Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బండి.. పచ్చి తొండి

-మనం చెల్లించిన పన్నులను ఇతర రాష్ర్టాల్లో వాడుతున్నరు
-కేంద్రమే మొత్తం నిధులిచ్చిన్నట్టుగా బండి తప్పుడు ప్రచారం
-తెలంగాణకు కేంద్ర విద్యాసంస్థల కేటాయింపు గుండు సున్నా
-60 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో వలసలు తప్ప ఇంకేం దక్కలేదు
-కాంగ్రెస్‌ నేతలు ఏం వెలగబెట్టారని ప్రజల వద్దకు వస్తున్నారు?
-వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చడంపై కేంద్రానిదే తాత్సారం
-ఏ ఎన్నికలున్నాయని ఐదుగురం మంత్రులం గద్వాలకు వచ్చాం
-కేంద్రం మన వడ్లు కొనదట.. వేరే వేయక తప్పదు: కేటీఆర్‌
-తెలంగాణ రూపాయి కడితే.. రాష్ర్టానికి కేంద్రమిచ్చేది ఆఠాణా
-నా మాట తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా.. నువ్వు సిద్ధమా!
-తెలంగాణ ప్రజల మనసు గెలవాలంటే ..

పాలమూరు పచ్చబడుతుంటే ప్రతిపక్షాల కండ్లు మండుతున్నాయి. ఇంటింటికీ తాగునీరివ్వడాన్ని కేంద్రమే పొగుడుతుంటే వీరికి మాత్రం కనిపించడంలేదు. తెలంగాణ ప్రజల మనసులు గెలవాలంటే వారిని కేసీఆర్‌ కంటే ఎక్కువగా ప్రేమించాలి.అదొక్కటే మార్గం కానీ.. మీడియా చూపిస్తున్నదని కేసీఆర్‌ను తిడుతూ పోతే పెద్ద నాయకులు కాలేరు.

–గద్వాల సభలో కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి రూపాయి కడుతుంటే.. కేంద్రం రాష్ట్రానికి ఆఠాణాయే ఇస్తున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆరున్నరేండ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు చెల్లించామని.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది రూ.1.42 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని, నిరూపించలేక పోతే ఎంపీ పదవికి బండి రాజీనామా చేస్తారా? అని సవాల్‌ విసిరారు. ‘నిధులు కేంద్రానివి.. సోకులు మాత్రం రాష్ట్రానివి’ అంటూ బండి సంజయ్‌ పాదయాత్రలో చెప్తున్నారని, అదే నిజమైతే తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం గద్వాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాదసభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘మొత్తం కేంద్రం పైసలే అయితే కర్ణాటకలో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు ఎందుకివ్వడం లేదు? అక్కడ కూడా ఇవన్నీ ఉండాలి కదా!’ అని నిలదీశారు. మోదీ ప్రభుత్వంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి ఏపీలో 68 ఏండ్లలో కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు నాలుగు మెడికల్‌ కాలేజీలు పెడితే.. తెలంగాణ వచ్చాక ఏడేండ్లలోనే 13 మెడికల్‌ కళాశాలలు ఏర్పాటుచేసుకున్నామని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మెడికల్‌ కాలేజీలు వస్తాయని సీఎం కేసీఆర్‌ చెప్పారని.. గద్వాలకు సైతం వస్తుందని పేర్కొన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. 16 ఐఐఎంలు, 80 పైచిలుకు నవోదయల్లోనూ రాష్ర్టానికి మొండిచేయే చూపిందని మండిపడ్డారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే గద్వాల బీజేపీ జాతీయ నాయకురాలు దీనికి సమాధానం చెప్పాలన్నారు. నల్లధనం తెచ్చి జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని.. కానీ ఉన్నధనమే పోయే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఏడేండ్లలో 1,32,899 ఉద్యోగాలను భర్తీచేస్తే.. కేంద్రం ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నదని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారని.. ఇప్పటివరకు రావాల్సిన 14 కోట్ల ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు. ‘బాత్‌ కరోడో మే.. కామ్‌ పకోడో మే’ అన్నట్టు మోదీ వ్యవహారం ఉన్నదని ఎద్దేవాచేశారు. ఇడ్లీలు, బజ్జీలు తయారుచేసే వాళ్ల ఉపాధి కూడా తామే ఇచ్చినట్టుగా బీజేపీ నాయకులు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు.

గద్వాల చూసి పోయేందుకొచ్చాం

గద్వాలను చూసి పోయేందుకు రాష్ట్రప్రభుత్వం తరఫున ఐదుగురు మంత్రులం వచ్చామని కేటీఆర్‌ అన్నారు. ఎలాంటి ఎన్నికలు లేకున్నా ఇక్కడకు వచ్చి రూ.104 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ధరూరు మండలం చిన్నపాడు గ్రామం వద్ద పత్తి రైతులతో మాట్లాడామని.. వర్షాలు బాగా పడ్డాయి, పరిస్థితి బాగుందంటూ శ్రీశైలం అనే రైతు చెప్పారని అన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్రంలో కేసీఆర్‌లాగా ఎవరూ ఆలోచించలేదని ఆ రైతు అన్నాడని చెప్పారు. భర్త చనిపోతే 10 రోజుల్లోనే రూ.5 లక్షల రైతు బీమా చెక్కు ఇంటికొచ్చిందని కల్యాణి అనే ఆడబిడ్డ పేర్కొన్నదని, నెలకు రూ.2 వేల పింఛన్‌ వస్తున్నదని హన్మంతమ్మ అనే పెద్దావిడ ఆనందంగా తెలిపిందని అన్నారు. కాంగ్రెస్‌, బంగ్లా దొరసాని అధికారంలో ఉన్నప్పుడు ఎంత వస్తుండే అని అడిగితే.. రూ.200 మాత్రమేనని.. ఇప్పుడు పెద్ద కొడుకు కేసీఆర్‌ 10 రెట్లు పెంచిండని చెప్పినట్టు వివరించారు. ‘మీ కర్ణాటకలో రైతుబంధు, రైతు బీమా ఉన్నదా.. కరోనా సమయంలో సర్కారే వడ్లు కొన్నదా’ అని అక్కడే ఉన్న కర్ణాటక రైతు కూలీలను అడిగితే లేదని చెప్పారని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. కేసీఆర్‌ రైతులను కంటికి రెప్పలా చూసుకోవడం చూసి కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలు కుళ్లుకుంటున్నాయన్నారు. ఆడబిడ్డల పెండ్లికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ కోసం రూ.లక్షా పదహారు ఇస్తున్న ఘనత కేసీఆర్‌ సర్కారుదేన్నారు. రాష్ట్రంలో సర్కారు దవాఖానలు సుఖ ప్రసవాలకు నిలయాలుగా మారాయని.. మాతా శిశు మరణాలు పూర్తిగా తగ్గాయని తెలిపారు. అంగన్‌వాడీకి పోతే బాలామృతం.. సర్కారు బడికి పోతే సన్న బియ్యం ఇస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణకు ముందు రాష్ట్రంలో 150 గురుకులాలు ఉంటే ఇప్పుడు 945 గురుకులాలు ఉన్నది నిజం కాదా? అని అడిగారు.


ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ పీ రాములు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎస్‌ వాణీదేవి, కే దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్లు సరిత, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్యాల నిజాంపాష, కార్పొరేషన్ల చైర్మన్లు అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, బాద్మి శివకుమార్‌, దేవర మల్లప్ప, గట్టు తిమ్మప్ప, మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ తదితరులు హాజరయ్యారు.

వాల్మీకీల అంశం లేవనెత్తిందే కేసీఆర్‌
వాల్మీకీ బోయలను ఎస్టీల్లో చేర్చాలని 2007లో గొంతు విప్పి గర్జించింది నాటి ఉద్యమనేత కేసీఆర్‌ అని కేటీఆర్‌ గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక చెల్లప్ప కమిషన్‌ వేస్తే వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెప్పారు. వారిపై నిజంగా ప్రేమ ఉంటే మోదీతో మాట్లాడి సాధించుకురావాలని డీకే అరుణకు సవాల్‌ విసిరారు. వాల్మీకీ సోదరులకు తెలంగాణ సర్కారు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఒక్కరోజులో గద్వాలకు రూ.104 కోట్లు వస్తే ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని చెప్పారు. అభివృద్ధి పనుల కోసం తాము తిరుగుతుంటే తమ వాహనాలకు కొందరు బీజేపీ పిల్లలు అడ్డుగా వస్తున్నారని చెప్తూ.. మతం పేరిట ఆ పార్టీ నేతలు పెట్టే చిచ్చుకు గురికావద్దని వారికి సూచించారు. మహారాష్ట్రలోని 7,8 గ్రామాలు తెలంగాణలో చేరుతామని, తమకూ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు ఇవ్వాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలిసి బతిమలాడుతున్నారని కేటీఆర్‌ తెలిపారు. పరిస్థితి ఇలా ఉంటే కేసీఆర్‌, కృష్ణమోహన్‌రెడ్డిని బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీఎంతో మాట్లాడి అలంపూర్‌ పట్టణంలో ప్రస్తుతం ఉన్న దవాఖానను సకల సదుపాయాలతో అప్‌గ్రేడ్‌ చేస్తామని హామీ ఇచ్చారు. గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు.

కొత్త బిచ్చగాడు రేవంత్‌..
కాంగ్రెస్‌ దివాలా తీసిన పార్టీ అని.. నిన్న మొన్న ఆ పార్టీకి రేవంత్‌ అనే కొత్త బిచ్చగాడు వచ్చాడని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. డబ్బు సంచులతో అడ్డంగా దొరికిన ఆయన తప్ప పీసీసీ చీఫ్‌గా మరెవరూ లేరా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇలా ఎందుకు చేయలేదు.. అలా ఎందుకు చేయలేదని అంటున్నారని.. 60 ఏండ్ల మీ పరిపాలనలో ఏం చేశారని నిలదీశారు. పాలమూరు పచ్చబడుతుంటే వీరి కండ్లు మండుతున్నాయని విమర్శించారు. ఇంటింటికీ తాగునీరివ్వడాన్ని కేంద్రమే పొగుడుతుంటే వీరికి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనసు గెలవాలంటే వారిని కేసీఆర్‌ కంటే ఎక్కువగా ప్రేమించాలని.. అదొక్కటే మార్గమని తెలిపారు. కేసీఆర్‌ను తిడితేనే మీడియా చూపిస్తుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని.. కానీ.. ఆయనను తిడితే పెద్ద నాయకులు కాలేరని హితవుపలికారు. ఇతర రాష్ర్టాలకు ముఖ్యమంత్రులు ఉంటారని.. ఇక్కడ మాత్రం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు.

కేంద్రం వడ్లు కొనమని చేతులెత్తేసింది
వడ్లు కొనబోమంటూ ఎఫ్‌సీఐ, కేంద్రం చేతులెత్తేసిందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కేంద్రం తీరును నిరసిస్తూనే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. వేరుశనగ, పత్తి, తదితర పంటలు పండించాలని కోరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.