Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బల్దియా బరిలో కారు ఒంటరి పోరు..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. మొత్తం 150 డివిజన్లలో పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందని కేసీఆర్ చెప్పారు. టీవీ చానళ్లతో సహా అనేక సర్వేల్లో పార్టీ 80నుంచి 85 స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడైందని, ఇంకొంచెం కష్టించి పనిచేస్తే 90-95 సీట్లు గెలుచుకోగలమని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ మేరకు నాయకులంతా ఈనెల 5 నుంచే ప్రచారరంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. -80-85 స్థానాలు ఖాయమంటున్న సర్వేలు -ఇంకొంచెం కష్టపడితే 90-95 స్థానాలు :కేసీఆర్ -గ్రేటర్ పీఠం మనదే -త్వరలో గ్రేటర్‌కు మ్యానిఫెస్టో ప్రకటన -ప్రతినిధులందరికీ డివిజన్లవారీగా ప్రచార బాధ్యత -వెయ్యిమంది ఓటర్లకో ప్రచార కార్యకర్త -గెలుపు గుర్రాలకే టిక్కెట్లు -టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ -గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

TRSLP-meeting-in-Telangana-Bhavan

తెలంగాణభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ప్రధానంగా గ్రేటర్ ఎన్నికలపై ఆయన పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో మొదలైన సమావేశం దాదాపు గంటకు పైగా కొనసాగింది. ఇందులో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీపరంగా ఎలా వ్యవహరించాలనే దానిపై సీఎం పలు సూచనలు చేసినట్టు తెలిసింది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ తన ప్రసంగంలో గెలుపు అవకాశాల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని, ఎలాంటి పైరవీలకు తావులేదని నొక్కి చెప్పారు.

గ్రేటర్ ఎన్నికలకు త్వరలో మ్యానిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాయని.. అందుకే వరంగల్ ఉప ఎన్నికల్లో ఓటర్లు మన మీద ఇష్టంతో ఓట్లు వేశారని కేసీఆర్ చెప్పారు. వరంగల్ గెలుపుతో మనపై మరింత భారం పెరిగిందని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ బల్దియా పీఠాన్ని దక్కించుకుంటుందని వివిధ సర్వేల్లో తేలిందన్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు ప్రజల్లో ఎలాంటి విశ్వసనీయత లేదన్నారు. సమైక్య పాలనలో హైదరాబాద్ నగరం బాగుపడలేదని, ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఏదో అభివృద్ధి చేశామని చెబుతున్నాయేగానీ వాస్తవానికి నగరాన్ని మొత్తం ఖరాబ్ చేశారని సీఎం అన్నారు.

ఒక ప్రణాళిక లేకుండా ముందుకుపోయారని, జనాభాకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించారని అన్నారు. అందువల్లనే ఇవాళ కొద్దిపాటి వర్షానికే నాలాలు మూసుకుపోయి, రోడ్లపై వాహనాలన్నీ మునిగిపోతున్నాయన్నారు. అధికారులను అడిగితే డ్రైనేజీ, ఇతర వ్యవస్థలను బాగు చేయాలంటే రూ.10వేల కోట్లు అవుతుందని చెప్పారని గుర్తు చేశారు. నాలాలన్నీ కబ్జాలకు గురైనా,లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నా గత పాలకులు పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై ప్రజల్లో కాంగ్రెస్, టీడీపీ వారిని నిలదీయాలన్నారు. హైదరాబాద్‌ను కేవలం సాంకేతికపరంగానే కాకుండా అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి, అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దితేనే ఇంకా పెట్టుబడులు వస్తాయన్నారు. హైదరాబాద్ ప్రాథమ్యాన్ని వివరిస్తూ హైదరాబాద్ అంటేనే తెలంగాణ అని, తెలంగాణ అంటే హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రధానంగా కరెంటు, నీటి సరఫరా, ప్రజా రవాణా అనేది ప్రధానమని కేసీఆర్ విశ్లేషించారు. ఈ రంగాల్లో చేసిన పనులను వివరిస్తూ ప్రజా రవాణా నష్టాలను చవిచూసే అవకాశమున్నందున స్థానిక సంస్థలతో సమన్వయం చేయించాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీని విజయవంతంగా రక్షించామని సీఎం చెప్పారు. తెలంగాణ ఉద్యమం మొదలు… రాష్ట్ర ఏర్పాటు వరకు పలు పరిణామాలను కేసీఆర్ వివరించారు. ఉద్యమ సమయంలో క్షేత్రస్థాయిలో, ప్రజల మధ్య పని చేసినందున ప్రజా సమస్యలపై టీఆర్‌ఎస్ పార్టీకి పూర్తిగా అవగాహన ఉందన్నారు.

15 రోజులు కష్టపడదాం.. గ్రేటర్ ఎన్నికల్లో అందరం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని సీఎం కేసీఆర్ ఉద్బోధించారు. ఎన్నికల్లో 15 రోజులు కష్టపడితే సర్వేల్లో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామన్నారు. ఈ మేరకు ఐదో తేదీ నుంచే కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టాలని నాయకులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. మంత్రులకు ఒక్కో డివిజన్ బాధ్యతతో పాటు ఆ నియోజకవర్గంలోని ఇతర డివిజన్లను సమన్వయం చేసుకునే బాధ్యత అప్పగిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు ఇలా ప్రతి ఒక్కరికీ ఒక్కో డివిజన్ బాధ్యత అప్పగిస్తామన్నారు. కొన్ని కీలక డివిజన్లు ఉంటే ఇద్దరు, ముగ్గురిని కూడా కేటాయిస్తామన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే పటాన్‌చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లను చూసుకుంటారని, నారాయణ్‌ఖేడ్ ఎన్నికలు రానున్నందున ఆ బాధ్యతలు కూడా చూస్తారని చెప్పారు.

ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లా వారితో.. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు ఏయే ప్రాంతాల్లో ఉంటున్నారో ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వారితో కలవాలన్నారు. దీని ఆధారంగానే డివిజన్ల బాధ్యతల అప్పగింత ఉంటుందన్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల వారు ఎల్బీనగర్, వరంగల్-ఉప్పల్, కరీంనగర్-మల్కాజిగిరి, బొల్లారం-ఆదిలాబాద్ ఇలా బాధ్యతలు చేపట్టాలని ఉదహరించారు. మంత్రి తుమ్మలతో పాటు ఖమ్మం జిల్లా నేతలు కూకట్‌పల్లి, రంగారెడ్డి జిల్లా వారు శేరిలింగంపల్లి నియోజకవర్గాలపై దృష్టిసారించాలని సీఎం సూచించారు. ఆయా డివిజన్ల బాధ్యుల వివరాల్ని ఆదివారం సాయంత్రంలోగా ఖరారు చేసి, సమాచారం అందిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.

TRSLP-meeting-in-Telangana-Bhavan01

డివిజన్ల బాధ్యులు ఐదో తేదీ సాయంత్రంలోగా క్షేత్రస్థాయిలోకి చేరుకోవాలని, పోలింగు ముగిసే వరకు అక్కడే ఉండాలని అన్నారు. తమ వెంట 40-45 మందిని తీసుకుని రావాలని, ఒక్కో డివిజన్‌లో వెయ్యి మంది ఓటర్లకు ఒకరు చొప్పున ప్రచార బాధ్యత అప్పగించాలన్నారు. మంత్రులు కే తారకరామారావు, జీ జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి ఆయా డివిజన్ల ఇన్‌ఛార్జీలు, ఇన్‌ఛార్జీల మార్పు, ఇతరత్రా అన్నిరకాల పర్యవేక్షణ బాధ్యత నిర్వహిస్తారని సీఎం చెప్పినట్టు తెలిసింది.

పైరవీలకు తావులేదు… తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాయని, టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చైతన్యపరిచే బాధ్యత మనపై ఉందని ప్రజాప్రతినిధులకు తెలిపారు. ప్రజల మధ్య ఉండే గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్ వస్తుందని, ఇందులో ఎలాంటి పైరవీలకు తావులేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సర్వే జరుగుతున్నదని, ఐదో తేదీ సాయంత్రం డివిజన్లకు వెళ్లే ఇన్‌ఛార్జీలు ఎవరైనా మంచి అభ్యర్థులను గుర్తిస్తే సూచించవచ్చునని చెప్పారు.

పనులు జరుగుకుంటే మీరే జవాబుదారీ.. టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో గ్రేటర్ ఎన్నికలతో పాటు నాలుగు ప్రధాన అంశాలపై పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం కీలక సూచనలు చేశారు. శనివారంనాటి క్యాబినెట్ భేటీ విషయాల్ని వివరించిన సీఎం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, కరెంటు అంశాలపై వివరణ ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కచ్చితంగా తమ పరిధిలో జరిగే మిషన్ భగీరథ పనులను దగ్గర ఉండి చేయించుకోవాలని నిర్దేశించారు.

ప్రతి రోజు ఈ నాలుగు అంశాలపై ఒక్కో గంట సమీక్ష నిర్వహించుకోవాలని, వారానికోసారి జిల్లా సమీక్షలు చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా రక్షిత మంచినీటిని అందించే ఈ కార్యక్రమానికి సంబంధించి పక్కాగా పనులు జరిగేలా చూడాలని, మిషన్ కాకతీయ పనుల సమయంలో చెరువుల దగ్గర ఉండి పనులు జరిగేలా పర్యవేక్షించాలన్నారు. సాగునీటి రంగానికి ఏటా రూ.25వేల కోట్లు కేటాయిస్తున్నామని, నియోజకవర్గాలు,జిల్లాలవారీగా ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. ఏప్రిల్ నుంచి రైతులకు పగటిపూట తొమ్మిది గంటల కరెంటును ఇవ్వనున్న దరిమిలా ఆయా గ్రామాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీల లైన్ల ఏర్పాటు వంటి పనులు పెండింగులో ఉంటే వెంటనే పూర్తి చేయించుకోవాలన్నారు.

ప్రణాళికలు రూపొందించుకున్నాం… నిధులు ఇస్తున్నాం… కేవలం పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మాత్రం మీపైనే ఉంది అని ముఖ్యమంత్రి కరాకండిగా చెప్పినట్లు తెలిసింది. ప్రత్యేక శ్రద్ధతో పనులు చేయించుకోవాలని, లేకపోతే ఆ మేరకు ప్రజలకు సమాధానం మీరే చెప్పుకోవాల్సి వస్తుందని కూడా సీఎం సూచించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు.

త్వరలో మ్యానిఫెస్టో.. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాభివృద్ధి (విశ్వ నగరం) ఎలా ఉండాలనే విజన్ అందులో స్పష్టంగా ఉంటుందన్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని చెప్పారు. అయితే ఎప్పుడు ప్రచారంలోకి దిగేది.. అవి బహిరంగ సభలా, రోడ్‌షోనా అనేది ఇంకా ఖరారు కానట్లు తెలిసింది.

బహుశా 75 డివిజన్లకు ఒకటి చొప్పున ముఖ్యమంత్రి రెండు బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు చెప్తున్నాయి. దీనితో పాటు టెలివిజన్‌లో ఒక పర్యాయం సీఎం ప్రజలతో మాట్లాడే అవకాశముందని నాయకుడొకరు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఇంకా ముందుకు తీసుకువెళ్లడంతో పాటు డివిజన్లవారీగా నేతలు ఎలా మాట్లాడాలనే దానిపైనా మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలిసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.