Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

భాషకు బ్రహ్మరథం

-ప్రపంచ తెలుగు మహాసభలకు సర్వత్రా జేజేలు -ఇక ఏటా తెలంగాణ తెలుగు మహాసభలు -డిసెంబర్‌లో రెండ్రోజులపాటు నిర్వహణ -తెలుగును జీవభాషగా నిలబెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం -జనవరి మొదటి వారంలో భాషా, సాహితీవేత్తలతో సదస్సు -అందులో వచ్చిన సూచనలతో నిర్దిష్ట ప్రణాళిక వెల్లడి -ఈ సభల విజయంతో భాష పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి వెల్లడైంది -విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు -భాషా పండితుల సమస్యల పరిష్కారం మొదలైంది -అందులో భాగంగానే పింఛనులో కోతను రద్దు చేస్తున్నాం -ఇంటర్‌వరకు తెలుగు తప్పనిసరిని కచ్చితంగా అమలుచేస్తాం -ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ -హాస్య పద్యంతో నవ్వులు పూయించిన ముఖ్యమంత్రి

జీవభాషగా తెలుగును నిలబెట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి జనవరిలో నిర్దిష్ట ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్‌లో ఐదురోజులపాటు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు ఎల్బీ స్టేడియం పాల్కురికి సోమన ప్రాంగణంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతి సంవత్సరం తెలంగాణ తెలుగు మహాసభలు డిసెంబర్ నెలలోనే రెండ్రోజులపాటు నిర్వహిస్తామని ప్రకటించారు. ఐదు రోజులపాటు ఘనంగా జరిగిన ఈ మహాసభలు సంపూర్ణంగా విజయవంతం అయ్యాయని చెప్పిన ఆయన.. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి ప్రసంగం సాగిందిలా.. ప్రపంచ తెలుగు మహాసభలు.. ఒకనాడు డిగ్రీ కాలేజీ విద్యార్థిగా ఇదే స్టేడియంలో ఒక మూలన కూర్చుని 1975లో నేను తిలకించాను. నేడు స్వరాష్ట్రంలో సగౌరవంగా తెలంగాణ భాషా వైదుష్యాన్ని, తన తేజోమయ సాహిత్య వైభవాన్ని.. పాండితీప్రకాశాన్ని, కళావైభవాన్ని సగౌరవంగా ప్రపంచానికి చాటింది మన రాష్ట్రం. సభలు విజయవంతమైనందుకు, ఆశించిన లక్ష్యం అద్భుతంగా నెరవేరినందుకు వ్యక్తిగతంగా నాకెంతో సంతోషంగా, సంతృప్తిగా ఉంది. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా.. గురుపూజతో ప్రారంభించి సంస్కారవంతంగా సభలను ప్రారంభించుకున్నాం. ఈరోజు ముగింపు సంరంభానికి మన ఆహ్వానాన్ని మన్నించి రాష్ట్రపతి వచ్చారు. అందరి తరఫున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సభలద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు భాషాభివృద్ధిపట్ల ఉన్న నిబద్ధత స్పష్టంగా వెల్లడైంది. మన భాషను గౌరవించుకోవడమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్య భాషల ఉద్దండపిండాలను జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం గొప్పగా సన్మానించింది.

తెలుగు తప్పనిసరి.. తెలుగు భాషను బతికించుకోవాలనే మాటలు విన్నాం. నాకు కొంత బాధ కలిగింది. మొన్న ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ తెలుగు మృతభాష కావొద్దని అన్నారు. తెలుగు నేల మీదనే.. మన గడ్డ మీదనే.. మన మాతృభాషను మృతభాష అనో.. బతికించుకోవాలనో అనాల్సి రావడం బాధాకరం. ఆ పరిస్థితి మన భాషకు సంభవించకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. సభలు, సంబురాలు జరిపి ఇక్కడే వదిలేయడం కాకుండా ఈ కృషిని తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణ సాహిత్య అకాడమీ సంపూర్ణంగా కొనసాగిస్తుంది. ఇకనుంచి నిరంతరంగా ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో రెండ్రోజుల పాటు తెలంగాణ తెలుగు మహాసభలు వైభవంగా నిర్వహించుకుందాం. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కచ్చితంగా తెలుగు భాష నేర్చుకోవాలనే ఆదేశాలు ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది. దాన్ని కచ్చితంగా అమలుచేస్తాం. ఏ సిలబసైనా, ఏ మీడియమైనా ఈ గడ్డ మీద చదువుకోవాలంటే తెలుగును కచ్చితంగా ఒక సబ్జెక్టుగా నేర్చుకోవాల్సి ఉంటుంది.

జనవరిలో ప్రణాళిక ప్రకటన భాషా పండితుల సమస్యలు పరిష్కరిస్తానని మహాసభల ప్రారంభ వేడుక సందర్భంగా హామీ ఇచ్చాను. దానికి కట్టుబడి ప్రభుత్వం అప్పుడే చర్చలు, చర్యలు ప్రారంభించింది. చిన్న న్యాయపరమైన సమస్య ఉంది. దానిని తప్పకుండా అద్భుతంగా, అనతికాలంలోనే పరిష్కారం చేస్తాను. భాషా పండితులుగా రిటైర్ అయిన వారికి పింఛనులో కొంత కోత విధిస్తున్నారనే విషయం నా గమనంలోకి వచ్చింది. దానిని కూడా వెంటనే రద్దుచేస్తాం. తెలుగు భాష అభివృద్ధికోసం, తెలుగు భాషను ఒక అద్భుతమైన జీవ భాషగా నిలిపి ఉంచడానికి అవసరమైన కొన్ని ప్రకటనలు ఈరోజు చేయాలని భావించాను. మొన్నటి ఉపన్యాసంలో నేను చెప్పిన దరిమిలా కొన్ని వందల, వేల సూచనలు వచ్చాయి. చాలామంది చాలారకాలుగా పంపించారు. ఇప్పటికిప్పుడు అర్ధాంతరంగా ప్రకటించడంకంటే జనవరి మొదటివారంలో భాషాసాహితీవేత్తల సదస్సు నిర్వహించి, ఆ వచ్చిన సూచనలన్నింటినీ క్రోడీకరించి, కచ్చితమైన, నిర్దిష్టమైన ప్రణాళికను ప్రకటిస్తాను.

విజయవంతం.. ఆనందం.. చాలా సంతోషంగా, అద్భుతంగా మహాసభలు నిర్వహించుకొని, చాలా గొప్పగా ముందుకు సాగినం. ఎట్ల జరుగుతుందో, ఎట్ల ఉంటుందో, దీనిని నిర్వహించే శక్తి సామర్థ్యాలు తెలంగాణ వాళ్లకున్నాయో లేవో అనే అనుమానాల మధ్య చాలా అద్భుతంగా, సంతోషంగా ఈ కార్యక్రమాన్ని పండించినాం. సిధారెడ్డి, వారితో పని చేసిన బృందం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి వెంకటేశం, మొత్తం ప్రభుత్వం అధికారులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి.. మహాసభలను అద్భుతంగా విజయవంతం చేయాలనే సంకల్పంతో వారంతా కృషిచేశారు. సిధారెడ్డి సూచించినట్లు కొన్ని కిట్స్ ఇచ్చాం. వాటిని ఇవ్వడంలో, ఇంకేదైనా ఇబ్బందులుంటే భవిష్యత్తులో అవి జరుగకుండా చూస్తాం. దేశ, విదేశాలు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఈ సభలను సుసంపన్నం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రారంభంలో కొంత బెరుకుగా ఉన్నా.. ఆనందంతో, సంతోషంగా ముగింపు సమావేశం నిర్వహించుకున్నాం అని సీఎం చెప్పారు.

నవ్వులు పూయించిన పద్యం.. ప్రారంభ వేడుకల్లో ఒకట్రెండు పద్యాలు చెప్పిన తనను చాలామంది అభినందించారని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంలో అందరూ సంతోష హృదయంతో.. నవ్వులతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నందున తాను కూడా ఒక నవ్వుల పద్యంతో ఉపన్యాసాన్ని ముగిస్తానంటూ ఒక పద్యం చెప్పారు. ఇదీ ఆ పద్యం.. నవ్వవు జంతువుల్.. నరుడు నవ్వున్.. నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు.. కొన్ని నవ్వులెటు తేలవు.. కొన్ని విష ప్రయుక్తముల్.. పువ్వులవోలె ప్రేమ రసముల్ విరజిమ్ము.. విశుద్ధమైన లే నవ్వులు.. సర్వదుఃఖ ధమనంచాలు.. వ్యాధులకున్ మహౌషధుల్..

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.