బంగారు తెలంగాణ సాధన కోసం తెలంగాణ బిడ్డలంతా కంకణం కట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఎన్నెన్నో కష్టాలు పడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, ఇపుడు ఆ రాష్ర్టాన్ని అభివృద్ధి పరుచుకోవడం మన కర్తవ్యంగా భావించాలని అన్నారు. అంతా కలిసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది అని కేసీఆర్ అన్నారు. ఈ దిశగా ఇంతవరకూ మనం చేసింది తక్కువే.. చేయాల్సింది మాత్రం ఎంతో ఉన్నదని చెప్పారు. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్‌తో పాటు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు.

-రాష్ట్రం అభివృద్ధి అందరి కర్తవ్యం.. చేయాల్సింది ఎంతో ఉంది -త్వరలోనే వాటర్‌గ్రిడ్ పనులకు శంకుస్థాపన -నాలుగునెలలు రోడ్ల అభివృద్ధిమీదే దృష్టి పెట్టాలి -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపు -టీఆర్‌ఎస్‌లో చేరిన నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలూనాయక్ -దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించిన కేసీఆర్ మంగళవారం తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో వీరందరూ గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పనులకు నల్లగొండ జిల్లాలో త్వరలోనే శంకుస్థాపన చేస్తానని చెప్పారు. రైతులకు గతంలో చెప్పినట్లుగానే రెండు నుంచి రెండున్నర సంవత్సరాల్లో 24 గంటల కరెంటు సరఫరా చేసి చూపిస్తామని భరోసా ఇచ్చారు. మిషన్ కాకతీయ కింద రాష్ట్రంలోని 46వేల చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టి వాటికి పునర్‌వైభవం తీసుకువస్తామని కేసీఆర్ చెప్పారు.
రహదారులపై దృష్టి పెట్టండి.. వచ్చే మూడు నాలుగు నెలలు నాయకులంతా రహదారుల అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని, భారతదేశంలోనే అద్భుతమైన రోడ్లు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పుకునేలా రహదారులను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి చేయూత అందించాలని కోరారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఇందులో భాగంగా రేషన్ బియ్యాన్ని నాలుగు కిలోల నుంచి ఆరు కిలోలకు పెంచి ఇవ్వనున్నామని చెప్పారు. అదేవిధంగా ఇప్పటికే పింఛన్లను రూ.200 నుంచి వెయ్యి రూపాయలకు పెంచామని, దళిత, గిరిజన ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి పథకం చేపట్టామని చెప్పారు.
గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌తో పాటు తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ వివరించారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా బంజారాహిల్స్‌లో ఎకరం స్థలంలో రూ.2.50 కోట్లతో బంజారా భవన్ నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బాలునాయక్‌కు కేసీఆర్ సూచించారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన బాలునాయక్‌కు మంచి రాజకీయ అనుభవం ఉందని, క్రియాశీలక కార్యకర్తగా చురుగ్గా పనిచేస్తారని కొనియాడారు.
నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేయడంతో పాటు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ దేవరకొండ ఇన్‌ఛార్జిగా బాలునాయక్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. పాత, కొత్త వాళ్లను కలుపుకొని పార్టీని ముందుకు తీసుకుపోవాలని హితవు పలికారు
ప్రపంచంలోనే పింఛన్లకు అధిక నిధులు:మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రపంచంలోనే పింఛన్లకు అత్యధికంగా ఖర్చు పెడుతున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం గతంలో రూ700-800 కోట్లు ఉన్న మొత్తాన్ని రూ.4వేల కోట్లకు పెంచిందని గుర్తు చేశారు. అయినా సీమాంధ్ర మీడియా ఇంకా తప్పుడు రాతలతో ప్రజల్ని గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నదన్నారు. కొన్ని సీమాంధ్ర పార్టీలు దుకాణాలు తెరిచి పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్స్ కడతామంటూ ఆఫర్లు ఇచ్చినా తెలంగాణలో ఏఒక్కరూ ఆంధ్ర పార్టీల్లో చేరడంలేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కలిసిరాని వాళ్లు, తెలంగాణ వ్యతిరేకులు, ఉద్యమకారులపై కేసులు బనాయించి జైళ్లలో వేసిస కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇంకా కండ్లు తెరవడంలేదని దుయ్యబట్టారు. వాస్తవంగా రూ.9వేల కోట్ల మేర చేయాల్సిన రైతు రుణమాఫీని రైతులు, రైతు సంఘాల విజ్ఙప్తి మేరకు రూ.20వేల కోట్ల మేర మాఫీ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది అన్నారు. గతంలో మంత్రులుగా పని చేసిన జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యనే కాదు… టీడీపీ దద్దమ్మలకు కూడా కేసీఆర్‌కు వచ్చిన ఆలోచనలు రావని, వంద జన్మలెత్తినా అలా ఆలోచించలేరని అన్నారు.
రెండు జిల్లాలది ఒకే తీరు : మంత్రి తుమ్మల నల్లగొండ, ఖమ్మం జిల్లా రాజకీయ ముఖచిత్రం గతంలో నుంచి ఒకేవిధంగా ఉంటుందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. భవిష్యత్తులోనూ ఒకేలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గతంలో ఈ రెండు జిల్లాల్లో టీఆర్‌ఎస్ ప్రభావం తక్కువగా ఉందనే వారని, కానీ ఈ పరిణామంతో రెండు జిల్లాల్లోనూ పార్టీ పూర్తిస్థాయిలో విస్తరించిందన్నారు. తెలంగాణను దేశంలోనే ముందు వరుసలో ఉంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
బంగారు తెలంగాణ కోసమే ఈ నిర్ణయం: బాలునాయక్ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నానికి అండగా నిలిచేందుకే తాను టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నానని నల్లగొండ జడ్పీ ఛైర్మన్ బాలునాయక్ తెలిపారు. ఆరు నెలల కేసీఆర్ పాలన చూసిన తర్వాత 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వారు సైతం ఇవాళ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. వెనుకబడిన నల్లగొండ జిల్లా, రాజకీయ జన్మనిచ్చిన దేవరకొండ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన ఆశయమన్నారు. జిల్లాకు సాగు, తాగునీరు అందాల్సిన అవసరముందని, కేసీఆర్ నాయకత్వంలో అది సాధ్యమవుతుందన్నారు.
సీఎం ఆశీస్సులతో కచ్చితంగా జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు వీరేశం, శేఖర్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కిక్కిరిసిన సమావేశ ప్రాంగణం బాలునాయక్ చేరిక సందర్భంగా నల్లగొండ జిల్లానుంచి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో మంగళవారం తెలంగాణ భవన్ కిక్కిరిసి పోయింది. భవన్ పరిసరాలు వాహనాలతో నిండిపోయాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో జడ్పీ ఛైర్మన్ నేనావత్ బాలునాయక్‌తో పాటు దేవరకొండ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో జడ్పీటీసీ సభ్యులు నేనావత్ హరినాయక్ (చింతపల్లి), జింకల వసంత ప్రభాకర్ (రామన్నపేట), గాలి రవికుమార్ (గుర్రంపోడ్), సందా అమల (అర్వపల్లి), నర్సింగ్‌నాయక్ (నూతనకల్లు), ఎంపీపీలు రవినాయక్ (చింతపల్లి), ఏడ్పుల రమాదేవి గోవింద్‌యాదవ్ (చందంపేట), మేకల శ్రీనివాస్‌యాదవ్ (దేవరకొండ), తేర జోజిరెడ్డి (గుర్రంపోడ్), మల్లికంటి అంజమ్మ (మఠంపల్లి), రామావత్ గీత రమేష్‌నాయక్ (నేరేడ్‌చర్ల)సింగిల్ విండో ఛైర్మన్లు ఎన్ మాధవరెడ్డి, కొండల్‌రెడ్డి, బిక్కునాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముత్యాల సర్వయ్య, డీసీసీ కార్యదర్శి కంచర్ల విజయేందర్‌రెడ్డి, బుర్రి అరవింద్‌రెడ్డి, డిండి నీటి సంఘం ఛైర్మన్ రుక్మారెడ్డి, ఐడబ్ల్యుఎంపీ ఛైర్మన్ నక్క సంజీవ్‌కుమార్ యాదవ్‌తో పాటు 39 ఎంపీటీసీ సభ్యులు, 45 మంది సర్పంచులు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు.