-మండలానికో రెసిడెన్షియల్ పాఠశాల -ఎస్సీ, ఎస్టీ బిల్లుకు త్వరితగతిన ఆమోదం -లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ కడియం సూచన

దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్‌లాంటి పలు చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఆశించిన ప్రగతి కనిపించడం లేదని, రాష్ట్రపతి ప్రసంగంలో సైతం ఈ ప్రస్తావన వచ్చినప్పటికీ ఆ వర్గాల ప్రజలను ఏ విధంగా పైకి తీసుకువస్తారనేదానిపై స్పష్టత లేదని టీఆర్‌ఎస్ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు. లోక్‌సభలో బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా కడియం మాట్లాడుతూ సమాజంలో విద్య, వైద్యం, ఉపాధిరంగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సమానావకాశాలు సృష్టించే వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారే తప్ప ఏ విధంగా అనే విషయమై స్పష్టత ఇవ్వలేదని అన్నారు. వారి జీవన ప్రమాణాలను పెంచే చర్యలతో పాటు విద్య, వైద్య రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించాలని, ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు.
విద్యా హక్కు చట్టం ఉన్నప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదని, ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల కొరతతో పాటు విద్యలో నాణ్యత కొరవడడం, పైవేటు పాఠశాలల్లో చేర్పించలేని ఆర్థిక వెనకబాటుతనం ఈ వర్గాల ప్రజలకు విద్యను అందించలేకపోతోందని అన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఇద్దరు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చిరుప్రాయంలోనే ఎవరెస్టు పర్వతం ఎక్కి రికార్డు సష్టించారని, వీరు రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నారని శ్రీహరి గుర్తు చేశారు. ఇలాంటి పాఠశాలల సంఖ్యను మరింతగా పెంచడానికి కేంద్రం ఒక విధాన నిర్ణయాన్ని తీసుకోవాలని, కనీసం మండలానికి ఒక బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను నెలకొల్పాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రజలు ప్రైవేటు వైద్య సౌకర్యాలు పొందలేకపోతున్నారని, వారికోసం నిర్బంధ విద్యా చట్టం తరహాలోనే నిర్బంధ వైద్య హక్కు చట్టం కూడా కేంద్రం తీసుకురావాలని కోరారు.
కేంద్ర స్థాయిలో ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రత్యేక చట్టం ఉన్నప్పటికీ అందులోని లోపాల వల్ల ఫలితం రావడం లేదని, అందువల్ల ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్ బిల్లు-2008 ఉభయ సభల్లో ఆమోదం పొందేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్, ట్రైబ్ సబ్ ప్లాన్ అనే విధాన నిర్ణయాలు ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని, మిగిలిన ప్రజలతో పోలిస్తే అభివృద్ధిలో ఉండే గ్యాప్‌ను పూడుస్తాయని, అయితే దీన్ని చట్టరూపంలోకి మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్న డిమాండ్ దీర్ఘకాలంగా ఉందని చెప్పారు. వివిధ రాష్ర్టాలు విడివిడిగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని కేంద్ర స్థాయిలో దేశం మొత్తంమీద అమలు చేయడానికి చట్టంగా మార్చడానికి పాటుపడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కడియం శ్రీహరి కోరారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి రానున్న ఐదేళ్ళలో దీన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.