Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బస్తీలను బాగుచేసుకుందాం

-క్లీన్ హైదరాబాద్‌కు ప్రతిజ్ఞ చేద్దాం -ప్రజలు సంకల్పిస్తే చేయలేనిదేమీ లేదు -బాగుంటే ఆ గౌరవం మనకే.. -నగరంలోని మమతానగర్, వెంకటరమణనగర్ -కాలనీలను సందర్శించిన సీఎం కేసీఆర్

ఉన్నంతలో గొప్పగ బతకాలి. మన సమాజాన్ని, మన ఇంటిని, మన బస్తీని ఎవరూ బాగు చేయరు. ఉన్న అథారిటీలు, ప్రభుత్వం, పురపాలక శాఖవాళ్లు కొంత చేస్తరు. కానీ ఎక్కువ చేసుకోవాల్సింది మనమే. అనుకుంటే మనం ఏదైనా చేయగలం. లోపల ఉన్న శక్తి ఏందో మనకు తెల్వదు. ఒక వేలితో కొడితే దెబ్బ తగలదు. అదే పిడికిలితో కొడితే దెబ్బ బాగా తగుల్తది. ఆ శక్తి మనకు వస్తే.. ప్రజలు సంఘటితమైతే ఎంతటి సమస్యయినా పరిష్కరించుకోవచ్చు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా హైదరాబాద్ కథ ఉందని, కేవలం మన ఇల్లే కాదు.. బస్తీ కూడా శుభ్రంగా ఉండాలనుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ పరిధిలోని మమతానగర్, వెంకటరమణనగర్ కాలనీలను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ.. మన కాలనీలు శుభ్రంగా ఉంటే ఆ గౌరవం మనకే కదా అని హితవు పలికారు. త్వరలోనే హైదరాబాద్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్‌ను 330 విభాగాలుగా విభజిస్తున్నం. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, రాష్ట్రస్థాయి అధికారులందరూ తలా ఒక ముక్క తీసుకుంటం. తలా ఒక్క మొక్క నాటుతం. అక్కడికి పోవాలె.. దండం పెట్టాలి. కడుపుల తల పెట్టాలి.. అన్ని విధాలా ప్రజలకు సంజాయించాలి. మొత్తానికి క్లీన్ బస్తీగా తయారు చేయాలి. అది చీఫ్ సెక్రటరీ అయినా, డీజీపీ అయినా, ముఖ్యమంత్రి అయినా సరే. వీళ్లంతా ప్రజల కోసమేగానీ ఆకాశం, భూమి కోసం కాదు అని అన్నారు.

CM-KCR-visited-colonies-in-Nagole-Hyderabad02సంకల్పిస్తే పేదరికాన్నీ జయించొచ్చు సంకల్పబలంతో పేదరికాన్ని కూడా జయించవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందుకు బంగ్లాదేశ్‌కు చెందిన సామాజిక అధ్యయన శాస్త్రవేత్త యూనుస్ అనుభవాన్ని వివరించారు. బంగ్లాదేశ్‌లో ప్రొఫెసర్ యూనుస్ ఓ సామాజిక అధ్యయన శాస్త్రవేత్త. ఆయన ఒకరోజు ఢాకాలో ఫుట్‌పాత్‌పై ఉండి చూస్తున్నపుడు ఆరుగురు ఆడవాళ్లు పోతుండటం చూసిండు. వాళ్లు చాలా పేదవాళ్లు… అసలు వాళ్లు ఏం చేస్తున్నారని తెలుసుకునేందుకు యూనుస్ వాళ్ల వెనకాల పోయిండు. వాళ్లు రోజువారీ వడ్డీ ఇచ్చే షావుకారు దగ్గరికి పోయి.. రూ.50 వడ్డీకి తీసుకొని, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కు పోయి, కూరగాయలు కొనుక్కొని, గంపల నెత్తిన పెట్టుకొని అమ్ముతున్నరు. సాయంత్రానికి అమ్మకం తర్వాత మళ్లీ వ్యాపారి దగ్గరికిపోయి ఆయన డబ్బులు వాపసు ఇచ్చి, వడ్డీ కట్టి.. రూ.2-3 మిగిలితే దానితో బియ్యం కొనుక్కుని ఇంటికిపోయిండ్రు. మళ్ల పొద్దునలేస్తే అదే బతుకు. వాళ్లు ఇంత పేదరికంలో ఉన్నందుకు యూనుస్‌కు బాధ కలిగింది. వడ్డీ వ్యాపారి వీళ్ల రక్తం తాగుతున్నడని గుర్తించి.. కష్టంలో నుంచి వీళ్లను బయటికి తీసుకురావాలని ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చింది.

ఆ మరుసటిరోజు ఫుట్‌పాత్‌పై నిలబడినపుడు మహిళలు అటునుంచిపోతుంటె.. వాళ్లను పిలిచి నేను కూడా వడ్డీ వ్యాపారినే… ఆ వడ్డీ వ్యాపారి మీ దగ్గర రూ.5 తీసుకుంటున్నడు, నేను రూ.3 తీసుకుంటనని చెప్పి… వాళ్లకు అప్పు ఇస్తడు. ఇట్ల కొన్నిరోజులు అయినంక… ఒకరోజు ఆ మహిళలను కుటుంబసభ్యులతో సహా ఇంటికి భోజనానికి పిలుస్తడు. అప్పుడు ఇంట్ల నుంచి ఒక సంచీ తెచ్చి చూపిస్తే… అందులో రూ.30వేలు ఉంటయి. అప్పుడు ఆయన వాళ్లతో… నేను వడ్డీ వ్యాపారిని కాదు. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌ని. మీ దగ్గర వడ్డీ తీసుకొని, ఈ సంచీల దాస్తే ఇంత అయిందని చెప్పి… ఆ డబ్బును తలా రూ.5వేలు పంచుతడు. దానితో కూరగాయల వ్యాపారం చేసుకోవాలని చెప్తడు. నేను మీకెట్లయితే ఈ విద్య నేర్పిన్నో… మీరు ఇట్ల మరికొన్ని సంఘాలు తయారు చేయాలని వాగ్దానం తీసుకుంటడు. అట్ల ఆ మహిళలు ఒక సంఘంగా ఏర్పడి, మరో సంఘం… అట్ల ఐదేండ్లలో 17వేల సంఘాలు ఏర్పడతయి అని చెప్పారు.

వ్యాధుల నియంత్రణ మన చేతుల్లోనే ప్రజలు తలచుకుంటే వ్యాధులను సైతం నియంత్రివచ్చని.. అది మన చేతుల్లోనే ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కుబేరులైనా వారు ఉండే నగరం బాగుంటనే ఆరోగ్యంగా ఉంటారని, లేకపోతే వ్యాధులొచ్చి ఇబ్బందులు పడక తప్పదన్నారు. ఇందుకు గుజరాత్‌లోని సూరత్ నగరంలో చోటుచేసుకున్న ఒక ఉదంతాన్ని ఉదహరించారు. సూరత్ పట్టణంలో పెద్దపెద్ద కోటీశ్వరులున్నరు. కానీ నిర్లక్ష్యంతో పరిసరాల పట్టించుకోలేదు. దీంతో చెత్త ఎక్కువై, ప్లేగు వ్యాధి వచ్చింది. వందలమంది చనిపోయిండ్రు. కోటీశ్వరులు ప్రత్యేక విమానాల్లో భార్యాపిల్లల్ని మూటగట్టుకొని పారిపోయిండ్రు. ప్రభుత్వం, అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటే వ్యాధి నియంత్రణలోకి వచ్చింది. ఆ తర్వాత అక్కడ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న వెంకటేశ్వరరావు అనే తెలుగు వ్యక్తి తొలుత శ్రీమంతులను పట్టుకున్నడు. మీకెంత ధనం, ఆరంతస్తుల మేడ ఉంటే ఏం లాభం? నీ డబ్బు, ఆస్తి నిన్ను కాపాడిందా? సమాజంలో నువ్వు కూడా ఒక భాగమే. నగర పరిశుభ్రతకు దోహదపడాలని మంచి మాటలు చెప్పి వారిలో మార్పు తెచ్చాడు అని తెలిపారు.

ఆదర్శ కాలనీగా ప్రగతినగర్ కాలనీ హైదరాబాద్‌లోని ప్రగతినగర్ కాలనీని సీఎం కేసీఆర్ ఆదర్శనగరంగా అభివర్ణించారు. అక్కడుండే ఆహ్లాద పరిస్థితిని వివరించారు. బీహెచ్‌ఈఎల్ దగ్గర ప్రగతినగర్ కాలనీ ఉంది. అక్కడ ఎవరో పుణ్యాత్ముడు మంచిగ చేసిండు. ఆ కాలనీల రెండున్నర, మూడువేల ఎకరాల్లో అన్నీ మెడిసినల్ ప్లాంట్లు పెట్టిండ్రు. అందుకే అక్కడ ఒక్క దోమ రాదు. మున్సిపాలిటీ తరపున రెండు ప్రత్యేక బస్సులు పెట్టిస్త. వెంకటరమణ, మమతానగర్ కాలనీలోని మహిళలు, పిల్లలతో సహా అందరూ అక్కడికి వెళ్లి, చూసిరండి అని పేర్కొన్నారు.

నగరాన్ని చూస్తే సిగ్గుపోతది నగర పరిస్థితి… పేరు గొప్ప, ఊరు దిబ్బగా ఉందని సీఎం అన్నారు. నేషనల్ జియోగ్రాఫికల్ ఛానెల్ వాళ్లు తప్పకుండా చూడాల్సిన నగరాల్లో (ది మస్ట్ సీ ద సిటీస్) హైదరాబాద్‌ను పెట్టిండ్రు. చెప్పుకుంటే సిగ్గుపోతది. ఊపర్ షేర్వాణీ, అందర్ పరేషానీ అది హైదరాబాద్ కథ. ఉన్నదున్నట్లు మాట్లాడుకోవాలి కదా. దాచుకుంటే కుదరదు. గట్లనె డంబాచారానికి పోతే దోమలు కుడతయి అని అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన మహబూబ్‌నగర్ బిడ్డ ఎస్‌ఎన్ రెడ్డి అనే పెద్ద మనిషి స్వీడన్‌లో స్థిరపడ్డరు. అక్కడ ఆయన గొప్ప శాస్త్రవేత్త. చెత్త నుంచి పవర్‌ను (ప్లాస్మా గ్యాసిఫికేషన్) కనిపెట్టారు. ఆయన నాతో.. బ్రదర్ మీరు తెలంగాణ తెచ్చి, మంచి పని చేసిండ్రు. నేను మీకు ఆ టెక్నాలజీ చెప్తానని చెప్పిండు. రెండు నెలలైనా రాకపోతే మొన్ననే ఫోన్ చేసినా. ఏమయ్యా.. ఏమైనా తిప్పల పడుదామంటె వస్తనని, రాకపోతివి అని అడిగిన. వద్దామని తయారైనా.. కానీ, మా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు వస్తలేరని చెప్పిండు. ఎందుకంటే హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ ఉందట కదా.. మా వాళ్లు భయపడుతున్నరని చెప్పిండు అని అన్నారు. ఇంతకుముందు చేసినోళ్లు మేం ఇంత చేసినం.. అంత చేసినం.. ఆరు చందమామలు, ఏడు సూర్యులు… హైటెక్కు, ఆటెక్కు అన్నరు. అసలు సంగతేందిరా అంటే.. ఇట్లున్నం అని ఎద్దేవా చేశారు.

CM-KCR-visited-colonies-in-Nagole-Hyderabad01సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తా: కాలనీవాసులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 400-500 గజాల స్థలం కొని, కమ్యూనిటీ హాల్ నిర్మించి, ఇస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న శ్మశానవాటిక బాగాలేదని, జీహెచ్‌ఎంసీ దానిని అభివృద్ధి చేస్తుందన్నారు. పోలీసులు మెయిన్ రోడ్లపై పది వేల కెమెరాలు పెడుతున్నారని, కాలనీల్లో కాలనీవాసులే కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మమతానగర్‌ కాలనీ వాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడాన్ని సీఎం అభినందించారు. వెంకటరమణ కాలనీలో కెమెరాల ఏర్పాటుకు ఇంటికి రూ.పది వేసుకుంటే సరిపోతుందన్నారు. మొట్టమొదటి చందాదారుడిగా తాను రూ.వెయ్యి ఇస్తున్నానని, ప్రకటించి… కాలనీ అధ్యక్షుడు షౌకత్ హుస్సేన్‌కు ఆ డబ్బు అందజేశారు. టీఆర్‌ఎస్ నాయకులు ఎగ్గె మల్లేశం, రామ్మోహన్‌గౌడ్ తలో ఒక కెమెరా విరాళంగా ఇవ్వాలని సూచించగా.. వారు దానికి అంగీకరించారు. ఒక్క గార్డును పెట్టుకుంటె… కాలనీల ఎవరు తిరుగుతున్నరు, ఏ బండి వస్తుందనే విషయాలన్నీ తెలుస్తయి. పోలీసులు కాలనీవాసుల వివరాలు ఇస్తే.. వాటిని కంప్యూటరైజ్డ్ చేసి, ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తరు. ఏదైనా జరగరానిది జరిగినపుడు వెంటనే నిమిషాల మీద నిందితులను పట్టుకుంటరు. కాలనీవాసులు కూడా శాంతిభద్రతల కమిటీ పెట్టుకోవాలి అని అన్నారు. అధికారులు లేకుండా కాలనీకి మరోసారి ఆకస్మికంగా వస్తానని పేర్కొన్నారు. కాలనీలో ఇండ్లులేని నిరుపేదలు ఉంటే ఆ జాబితాను ఇవ్వాలని కాలనీ అధ్యక్షుడికి సూచించారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, ఎల్బీనగర్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎం రామ్మోహన్‌గౌడ్ పాల్గొన్నారు.

నా కంటే మీ దగ్గరే శక్తి ఎక్కువ ముఖ్యమంత్రిగా తన కంటే ప్రజల దగ్గర శక్తి ఎక్కువగా ఉందన్న సీఎం.. చెత్త నుంచి కాలనీలు ఎలా బయటపడాలో సూచించారు. వెంకటరమణ, మమతానగర్‌కాలనీల్లో వారం, పది రోజుల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇంటికి రెండు ప్లాస్టిక్ బుట్టలు పెడతరు. రెండు వేర్వేరు కలర్లు ఉంటయి. ఒక దానిలో ప్లాస్టిక్ చెత్త, మరో దానిలో కూరగాయల తరుగు, మిగిలిన అన్నం పడేయాలి. మన ఇంటిని మనమెంత శుభ్రంగ పెట్టుకుంటమో… వీధిని కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలి అని అన్నారు. ఈ నేపథ్యంలో సమావేశం జరుగుతున్న ప్రదేశంలో చెట్లు లేకపోవడాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

కాలనీకి ఎందుకొచ్చానంటే.. ఒకరోజు పెండ్లికి పోతున్నపుడు కాలనీలో చూస్తే మంచి ఇండ్లు, మల్టీస్టోర్డ్ అపార్ట్‌మెంట్లు కనిపిస్తున్నాయ్.. కానీ ఎక్కడపడితే అక్కడ చెత్త ఉన్నది.. ఇంత చెత్తగ ఎందుకున్నది? అని అనుకున్నా. తిరిగి వచ్చేటపుడు ఓ జాగలో జనం గూమికూడి ఉంటే.. కాలనీని ఎందుకు శుభ్రం చేసుకుంటలేరని వాళ్లను అడిగినా. మున్సిపాలిటీ వోళ్లు మా దిక్కు రారు. దొంగల లొల్లి ఎక్కువ ఉన్నది.. ఇంకా చాలా సమస్యలు ఉన్నయి అని చెప్పిండ్రు. వెంటనే నేను మున్సిపల్, పోలీస్ కమిషనర్లకు చెప్పి, ఆ కాలనీ సమస్యలు పరిష్కరించాలని చెప్పిన. పోలీసు పెట్రోలింగ్ పెట్టి, ఎవరైనా ప్రొఫెషనల్ దొంగలు ఉంటే వారిని పట్టుకొని రౌడీషీట్ పెట్టి లోపలికి తోయాలని చెప్పిన. అట్లనే కాలనీని శుభ్రం చేయించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు చెప్పి.. మళ్లీ పోదమని చెప్పిన. అందుకే జలుబుగా ఉన్నా, కాలనీవాసులు ఎదురుచూస్తున్నరని వచ్చిన.

CM-KCR-visited-colonies-in-Nagole-Hyderabadఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ ఇరవై రోజుల కిందట ఓ వివాహానికి వెళ్తూ కాలనీలోని సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించడమే కాదు.. కచ్చితంగా మరోసారి కాలనీలను సందర్శిస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం కాలనీలకు వచ్చి, స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. నాగోల్ పరిధిలోని మమతానగర్ కాలనీకి ఆదివారం సాయంత్రం వచ్చిన ముఖ్యమంత్రి… తొలుత మమతానగర్‌లో కాలనీవాసులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా కంట్రోల్ రూంను ప్రారంభించారు. కాలనీకి చెందిన శ్మశానవాటిక కబ్జాకు గురైందని కాలనీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి చెప్పడంతో.. సీఎం స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఆ తర్వాత ఇందూ అరణ్యలోని తన ప్రైవేటు కార్యదర్శి అజిత్‌రెడ్డి నివాసానికి వెళ్లి టీ ఆతిథ్యాన్ని స్వీకరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.