Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బాబుమియా చెప్పాడు..నేను పాటించాను..

తండ్రి ఆస్తులిస్తానన్నా.. ఆయన తీసుకోలేదు.. అప్పుగా డబ్బు తీసుకున్నాడు.. అదీ ముందుగానే తీర్చే గడువు చెప్పిమరీ.. ఆత్మ విశ్వాసంతో పాల వ్యాపారం ప్రారంభించి బాబుమియా డెయిరీగా అభివృద్ధి చేశాడు. ఓ రోజు అర్ధరాత్రి తండ్రి ఇంటికెళ్లాడు.. ఇచ్చిన అప్పును తిరిగి ఇచ్చేశాడు.. రేపు ఇవ్వొచ్చు కదా అన్న తన తండ్రితో తెల్లారితే గడువు మీరిపోతుంది అని బదులిచ్చాడు.. ఆయన ఎవరో కాదు తెలంగాణ ఉద్యమంలో నగరం నుంచి కీలకపాత్ర వహించి.. నేడు తెలంగాణ తొలి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న మహమూద్ అలీ.. తండ్రి చూపిన బాటలోనే నడుస్తున్నానని, హలాల్ రోజీ తన సక్సెస్ సీక్రెట్ అని అంటున్న ఉప ముఖ్యమంత్రితో టీ మీడియా ముఖాముఖి…

Mahmud-Ali-03

వందేళ్లకు పైబడిన బాబూమియా డెయిరీ పేరు వినని వాళ్లుండరు. సిటీలో ఎంతో పేరుగాంచిన ఈ పాల ఉత్పత్తి సంస్థను అవిశ్రాంతమూ శ్రమిస్తూ నిర్వహించిన మహమూద్ అలీ ఇప్పుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. పని వాళ్లను వాచ్ చేయొద్దు. వాళ్లతో కలిసి పనిచేస్తూ, పనిచేయిస్తే శ్రమ విలువ తెలుస్తుంది. అప్పుడే నీవు వాళ్లను గౌరవిస్తావు. గౌరవించే యజమానినే శ్రామికులు ప్రేమిస్తారు అని వాళ్ల నాన్న చెప్పిన నీతిని ఆచరిస్తూ 15 ఏళ్ల ప్రాయంలో డెయిరీ వృత్తి జీవితాన్ని ఆరంభించిన మహమూద్ అలీ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో కూడా తనవంతు పాత్ర పోషించారు. ఆయనలాగే ఆయన కుమారుడు వృత్తిని పనివాళ్లకు అప్పగించకుండా పనిచేస్తూ, చేయిస్తూ బాబూమియా వారసత్వాన్ని నిలబెడుతూ తండ్రికి చేదోడుగా నిలిచారు. ఈ శ్రమైక్య జీవన సౌందర్యమే ఈ వారం కుటుంబ కదంబం!

చిన్న వయసులో పెళ్లయింది. ప్రేమ వివాహమా? మహమూద్: కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో పెళ్లి కుదిరింది. సెకండ్ ఇయర్‌లో పెళ్లి చేశారు. దానికి కారణం చదువు ఉద్యోగం కోసమేనని నాన్న అభిప్రాయం. బిజినెస్ మ్యాన్ కొడుక్కి అకౌంట్లు రాయడం తెలిస్తే చాలనుకునేవాడు. అయినా చదువంటే నాకిష్టం. అందుకే బీకామ్ వరకు చదివాను.

నస్రీన్ ఫాతిమా: వాళ్లింట్లో అందరూ వ్యాపారులు, మా ఇంట్లో అందరూ ఉద్యోగులు. మా నాన్న డీఎస్పీ. ఉద్యోగం లేని అతనికిచ్చి పెళ్లి చేయడం నాన్నకు ఇష్టం లేదు. కొంచెం కంగారు ఉన్నా కుటుంబ నేపథ్యం, వ్యాపారం, క్రమశిక్షణ నాన్నకు నమ్మకం కలిగించాయి. పెళ్లికి ఒప్పుకున్నాడు. అప్పటికే నేను స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో పదో తరగతి చదివాను.

సినిమాలు, షికార్లు, సంతోషాల్లో నిర్ణేత ఎవరు? మహమూద్: చెప్పాను కదా! మా నాన్న చాలా స్ట్రిక్ట్. సినిమాలు, షికార్లతో కాలం వృథా చేస్తామంటే ఆయన ఒప్పుకోరు. కాలేజీ రోజుల్లో చాలా తక్కువ సినిమాలు చూశాను. పెళ్లయిన తర్వాత బాధ్యతలు ఇంకా పెరిగాయి. పెళ్లి తర్వాత సినిమాకు పోయిందే లేదు. ఆమె కూడా సినిమాకు పోదాం అని ఎప్పుడూ అనలేదు. పిల్లలకు ఇష్టం ఉంటుంది. నాన్న బిజీ అని వాళ్లు కూడా పోదామని అనలేదు. రాజకీయాల్లోకి రాకముందు గండిపేట, జూకు వెళ్లేవాళ్లం.

నస్రీన్ ఫాతిమా: చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్లు లేకుండా ఎటూ పోయే అలవాటు లేకపోవడం వల్ల సినిమా చూసే అలవాటు రాలేదు. నాకు తగ్గట్లే ఆయనకూ సినిమాలపై ఆసక్తి తక్కువ. పిల్లల్ని తీసుకుని మేమెప్పుడూ సినిమాకు పోలేదు. అంతేకాదు ఫ్యామిలీ మొత్తం హోటల్‌కు వెళ్లి భోజనం చేసింది కూడా లేదు.

పిల్లల పెంపకంలో పెద్దరికం ఎవరిది? మహమూద్: సమస్యలతో చాలామంది నా దగ్గరికొస్తారు. కానీ మా పిల్లలు రారు. ఎందుకంటే మా కుటుంబంలో పిల్లల పెంపకం, కుటుంబ నిర్వహణ పూర్తిగా అమ్మే చూసుకుంటుంది. సంపాదన, వ్యాపార నిర్వహణ నాన్న బాధ్యత. నేను బిజినెస్ చూసుకుంటే ఆమె పిల్లల్ని చూసుకుంది. మా నాన్న కూడా వ్యాపారమే చూసుకునేవాడు. కుటుంబ పాలనంతా అమ్మదే. మాకు ఏది కావాలన్నా అమ్మనే అడిగేవాళ్లం. అందుకే నాకు అమ్మతోనే అటాచ్‌మెంట్ ఎక్కువ.

Mahmud-Ali-01

నస్రీన్ ఫాతిమా: మా అత్తగారు నాకు ఇంటిపనులు, వంటలతో పాటు కుటుంబ పాలనను నేర్పింది. మా అబ్బాయి అజం అలీ, అమ్మాయిలు ఫిర్దౌస్ ఫాతిమా, అఫ్రోజ్ ఫాతిమా దుస్తులు, స్కూల్, ఆరోగ్యం ఈ విషయాలన్నీ నా బాధ్యతలే. ఇంటికి కావాల్సినవన్నీ నేనే కొంటాను. ఆయన అడిగినంత డబ్బులిస్తారు. ఖాళీ సమయాల్లో పిల్లలకు ఖురాన్ చెబుతాను. పత్రికల్లో వచ్చే మంచి ఆర్టికల్స్‌ని కలెక్ట్ చేసి పిల్లలతో చదివిస్తాను.

కొత్త కాపురం కష్టం కాలేదా? మహమూద్: మా కుటుంబం వేరు పడేప్పుడు మా నాన్న దగ్గర ఒక్క పైసా తీసుకోలేదు. నాన్న ఆస్తి ఇస్తానన్నారు. వద్దన్నాను. నా కాళ్లపై నేను నిలబడగలను. ఆర్థికంగా సహాయం చేయండన్నాను. ఏమిటా సాయం అన్నడు మా నాన్న. అప్పు అడిగాను. ఆయన నాకు తాళం ఇచ్చి నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అన్నారు. ఒక తారీఖు గడువు చెప్పి డబ్బు తీసుకున్నాను. కొన్ని బర్రెలు కొని పాల వ్యాపారం మొదలుపెట్టాను. ఓ రోజు అర్ధరాత్రి మా నాన్న దగ్గరకు పోయాను. ఎందుకిప్పుడొచ్చావన్నాడు. అప్పు తీర్చడానికి అన్నాను. తెల్లవారినంక రావచ్చుగా అన్నాడు. తెల్లారితే గడువు తీరుతుందని వచ్చానన్నాను. ఆ క్రమశిక్షణకు ఆయన ఆ రోజు ఎంతగానో సంతోషించారు.

నస్రీన్ ఫాతిమా: వాళ్ల నాన్నపై నమ్మకంతో మా నాన్న ఈ పెళ్లి చేసిండు. పెళ్లయిన తర్వాత నాకు ఆయనపై నమ్మకం కుదిరింది. ఆయన ఆస్తిలో వాటా తీసుకోను అన్నప్పుడు వద్దనలేదు. ఆస్తి కావాలనలేదు. ఆయన పట్టుదలపై నాకు విశ్వాసం ఉంది.

మీ ఇంటి విందులో వినోదాలేమి? మహమూద్: ఎన్ని మీటింగులు ఉన్నా, ఎంత హడావుడి ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు తప్పకుండా ఆమెతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. మినిస్టర్ కాకముందు మాతోపాటు పిల్లలు కూడా ఉండేవారు. రాత్రిపూట కూడా కలిసే భోజనం చేసేవాళ్లం. ఇప్పుడు మాత్రం బ్రేక్‌ఫాస్ట్ కలిసే చేస్తాం. ఎంత ముఖ్యమయిన పని అయినా వాయిదా వేసుకుంటాను. ఆ సందర్భంలో ఎవరి విందునైనా తిరస్కరిస్తాను. నేను చిన్నప్పట్నుంచి చెడు అలవాట్లకు దూరం. చాయ్ తాగను, టీ తాగను, పాను నమలను, మందు కొట్టను, సిగరెట్ ముట్టను.

నస్రీన్ ఫాతిమా: ఆయన వేడిగా లేనిదే ఏదీ తినరు. తినేది ఏదయినా సరే తాజాగా ఉండాలంటారు. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన బిజీ అయ్యారు. ఒకప్పుడు అందరం తింటూ మాట్లాడుకునే వాళ్లం. కానీ ఇప్పుడు తినేప్పుడు అందరి మాటలు ఆయనకు చెబుతున్నాను.

రాజకీయాలు కుటుంబ సంతోషాల్ని తగ్గించాయా? మహమూద్: రాజకీయాల్లోకి వచ్చాక టైమ్ నా చేతిలో లేదు. అప్పుడు ఇష్టమున్నంత సేపు మాట్లాడేది. డిప్యూటీ సీఎం అయ్యాక మరీ బిజీ అయ్యాను. పిల్లలు నాకు ఫోన్ చేసి మాట్లాడే అవకాశం పోయింది. గతంలో ఇద్దరం కలిసి ప్రతి రోజూ ఉదయం వాకింగ్‌లో పబ్లిక్ గార్డెన్‌కు పోయేవాళ్లం. కానీ ఇప్పుడు మినిస్టర్స్ క్వార్టర్స్‌లోనే వాకింగ్ చేస్తున్నాం. అప్పటిలా ఏకాంతం లేదు. మా వెనకే సెక్యూరిటీ, సహాయకులు. అయినా సీనియర్ సిటిజన్లమే ఏకాంతంగా ఉండాలనే సరదా ఏముంటుందిలే?!

నస్రీన్ ఫాతిమా: ఇప్పుడాయనతో ఫోన్‌లో మాట్లాడటం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆయనకు ఫోన్ చేస్తే పీఏ ఎత్తుతాడు. పిల్లలకూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇక చేసేది లేక వాళ్లు కూడా నాకే ఫోన్ చేస్తారు. రోజుకు రెండు మూడు సార్లు పిల్లలకు ఫోన్ చేస్తాను. రోజులో అర్ధగంట వాళ్ల ఫోన్లకు కేటాయిస్తాను.

ఛాదర్‌ఘాట్ సామాన్యులకు దూరమయ్యారా? మహమూద్: నేను సండే సెలవు అనుకోను. ఎప్పుడూ పనే. వ్యాపారంలోనే కాదు 14 సంవత్సరాల పాటు ఇదే రీతిలో ఉద్యమంలో పనిచేశాను. డిప్యూటీ సీఎం అయిన తర్వాత అందరూ ఆఫీసుకు, క్వార్టర్స్‌కు రాలేరని నేనే చాదర్‌ఘాట్‌కు వస్తున్నాను. శని, ఆదివారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెగ్యులర్‌గా అందరికీ అందుబాటులో ఉంటాను. ఇంటి వద్దకు వచ్చి అందరూ కలుస్తారు.

మీ ఫ్యామిలీ సక్సెస్ సీక్రెట్స్…? మహమూద్: హలాల్ రోజీ నా సక్సెస్ సీక్రెట్. ఇది మా నాన్న చెప్పింది కాదు. నేర్పింది. ఇది ఖురాన్ నీతి. మా నాన్న పీర్ మెహమ్మద్ (బాబూమియా) మూడు విషయాలు చెప్పారు. వాటిలో మొదటిది.. అందరితోనూ మర్యాదగా మాట్లాడాలి. మన ప్రవర్తన ఎవరికీ అమర్యాదగా అనిపించకూడదు. పెద్దల పట్ల గౌరవం, పేదల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. రెండోది ఏ పనిలోనూ తప్పు చేయొద్దు. తప్పు మాట్లాడవద్దు. అవి నలుగురిలో మనల్ని తక్కువ చేస్తాయి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడికి ఏనాడూ కష్టాలు రావు. మూడోది కాలానికి తగినట్లుగా జీవించాలి. అంతేకాని ఆడంబరాలకు పోయి అతిగా ఖర్చు చేయవద్దు. అత్యాశతో అప్పులు చేయొద్దు. డబ్బుంటే సహాయంగా ఇవ్వు. కానీ ఎదుటివాళ్లకు అవసరం ఉందని వడ్డీకి ఇవ్వకూడదు. ఖురాన్ చెప్పిన ఈ నీతిని ఆయన ఆచరించి నాకు చెప్పిండు. నేను కూడా మా నాన్ననే అనుసరించాను.

వ్యాపార జీవితానికి, రాజకీయ జీవితానికి తేడా? మహమూద్: నాన్నకు ఏనాడూ ఎదురు చెప్పలేదు. ఆ విధేయత వల్లే అంత స్ట్రిక్ట్‌గా ఉండే మనిషితో ఏనాడూ ఒక్కమాట పడలేదు. ఇప్పుడు నేను స్ట్రిక్ట్. సమయానికి వెళతాను. సమయానికి చేస్తాను. వ్యాపారం అయినా, రాజకీయం అయినా బాధ్యతను కచ్చితంగా నెరవేర్చాలి. వ్యాపారం జనానికి దూరం చేస్తుంది. రాజకీయం జనానికి దగ్గర చేస్తుంది. ఇది జనం లేకుంటే నడవదు. అది జనం తోడుంటే కదలదు. నస్రీన్ ఫాతిమా: అప్పుడూ ఇప్పుడూ నా బాధ్యతలు మారలేదు. క్వార్టర్ మారింది అంతే!

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.