Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బంగారు తెలంగాణ బడ్జెట్

-సకలజనానికి కేసీఆర్ సర్కార్ భరోసా -ఎంపికచేసిన పథకాలకు సమృద్ధిగా నిధులు.. -తొలి ప్రయత్నంలోనే లక్ష కోట్ల మార్కు దాటిన బడ్జెట్ -లక్ష కోట్ల సమైక్యరాగ బడ్జెట్ల దుమ్ముదులిపిన ఈటెల.. -గతంకంటే ఘనంగా తెలంగాణకు కేటాయింపులు

-నీటిపారుదల రంగానికి రూ.9,407 కోట్లు -వ్యవసాయ రంగానికి 8,511 కోట్లు -రైతుల రుణమాఫీకి రూ.4,250 కోట్లు -చెరువుల పునరుద్ధరణకు 2,000 కోట్లు -రహదారుల అభివృద్ధికి 4 వేల కోట్లు -ఆరోగ్య రంగానికి రూ.2,282 కోట్లు

-అమరవీరుల కుటుంబాలకు రూ.100 కోట్లు -పింఛన్లకు రూ.6,580 కోట్లు -నియోజకవర్గం అభివృద్ధి నిధులు ఇక కోటిన్నర -విద్యా రంగానికి రూ.10,956 కోట్లు -మొత్తం సామాజికరంగానికి 23 వేల కోట్లు -ఉద్యోగుల జీతభత్యాలకు రూ.20 వేల కోట్లపైనే

ప్రణాళిక వ్యయం : రూ.48,648.47 కోట్లు ప్రణాళికేతర వ్యయం : రూ.51,989.49 కోట్లు

Etela Rajendar Budget

మన నిధులు మనకేనన్న తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిని చాటి చెప్తూ.. గతంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిచేసే దిశగా.. బంగారు తెలంగాణ నిర్మాణానికి తొలి అడుగువేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014-15 వార్షిక సంవత్సరంలో పది నెలల కాలానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.1,00,637.96 కోట్ల అంచనాలతో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ప్రథమ బడ్జెట్‌ను ప్రతిపాదించారు.

సబ్బండ వర్ణాలకు బంగారు తెలంగాణపై భరోసా కల్పిస్తూ కేటాయింపులు చేశారు. కిందటేడాది ఉమ్మడి రాష్ట్రంలో రూ. 1.61 లక్షల కోట్లతో బడ్జెట్‌ను గత ప్రభుత్వం మొత్తం 23 జిల్లాలకు ప్రవేశపెట్టగా.. తెలంగాణలోని పది జిల్లాలకు అదీ పది నెలల కాలానికి కేసీఆర్ సర్కారు లక్ష కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం విశేషం. పైగా.. దామాషా నిష్పత్తితో పోల్చితే.. గతంలో జరిగిన కేటాయింపులకంటే అదనంగా నిధులు సమకూర్చడం మరో విశేషం. గత ప్రభుత్వాల కాలంలో అన్యాయానికి గురైన తెలంగాణ అవసరాలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవచేస్తూ పలు కొత్త పథకాలకు సమృద్ధిగా నిధులు కేటాయించారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రణాళికా వ్యయాన్ని, ప్రణాళికేతర వ్యయాన్ని ఇంచుమించు సరిసమానంగా చూపడం ద్వారా ప్రభుత్వం అభివృద్ధిలో ప్రణాళికాయుతంగా ముందుకు సాగనుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

ఆ క్రమంలోనే ప్రణాళిక వ్యయంకింద రూ.48,648.47 కోట్లను, ప్రణాళికేతర వ్యయంగా రూ.51,989.49 కోట్లను పేర్కొన్నారు. రోడ్లు, నీటి వనరులు, ప్రజారోగ్యం, నీటిపారుదల పథకాలతోపాటు దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి కొని ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలను బలిదానమిచ్చిన అమరవీరుల స్ఫూర్తికి వినయపూర్వకంగా తలొంచుతూ వారి కుటుంబాలను ఆదుకునేందుకు వంద కోట్ల రూపాయలను కేటాయించారు. 26.95శాతం బడ్జెట్ పెరుగుదల:మొత్తం బడ్జెట్‌లో పెరుగుదల గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 26.95 శాతంగా చూపారు.

ఇందులో ప్రణాళిక వ్యయం పెరుగుదల 58.68 శాతంగా, ప్రణాళికేతర వ్యయం పెరుగుదల 6.94 శాతంగా చూపారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల నుంచి రాష్ర్టానికి వచ్చేవాటాగా రూ.9,749.36 కోట్లను పేర్కొన్నారు. కేంద్రం రాష్ర్టానికి గ్రాంట్లుగా రూ.21,720 కోట్లు ఇస్తుందని ఆశిస్తున్నామని ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో రాష్ట్రంలో ప్రణాళిక వ్యయంగా రూ.11,781.25 కోట్లను ప్రతిపాదించారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన సేల్స్ టాక్స్ బకాయిలు రూ.1,500 కోట్లని పేర్కొన్నారు.

ఫైనాన్షియల్ కాంపొనెంట్ గ్రాంట్‌గా రూ.3,139.46 కోట్లను పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించే సొంత పన్నులద్వారా వచ్చే ఆదాయం రూ.35,378.24కోట్లుగా ఉంది. ఇందులో సేల్స్‌టాక్స్ ద్వారా రూ.26,963.30 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.2,823.54 కోట్లు, మోటార్ వెహికిల్ టాక్స్ ఆదాయం రూ.2,226.86 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌ద్వారా రూ.2,583.88 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పన్నేతర ఆదాయంగా 13,242.02 కోట్లను అంచనావేశారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 96.23% అధికం. ఇందులో మైన్స్ అండ్ మినరల్స్ ద్వారా రూ.1,877.52 కోట్లు, వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం రూ.2,508.98 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని రూ.80,090.33 కోట్లుగా చూపితే, రాష్ట్ర ప్రభుత్వ మొత్తం వ్యయాన్ని రూ.79,789.31 కోట్లుగా చూపించారు.

వ్యయాల్లో నాన్ ప్లాన్ కింద రూ.48,676.42 కోట్లు, ప్లాన్ కింద రూ.31,112.89 కోట్లను చూపించారు. ప్రణాళిక వ్యయం గతంతో పోల్చితే 67.41 శాతం అధికంగా ఉంది. రెవెన్యూ మిగులును రూ.301.02 కోట్లుగా చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మొత్తం రుణాలపై వడ్డీలు, వాయిదాలపై చెల్లించే మొత్తం రూ.17,774.30 కోట్లుగా బడ్జెట్ లెక్కల్లో పొందుపర్చారు. ప్రణాళికేతర వ్యయంలో అధికభాగం ఉద్యోగుల జీతాలు, ఇతర అలవెన్సులకే చెల్లించాల్సి వస్తున్నది. ఉద్యోగుల వేతనాలకోసం ఏటా రూ.18,437.77 కోట్లను, టీఏలు, డీఏలు, ఉద్యోగుల వైద్యం, ఇతర ఖర్చులకోసం రూ.1,733.01 కోట్ల ఖర్చును ప్రతిపాదించారు.

ఇతర సబ్సిడీల కింద రూ.11,528.60 కోట్లను చెల్లిస్తుంటే, ఇందులో రైతుల రుణమాఫీ కోసం రూ.4,250 కోట్లను, విద్యుత్ సబ్సిడీ కింద రూ.3,000 కోట్లను, మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటుగా రూ.812 కోట్లను, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటుగా రూ.1,395 కోట్లను చెల్లించేందుకు ప్రతిపాదనలు చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీల చెల్లింపులకు రూ.5,925 కోట్లను, పెన్షనర్లకోసం రూ.6,580.46 కోట్లను వెచ్చించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. కేవలం పది నెలల కాలానికే బడ్జెట్ ప్రతిపాదనలు చేస్తున్నా.. 2014-2019 మధ్యకాలంలో ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు జరుపుతున్నట్లు ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధుల పెంపు శాసనసభా నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కింద ఇప్పటివరకు పభుత్వం ప్రతీ సంవత్సరానికి ఒక్కో ఎమ్మెల్యేకు రూ.కోటి క్రేటాయించేది. దానిని కోటిన్నరకు పెంచుతూ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. తద్వారా రూ.234 కోట్లను తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులుగా ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ అభివృద్ధికోసం ఇప్పటికే అభివృద్ధి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేశారు. గజ్వేల్ అభివృద్ధికోసం రూ.50 కోట్లను కేటాయిస్తూ బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.

క్షేత్రస్థాయి అవసరాలకు అద్దంపడుతున్నది ఏం చేస్తామో… అదే చెబుతాం! తత్తర బిత్తరపడి ఏదీ చేయం అంటూ తరచూ చెప్పే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాటలను అక్షరసత్యాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మునుపటి మాదిరిగా అధికారుల ప్రతిపాదనలు, ఏసీ గదుల్లో తర్జనభర్జలతో అంకెల గారడీ కాకుండా.. మన ఊరు-మన ప్రణాళిక రూపంలో క్షేత్రస్థాయి అవసరాలకు అద్దంపట్టే రీతిలో బడ్జెట్ ఉందని రాజకీయ పరిశీలకులకు చెబుతున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందనే భరోసాను తెలంగాణ సమాజానికి ప్రభుత్వం కల్పించిందని పేర్కొంటున్నారు. నాలుగేండ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని, లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగబోమని ధైర్యంగా చెబుతున్న ముఖ్యమంత్రి.. ఈ బడ్జెట్‌లో వాటర్ గ్రిడ్‌కు ఏకంగా రూ.2,000 కోట్లు కేటాయించడమంటే మామూలు విషయం కాదంటున్నారు. రైతు రుణమాఫీని ఎప్పుడో అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఒకే జీవోతో రూ.4,250 కోట్ల కేటాయింపులు జరిపింది. దీనితోపాటు ఇన్‌పుట్ సబ్సిడీ, ఎర్రజొన్న రైతుల బకాయిలను చెల్లించింది. అయితే తెలంగాణ బ్రహ్మాండమైన విత్తన భాండాగారంగా అభివృద్ధి చెందుతుందని ఆది నుంచి చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి ఈ బడ్జెట్‌లో ఆ మేరకు అడుగులు వేయించారు. ఫామ్ మెకనైజేషన్‌కు రూ.వంద కోట్లు కేటాయించారు.

ప్రతిపక్షాలకు అవకాశమివ్వకుండా.. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు పన్నుతున్న చంద్రబాబు.. ఆయనకు వంత పాడుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతోపాటు నిత్యం విమర్శలు ఎక్కుపెడుతున్న కాంగ్రెస్‌కు కూడా అవకాశం ఇవ్వకుండా ఈ బడ్జెట్‌లో అన్ని రంగాలను పరిగణలోనికి తీసుకున్నారని పార్టీ నేతలు అంటున్నారు.

కేసీఆర్ ఆకాంక్షల బడ్జెట్ ఆరు దశాబ్దాలపాటు అన్యాయాలు ఎదుర్కొన్న తెలంగాణను ఉన్నతస్థానంలో చూడాలని భావించిన కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వనరుల కొరత ఎలా ఉన్నప్పటికీ, కేంద్రం నుంచి అదనంగా ప్యాకేజీ వస్తుందని, అవసరమైతే రుణాలు పెంచుకుని, పెట్టుబడి వ్యయంగా ఆ మొత్తాలను ఖర్చు చేయాలనే దిశగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని అధికారవర్గాలు అంటున్నాయి.

గత ప్రభుత్వాలు అమలు చేసిన విధంగానే నిధుల సమీకరణకు ప్రభుత్వ భూములను కొంతవరకు విక్రయించాలనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎఫ్‌ఆర్‌బీఎం యాక్టు కింద రాష్ట్ర స్థూల ఆదాయంలో మూడోవంతు వరకే రుణాలు తీసుకునే అవకాశాన్ని సడలించేందుకు కేంద్రం అనుమతిస్తుందన్న ఆశాభావంతో ద్రవ్యలోటును పెంచుకునేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. సాగునీటి వసతిని పెంచేందుకు రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రచన జరిగిన నేపథ్యంలో, అవసరమైతే కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, వాటి నుంచి బాండ్లను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు అదనపు ప్యాకేజీ వస్తే, దాదాపు 9 వేల కోట్లకు రెవెన్యూ మిగులు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పూర్తి శ్రద్ధ తీసుకున్న కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణంలో తొలి అడుగుగా భావిస్తున్న బడ్జెట్ రూపకల్పనలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పూర్తిస్థాయిలో శ్రద్ధ తీసుకున్నారు. సాధారణంగా ఆర్థికశాఖ రూపొందించే ప్రతిపాదనలను పరిశీలించి, ప్రభుత్వ ప్రాథమ్యాల ప్రకారం కొన్ని రంగాలకు అధిక నిధులు కేటాయించాలని మాత్రమే ముఖ్యమంత్రులు సూచించడం పరిపాటి. కానీ కేసీఆర్ ప్రతి దశలోనూ బడ్జెట్ చర్చల్లో పాల్గొని, దీర్ఘకాలిక ఆలోచనగా ఒక్కో రంగానికి చేసే కేటాయింపులపై సూచనలు అందించినట్లు సమాచారం.

దీంతో రాష్ట్ర వార్షిక ప్రణాళిక భారీగా పెరిగింది. బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం దాదాపు సమాన స్థాయికి చేరడం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేకతగా ఆర్థిక విశ్లేషకులు కొనియాడుతున్నారు. గత బడ్జెట్‌లో (రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు) రూ.55 వేల కోట్లవరకు వార్షిక ప్రణాళిక ప్రతిపాదించినప్పటికీ, జరిగిన వ్యయం కేవలం రూ.35 వేల కోట్లకే పరిమితమైంది. కానీ తెలంగాణ ప్రభుత్వం రూ.48 వేలకోట్ల పైచిలుకు వార్షిక ప్రణాళిక రూపొందించి సమర్థవంతంగా దాన్ని అమలు చేసేందుకు వ్యూహరచన చేసింది.

చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన బడ్జెట్‌లో ద్రవ్య లోటును 7.5 శాతానికి పెంచుకునేలా రూపొందించుకున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం 1.79 శాతానికి ద్రవ్య పరిమితిని పెంచుకునేందుకు కేంద్రం అనుమతించే అవకాశాలుంటాయని ఆశించి, మొత్తం రూ.17 వేల కోట్లకు ద్రవ్య లోటును పరిమితం చేసింది. రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌వంటి సంస్థలను ఏర్పాటు చేసి అవసరమైతే బాండ్లు విడుదల ద్వారా అంతర్గతంగా వనరులు పెంచుకునేందుకు కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా 6 వేల కోట్ల వరకు నిధులు జమ చేసుకునే అవకాశముంటుందని అంచనా. నిధుల సమీకరణ పెంచడం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం ప్రాతిపాదించిన సంక్షేమ కార్యక్రమాలు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ అమలు, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర సొంత రెవెన్యూ రూ.35 వేలకోట్లకు పైగా ఉండగా, ఈ ఏడాది అదనంగా రుణాలు సేకరించడం, కేంద్రంనుంచి వచ్చే ప్యాకేజీ వల్ల భారీ బడ్జెట్‌ను అమలు చేయడం అసాధ్యమేమీ కాదని మరో అధికారి తెలిపారు.

ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా.. -అభివృద్ధికి పటిష్ఠమైన ప్రణాళికలు -మౌలిక సదుపాయాలకు అనుగుణంగా ప్రాథమ్యాలు -పారిశ్రామిక ప్రగతి.. తలసరి ఆదాయం పెంపు -సామాజిక ఆర్థిక నివేదికలో ప్రభుత్వ లక్ష్యాలు

బంగారు తెలంగాణ సాధన దిశగా సామాజిక ఆర్థిక నివేదిక (సోషల్ ఎకనామిక్ సర్వే) రూపకల్పనలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సామాజిక ఆర్థిక నివేదికను బుధవారం శాసనసభకు సమర్పించారు. ఇందులో భాగంగా విత్తన అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, రక్షిత తాగునీటి అవసరాలు, ప్రతి గ్రామంలో ఒక గోదాం నిర్మాణం, విద్యుత్‌లోటును అధిగమించేందుకు 2019-20 సంవత్సరం నాటికి 7,529 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలు, ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి సన్నాహాలకు వీలుగా పటిష్ఠమైన విద్యుత్ ప్రణాళికను రూపొందిస్తున్న అంశాలను ప్రభుత్వం నివేదికలో పొందుపరిచింది.

వాటి వివరాలు.. -భౌగోళికంగా తెలంగాణ 1,14,840 చదరపు కిలోమీట ర్లవిస్తీర్ణంతో 2011 జనగణనప్రకారంగా 3,51,94,000 జనాభాను కలిగి ఉంది. -తెలంగాణలో అక్ష్యరాస్యత 66.46శాతం ఉంది. 2013-14 ప్రాథమిక అంచనాల ప్రకారం.. -రాష్ట్రంలో తలసరి స్థూలఆదాయం (జీఎస్‌డీపీ) రూ.2,07,069కోట్లు. ఇది 5.55 శాతంగా నమోదైంది. జాతీయ స్థూల ఆదాయం (4.74 శాతం) కంటే తెలంగాణ స్థూల ఆదాయం అధికంగా ఉంది.

ప్రస్తుత ధరల ప్రకారం.. -రాష్ట్ర తలసరి స్థూల ఆదాయం రూ.3,78,963కోట్లు -వ్యవసాయరంగంలో జీఎస్‌డీపీ రూ.65,205కోట్లు -పారిశ్రామికరంగంలో జీఎస్‌డీపీ రూ.1,04,218కోట్లు -సేవారంగంలో జీఎస్‌డీపీ రూ.2,09,540కోట్లు -ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం రూ.93,151 లు. 2013-14లో జాతీయ తలసరి ఆదాయం రూ.74,380. -మానవవనరుల అభివృద్ధిలో 2011-12 సెస్ డ్రాఫ్ట్ నివేదిక ప్రకారం తెలంగాణ 10వ స్థానంలో ఉంది. -2012-13లో 82.42 లక్షల టన్నుల మేరకు ఉన్న ఆహా ర ఉత్పత్తులు ఈ ఏడు 106. 88 లక్షలటన్నులకు పెరిగాయి. -చిన్న, మధ్య, భారీ ప్రాజెక్టుల కింద 52.95 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తరించింది.

ప్రభుత్వ లక్ష్యాలు.. -రానున్న ఐదేండ్లలో చెరువుల అనుసంధాన కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వడం. -తెలంగాణను భారీ విత్తన కేంద్రంగా తీర్చిదిద్దడం. -25.16 ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడం. -హరితహారం కింద వచ్చే నాలుగేండ్లలో 230కోట్ల మొక్కల పెంపకం. -రక్షిత తాగునీటి వసతి కల్పించేందుకు వాటర్‌గ్రిడ్ కార్యక్రమం చేపట్టడం. -ప్రతి విద్యార్థికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య అందించడం. -పరిశ్రమలు త్వరితగతిన ఏర్పాటయ్యేందుకు వీలుగా సింగిల్‌విండో క్లియరెన్స్ వ్యవస్థను నెలకొల్పడం. -స్మార్ట్ సిటీల నిర్మాణాలను చేపట్టడం. -హైదరాబాద్‌లో 24×7 4-జీ సేవలు. -ప్రైవేటు భూములు కొనుగోలు చేసి భూమిలేని దళిత కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున పంపిణీ చేయడం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.