-జయశంకర్ సార్ సమాధిపై బీజేపీ రాజకీయం -టెక్స్టైల్ పార్కుకు ఒక్కరూపాయి తెచ్చావా? -వరంగల్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడావా? -ఓరుగల్లు అభివృద్ధిపై మాట్లాడటం సిగ్గుచేటు -ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఫైర్

బండి సంజయ్ కాదు.. తొండి సంజయ్.. అబద్ధాలు చెప్పడం తప్ప ఆయనకేమీ తెలియదు అని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని రగిలించి, ప్రత్యేక రాష్ట్రం కోసం తుదిశ్వాస వరకు పోరాడిన దివంగత ప్రొఫెసర్ జయశంకర్‌సార్ అన్నా, తెలంగాణ అమరులు అన్నా గౌరవం లేదని విమర్శించారు. జయశంకర్‌సార్ గురించి కనీస అవగాహనలేని బీజేపీ నాయకులు ఆయన సమాధిపై రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం హన్మకొండలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్‌తో కలిసి దాస్యం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ ప్రాణాత్యాగాలకు సిద్ధమైనప్పుడు బీజేపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ గురించి ఉద్యమాలు.. ఉద్యమ ఆకాంక్షలు తెలియనివాళ్లు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని, ఆయన గురించి మాట్లాడేముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తొండి సంజ య్.. నిన్ను గల్లీ నుంచి ఢిల్లీకి పంపిస్తే వరంగల్‌కు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తెచ్చావా.. బయ్యారం ఉక్కు ప్యాక్టరీ తెచ్చావా? అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కుకు ఒక రూపాయైనా తెచ్చావా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా తీసుకురాలేని బీజేపీ నాయకులు వరంగల్ నగరం అభివృద్ధి గురించి మట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఏ ఎన్నికలప్పుడూ టీఆర్ఎస్ భయపడలేదని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమాగా చెప్పారు.