-9నుంచి మహిళలకు పంపిణీ -నాలుగేండ్లలో 1,033 కోట్లు వెచ్చింపు -బతుకమ్మ చీరెకు బ్రాండింగ్ కల్పించాలి -ద్విముఖ వ్యూహంతో చీరెల తయారీ -వచ్చే ఏడాది మరింత ఆకర్షణీయంగా -రైతులు, నేతన్నల ఆత్మహత్యలు లేవు -ఐటీ, చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ -ఇంటికే తెచ్చి ఇవ్వనున్న మహిళా సంఘాలు

బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతిఏటా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం తరఫున అందించే చీరెలను అక్టోబర్ 9 నుంచి పంపిణీచేస్తామని ఐటీ, చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. కరోనా నేపథ్యంలో స్వయంసహాయక సంఘాలతో ఇంటింటికీ అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కోటిమంది మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీకోసం నాలుగేండ్లలో రూ.1,033 కోట్లు వెచ్చించినట్టు చెప్పారు. ఈసారి బతుకమ్మ చీరెలను 287 డిజైన్లు, రంగు ల్లో తయారుచేయించామని అన్నారు. వెండి, బంగారు రంగు జరీ అంచులతో చూడముచ్చటగా ఉన్నాయని తెలిపారు. మంగళవారం బేగంపేట హరితప్లాజాలో బతుకమ్మ చీరెల ప్రదర్శనను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్ తిలకించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఆడపడుచుకు పెద్దన్నగా, మేనమామగా బతుకమ్మ చీరెలను ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. నాలుగేండ్లుగా కోటిమంది మహిళలకు ఉచితంగా పంపిణీచేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రూ.1,033 కోట్లను వెచ్చించామన్నారు. 2017లో రూ.123 కోట్లు, 2018లో రూ.280 కోట్లు, 2019లో రూ.313 కోట్లు, 2020లో రూ.317 కోట్లు ఖర్చుచేశామని వివరించారు. ఆడపడుచులకు చీరెల పంపిణీ.. తద్వారా నేతన్నలకు ఉపాధి అనే ద్విముఖ వ్యూహంతో వీటి తయారీకి పూనుకొన్నామని కేటీఆర్ తెలిపారు. నేతన్నల సమస్యలను దీర్ఘకాలిక వ్యూహంతో పరిష్కరించాలనే భావనతో బతుకమ్మ చీరెలద్వారా వారికి ఉపాధి కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఈసారి బతుకమ్మ చీరెలను సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్‌లో తయారు చేయించామని తెలిపారు. బతుకమ్మ చీరెల ద్వారా గతంలో నెలకు రూ.8 వేలు కూలీ దొరికిన నేతన్నకు ప్రస్తుతం రూ.20 వేలు, రూ.15 వేలు దొరికినవారికి రూ.25 వేలు లభిస్తున్నదన్నారు. 26 వేల మంది నేతన్నలు పనిచేశారని, నాలుగేండ్లలో సుమారు 30 కోట్ల మీటర్ల చీరెలను తయారుచేశారని వివరించారు.
భర్త వల్లే కాదు.. ‘మహిళలకు నచ్చిన చీరెలు తేవడం భర్తవల్లే కాదు.. ఇక ప్రభుత్వంతో ఏమవుతుంది’ అని మంత్రి కేటీఆర్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. బతుకమ్మ చీరెల డిజైన్లను చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ స్వ యంగా తయారుచేశారని చెప్పిన కేటీఆర్.. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. కొద్దిగా కష్టపడితే మహిళలందరికీ నచ్చేలా చీరె లను తయారుచేయవచ్చని చూపించారని పేర్కొన్నారు. వచ్చేఏడాది ఇంకా నాణ్యంగా, మరిన్ని వెరైటీల్లో చీరెలను తయారు చేయిస్తామ న్నారు. బతుకమ్మ చీరెలకు బ్రాండింగ్ కోసం ప్రయత్నించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. టెస్కో షోరూముల్లో వీటిని విక్రయించవచ్చన్నారు.
రాష్ట్రంలో తగ్గిన ఆత్మహత్యలు రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయాయని, రైతుల ఆత్మహత్యలు బాగా తగ్గాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కేసులు లేవని కేంద్రప్రభుత్వం ప్రకటించిందని మంత్రి తెలిపారు. అతివేగంగా ఆత్మహత్యలు తగ్గిన రాష్ట్రంగా తెలంగాణ ఉన్నదని, ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని చెప్పారు. కేంద్రంలో ఉన్నది తమకు అనుకూలమైన ప్రభుత్వం కాకపోయినప్పటికీ వాళ్లు కూడా వాస్తవాలను అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడిందని మ ంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

సంక్షోభంలోనూ ఆగని సంక్షేమం కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షే మం ఆగలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతు బంధు ద్వారా రూ. 7,279 కోట్లను 58 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రైతు బీమాకు రూ.1,141 కోట్లు, ఆసరా పింఛన్లకు నెలకు రూ. 1000 కోట్లు కేటాయించామన్నారు.
తల్లిగారింటి కానుక.. బతుకమ్మ చీరెలను మహిళలు తల్లిగారింటి నుంచి అందిన కానుకగా భావిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మంత్రి కేటీఆర్ నిత్యం మనసుపెట్టి చేనేత, జౌళిశాఖను పర్యవేక్షిస్తున్నారని అన్నారు. తండ్రిగా, అన్నగా ప్రతి ఆడపడుచుకు చీరెలను అందజేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఆడపడుచుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బతుకమ్మ చీరెల పంపిణీకి ప్రభుత్వం గ్రామస్థాయి కమిటీని నియమించిందని చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ తెలిపారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ మహిళా సంఘం ఆఫీసర్ బేరర్, రేషన్ డీలర్, పట్టణప్రాంతాల్లో వార్డుస్థాయి కమిటీలో బిల్‌కలెక్టర్, వార్డు మహిళాసంఘం ఆఫీస్ బేరర్, రేషన్ డీలర్ ఉంటారని అన్నారు.

అన్నిరకాల వస్ర్తాలు నేతన్నలకే.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా చేనేత, జౌళిశాఖకు రూ.1200 కోట్లు కేటాయించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట ప్రభుత్వానికి అవసరమైన అన్ని వస్ర్తాలను మరమగ్గాలమీదే తయారుచేయించి ఇస్తున్నామన్నారు. సంక్షేమ గురు కులాలకు అందించే యూనిఫాంలను చేనేత కార్మికులచే, కేసీఆర్ కిట్ల చీరెలు, ఐసీడీఎస్ వారికి అందించే చీరెలు మరమగ్గాలమీద తయారుచేయిస్తున్నామన్నారు. సిరిసిల్లలో మరమగ్గాలను అప్‌గ్రేడ్ చేశామని, బతుకమ్మ చీరెల తయారీద్వారా ఇక్కడ్నుంచే వారికి ఆర్డర్లు రావడమే కాకుండా తమిళనాడు నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. నేతన్నలకు 50 శాతం యార్న్‌ను సబ్సిడీతో అందిస్తున్నామన్నారు.
పేదవారికి తండ్రిలాగా కేసీఆర్ ఇచ్చే చీరె బతుకమ్మ పండుగకు సీఎం కేసీఆర్ ఇచ్చే చీరె ఎంతో బాగుంటుంది. చీరెలను కొనుక్కునే స్థోమతలేని వారికి ఎంతగానో ఉపయోగపడుతాయి. ప్రభుత్వం ఇచ్చిన చీరెలతో గ్రామాల్లో పేదలు ఎంతో సంతోషిస్తారు.
– రజిత, నెక్కొండ, వరంగల్ రూరల్ జిల్లా