Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నాం

-అది దీర్ఘకాలిక లక్ష్యం.. అన్నీ ఒకేసారి పరిష్కారంకావు -ఒక్కొక్కటిగా సాధిస్తూ ముందుకు వెళ్తున్నాం -త్వరలో ప్రతి మండలానికీ గురుకులాలు -అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -మీరు తెలంగాణను చీకట్లో పెడితే.. -మేం వెలుగులు నింపుతున్నాం -మీ హయాంలో వర్సిటీలను భ్రష్టుపట్టించారు -మా పనిని ప్రజలు చూస్తున్నారు -క్షేత్రస్థాయిలో ప్రజలే తీర్పుచెప్తారు -కాంగ్రెస్ సభ్యుల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి

ఏండ్ల తరబడి కొట్లాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి బాటలు వేసుకొంటూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.కాంగ్రెస్ హయాంలో రాష్ర్టాన్ని చీకట్లో పెడితే.. తాము వెలుగులు నింపుతున్నామని చెప్పారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుపై గురువారం శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ లక్ష్యాన్ని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెటకారం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బంగారు తెలంగాణ అనేది దీర్ఘకాలిక లక్ష్యమని, దీన్ని సాధించే దారిలో ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు.

సమస్యలన్నీ ఒకేసారి పరిష్కారం కావన్న సీఎం.. ఒకదాని తర్వాత ఒక సమస్యను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామని వివరించారు. మా పరిపాలన మూడోవంతు మాత్రమే పూర్తయింది. ఇంకా 20 నెలల సమయం ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో.. ఇప్పుడు మేం ఏం చేస్తున్నామో ప్రజలు గమనిస్తున్నారు. మనం ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తప్పకుండా వారే తీర్పు ఇస్తారు. మేం బంగారు తెలంగాణ దిశగా వెళుతుంటే అది మీకు కనపడకపోతే ఏంచేస్తాం? మొత్తం మార్పుకోసం సమయం పడుతుంది. వన్ బై వన్ చేసుకొంటూ వెళ్తున్నాం అని సీఎం సభకు వివరించారు.

ప్రతి మండలానికీ గురుకులాలు రాబోయే రోజుల్లో ప్రతి మండలానికీ రెండు, మూడు గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలను నీతి ఆయోగ్ ప్రశంసించడమే కాకుండా అన్ని రాష్ర్టాలూ ఇదే తరహాలో గురుకులాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించిందని పేర్కొన్నారు. హాస్టళ్ల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ల దగ్గర తగినన్ని నిధులు అందుబాటులో ఉంచామని తెలిపారు. దళిత, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్యనందించడంలో కానీ, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంలో కానీ, సమైక్యరాష్ట్రంలో ప్రభుత్వాలు ఏమీ చేయలేదని, విఫలమయ్యాయని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాట వాస్తవమని సీఎం అన్నారు. అదే సమయంలో బంగారు తెలంగాణపై కోమటిరెడ్డి చేసిన ఆరోపణలకు బదులిస్తూ..

బంగారు తెలంగాణ నెలల్లో.. రోజుల్లో రాదు.. అందుకు బాటలు వేస్తారు అన్నారు. మీరు ఏదో భ్రమలకు పోయి.. ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ పద్ధతి మీకు ఔన్నత్యం తీసుకురాదు. మీ పరిపాలనలో ఏనాడూ లేని విధంగా ఇప్పుడు గురుకులాలు ప్రారంభమయ్యాయి. మీ హయాంలో ఫ్యాన్లు, బాత్‌రూమ్‌లు లేకుండా హాస్టళ్లు నడిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీని భ్రష్టు పట్టించిందే కాంగ్రెస్‌పార్టీ. సొంత రాష్ట్రాన్ని మనకు మనమే శపించుకోవడం మంచిది కాదు. ఊరికే బంగారు తెలంగాణ అంటే ఏమిటి? బంగారు తెలంగాణ అంటే ఏమిటి అని అంటుంటే బయట ప్రజలు సీరియస్‌గా తీసుకోరు. మీరు అనుసరించే పద్ధతి చాలా పాతది అని సీఎం చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, అప్పు లు.. ఇలాంటివి తప్ప మీకు ఇంకో సబ్జెక్ట్ లేదా అని కాంగ్రెస్ సభ్యులను ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు బాగా నడుస్తున్నాయని, వాటిని ఎంకరేజ్ చేస్తూ నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని విపక్షాలను ముఖ్యమంత్రి కోరారు.

గురుకులాల నిర్మాణాలకు రూ.9 వేల కోట్లు రాష్ట్రంలో 25 ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడ్డాయని, కొత్త గురుకుల పాఠశాలలను వాటిల్లో ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. గురుకుల పాఠశాలల నిర్మాణాలకు రూ.9000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఎస్సీ విద్యార్థినుల కోసం 30 గురుకుల కళాశాలలు ఏర్పాటుచేశామని చెప్పారు. ఈ గురుకులాల్లో 50 సీట్లు ఇతర విద్యాసంస్థల్లో వేరే కోర్సులు చదివే వారి కోసం కేటాయించామని వివరించారు. చాలా ఎస్సీ, బీసీ హాస్టళ్లు మూతపడే పరిస్థితిలో ఉన్నాయని కేసీఆర్ అన్నారు. ఒక వేళ హాస్టళ్లను క్లోజ్ చేయాల్సివస్తే, వీటిని గురుకులాలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.