-అవగాహన లేకుండా చిల్లర మాటలు -ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు -ఎన్నికల్లో ప్రచారంచేయకుండా అడ్డుకోండి -ఎస్ఈసీకి టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు -సామాజిక న్యాయానికి టీఆర్ఎస్ పెద్దపీట -బీజేపీ పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి -నిప్పులు చెరిగిన టీఆర్ఎస్ నేత పల్లా

మత విద్వేషా లు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ని వెంటనే అరెస్ట్‌చేసేలా ఆదేశాలు జారీచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదుచేశారు. టీఆర్ఎస్ ప్రధానకార్యదర్శులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. ముఖ్యమంత్రిపై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని, వెకిలిగా మాట్లాడుతున్నారని, సీఎంపై అనుచిత వ్యాఖ్యలుచేస్తున్న సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలు సరికాదని తెలిపారు. తాను ఒక ఎంపి అనే విషయాన్ని మర్చిపోయి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజకీయాలపై అవగాహనలేకుండా చిల్లరమల్లర వ్యాఖ్యలుచేస్తున్నారని మం డిపడ్డారు. చట్టప్రకారం ఎంపీ సంజయ్‌పై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయకపోతే మత సామరస్యానికి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. సీఎంను లాడెన్‌తో పోలుస్తూ శాంతియుతంగా ఉన్న ప్రజలను రెచ్చగొట్టేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న పీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకొన్నదని గుర్తుచేశారు. పాకిస్థాన్‌కు వెళ్లి జిన్నా విగ్రహానికి పూలమాల వేసి ఆయనపై ప్రశంసలు కురిపించింది.. బీజేపీ నాయకులు కాదా? అని ప్రశ్నించారు.
కోడ్ ఉల్లంఘన హైదరాబాద్‌లో శాంతిభద్రతల దృష్ట్యా బండి సంజయ్‌ను అరెస్ట్‌చేయాలని కోరారు. ఈ రకమైన రెచ్చగొట్టే ప్రసంగాలుచేయడం ద్వారా బండి సంజయ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని టీఆర్ఎస్ నేతలు ఎస్ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంజయ్‌పై క్రిమినల్ చర్యలతోపాటు ప్రజాప్రతినిధుల చట్టం, జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీగా ఉండి మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దిగజార్చేలా దేశద్రోహి, హిందూవ్యతిరేకి అనే పదాలను ఉపయోగించడం ద్వారా నిబంధనలను అతిక్రమించారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధుల చట్టం – 1951 సెక్షన్ 123కు విరుద్ధంగా మతం ఆధారంగా ఓటు వేయాలని బండి సంజయ్ కోరినట్టు ఆయన ప్రసంగంలో స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. మతాల మధ్య విద్వేషాలు పెరిగితే అది జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని వివరించారు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 153 ప్రకారం ఇది తీవ్రనేరం కిందకి వస్తుందని తెలిపారు. ఆర్టికల్ 324 ప్రకారం స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఈసీపై ఉన్నందున.. తీవ్రనేరాలకు పాల్పడిన సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ప్రచారం నిర్వహించకుండా నిరోధించాలని విజ్ఞప్తిచేశారు.
నోరు దగ్గరపెట్టుకుంటే మంచిది రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంటే కండ్లుకుట్టిన కాషాయ పార్టీ నేతలు టీఆర్ఎస్ పైనా, సీఎం కేసీఆర్ పైనా అవాస్తవాలను ప్రచారంచేస్తే చూస్తూ ఊరుకోబోమని, స్థాయిని మరి చి మాట్లాడుతున్నారన్నారు. ఇటీవల భారీ వర్షా లు కురిసి, వరదల్లో ప్రజలు అతలాకుతలమైపోతే ఏ పార్టీ నాయకులు, ముఖ్యంగా బీజేపీ నేతలు ఎక్కడున్నారని నిలదీశారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ శ్రేణులు బాధితులను ఆదుకొన్నారని గుర్తుచేశారు. వరద బాధితులకు అందించే సహాయాన్ని ఓ పక్క అడ్డుకొంటూ మరోపక్క అధికారంలోకి వస్తే 25 వేలు ఇస్తామంటూ బీజేపీ నేతలు మాట్లాడితే నమ్మేందుకు హైదరాబాదీలు సిద్ధంగాలేరని తెలిపారు. ట్రిపుల్‌రైడింగ్ చేసినా వాళ్ల చలాన్లకు జీహెచ్ఎంసీ డబ్బులు చెల్లిస్తుందంటూ యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు.
సామాజిక న్యాయం టీఆర్ఎస్లోనే.. అంతకుముందు తెలంగాణ భవన్లో పల్లా మీడియాతో మాట్లాడుతూ.. ఈ దేశంలో సామాజికన్యాయానికి పెద్దపీట వేసింది టీఆర్ఎస్ పార్టీయేనని, అన్ని వర్గాలను అక్కున చేర్చుకొన్న మహానాయకుడు సీఎం కే చంద్రశేఖర్‌రావు అని అన్నారు. వరదలతో అల్లాడి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను పెద్దమనసుతో ఆదుకోవాలని.. ఇంటికి పదివేలు సాయం చేస్తుంటే.. ఓర్వలేక రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజల నోటికాడి ముద్దను ఎత్తగొట్టిన దుర్మార్గపు పార్టీ బీజేపీ అని ఆయన మండిపడ్డారు. సామాజిక న్యాయానికి అధిక ప్రాధాన్యమిస్తున్న పార్టీ టీఆర్ఎస్సేనని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ ఎంపికచేసిన అభ్యర్థుల సీట్ల కేటాయింపే తార్కాణమని తెలిపారు. మహిళలకు 56% సీట్లిచ్చిన పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది టీఆర్ఎస్సేనని స్పష్టంచేశారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారికీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం కల్పించిన ఘనత టీఆర్ఎస్కే దక్కిందని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, బస్వరాజు సారయ్య, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.