Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బాసటగా నిలవండి అభివృద్ధిని చూపిస్తాం

-సీఎంపై నమ్మకం ఉంచండి.. ఖేడ్ దశ మారుతుంది -నిరుపేదల ముఖంలో చిరునవ్వే కేసీఆర్ సంకల్పం -జిల్లాలో 15 నెలల్లోనే 56వేల గ్యాస్ కనెక్షన్ల పంపిణీ -పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ -నిరుపేద వృద్ధులకు పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ -రూ.860 కోట్లతో ఖేడ్ వాటర్‌గ్రిడ్ -డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి

KTR-addressing-in-Narayanked-public-Meeting

ప్రభుత్వానికి బాసటగా నిలవండి.. అభివృద్ధిని చేసి చూపిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన నారాయణఖేడ్, కల్హేర్ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చిన ఐదు నిమిషాల్లోనే ఇక్కడ పేరుకుపోయినా సమస్యలపై పెద్దఎత్తున దరఖాస్తులిచ్చారని, పెద్దపెద్ద ఉపన్యాసాలిచ్చే నేతలు చేసిన అభివృద్ధి ఇదేనా అని మండిపడ్డారు. గత ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధిలో ఎంతో తేడా ఉందన్నారు. 50ఏళ్లుగా జిల్లాలో 89వేల గ్యాస్ కనెక్షన్‌లను ఇస్తే.. తమ ప్రభుత్వం వచ్చిన 15నెలల్లోనే 56వేల గ్యాస్ కనెక్షన్‌లు మంజూరు చేసిందని చెప్పారు.

గతంలో 3.04లక్షల మందికి రూ.8కోట్ల పింఛన్లు అందిస్తుండగా.. ప్రస్తుతం 3.55 లక్షల మందికి రూ.36కోట్ల పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. రైతు శ్రేయస్సు కోసమే రూ. 17 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. ప్రతి నిరుపేద ముఖంలో చిరునవ్వు చూడాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయనకు మరింత బలం చేకూర్చాలని కోరారు. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరుపేద వృద్ధులకు పెద్దకొడుకని,రూ. 860 కోట్లతో ఖేడ్‌లో వాటర్‌గ్రిడ్ చేపడుతున్నారన్నారు. వచ్చే మూడేళ్లలో ఏ ఆడపడుచు బిందె పట్టుకుని రోడ్డు మీదకు రావద్దని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనని ప్రకటన చేసిన దమ్మున్న సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాలు పార్టీలవారీగా వడబోసి పింఛన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తమ ప్రభుత్వం అర్హతనే ప్రాతిపదికగా నిరుపేదలకు లబ్ధి చేకూరుస్తుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తుందని హెళన చేసిన వారు ముక్కున వేలేసుకునే విధంగా బంగారు తెలంగాణ దిశగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు తొలగిస్తుందని దుష్ప్రచారం చేశారు. ఆహారభద్రత కార్డులను ప్రవేశపెట్టి పరిమితి లేకుండా ఒక్కరికి 6కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసే విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎవరు అడగకపోయినా పేద విద్యార్థులపై మమకారంతో సీఎం కేసీఆర్ మనువడు తినే సన్నబియ్యాన్నే హస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు ఇస్తున్నామన్నారు.

ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోరి రూ.17వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 36లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందన్నారు. ప్రస్తుతం రూ.4వేల కోట్లు వెచ్చించి వ్యవసాయానికి 6గంటల విద్యుత్ సరఫరా చేస్తుండగా వచ్చే వేసవినుంచి వ్యవసాయానికి 9గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయకోపోవడం వల్ల ఎరువుల దుకాణాల వద్ద బారులు తీరే వారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ దుస్థితి రాకుండా అవసరమైన ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గంలోని మెట్టభూములకు సాగునీరందించే లక్ష్యంతో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో అనేక ప్రణాళికలు రూపొందుతున్నాయన్నారు. రైతుల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం అంకితమై పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాను వేదికపైకి వచ్చిన 5నిమిషాల్లోనే పెద్దసంఖ్యలో దరఖాస్తులు ఇస్తున్నారంటేనే నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు పేరుకుపోయాయో అర్థమవుతుందని, పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే ఇక్కడి నాయకులు అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో నారాయణఖేడ్ ప్రజలు తెలంగాణ వస్తుందని నమ్మలేదని అయితే కేసీఆర్ పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉంచి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వానికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు.

నిరుపేద వృద్ధులకు పెద్ద కొడుకు కేసీఆర్.. -డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుని నిరుపేద వృద్ధులందరికీ రూ.1000ల పింఛన్ ఇస్తూ సీఎం కేసీఆర్ వారిని పెద్దకొడుకులా ఆదరిస్తున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో నీటి సమస్యను తీర్చేందుకు రూ.860కోట్ల నిధులతో వాటర్‌గ్రిడ్ పథకం పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో కేవలం 20 సబ్‌స్టేషన్లు ఉన్నట్లు గుర్తించి ఒకేసారి పది 33/11కేవీ, ఒక 132కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేసినట్లు చెప్పారు. గత పాలకులు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఒక్క మార్కెట్‌యార్డు కూడా తీసుకురాలేదని, తమ ప్రభుత్వం ఏకంగా రెండు మార్కెట్ యార్డులను మంజూరు చేసిన విషయాన్ని ఆమే గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఖేడ్‌ను అభివృద్ధి చేసుకునేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వానికి అండగా ఉన్నప్పుడే ఇక్కడి సమస్యలు తీరతాయని, అందరు కలిసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్సీ రాములునాయక్, డీసీసీబీ చైర్మెన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఆయా మండలాల జడ్పీటీసీలు గుండు స్వప్నమోహన్, సంగీతాశెట్కార్, ఎంపీపీలు జమునాబాయి, లక్ష్మీగణపతి, సర్పంచ్‌లు అప్పారావుశెట్కార్, బేగంబీ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎం.భూపాల్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, జడ్పీ సీఈవో మధు, డీపీవో సురేష్‌బాబు, ఆర్డీవో మధుకర్‌రెడ్డి, ఎంపీడీవోలు, తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

అవ్వ.. నీకు వచ్చేనెల నుంచే పింఛన్.. ఆదివారం కల్హేర్‌లో జరిగిన బహిరంగసభకు వచ్చిన మండల పరిధిలోని క్రిష్ణాపూర్‌కు చెందిన యాదమ్మ అనే వృద్ధురాలు కేటీఆర్ వేదిక పైకి రాగానే పింఛన్ రావడం లేదనే విషయాన్ని పదేపదే ప్రస్తావించింది. పోలీసులు, అధికారులు, నాయకులు ఆమెను వారించినా వినిపించుకోకుండా మంత్రి కేటీఆర్ వైపు చూస్తూ తన గోడు వెళ్లబోసుకుంది. ఇది గమనించిన మంత్రి ముసలమ్మను వేదికపైకి పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుని అవ్వ.. అని అప్యాయంగా పలకరిస్తూ సమస్యను విన్నారు. తనకు పింఛన్ రావడం లేదని వృద్ధురాలు మంత్రి కేటీఆర్‌తో తెలుపగా అప్పటికప్పుడు వచ్చేనెల నుంచే పింఛన్ మంజూరు చేసి అందజేయాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. యాదమ్మకు భరోసా కల్పిస్తూ అవ్వ.. నీకు వచ్చే నెల నుంచి పింఛన్ వస్తుంది.. రందీ పడకు.. అని ధైర్యం చెప్పడంతో యాదమ్మ సంబురపడుతూ వేదిక దిగింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.