-హైదరాబాద్‌లో రోజుకు 30 వేలమందికి ఉచిత చికిత్స -ప్రస్తుతం 224 బస్తీదవాఖానల్లో సేవలు.. -త్వరలో మరో 125 ఏర్పాటుకు చర్యలు -పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.. -హైదరాబాద్‌లో పలు బస్తీ దవాఖానలు ప్రారంభం

పట్టణ ప్రాంత నిరుపేదలకు బస్తీ దవాఖానలతో మెరుగైన వైద్య సేవలందుతున్నాయని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. గురువారం జీహెచ్ఎంసీ పరిధిలోని నాంపల్లి నియోజకవర్గం అహ్మద్‌నగర్ డివిజన్ సయ్యద్‌నగర్ -2 లో బస్తీ దవాఖానను మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదలను ఆర్థికంగా ఆదుకోవడమే కాక నాణ్యమైన వైద్యాన్ని చేరువచేసేందుకు బస్తీ దవాఖానలకు రూపకల్పన చేశారని చెప్పారు. వీటిలో ప్రతిరోజు సుమారు 30 వేల మంది ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొంటున్నారని తెలిపారు. ఇప్పటికే నగరంలో 224 బస్తీదవాఖాలు సేవలందిస్తుండగా మరో 125 బస్తీ దవాఖానలను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలతో ఆరోగ్య విప్లవానికి నాంది పలికారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ , జోనల్ కమిషనర్ ప్రావీణ్య , బస్తీ దవాఖాన ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూరాధ, ఎస్పీహెచ్వో డాక్టర్ నాగేంద్రబాబు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌తోపాటు సహచర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఈటల రాజేందర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ తదితరులు నగరంలోని పలుచోట్ల బస్తీ దవాఖానలను ప్రారంభించారు.
