Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బట్ట కాల్చి వేస్తామంటే ఊరుకోం

-ఆరోపణలకు హద్దు ఉంటుంది -బాధించే నిందలు వేసినందుకే గట్టిగా స్పందించా -డీఎల్‌ఎఫ్ విషయంలో కాంగ్రెస్‌ను తప్పుపట్టలేదు -బాజాప్తా ఓపెన్ యాక్షన్‌లో కొన్నారనే చెప్పా -స్పీకర్ ఆదేశిస్తే గంటలో ఫైల్స్ సభలో పెడుతం -ఏపీఐఐసీ భూముల కేటాయింపుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్

KCR

డీఎల్‌ఎఫ్ గురుగావ్ సంస్థకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. తాము అధికారంలోకి వచ్చే నాటికే అంతా అయిపోయిందని ఆయన చెప్పారు. ఈ వ్యవహారంపై ఇటీవల తాను ఇచ్చిన సమాధానంలో సైతం ఎక్కడా గత కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పలేదని స్పష్టం చేశారు. బాజాప్తాగా ఓపెన్ యాక్షన్‌లో కేటాయించారని చెప్పిన మాటను గుర్తు చేశారు. సోమవారం శాసనసభలో సీఎల్పీ కార్యదర్శి, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్కమార్క ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం తప్పు చేసిందా?… అంతకుముందు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాలింగ్ అటెన్షన్ ద్వారా సభకు చెప్పిన కొన్ని విషయాల వల్ల డీఎల్‌ఎఫ్ భూముల కేటాయింపు విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందనే సంకేతాలు వెళ్లాయని అన్నారు.

ప్రత్యామ్నాయ కేటాయింపులు సక్రమంగా జరగని కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వస్తుందని అనేక ప్రసార మాధ్యమాల్లో ఆరోపణలు వస్తున్నాయని సభ దృష్టికి తెచ్చారు. డీఎల్‌ఎఫ్ తర్వాత ఆక్వాస్పేస్‌గా మారి తీసుకున్న భూమి వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందా? చెప్పాలని ముఖ్యమంత్రిని కోరారు. 2007లో మొదలైన భూముల విక్రయం కేసీఆర్ సీఎం అయిన తర్వాత 19-7-14న ముగిసింది. జూలై 28న ప్రత్యామ్నాయ భూములు తీసుకోవాలంటూ ఏపీఐఐసీ డీఎల్‌ఎఫ్‌కు లేఖ రాసింది. ఆగస్టు 1న సేల్ డీడ్ జరిగింది అని చెప్పారు. అలాగే సభానాయకుడు ఇంపీచ్‌మెంట్ అనే పదం వాడడం సరికాదన్నారు.

తప్పు చేసిందని నేనన్నానా?: సీఎం కేసీఆర్ విక్రమార్క ప్రశ్నకు సీఎం కేసీఆర్ వివరణ ఇస్తూ తాను గత కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందని ఎక్కడా చెప్పలేదని, పైగా గ్లోబల్ టెండర్లు పిలిచి బాజాప్తా ఓపెన్ ఆక్షన్ ద్వారా ఇచ్చిందని చెప్పానని గుర్తు చేశారు. అలాగే వ్యక్తిగతంగా తానెవరినీ తప్పు పట్టలేదని కూడా ఆయన అన్నారు. స్పీకర్ ఆదేశిస్తే గంటలోపల అన్ని ఫైళ్లు సభముందు ఉంచుతానని స్పష్టం చేశారు. బాధ కలిగించే రీతిలో ఆరోపణలు చేయడం వల్లనే ఆ స్థాయిలో స్పందించాల్సి వచ్చిందని చెప్పారు.

బట్ట కాల్చి మీద వేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయినా తన వ్యాఖ్యలు ఎవరి మనసు బాధపెట్టినా ఉపసంహరించుకుంటానని అన్నారు. డీఎల్‌ఎఫ్ భూమలుపై వివరణ ఇస్తూ 28-2-14 రోజే ఏపీఐఐసీ ఆక్వాస్పేస్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి తోట నరసింహం సంతకాలు కూడా చేశారు. మేం వచ్చే నాటికి అంతా అయిపోయింది. రాష్ట్ర విభజన ప్రకటనతో కిరణ్ రాజీనామా చేస్తే గవర్నర్ పాలన వచ్చింది. ఆయన లైఓవర్ అని పక్కనపెట్టారు.

ఇదే విషయాన్ని నేను సభకు చెప్పాను. అంతే తప్ప కాంగ్రెస్ తప్పు చేసిందని నేను చెప్పలేదు. ఏపీఐఐసీ తప్పిదం వల్లే ప్రత్నామ్నాయ భూమి ఇవ్వాల్సి వచ్చిందని కూడా చెప్పాను. అంతే తప్ప గీతారెడ్డిని తప్పుబట్టలేదు. అయినా ఆరోపణలకు హద్దు, పద్దూ ఉంటుంది. సభా నాయకుడిగా నన్ను బాధించే రీతిలో తీవ్ర ఆరోపణలు చేశారు. వాటికి ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం నాపై ఉంది. ఖజానాకు నష్టం జరిగిందని కూడా నేను చెప్పలేదు. స్పీకర్ కోరితే నోట్ ఫైల్స్ సహా అన్నీ టేబుల్ మీద పెడతామని కూడా చెప్పిన.

ఫైల్ టేబుల్ మీద పెట్టమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. బోలెడు ధైర్యం ఉండాలే. మేం భయపడే వాళ్లం కాదు. స్పీకర్ ఆదేశిస్తే గంటలో ఫైల్స్ తెప్పించి టేబుల్ మీద పెడతం. సభ్యులు ఎవరికి కావాలన్నా చూసుకోవచ్చు. ఇక సభా నాయకుడిగా సమన్వయం అవసరం అన్నారు. మంచిది.. నేనూ స్వాగతిస్తున్నా. నా భవిష్యత్తుకే మంచిది. ఇక రిమార్క్స్ బాగోలేవని భట్టి విక్రమార్క చెప్పారు. ఒకవేళ మీ మనసును బాధపెట్టినవి ఏమైనా ఉంటే ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. భేషజాలకు పోను. కానీ బట్ట కాల్చి మీద వేస్తే సరిపోదు.

మాపై లేనిపోని నిందలు వేశారు. ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేశారు కాబట్టే ఆ రోజు గట్టిగా సమాధానం చెప్పిన. పూర్వాంకర అనే సంస్థ భూములు వద్దు.. తాము కట్టిన రూ.600 కోట్లు చెల్లించాలని హైకోర్టుకు పోయింది. ఇప్పుడు దానికి డబ్బులు ఎవరు కట్టాలే!. 600 కోట్లంటే మజాకానా. ఇప్పుడు వడ్డీగిడ్డీ అని 900 కోట్లు అడిగినా ఆశ్చర్యం లేదు. నేను పూర్వాంకర వాళ్లకు ఈ సభ నుంచి విజప్తి చేస్తున్న.. వాళ్లు వచ్చి భూములు తీసుకోవాలని నేను కోరుతున్నా అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జవాబిచ్చారు.

అరగంట వాయిదా… ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి ప్రసంగించేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికార టీఆర్‌ఎస్ పార్టీ సభ్యులు అడ్డుకున్నారు. సభకు క్షమాపణ చెప్పిన తర్వాతే మాట్లాడాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సమయంలో స్పీకర్ మధుసూదనాచారి జోక్యం చేసుకుని రూల్-74 ప్రకారం ఈ అంశంపై మూడు రోజుల పాటు చర్చ జరిగిందని, సంబంధిత ఫైళ్లను ప్రభుత్వం సభకు అందజేయాలని సూచించారు. చర్చ ముగిసినట్లుగా స్పీకర్ రూలింగ్ ఇచ్చి సభను అరగంట వాయిదా వేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.