Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బీసీలపై కేంద్రానికి ఎందుకీ నిర్లక్ష్యం?

బీసీలపై కేంద్రానికి ఎందుకీ నిర్లక్ష్యం?

దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు అర్ధాకలితో అలమటిస్తుంటే అదానీ రోజుకు వెయ్యి కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే తగిన వివరాలు లేకుండా ఏ వర్గాన్నయినా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఎలా రచిస్తారంటూ కేసీఆర్‌ చెప్పిన మాట ఆలోచింపదగినది. కచ్చితమైన గణాంకాల ప్రాతిపదికగా ప్రణాళికా రచన, విధాన నిర్ణయాలు జరగాలనేది ప్రాథమిక అవగాహన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించి, ప్రజల మొత్తం వివరాలను ఒకే ఒక్క రోజులో సేకరించటం గమనార్హం.

జనాభాకు అనుగుణంగా రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వృత్తిపనులు, బీసీ వర్గాలకు ఎంతమేర రిజర్వేషన్లు పెంచాలి? వెనుకబడిన సంచార జాతులు (ఎంబీసీలు), సంచార జాతుల స్థితిగతులను మెరుగుపరచడానికి ఏం చేయాలి? అనే అంశంపై రాష్ట్రప్రభుత్వం నిబద్ధతతో ఉన్నది. బీసీ కులాల హేతుబద్ధీకరణ కోసం బీసీ కమిషన్‌ నివేదిక అందిన తర్వాత జాబితాను నవీకరించే అవకాశాలు లేకపోలేదు. జాతీయ బీసీ కమిషన్‌ తరహాలోనే బీసీ కులాలను హేతుబద్ధీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి.

తెలంగాణలో 50 శాతానికిపైగా బీసీల జనాభా ఉండగా.. కొన్ని కులాల తొలగింపుతో ఈ శాతం కొంతమేర తగ్గింది. ఇక, రాష్ట్రంలో బీసీలు ఐదు గ్రూపులుగా ఉన్నారు. బీసీ-ఏ కు 7 శాతం, బీసీ-బీకి 10 శాతం, బీసీ-సీకి 1 శాతం, బీసీ-డీకు 7 శాతం కలుపుకొని మొత్తం 25 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అయితే, ఈ గ్రూపుల్లోని కులాల మధ్య అసమానతలున్నాయి. బీసీలకు అమలుచేస్తున్న ఫలాలను కొన్ని కులాలే ఎగరేసుకుపోతున్నాయని ఎంబీసీలు అంటున్నారు. నిజానికి, బీసీల్లో ఎంబీసీ కులాలు ఏవి అనడానికి ప్రభుత్వం వద్ద శాస్త్రీయంగా లెక్కలు లేవు. ఇప్పుడు బీసీ కమిషన్‌ అధ్యయనం తర్వాత ఎంబీసీల లెక్కలు బయటపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే నోమాడిక్‌ (సంచార), సెమీ నోమాడిక్‌ జాతులు, వృత్తి కులాలు, అత్యంత వెనకబడిన వర్గాలపై సర్వే నిర్వహించాలి.

స్వయంగా బీసీ అయికూడా బీసీ గణన గురించి ఏనాడూ మాట్లాడని నరేంద్రమోదీ, ఎన్నికలకు ముందు 2018లో బీసీ కులగణన చేపడుతామని, రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని మర్చిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా బీసీ. బీసీ గణన గురించి ఆయన ఎందుకు నోరు మెదపరు? ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఒక్కనాడైనా బీసీల గురించి మాట్లాడారా? బీసీ నేతనని చెప్పుకొనే నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ బీసీల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.

బీజేపీ నేతల తీరు ఇలా ఉంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా బీసీ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. త్వరలోనే ప్రధానిని మరోసారి కలిసి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతామని, కుల గణన, రిజర్వేషన్లపై జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రంపై పోరాటం చేస్తామని కేసీఆర్‌ ప్రకటించటం బీసీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలుపుతుంది. 2021లో దేశంలో చేపట్టే జనాభా లెక్కల్లో బీసీ కుల జనగణన చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన కేసీఆర్‌ గారికి కృతజ్ఞతలు.

బీసీల వివరాల సేకరణ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ముందు కేంద్రప్రభుత్వం తన అశక్తతను వ్యక్తం చేసింది. 2011 నాటి జనగణన సందర్భంగా సేకరించిన బీసీల వివరాలు తప్పుల తడకగా ఉన్నాయనీ, ఈ నేపథ్యంలో ఇకముందు ఈ వివరాల్ని సేకరించలేమని కేంద్రం తన అఫిడవిట్లో తెలిపింది. బ్రిటిష్‌ హయాంలో మన దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించారు. ఇప్పటికీ అవే లెక్కలపై ఉజ్జాయింపుగా ఆధారపడతామనడం ఆశ్చర్యం. పరాయి పాలకుల స్థాయిలో కూడా మనం వివరాలు సేకరించుకోలేమా? ఈ కీలకమైన అంశంపై బీజేపీ ఎన్నికల ముందు ఒకతీరు, తర్వాత మరోతీరుగా మాట మార్చడం గర్హనీయం.

కొందరు చెబుతున్నట్టుగా కులాల వివరాలు సేకరిస్తే వైషమ్యాలు పెరుగుతాయనేది అర్థం లేని వాదన. సామాజిక అంతరాలు తొలగించి, సామరస్యం సాధించడంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడే వైషమ్యాలు చోటుచేసుకుంటాయి. అంతే గానీ గణాంకాలు సేకరించడం వల్ల కాదు. జనగణన అంటే అడవిలో జంతువులను లెక్కించినట్టు కాదు. ప్రజల సమగ్ర వివరాలు విధానకర్తలకు, సామాజిక పరిశోధకులకు ఉపయోగపడాలి. ఏయే ప్రాంతాలలో, ఏయే వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలువకుండా ప్రణాళికలను రూపొందించడం చీకటిలో బాణం వేసినట్లే. సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలున్న మన సమాజంలో గణాంకాలకు మరింత ప్రాధాన్యం ఉంటుంది. కేంద్రం ఇప్పటికైనా కులాలవారీ జనగణన అవసరాన్ని గుర్తించాలి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.

(వ్యాసకర్త: శ్రీ బోడకుంటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.