వరంగల్ సభలో చంద్రబాబు ప్రసంగమంతా అబద్దాల పుట్ట అని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు విరుచుకపడ్డారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవి కోసం మామ మీద చెప్పులేసిన ఘనత బాబుదేనని.. ఊకదంపుడు ఉపన్యాసాలతో మోసం చేస్తే నమ్మే పరిస్థితిలో జనం లేరని విమర్శించారు. రూ.50 లకే రైతులకు కరెంటు సరఫరా చేసిన ఘనత బాబుకే దక్కుతుందని ఆరోపించారు. బాబు హయాంలో తెలంగాణలో 9 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలనైనా మంజూరు చేశారా..? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు అల్లుడు కాకపోతే నిన్ను చూసే నాథుడే లేడని.. తెలంగాణ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించింది నీవు కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణపై మాట మార్చినందుకే వెయ్యి మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అమరవీరుల గురించి మాట్లాడటం చూస్తే..పిల్లి ఆత్మ కోసం ప్రార్థించినట్లుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పాస్ కాకుండా దేశమంతటా కాలు కాలిన పిల్లిలా తిరిగింది ఎవరూ..? చంద్రబాబు తెలంగాణను అడ్డుకునేందుకు కాళ్లు పట్టుకోవడం ఒకటే తక్కువైందని ఆరోపించారు. తెలంగాణను అడ్డుకోలేదని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తావా..? అని ఘాటుగా విమర్శలు సంధించారు.