Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బస్తీలు బాగుపడాలి

ఇచ్చిన మాట ప్రకారం నాలుగున్నర నెలల్లో ఇండ్లు కట్టి చూపిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. నాలుగేండ్లలో మురికివాడలను పూర్తిగా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని మురికివాడల్లో ఆదివారం ముఖ్యమంత్రి పర్యటించి అక్కడి బస్తీవాసులతో స్వయంగా మాట్లాడి వాళ్ల సమస్యలు తెలుసుకొన్నారు.

KCR-Mahabubnagar-Visit-01

-నాలుగున్నర నెలల్లోనే ఇండ్లు: కేసీఆర్ -బస్తీల్లో నీటిశుద్ధి ప్లాంట్లు.. ప్రతి ఇంటికీ నల్లా -మహబూబ్‌నగర్ మురికివాడల్లో సీఎం కేసీఆర్ పర్యటన -పట్టణంలో డంపింగ్ యార్డు, ఐదుచోట్ల మార్కెట్లు -మెడికల్ కాలేజీ, కళాభారతి ఏర్పాటుపై పరిశీలనకు హామీ మున్సిపాలిటీ పరిధిలోని పాతపాలమూరు, వీరన్నపేట, పాతతోట, రైతుబజార్ ప్రాంతాలలో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. అధికారులే మీ దగ్గరికి వస్తారు. మరో ఎనిమిది రోజుల్లో ఇక్కడ ఇండ్ల నిర్మాణానికి పునాదిరాయి వేసేందుకు మళ్లీ వస్తా. నాలుగున్నర నెలల్లో నిర్మాణం పూర్తికాగానే ప్రారంభించడానికి వస్తా అని సీఎం కేసీఆర్ బస్తీవాసులకు భరోసా ఇచ్చారు. నీటిశుద్ధి ప్లాంట్లు, ఇంటింటికీ నల్లాలు, సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, మరుగుదొడ్లు నిర్మిస్తామని హామీఇచ్చారు.

కేసీఆర్ మాట అంటే ఒట్టి మాట కాదని, మాట ఇచ్చినమంటే చేసి చూపిస్తామని స్పష్టంచేశారు. ఆద్యంతం ఉత్సాహంగా..: ఆదివారం మధ్యాహ్నం 12.20 గంటలకు పాతపాలమూరు నుంచి ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభమైంది. పాతతోట, వీరన్నపేట, రైతుబజార్‌లలో కేసీఆర్ పర్యటించారు. అభివృద్ధిపై ప్రజలకు భరోసా ఇస్తూ మధ్యమధ్యలో చలోక్తులు విసురుతూ ఆద్యంతం పర్యటన ఉత్సాహంగా కొనసాగించారు.

మీకు ఇండ్లు కట్టినాక నేను మిమ్మల్ని ఇండ్లకు పంపియనీకె వస్త.. అప్పుడు జోర్‌దార్ దావత్ ఇయ్యాలె అని పాతతోటలో ముఖ్యమంత్రి అనగానే.. ఓ మహిళ బిర్యానీ తినిపిస్తాననడంతో సీఎం చిరునవ్వు నవ్వారు. పాతతోట.. కొత్తతోట కావాలని ఆయన ఆకాంక్షించారు. అక్కడి నుంచి వీరన్నపేట చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి బస్తీలో కలియతిరిగారు.

అక్కడి ప్రజలను మీకు ఎన్ని రోజులల్ల ఇండ్లు కావాలె? అని కేసీఆర్ ప్రశ్నించగా.. మీ దయ అని ప్రజలు అన్నారు. దానికి సీఎం స్పందిస్తూ.. నా దయ కాదు.. కావాల్సింది మీ దయనే అని అన్నారు. నాలుగున్నర నెలల్లో ఇండ్లు కట్టిస్తానని అనగానే జనం కేరింతలు కొట్టారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. అరె ఒక్క మంచిమాట సెప్పగానే పొంగిపోయి లొల్లిపెట్టడమేనా? జిద్దుగుండాలె, సమస్యల మీద యుద్ధం జేయాలె.. పేదరికం పోవాలి.. యువకులకు ఉపాధి కావాలి అని అన్నారు. కేసీఆర్ మాట అంటే ఒట్టిమాట కాదు. మాట ఇచ్చినమంటె చేసి చూపాలె.. లేకుంటే తలకాయ తెగిపడాలె అని సీఎం వాఖ్యానించారు.

సందులల్ల ఇండ్లు ఉన్నయి. కనీసం ఒక మనిషి కూడా వెళ్లేందుకు వీలు లేదు. నేను బక్కగున్నగాని.. గట్ల సందుల పోదమంటే పోనీకె వస్తలేదు. మీరెట్ల వచ్చిండ్రో అని కేసీఆర్ అన్నారు. ఇండ్లన్నీ ఒక పద్ధతి మీద కట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. వార్డులోని మహిళా సంఘాల సభ్యులు అందరూ కలిసి ఇండ్లు కట్టుకునేందుకు ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయని, పైసా లేకుండా అందరికీ ఇండ్లు ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. రెండు బెడ్‌రూంలు, కిచెన్, హాలుతో నాలుగు గదులు గల ఇండ్లను నిర్మిస్తామని తెలిపారు.

అందరూ సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుందని కేసీఆర్ అన్నారు. అధికారులు రేపు మీ ఇండ్లకు వస్తరు.. అందరూ పని బంద్ పెట్టి ఇంటికాడనే ఉండాలి అని బస్తీవాసులకు సూచించారు. ఇండ్లు లేనివారు లేని విషయాన్ని, ఉన్నవారు కుటుంబసభ్యుల వివరాలను తెలుపాలని చెప్పారు. ఇండ్లు లేనివారికి పట్టణశివారులో ప్రభుత్వ స్థలం చూపించి, అవసరమైతే కొనుగోలుచేసి ఇండ్ల నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఆయా వార్డులలో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉన్నారని, అందరూ మంచిగ బతకాలె అని ఆయన అన్నారు.

ఆర్థికంగా ప్రజలు ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మైనారిటీ కార్పొరేషన్ కింద నిధులు ఉన్నాయని, అర్హులైనవారు స్వయంఉపాధి పొందేందుకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. మరో పది రోజుల్లో మురికివాడల్లో బోర్లు లేకుంటే బోర్లు వేయించడం, బోర్లు ఉన్న బస్తీలలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

నాలుగేండ్లలో మురికివాడల అభివృద్ధి మహబూబ్‌నగర్ పట్టణంలో 29 మురికివాడలు ఉన్నాయని, ఏడాదికి ఏడు వాడల చొప్పున అభివృద్ధి చేస్తూ నాలుగేండ్లలో అన్నింటినీ అద్దంలా మారుస్తామని సీఎం చెప్పారు. శ్రీశైలం నుంచి ఎత్తంగట్టు ద్వారా మహబూబ్‌నగర్ పట్టణానికి మొదట తాగునీరు ఇచ్చే ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. సీసీ రోడ్లు, మురికినీటి కాలువల నిర్మాణం చేయకముందే పైప్‌లైన్ వేసి ఇంటింటికీ నల్లాను ఏర్పాటుచేసేందుకు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, చైర్‌పర్సన్ రాధాఅమర్ ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.

మీ బస్తీలలో స్తంభాలు లేవు, ఉన్న స్తంభాలకు లైట్లు లేవు, ఇండ్లు సరిగ్గా లేవు, ఇట్ల ఉంటే మీకు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బస్తీలన్నింటినీ బాగుచేసేందుకు కృషి చేస్తా అని సీఎం హామీ ఇచ్చారు. మహిళలు మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారన్న విషయం తెలుసుకొని.. స్థలాభావం ఉన్న బస్తీలలో సామూహిక మరుగుదొడ్లను నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు.

మంత్రిగారు బోరేపిస్తరా? వీరన్నపేటలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తన వెంట వచ్చిన మంత్రులను ఉద్దేశించి మాట్లాడారు. బస్తీలో తాగునీటికి ఇబ్బంది ఉంది. ఏం మంత్రిగారు బోరేపిత్తరా? లక్ష్మారెడ్డిగారు చెప్పండి అని సీఎం అనగానే.. ఆయన సరేనని తలూపారు. మంత్రితో పాటు ఎంపీ, ఎమ్మెల్యే.. ముగ్గురు కలిపి మూడు బోర్లు ఏపియ్యాలె. అదీ రేపే ఏపియ్యాలె. బోర్లేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కోబోరు కాడ కుర్చేసుకుని కూర్చోవాలె అన్నారు. వీరన్నపేట నుంచి ముఖ్యమంత్రి నేరుగా రైతుబజార్, కూరగాయలు, చేపల మార్కెట్‌లను పరిశీలించారు.

అక్కడున్న పలువురు వ్యాపారులతో మాట్లాడారు. వారు మార్కెట్‌లోని సమస్యలను సీఎంకు విన్నవించారు. 60 ఏండ్లుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నామని, రైతుబజార్ వల్ల తాము నష్టపోతున్నామని వాళ్లు చెప్పారు. అక్కడి నుంచి సింధూ హోటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లాపరిషత్‌లో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

అనంతరం జడ్పీ మైదానంలో ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమాలలో ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు,లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్ శ్రీదేవి, జడ్పీ చైర్మన్ భాస్కర్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.