Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బాల్కొండ ఖిల్లాపై గులాబీ జెండా ఖాయం

-బాల్కొండ.. మరో గోల్కొండ
-ఎవరెన్ని ఎత్తులేసినా చిత్తుకాక తప్పదు
-టీఆర్‌ఎస్ చరిత్రను టీఆర్‌ఎస్సే తిరగరాయాలి
-నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఎంపీ కల్వకుంట్ల కవిత

బాల్కొండ నియోజకవర్గం హైదరాబాద్ గోల్కొం డ ఖిల్లా లాంటిదని.. ఇక్కడ గెలిచేందుకు ఎవరెన్ని ఎత్తులు వేసినా, టీఆర్‌ఎస్ ముందు చిత్తయిపోక తప్పదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బాల్కొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగిరి తీరుతుందని స్పష్టంచేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం లక్కోరలో బాల్కొండ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం.. తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ.. బాల్కొండలో ప్రశాంత్‌రెడ్డిని 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి 2014 నాటి రికార్డును టీఆర్‌ఎస్ పార్టీయే తిరగరాయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకత ఉన్నది. తొమ్మిదికి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు ఇక్కడే ఉన్నారు. మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి రాక పార్టీకి మరింత కలిసి వచ్చే అంశం. ఒకనాడు హైదరాబాద్‌లో గోల్కొండ ఖిల్లాను వశపర్చుకోవడానికి ఎంతోమంది రాజులు ఎన్నో వందల ఏండ్లు ప్రయత్నించినా వశం కాలేదట. అట్ల ఇవాళ నిజామాబాద్‌కు బాల్కొండ టీఆర్‌ఎస్ పార్టీకి మరో గోల్కొండగా తయారవుతున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రశాంత్‌రెడ్డి నిరంతరం ఇక్కడి గ్రామాలకు ఏం కావాలి, రైతన్నలకు ఏం కావాలి.. అభివృద్ధి ఎలా జరుగాలని ఆలోచిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుండి నిరంతరం మాట్లాడుతూ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం నిధులు తీసుకువస్తున్నారు అని అన్నారు.

అతి విశ్వాసం వద్దు
కార్యకర్తలకు అతి విశ్వాసం రాకూడదని, ఆత్మవిశ్వాసం ఉండాలని ఎంపీ కవిత సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎర్రజొన్నను రూ.42 కోట్లతో ప్రభుత్వం కొనుగోలుచేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించేలా రూ.2 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని, వెయ్యి కోట్లతో ఎస్సారెస్పీ పునర్జీవపథకం చేపట్టామని కవిత వివరించారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, నాయకులు కోటపాటి నర్సింహనాయుడు, డాక్టర్ మధుశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి అనుచరులు సుమారు 500 మంది ఎంపీ కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎంపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇందూరు నుంచే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాల సదస్సులో భాగంగా అక్టోబర్ 3న ఉమ్మడి నిజామాబాద్‌లో మొదటి సదస్సు జరుగుతున్నదని, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని 9 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నాయకులను పెద్ద ఎత్తున తరలించి సదస్సును విజయవంతంచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కోసం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీలు కవిత, బీబీపాటిల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డితోపాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల తాజా మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు అభివృద్ధికి కాలడ్డం పెడుతున్నాయని విమర్శించారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతుంటే కోర్టులలో కేసులు వేసి ప్రతిపక్షాలు పైశాచికానందం పొందుతున్నాయని ఎద్దేవాచేశారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత సాధారణ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో తొమ్మిందిటిని కైవసం చేసుకోవడంతోపాటు రెండు ఎంపీ స్థానాలు కూడా గెలుచుకున్నామని తెలిపారు. మళ్లీ అదే ఒరవడితో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని పోచారం ధీమా వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో 105 సీట్లలో బంపర్ మెజార్టీతో విజయం సాధించి కేసీఆర్ నాయకత్వంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో తాజా మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, వేముల ప్రశాంత్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, మహ్మద్ షకీల్, హన్మంత్ షిండే, ఏనుగు రవీందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సుజాత, రెడ్‌కో చైర్మన్ ఎస్‌ఏ అలీం, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు దాదాన్న గారి విఠల్, తారీఖ్ అన్సారీ, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలో సీఎం సభ కోసం స్థలాన్ని పరిశీలించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.