Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బహుజన విద్యకు బలమైన పునాది

వేల ఏండ్లుగా విద్యకు దూరంగా ఉన్న జాతులు ఇప్పుడు తలెత్తుకుని చదువులమ్మ ఒడిలో చేరుతున్నాయి! ఒకప్పుడు నిర్లక్ష్యానికి.. నిరాదరణకు గురైన సంచార జాతులు, బహుజనవర్గాలు ఇప్పుడు భరోసాతో తమ పిల్లలను బడిలో చేర్చుతున్నాయి! మహాత్మా జ్యోతిబాపూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, భాగ్యరెడ్డివర్మ వంటి మహోన్నతులు వేసిన విద్యాసంస్కరణ మార్గం.. డెబై ఏండ్ల స్వతంత్ర భారతావనిలో కునారిల్లి.. ఇప్పుడు విద్యారహదారిగా భాసిల్లుతున్నది! సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం.. తన సంక్షేమ విధానంలో భాగంగా విద్యారంగాన్నీ సంక్షేమబాట పట్టిస్తున్నది! బహుజన విద్యకు పునాదులేస్తున్నది.

జూలూరు గౌరీశంకర్ గతం చేసిన గాయాలు బహుజనవర్గాలను నేటికీ బాధిస్తూనే ఉన్నాయి. భారత పునరుజ్జీవ ఉద్యమంలో తొలితరం మేధావులైన మహాత్మా జ్యోతిబాపూలే, అంబేద్కర్‌లు సామాజిక పరివర్తనకోసం చేసిన కృషినంతా 70 ఏండ్లుగా ఏలిన పాలకులు ఏంచేశారన్నది ప్రశ్నగానే ఉన్నది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషిస్తున్నారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా బహుజన వర్గాలన్నింటికీ మెరుగైన చదువును అందించాలన్న లక్ష్యంతో ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడా లేనివిధంగా అతికొద్దికాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాల పిల్లలకోసం 815 సంక్షేమ గురుకుల పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అభివృద్ధి అట్టడుగునుంచి మొదలుకావాలన్న లక్ష్యంతో.. ఇప్పటిదాకా బడికిరాని సామాజిక వర్గాల, సంచారజాతుల పిల్లలను బడికి రప్పిస్తున్నారు. ఒక్కో విద్యార్థిపై ఏటా లక్షరూపాయలకుపైగా వెచ్చించి వారికి కార్పొరేట్‌కు దీటైన విద్యను అందిస్తున్నారు.

నిర్లక్ష్యానికి గురైన బహుజనమహావళి విద్య అట్టడుగు కులాలను రెండువేల ఏండ్లుగా చదువుకు దూరంగా ఉంచారు. అంతేకాకుండా ఆయాకులాలను అంటరానివిగా చూశారు. అసలు శూద్రులకు చదువెందుకన్న అగ్రవర్ణాల ఆధిపత్యమూ ఉంది. మహాత్మా జ్యోతిబాపూలే ఈ వర్గాలకు చదువు అందించాలని స్వాతంత్య్ర పోరాటకాలానికి ముందే పిలుపునిచ్చి బహుజనావళికి బడులను తెరిచారు. ఆయన స్ఫూర్తిని బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకున్నారు. రాజ్యాంగాన్ని రాశారు. దేశంలో సమత్వసాధనకు చదువే ప్రధాన సాధనమని.. చదువును ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంద్వారా బహుజనావళికి అందించారు. పాత హైదరాబాద్ రాష్ట్రంలో భాగ్యరెడ్డివర్మ దళిత బహుజన విద్యార్థుల చదువులకోసం కృషిచేశారు. పోరాడారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు గడుస్తున్నా ఇప్పటిదాకా పాలకులు బహుజనమహావళి విద్య విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో చెప్పనక్కర్లేదు. రాష్ట్ర అవతరణ తర్వాత అట్టడుగువర్గాల పిల్లలకు నాణ్యమైన చదువు అందుతున్నది.

మొత్తం విద్యార్థుల్లో సగం మంది బీసీలే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నింటిలో 1 నుంచి 10 తరగతుల వరకు మొత్తం 58,36,310 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో జనరల్ విద్యార్థులు 12,66,593 మంది కాగా, ఎస్సీ విద్యార్థులు 9,83,677, ఎస్టీ విద్యార్థులు 6,54,220, బీసీ విద్యార్థులు 29,31,820 మంది ఉన్నారు. ముస్లిం మైనార్టీ విద్యార్థులు 8,79,734 మంది ఉన్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్యతో చూస్తే బీసీ విద్యార్థులు 29,31,820 మంది ఉంటే మిగతా అన్ని సామాజికవర్గాలకు చెందిన విద్యార్థులు 29,04,490 మంది ఉన్నారు. అంటే సగానికి సగంగా బీసీ విద్యార్థులున్నారు. అందులోనూ ఎనిమిది ప్రధాన బీసీ కులాల్లోని విద్యార్థుల సంఖ్య ఇందులో సగభాగం ఉంది. చిన్నకులాలు, సంచార జాతులవారి పిల్లలు వందల సంఖ్యలోనే ఉన్నారు. ఆ కులాల జనాభా తక్కువ ఉండటం ఇందుకు కారణం.

అన్ని కులాల పిల్లలకూ సమాన విద్య బీసీల కోసం విద్యాపరంగా బీసీ కమిషన్ చేపట్టిన అధ్యయనంవల్ల అనేక విషయాలు మనముందుకొచ్చాయి. అన్ని కులాల ప్రగతి ఒకలాగా ఉండదు. విద్యావిషయాల్లో, సామాజిక అంశాల్లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని కులాల పిల్లలందరికీ చదువును అందించాలన్న కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగానే బీసీ కమిషన్ అధ్యయనం సాగుతున్నది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఆ వర్గాలను నిలబెట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రతి ఇంటికి నల్లానీళ్లు అందించినట్టే.. ప్రతి ఇంటిని చదువుల గడపగా మార్చి తెలంగాణను మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే కేసీఆర్ సంకల్పం.

విద్యలేక వివేకం లేదు వివేకం లేక నీతిలేదు నీతిలేనిదే పురోగతి లేదు పురోగతి లేక విత్తం లేదు విత్తం లేకనే శూద్రులు అథోగతి పాలయ్యారు. ఇంత అనర్థమూ ఒక్క అవిద్య వల్లనే – మహాత్మా జ్యోతిరావ్ పూలే

శక్తిమంతమవుతున్న సర్కారీ బడులు తెలంగాణ ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలతో బహుజనావళి మర్చిపోలేనివిధంగా 815 రెసిడెన్షియల్ గురుకులాలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటుగా ప్రభుత్వ స్కూళ్లను శక్తివంతంచేసే పనులు కూడా ముమ్మరమయ్యాయి. తెలంగాణ వచ్చాకే అట్టడుగు వర్గాల పిల్లలు, ప్రధానంగా బీసీల్లో సంచారజాతులకు చెందిన పిల్లలు గురుకుల పాఠశాలలకు వచ్చి ఇంగ్లిష్ మీడియం చదువులు చదువుతున్నారు. పేదబహుజనుల పిల్లలకు అన్ని వసతులతో కార్పొరేట్ స్థాయిలో చదువును ప్రభుత్వం అందిస్తున్నది. ఇది ఇంతకు ముందు జరుగలేదు. గతంలో హాస్టళ్లు విద్యావేత్తలు ఊహించలేనంత అస్తవ్యస్తంగా ఉండేవి. ఇపుడు ఆ పరిస్థితి లేదు. గురుకులాలతోపాటు మొత్తం ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలన్న బలమైన తలంపు, హైస్కూల్ విద్య పూర్తయ్యేవరకు ప్రభుత్వమే అన్ని బాధ్యతలు వహించి ప్రతి విద్యార్థికి చదువు చెప్పించాలన్న దృఢ సంకల్పం కేసీఆర్‌లో ఉన్నాయి. ఇందులో భాగంగానే సమాజంలో సగభాగమైన బీసీల జీవనవిధానాన్ని అధ్యయనం చేసేందుకు దూరదృష్టితో బీసీ కమిషన్‌ను నియమించారు.

రూపానికి వస్తున్న విద్యాశాఖ నివేదిక మొత్తం ప్రభుత్వ శాఖల్లో అతిపెద్దదైన విద్యాశాఖ ప్రధానంగా విద్యకు పునాది అయిన 1 నుంచి 10 తరగతుల వరకు చదువుతున్న పిల్లల్లో ఏయే వర్గాల పిల్లలకు ఏ రకమైన విద్య అందుతున్నదనే అంశంతోపాటు.. బీసీ విద్యార్థుల విద్యాసంబంధమైన స్థితిగతుల అధ్యయనంపై కమిషన్ దృష్టిసారించింది. దీనిలో ప్రధానమైన పాఠశాల విద్యాశాఖ నివేదిక ఒక ఐదునెలల కృషిఫలితంగా ఒక రూపానికి రాబోతున్నది. ఒక రకంగా బీసీ వర్గాల విద్యార్థుల స్థితిగతులను కులాలవారీగా వెలికితీసే పరిశోధన ఇది. దీనిద్వారా ఇప్పటికీ చదువు అందని వారి వాకిళ్ల దాకా వెళ్లి ఆ పిల్లలను విధిగా బడిలో చేర్పించాల్సిన అవసరం ఉంది. ఈ పనిని తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా చేస్తున్నది. మహాత్మాజ్యోతిబాపూలే, అంబేద్కర్ కలలుగన్న బహుజన విద్యారాజ్యాలకు తెలంగాణ రాష్ట్రంలో బలమైన పునాదులు పడుతున్నాయి.

సంచార జాతుల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ గత పాలకులు సంచారజాతుల్ని పూర్తిగా విస్మరించారు. వాళ్లను కనీసం పౌరులుగానూ చూడలేదు. అత్యంత దయనీయంగా బతుకులీడుస్తున్న వారిని ఆ స్థితినుంచి బైటపడేయాలి.. వారికి స్థిరనివాసం కల్పించాలి.. వాళ్ల పిల్లలను బడులకు తీసుకురావాలన్న బృహత్ సంకల్పం ముఖ్యమంత్రిలో బలంగా ఉంది. అందుకే సంచారజాతుల పిల్లలపై ప్రత్యేక దృష్టిపెట్టి ఆ పిల్లలను బడులలో చేర్పించే కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగించాలని ఆదేశించారు. సంచారజాతుల పిల్లలను బడిలో చేర్పించే తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించాలన్న తలంపు కూడా ప్రభుత్వానికి ఉంది. సంచారజాతుల పిల్లలు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులకు ఆదాయవనరులుగా ఉన్నారు. వీరిని బడిలో చేర్పిస్తే ఆ మేర ఆదాయం పోతుందని తల్లిదండ్రులు భావిస్తారు. ఆ భర్తీని పూడ్చేలా ప్రోత్సాహకాలుంటే వారిని బడికి పంపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికే రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో సంచారజాతుల పిల్లలకు సీట్లు లేవనకుండా అవసరమైతే కొన్ని ప్రత్యేక సీట్లను ఏర్పాటుచేసి వసతులు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పం.

ప్రతిభను వెలికితీసే ప్రయత్నాలు ఓపెక్ (ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్)కు చెందిన 37 దేశాలు ప్రతి నాలుగేండ్లకోసారి నిర్వహించే పిసా (ప్రోగ్రావ్‌ు ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎసెస్‌మెంట్) పోటీలలో ఈసారి చైనా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మనదేశం 72వ స్థానంలో ఉంది. అన్ని రంగాలలో చైనా అగ్రస్థానంలో ఉండటానికి కారణం చిన్ననాటి నుంచే పిల్లలకు వసతులు కల్పించడంతోపాటు.. పేద పిల్లల తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ఇస్తుండటం. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వ అధ్యయనంలో ఉంది. విద్యారంగానికి సంబంధించిన సమీక్షాసమావేశాల్లో.. పిల్లలను ఆటలు ఆడించాలని, క్రీడాపోటీలు నిర్వహించాలని, చదువులో టాలెంట్‌లను వెలికితీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెప్తుంటారు. ఆ మేరకు అకడమిక్ క్యాలెండర్లను తయారుచేసుకుని ఆచరణలోకి దిగాలని కూడా సూచిస్తుంటారు.

ఆ బిడ్డలు.. ప్రకృతి మాత వరాలు సంచార, గిరిజన జాతుల పిల్లలకు సహజంగానే కొన్ని నైపుణ్యాలు ఉంటాయి. కళారంగాలతోపాటు, అతివేగంగా చెట్టు ఎక్కిదిగే సామర్థ్యం, దూకే సామర్థ్యం, నీటిలో దూకటం, ఈదటం, కొండలెక్కటం, బాణం గురిపెట్టి వదలడం లాంటివన్నీ ఆదివాసీలు, సంచారజాతుల పిల్లలు సహజంగా నేర్చుకుంటారు. అదే ఆయారంగాలలో శిక్షణనిస్తే వాళ్లను జయించగల వారెవరుంటారు? జానపద కళారూపాలు, మౌఖిక సాహిత్యం, బుర్రకథలు, హరికథలు, పాటలు పాడటం, నృత్యాలు చేయటం, డప్పులు కొట్టడం, గొంతెత్తి గానం చేయటంలాంటివి బహుజన వర్గాలు, సంచారజాతుల పిల్లలకు వెన్నతో పెట్టిన విద్య. వీటన్నింటిపై దృష్టిపెట్టాలని, వారిలోని ఆ నైపుణ్యాలు వెలికితీసి పోటీలకు శిక్షణనిప్పించి తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నది కేసీఆర్ ఆలోచన. అందుకు కార్యాచరణ ప్రణాళికలు త్వరలో ఆచరణ రూపం దాల్చనున్నాయి. ఇందుకోసం మొదటగా సంచారజాతుల పిల్లలందర్నీ బడిలోకి చేర్పించాలి. ఇలాంటి పిల్లలను తీసుకువచ్చి చదువులు నేర్పే స్కూళ్లకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న తలంపు ప్రభుత్వానికికుంది. ఒకటి నుంచి పది తరగతుల పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికితీయమని, ప్రధానంగా బడిఈడు పిల్లలందరూ బడికి వచ్చే విధంగా చేయటం, వచ్చిన పిల్లల్లో ప్రతిభను గుర్తించి, వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తూ వాళ్లను జాతి సంపదగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం కృషి ప్రారంభించింది.

కేసీఆర్ ధృడసంకల్పంతో చేస్తున్న ఆ కృషి ఫలించాలని, తమ పిల్లలు అన్ని రంగాల్లో దూసుకుపోవాలని బహుజనావళి కోరుకుంటున్నది. తెలంగాణ సమాజంలో 85శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి అని ముఖ్యమంత్రే స్పష్టంగా చెప్తూ.. ఇందుకోసం మున్ముందు మరెంతో కృషిచేయాలని కొత్తదారులు వేస్తున్నారు. సంక్షేమవిద్యారంగంలో దేశానికే తెలంగాణ తలమానికంగా ఉంది. పూలే, అంబేద్కర్‌లు కలలుగన్న అట్టడుగు వర్గాలకు నాణ్యమైన విద్యనందించే సామాజిక తెలంగాణకు కేసీఆర్ ముగ్గులు పోస్తున్నారు. బహుజనవర్గాల కంచాలలోకి సన్నబియ్యం రావటమే కాదు, దేశానికి ప్రపంచానికి నైపుణ్యమున్న మానవనరులను అందించే శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న కేసీఆర్ ఆలోచనలకు గురుకులాలు బలమైన పునాదులు వేస్తున్నాయి. భవిష్యత్ తెలంగాణ నిర్మాణం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లోనే రూపుదిద్దుకుంటుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా విద్యారంగ పునర్నిర్మాణం అత్యంత కీలకమైనది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి ఎదిగొచ్చిన పిల్లలే భవిష్యత్ తెలంగాణను నిర్థారిస్తారనటం అతిశయోక్తి కాదు. రాబోయే పదేండ్ల తర్వాత పలుసామాజిక మార్పులకు ఈ గురుకులాలే పునాదులవుతాయన్నది అక్షరసత్యం.

మహిళలు, ఆదివాసీలు, శూద్రులు, దళితులు, మహ్మదీయులలోని వెనుకబడిన కులాలు, తదితరుల పతనావస్థలకు కారణం కులవ్యవస్థే అన్నది నిర్వివాదాంశం. కులం మూలంగా అవకాశాలు, యోగ్యతలు అనివార్యంగా సంకుచితపడి సన్నగిల్లుతాయన్న ఒక నూతన సామాజిక శాస్త్ర సిద్ధాంతం ఉత్పన్నమౌతున్నది. కులం అంటేనే ప్రజలను యోగ్యతకు దూరం చేయటం. మనదేశ ప్రజలు ఇంతగా వెనుకబడి ఉండటానికి, అనేకసార్లు బానిసత్వాన్ని వరించటానికి కులమే ప్రధానమైన కారణం. – డాక్టర్ రాంమనోహర్ లోహియా

బలపడుతున్న ప్రభుత్వ విద్య ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు చేయని పని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎలా పునర్నిర్మాణం చేస్తున్నారో.. సమాజ మార్పునకు కీలక భూమికైన విద్యారంగాన్ని కూడా సమూలంగా సంస్కరించుకుంటూ ముందుకుసాగుతున్నారు. అభివృద్ధి అనేది కింది నుంచి మొదలు కావాలన్నది కేసీఆర్ ధ్యేయం. మొదట ప్రాథమిక విద్య పునాదులు గట్టిపడకుండా ఉన్నత విద్యారంగాన్ని, పరిశోధనను పటిష్ఠం చేసుకోలేమని ప్రభుత్వం నమ్ముతున్నది. ఇందులో భాగంగానే బడికి వచ్చే పిల్లల్లో సామర్థ్యాలను పెంచటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉన్నారు? పట్టణ, గ్రామీణ, మహానగరాల చదువులలో ఉన్న తేడా ఏమిటి? అనే అంశాలపై దృష్టిసారించి.. గ్రామీణప్రాంత విద్యారంగాన్ని శక్తిమంతం చేసుకునేందుకు సమగ్ర అధ్యయనం మొదలుపెట్టింది. రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మొత్తం పిల్లల లెక్కలను వెలికితీసే పని మొదలుపెట్టి ఆ బాధ్యతను పాఠశాల విద్యాశాఖకు అప్పజెప్పింది. ఈ లెక్కలు రాష్ట్రంలోని పిల్లల చదువుల ప్రగతిని అంచనా వేసేందుకు దోహదపడుతాయి. దీని ఆధారంగా శక్తిమంతమైన విద్యారహదారిని వేయాలని కేసీఆర్ తలంచుతున్నారు.

అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలోకి వెళ్లాల్సి ఉంది. మన విద్యార్థులు ఏయే సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుసుకోవాలి. ఇందుకు మొదటగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దే పనిని చేసింది. దీనివల్ల పేదవర్గాల పిల్లలకు ఒక్కపైసా ఖర్చులేకుండా నాణ్యమైన విద్య అందుతున్నది. ఇది విద్యారంగంలో ఇప్పటిదాకా జరుగనిది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ విద్యారంగం బలపడితే తెలంగాణ వచ్చాక ప్రభుత్వ విద్య బలపడుతున్నది. ఇది పెద్దమార్పు. ప్రధానంగా ఏయే వర్గాల, వర్ణాల పిల్లలు బడికి వస్తున్నారో, ఏయే కులాల పిల్లలు ఎన్నెన్ని చదువులు చదువుతున్నారో, ఇప్పటిదాకా లెక్క తేలని సంచారజాతుల పిల్లలు ఎంతమంది బడులకు వస్తున్నారోనన్న లెక్కలు తెలంగాణ రాష్ట్రం వచ్చాకే స్పష్టంగా బయటకు వచ్చాయి. ఈ గణాంకాల ద్వారా పిల్లల చదువులను కులాలవారీగా అంచనా వేయటమే కాకుండా, పిల్లల ఆరోగ్య స్థితిగతులపైన కూడా మొత్తంగా సర్వే చేయాల్సి ఉంది. ఇప్పటికే కొంతమంది పేదవర్గాల పిల్లల్లో రక్తహీనత ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన అవసరమైన చర్యలు చేపట్టింది. పిల్లలకు కంటి పరీక్షలు కూడా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నది. (రచయిత తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.