Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బయ్యారంపై సానుకూలం

బయ్యారంలో ప్రతిపాదించిన స్టీల్‌ప్లాంట్ నిర్మాణంపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీనిపై అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్ నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. కేంద్రబడ్జెట్ సమర్పణ అనంతరం ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ఉంటుందని కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేశారు. స్టీల్ అథారిటీ అధికారుల అధ్యయన నివేదిక వివరాలను పరిశీలించినప్పుడు వాణిజ్యపరంగా ఉన్న అనుకూలతలపైనే ఆలోచన జరుగుతూ ఉన్నదని తెలిపారు.

KCR met Union Minister Narendra singh

-స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై టాస్క్‌ఫోర్స్.. -ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉక్కు మంత్రి తోమర్ హామీ -ప్లాంటు నిర్మాణానికి అభ్యంతరాల్లేవని వెల్లడి -ఛత్తీస్‌గఢ్,ఒడిశా తరహాలోనే అనుమతి -దామరచర్లపై నెలాఖరుకల్లా ఉత్తర్వులు -కేసీఆర్‌తో కేంద్రమంత్రి జవదేకర్ -ఫార్మా సిటీకి సానుకూలత.. -హరితహారం భేష్.. -ఎయిమ్స్‌పై ఈబడ్జెట్‌లోనే నిర్ణయం -సీఎంకు కేంద్రమంత్రుల హామీలు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక రాష్ర్టాల్లో ఇప్పటివరకు స్టీల్‌ప్లాంట్‌లను నెలకొల్పడంలో అనుసరించిన విధానాలనే తెలంగాణకూ అవలంబిస్తామని చెప్పారు. 2025వ సంవత్సరానికి 300 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని వెలికి తీయగలిగే పరిస్థితి ఉన్నట్లయితే గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని తోమర్ తెలిపారు.

ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ర్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై వివిధ కేంద్ర మంత్రులను కలిశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇనుము, ఉక్కు శాఖల మంత్రి తోమర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్‌ప్లాంట్ హామీపై ఆయనతో చర్చించారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిది నెలలైన నేపధ్యంలో వీలైనంత తొందరగా ఈ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వాలని కోరారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఏర్పడిన ఆరునెలల్లోగా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి అధ్యయనం జరగాల్సి ఉందని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అధ్యయనం జరిపించిందని, ఇదే విషయాన్ని పార్లమెంటు సమావేశాల్లో తమ రాష్ట్ర ఎంపీలు కూడా ప్రస్తావించారని కేసీఆర్ గుర్తుచేశారు.

KCR met Minister for Environment Prakash Javdekar

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి జరగాలన్నది కూడా ఉద్యమంలోని ప్రధానమైన డిమాండ్లలో ఒకటని గుర్తు చేసిన కేసీఆర్.. ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి, తదితర ప్రాంతాల్లో పుష్కలంగా ఇనుప ఖనిజం ఉన్నదని, సరిహద్దులో ఉన్న వరంగల్ జిల్లాలోని గూడూరు తదితర ప్రాంతాల్లో కూడా విస్తారమైన ఇనుప నిక్షేపాలు ఉన్నాయని నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్ర ప్రజలు కూడా పారిశ్రామికంగా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని తెలిపారు.

ఈ మేరకు తమ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నదని వివరించిన సీఎం.. కేంద్రం కూడా వేగంగా స్పందించి.. బయ్యారంలో సమగ్ర స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ పరిశ్రమ ద్వారా వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందడమేకాక వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అనేక గ్రామాల్లో పురోగతి సాధ్యమవుతుందని అన్నారు. కేసీఆర్ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అందుబాటులో ఉన్న స్టీల్ అథారిటీ అధికారులతో అధ్యయనంలో తేలిన అంశాలపై చర్చించారు.

అయితే.. బయ్యారం ప్రాంతంలో నాణ్యమైన ఇనుప ఖనిజం లేదని, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఇనుప ఖనిజానికి పెద్దగా డిమాండ్ లేదని, ఇలాంటి సమయంలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టినట్లయితే భవిష్యత్తులో పెద్దగా ప్రయోజనం ఉండదని, ఆర్థిక కోణం నుంచి చూస్తే ఎక్కువ కాలం పరిశ్రమను నడపలేమని అధికారులు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. పరిశ్రమల ఏర్పాటును కేవలం ఆర్థికకోణం నుంచిగానీ, లాభార్జన అంశంతో ముడిపెట్టిగానీ చూడడం అన్ని సందర్భాల్లో సహేతుకం కాదని అన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధినికూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఉపాధి కల్పన అవకాశాల గురించీ ఆలోచించాలని సూచించారు.

ఈ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరుగుతుందని వివరించారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఒక టాస్క్‌ఫోర్స్‌ను కేంద్ర బడ్జెట్ సమర్పణ అనంతరం ఏర్పాటు చేయడానికి ఏకాభిప్రాయం కుదిరిందని మంత్రి తోమర్ మీడియాకు చెప్పారు. ఇప్పటికే స్టీల్ అధారిటీ అధికారులు చేసిన అధ్యయనంతోపాటు ఇప్పుడు ఏర్పడబోయే టాస్క్‌ఫోర్స్ కూడా అధ్యయనం జరుపుతుందని, 60 రోజుల వ్యవధిలో నివేదిక సమర్పిస్తుందని, ఆ తర్వాత బయ్యారంలో సమగ్ర స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు.

ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాకు వివరిస్తూ, సుమారు నలభై నిమిషాలపాటు బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణంపైనా, స్టీల్ అథారిటీ జరిపిన అధ్యయనం పైనా, భవిష్యత్తులో ఈ ప్లాంట్ నిర్మాణానికి ఎదురయ్యే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోడానికి వీలైన పరిస్థితులపైనా చర్చించామని తెలిపారు. అందులో భాగంగానే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు నిర్ణయం జరిగిందని చెప్పారు.

గనుల వేలంపై దృష్టి సారించండి రాష్ట్రంలోని సహజ వనరులపై అధ్యయనం చేయాలని, గనులను వేలానికి విక్రయించడంపై స్పష్టమైన పరిశీలన జరపాలని, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తయితే మైనింగ్ పరిశ్రమను అభివృద్ధి చేయవచ్చునని కేసీఆర్‌కు తోమర్ సూచించారు. గనుల వేలానికి సంబంధించి కేంద్ర స్థాయిలో మార్గదర్శకాలను రూపొందించే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నదని, ఇదే సమయంలో తెలంగాణలో కూడా ఎలాంటి ఖనిజాలు లభించే గనులు ఉన్నాయి, వాటిని వేలం వేయడానికి ఉన్న వాస్తవిక, భౌతిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వీలైనంత త్వరగా వివరాలు అందజేయాలని కోరారు. ఈ ప్రక్రియ పూర్తయితే సంబంధిత డాక్యుమెంటేషన్ ప్రక్రియను ప్రారంభించి గనుల వేలం ఏర్పాట్లను చేయవచ్చని తెలిపారు.

పర్యావరణ అనుమతులకు కేంద్రం సానుకూలం తోమర్‌తో భేటీ అనంరతం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్‌ను సీఎం కేసీఆర్ కలిశారు. తీవ్రమైన విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న మన రాష్ట్ర పరిస్థితి గురించి జవదేకర్‌కు వివరించిన కేసీఆర్.. నల్లగొండ జిల్లా దామరచర్లలో నెలకొల్పాలనుకుంటున్న థర్మల్ విద్యుత్ కేంద్రం గురించి వివరించారు. విద్యుత్ కేంద్రం ఏర్పాటయ్యే ప్రాంతంలో కొంత అటవీ భూమి ఉన్నందున దానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరిన కేసీఆర్.. అంతే మోతాదు మేరకు మరోచోట అడవి పెంపకాన్ని ఇప్పటికే చేపట్టినట్లు వివరించారు. మొత్తం సుమారు పదివేల ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. థర్మల్ కేంద్రానికి అవసరమైన అటవీ భూములకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

పది వేల ఎకరాల్లో మొక్కల పెంపకానికి, అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి తీసుకున్న చర్యలను వందల పేజీల వివరాలతో కూడిన నివేదికను కూడా కేంద్ర మంత్రికి కేసీఆర్, అధికారులు అందజేశారు. ఈ వివరాలతో సంతృప్తి చెందిన జవదేకర్ పర్యావరణ పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. తమ శాఖ అధికారులు నెలాఖరుకల్లా అధ్యయనంచేసి, అనుమతుల మంజూరుపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తారని కేసీఆర్‌కు హామీ ఇచ్చారు.

ప్రాణహిత-చేవెళ్లపైనా చర్చ ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు కేంద్రంనుంచి రావాల్సిన పర్యావరణ అనుమతులపైనా మంత్రితో కేసీఆర్ చర్చించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నందున ఈ అనుమతులను వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరారు. అరగంటకు పైగా జరిగిన ఈ చర్చల్లో సానుకూల నిర్ణయాలు జరిగినట్లు ఎంపీ వినోద్ తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులన్నింటిపై ఫిబ్రవరి నెలాఖరులోగా నిర్ణయాలు తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఖమ్మం జిల్లా మణుగూరులో కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం ఆధీనంలో నడిచే రెండవ దశ ప్లాంట్ (800 మెగావాట్లు) గురించి కూడా కేంద్ర మంత్రికి వివరించిన కేసీఆర్ విస్తరణకు అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం హరితహారం పథకం కింద ఇప్పటికే రెండు కోట్ల మొక్కలు నాటటం, జీవ వైవిధ్యానికి తీసుకుంటున్న చర్యలు, హైదరాబాద్‌లో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. గతంలో తాను సిద్ధిపేట శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరించిన కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరించడానికి చేపట్టిన ప్రణాళికలను వివరించారు. కొన్ని ప్రాజెక్టుల విషయంలో పర్యావరణ అనుమతుల జారీ ప్రక్రియను సరళీకృతం చేయాలని కూడా సూచించారు.

ఎయిమ్స్ దవాఖాన, ఫార్మా వర్శిటీలపై చర్చ నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో నిర్మాణంలో ఉన్న నిమ్స్ దవాఖానను ఎయిమ్స్‌గా అభివృద్ధి చేయడానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎయిమ్స్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను అభినందించిన నడ్డా.. ఇందుకు అవసరమైన స్థలం, ఇతర మౌలిక సదుపాయాల గురించి కేసీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. బీబీనగర్‌ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, అందులో భాగంగానే ఎయిమ్స్ ఏర్పాటు, దీనికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ దవాఖాన, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, నర్సింగ్ హాస్టల్ తదితరాలను నెలకొల్పాలనుకుంటున్నామని మంత్రికి కేసీఆర్ వివరించారు.

ప్రస్తుతం బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక మంత్రి హడావిడిగా ఉన్నారని, ఒకటి రెండు రోజుల్లోనే ఈ విషయమై ఆర్థిక మంత్రితో చర్చించి ఎయిమ్స్ దవాఖానల ఏర్పాటుకు బడ్జెట్‌లో ఏ మేరకు నిధులు కేటాయించారో తెలుసుకుని వెంటనే తగిన అనుమతులు మంజూరు చేస్తామని కేసీఆర్‌కు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మొత్తం దేశంలోనే 33% ఫార్మా పరిశ్రమలు హైదరాబాద్ నగరంలో ఉన్నందున ప్రతిష్ఠాత్మకమైన ఒక ఫార్మా నగరాన్ని కూడా నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదని, ఇందుకు తగిన సహాయ సహకారాలు కావాలని కేంద్ర మంత్రికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి అనుగుణంగా ఒక ఫార్మా విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పడంపై కేంద్రం ఆలోచించాలని కోరారు.

అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తాము సిద్ధమని తెలిపారు. వీటిని కూలంకషంగావిన్న కేంద్ర ఆరోగ్య మంత్రి తప్పనిసరిగా సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీఇచ్చారు. జిల్లా స్థాయి దవాఖానాలను అభివృద్ధి పర్చడంపై కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాలనుకుంటున్నదని, అందులో తెలంగాణను కూడా చేరుస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. అవసరమైనచోట వైద్య కళాశాలలను కూడా నెలకొల్పుతామని అన్నారు. అనేక చోట్ల ప్రజా వైద్య ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందని, వీటికి కేంద్రం నుంచి సుమారు రూ. 50 కోట్ల మేరు నిధులు ఇంకా అందాల్సి ఉన్నదని, వీటిని కూడా వీలైనంత తొందరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రికి కేసీఆర్ విజ్ఞప్తిచేశారు.

నిలోఫర్ ఆస్పత్రిని జాతీయ పిల్లల వైద్య కేంద్రంగా గుర్తించాలని ఈ సందర్భంగా సీఎం కేంద్ర మంత్రికి విన్నవించారు. నిలోఫర్ విశిష్ఠతను కేంద్ర మంత్రికి వివరించిన కేసీఆర్.. ఆరు దశాబ్దాలుగా ఈ దవాఖాన చిన్న పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్నదని తెలిపారు. జాతీయ వైద్య కేంద్రంగా గుర్తింపు వస్తే ఈ ఆస్పత్రికి రూ.200 కోట్ల నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. వీటితోపాటు ఏటా దవాఖాన నిర్వహణకూ నిధులు విడుదలవుతాయి.

చర్చలు సానుకూల ఫలితాలిచ్చాయి : తెలంగాణ ప్రతినిధులు కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో కేసీఆర్‌తోపాటు రాష్ర్టానికి చెందిన సంబంధిత శాఖల మంత్రులు కూడా పాల్గొన్నారు. తోమర్‌తో జరిగిన చర్చల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య మంత్రితో జరిగిన చర్చల్లో మంత్రి లకా్ష్మరెడ్డి పాల్గొన్నారు. జవదేకర్‌తో జరిగిన చర్చల్లో రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, అధికారులు కూడా ఉన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంపీ వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రులందరితో జరిగిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయని చెప్పారు.

త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రులు అభినందించారని తెలిపారు. ఇటీవల స్వైన్‌ఫ్లూ వ్యాపించిన సమయంలో పరిస్థితి నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు వివరించిన కేసీఆర్.. ఆ సమయంలో కేంద్రం అందించిన సహకారంపై ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారని వేణుగోపాలచారి, వినోద్ చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.