Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బీసీలకు అందలం

-అన్ని కులాలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ.. -అన్ని వర్గాలకూ రాజకీయ అధికారం లభించాలి -ఆ దిశలోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకు.. -మన గొల్లకురుమలు దేశానికి మార్గదర్శకులు కావాలి: ముఖ్యమంత్రి కేసీఆర్ -గొర్రెల పంపిణీ పథకం విజయవంతమైంది.. సంక్షేమ నిధికి కోటి రూపాయలు -మొబైల్ అంబులెన్సుల క్రెడిట్ అంతా తమ్ముడు శ్రీనివాస్‌యాదవ్‌దే -టీఆర్‌ఎస్ మంత్రులు అద్భుతంగా పనిచేస్తున్నారు -అనేక రంగాల్లో నంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం -యెగ్గె మల్లేశాన్ని ఎమ్మెల్సీ చేస్తా.. ఒక యాదవ సోదరుడిని రాజ్యసభకు పంపుతా -తెలివిలేని గొర్రెల మాటల్ని పట్టించుకోవద్దు -యాదవ, కురుమ భవనం శంకుస్థాపన సభలో సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌తో చరిత్ర సృష్టిస్తున్నారు ప్రశంసలతో ముంచెత్తిన కర్ణాటక మంత్రి రేవణ్ణ

తెలంగాణలోని అన్ని జాతులు, కులాలు, వర్గాల ప్రజలు అభివృద్ది చెందినప్పుడే బంగారు తెలంగాణ కల సాధ్యమవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు ఆర్థికంగా బలపడాలని.. ఏ కులంలో పేదలను ఆ కుల సంఘాలు ఆదుకొంటూ ముందుకు కదలాలని..అదే చైతన్యంతో రాజకీయంగా కూడా ముందు కు వచ్చినప్పుడే తాను కలలు గన్న తెలంగాణ సాకారమవుతుందని ఆయన అన్నారు. అధికారం అన్నది ఏ ఒక్క వర్గం చేతుల్లో కేంద్రీకృతం కారాదని, అది ఎంతమాత్రం సరైన సిద్ధాంతం కాదని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు రాజకీయంగా శాసించే అధికారం లభించినప్పుడే సంపూర్ణంగా బంగారు తెలంగాణ ఆవిర్భవించినట్టవుతుందని, ఆ దిశగానే తమ పార్టీ, ప్రభుత్వం పనిచేస్తూ ముందుకు పోతున్యాయని పేర్కొన్నారు. యాదవ, కురుమ సంక్షేమ భవన్ నిర్మాణానికి కోకాపేట సమీపంలో ప్రభుత్వం కేటాయించిన భూమిలో శుక్రవారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సీబీఐటీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ప్రగతి సాధించాలని సీఎం ఆకాంక్షించారు. తమ ప్రభుత్వ హయాంలో రెండు చట్టసభలకు బీసీలే అధినాయకులుగా ఉన్నార ని.. శాసనసభకు స్పీకర్‌గా మధుసూదనాచారి, శాసనమండలికి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఉన్నారని పేర్కొన్నారు. కురుమ సంఘానికి నేతగా ఎంతోకాలంగా పనిచేస్తున్న యెగ్గె మల్లేశంకు ఇంతకాలం రాజకీయంగా అవకాశం రాలేదని, అందుకే ఆయన్ను ఎమ్మెల్సీ చేస్తానని గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తానని ప్రకటించారు. వచ్చే మార్చిలో ఒక యాదవ సోదరుడికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిస్తానని తెలిపారు. ఒకేసారి అన్నీ చేయలేకపోయినా, బీసీల అభ్యున్నతికి క్రమంగా ముందుకు వెళ్లాలని చెప్పారు.

సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే… చివరి కుటుంబం వరకూ గొర్రెలు పంపిణీ చేస్తాం గొర్రెల పంపిణీ పథకం ప్రారంచాలనుకున్నప్పుడు 4 లక్షల కుటుంబాలకు పంపిణీ చేస్తే సరిపోతుందనుకున్నాం. దానికోసం బడ్జెట్ సమకూర్చుకున్నం. గొల్ల, కురుమ అయి ఉండి, 18 ఏండ్లు నిండిన వారంతా ఈ పథకానికి అర్హులే అని అధికారులకు చెప్పిన. తెలంగాణ రాష్ర్టానికి 650 లారీల గొర్రెలు దిగుమతి చేసే పరిస్థితి నుంచి మనమే రోజుకు 650 లారీల గొర్రెలు ఎగుమతి చేసే పరిస్థితి రావాలె. మన యాదవులు దేశంలోనే అత్యంత ధనవంతులు కావాలని అధికారులకు చెప్పిన. కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత అర్హుల సంఖ్య 7లక్షల 61వేలని తేలింది. వాళ్లకు కోటి 60 లక్షల గొర్రెలు ఇవ్వాలె. ఇప్పటి వరకు మన ప్రణాళికలో ఉన్నది 84 లక్షల గొర్రెలు. ఈ సందర్భగా నేను మనవి చేస్తున్నా.. 7 లక్షల 61వేల మందికి.. చివరి కుటుంబం వరకు గొర్రెల పంపిణీ చేస్తం. ఇందుకు మరో రూ.5వేల కోట్లు ఖర్చు అయితది. అయినా ప్రభుత్వం వెనుకకు పోదు. కానీ, సబ్సిడీ గొర్రెలు అమ్ముతున్నట్టు అప్పుడప్పుడు వార్తలు చూస్తున్నం. దయచేసి గొల్ల, కురుమ నాయకులు దీనిపై దృష్టి పెట్టాలని నేను కోరుతున్నా. అక్రమాలు జరగకుండా పకడ్బందీగా చూడాలె. గొర్రెలను అటవీ భూముల్లో మేపేందుకు ఇప్పటికే ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మేకలు తప్ప గొర్రెలను మీరు మేపుకోవచ్చు, ఎవరైనా ఇబ్బందిపెడితే మీ ఎమ్మెల్యే, ఎంపీ, మీ జిల్లా మంత్రి దృష్టికి తీసుకొస్తే, సమస్య పరిష్కరిస్తరు. అట్లనే రాష్ట్రంలోని 12 లక్షల ఎకరాల్లో ఉన్న పండ్ల తోటల్లోనూ గొర్రెలను మేపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రికి ఇప్పటికే ఆదేశాలిచ్చిన. గొల్ల, కురుమలకు మరో లాభం కూడా జరగబోతున్నది. గొల్ల, కురుమ రైతులకు సబ్సిడీపై గొర్రెలతో పాటు వచ్చే ఏడాది నుంచి ఏటా ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడిగా ఇవ్వబోతున్నం.

మన రాష్ట్ర గొల్ల, కురుమలు దేశానికే ఆదర్శం కావాలి గొల్ల, కురుమ కమ్యునిటీహాల్ నిర్మాణానికి ఇంత గొప్పగా భూమి పూజ చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలోని గొల్ల, కురుమ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇల్లు అలకగానే పండుగ కాదు..గొల్ల, కురుమ సోదరులంతా పట్టుబట్టి ఈ భవనాలను నిర్మించి, వీటిని అద్భుత సంక్షేమ భవనాలుగా తీర్చిదిద్దేందుకు సంఘంలోని నాయకులు, రాజకీయ ప్రముఖులు కృషి చేయాలని నేను కోరుతున్నా. మనం ఎప్పుడూ వింటుంటాం, లండన్‌లో అట్ల ఉంటది..అమెరికాల ఇట్ల ఉంటదని..చెప్పుకుంటుంటాం. కానీ మనమంతా సంఘటితం అయితే అందులో శక్తి ఏందో ముందు తెలుసుకోవాలె. అందుకే మొట్టమొదట మనలో ఐకమత్యం రావాలె. భారత దేశ యాదవ, కురుమ జాతికి మన వాళ్లు మార్గదర్శకం కావాలె. రాష్ట్రంలోని గొల్ల, కురుమల్లో ఎవరు అనాథగా ఉన్నా, వారికి ఇక్కడ అన్నం, విద్య దొరికే విధంగా ఈ సంక్షేమ భవనాలు రూపుదిద్దుకోవాలె. తల్లిదండ్రులు లేని గొల్ల, కురుమ అమ్మాయిలకు, పేద అమ్మాయిలకు ఇక్కడ వివాహాలు జరిపించేందుకు కల్యాణ మండపం ఏర్పాటు చేసుకోవాలె. అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చేదానితోపాటు గొల్ల, కురుమలు కొంత కలుపుకుని మూలనిధి ఏర్పాటు చేసుకోవాలె. వైకుంఠ ఏకాదశి శుభదినాన మూలధనం కింద ఇప్పటికప్పుడు రూ.కోటి రూపాయలు మంజూరు చేస్తున్నా. మీరంతా సంకల్పం తీసుకుని ఈ కోటి రూపాయలను వందల కోట్లు చేసుకోవాలె. ధనవంతులైన గొల్ల, కురుమలు ముందుకు రావాలె, ఎన్నారైలు ముందుకు వచ్చి చందాలు ఇవ్వాలె. దీనికి యాదవ, కురుమ నాయకులంతా పట్టుబట్టి ముందుకు వెళ్లి ఈ నిధితో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నేను కోరుతున్నా. ఈ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్‌యాదవ్, ఇతర కుల పెద్దలకు సూచిస్తున్నాను. ఈ భవనాలు పూర్తయితే గండిపేట సోయగంతో మంచి వాతావరణం ఉంటది.

గొర్రెలు మూవింగ్ బ్యాంక్ లాంటివి విచిత్రమైన పరిస్థితులు.. గతంలో విన్నదానికి వాస్తవానికి చాలా తేడా ఉన్నది. తెలంగాణ రాష్ర్టానికి రోజుకు 650 లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌కే రోజుకు 350 లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నయి. మన తెలంగాణలో కాకతీయ రాజులు తవ్వించిన చెరువులు, మన నవాబులు నిర్మించిన ప్రాజెక్టులు, చిన్ననీటిపారుదల ప్రాజెక్టు ఉన్నా హైదరాబాద్‌లోని రాంనగర్ చేపల మార్కెట్‌లో 20 నుంచి 25లారీల చేపలు దిగుమతి అవుతున్నయి. మన రాష్ట్రంలో 30 లక్షల మంది గొల్ల, కురుమలు ఉన్నరు. చేపలు పట్టే వృత్తి ఉన్న గంగపుత్రులు, ముదిరాజ్‌ల జనాభా 40 లక్షలు.. మొత్తం 70లక్షల మంది ఉన్నరు. ఇంతమంది ఉండగా, మన రాష్ర్టానికి గొర్రెలు, చేపలు దిగుమతి చేసుకునే పరిస్థితి ఎందుకు ఉన్నది? మనకేమన్నా సిగ్గు ఉందా? అని అధికారులతో మాట్లాడిన. గొర్రెలు, చేపలు పెంచే మానవ వనరులు మన దగ్గర ఉన్నయి. మానవ వనరులు ఉంటే ఎక్కడో కంప్యూటర్ల కాడ ఉన్నరనుకొంటరు. వాళ్లను మించిన మానవ వనరులు తెలంగాణ గొల్ల, కురుమలని ఈ రోజు రుజువైంది. గొర్రెల పంపిణీ పథకంపై తెలివిలేని గొర్రెలు చాలా మాట్లాడినయి. కానీ నేను పట్టించుకోలేదు. తప్పకుండా విజయం సాధిస్తామన్న నమ్మకం నాకు ఉండె. మొన్న పేపర్లో రాసినారు. అసెంబ్లీలో కేసీఆర్ ఏవిధంగా చెప్పారో.. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అద్భుతంగా గొర్రెల పెంపకం జరుగుతున్నదని, ఇక్కడి యాదవులు, కురుమలు కేసీఆర్ మాట నిలబెట్టిండ్రని రాసిండ్రు. ఇప్పటివరకు రాష్ట్రంలో మనం తెచ్చి పంపిణీ చేసిన గొర్రెలు 35 లక్షలు, వాటికి పుట్టిన పిల్లలు 13 లక్షల పైచిలుకు. రెండు కలిపితే 48 లక్షల గొర్రెలు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నయి. ఈ 48 లక్షల గొర్రెలు మూవింగ్ బ్యాంక్.. అంటే కదిలేటువంటి బ్యాంకు వంటివి. ఇట్లా కొన్ని వేల కోట్ల సంపదను తెలంగాణ యాదవులు సృష్టించబోతున్నారు. అసెంబ్లీలో నేను చెప్పినప్పుడు కొందరు అడ్డదిడ్డగా మాట్లాడితే నేను చెప్పిన, మూడునాలుగేండ్లు దాటితే భారతదేశంలో అత్యంత ధనికులైన గొల్ల, కురుమలు తెలంగాణలో ఉన్నారని చెప్పే రోజు వస్తదని చెప్పినా. అది విజయవంతం చేయాల్సిన బాధ్యత గొల్ల, కురుమలపై ఉంది. గొర్రెల పంపిణీ పథకం అద్భుతంగా అమలవుతున్న రాష్ట్రం దేశంలో తెలంగాణే అని కర్నాటక మంత్రి రేవణ్ణగారు స్వయంగా చెబుతున్నారు.

యాదవ యువతకు సబ్సిడీపై మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు పట్టణ ప్రాంతాల్లోని యాదవ యువతకు ఉపాధి వచ్చేలా మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలి. అందుకు ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ నుంచి సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తది. ఇవి కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తం. మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటు కోసం, గల్ఫ్, జర్మనీ దేశాలకు వెళ్లి అక్కడ మీట్ ప్రాసెసింగ్ యూనిట్లపై అధ్యనం చేసి రావాలని ఇప్పటికే మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌కు చెప్పిన. వారు త్వరగా అధ్యయనం పూర్తి చేస్తే ఒక్కో యూనిట్‌కు ఎంత ఖర్చవుతుందో మనకు ఒక లెక్క వస్తది.

జనవరి ఒకటి నుంచి సేద్యానికి 24గంటల కరంటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు సమైక్య రాష్ర్టానికి ఒక పుణ్యాత్ముడు ఆంధ్రాయన ముఖ్యమంత్రిగా ఉండే. టీవీల ఆయన కట్టెపట్టి సూపిచ్చిండు. తెలంగాణ వస్తే సిమ్మని చీకటైతదని, మీకు కరంటు రాదు. ఆగమాగం అయితరని చెప్పిండు. ఆగం వాళ్లు అయిండ్రు. మనంకాలే. ఈ రోజు వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయానికి 7 గంటలే కరంటు ఇస్తున్నరు కానీ, తెలంగాణలో జనవరి ఒకటి నుంచి వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇవ్వబోతున్నం.

కొన్ని తెలివిలేని గొర్రెలు మాట్లాడుతున్నయి గొర్రెల పంచుడు అభివృద్ధా.. అని కొన్ని పార్టీల వాళ్లు మాట్లాడారు. వాళ్లు ఎవరో మీకు తెలుసు.. గ్రామీణ ప్రాంతంలోని 30 లక్షల మంది యాదవులు, కొన్ని రూ. వేల కోట్ల సందపను సృష్టిస్తే అది తెలంగాణ సంపద కాదా? తెలంగాణ అభివృద్ధి కాదా? ఆ సంపద మరింత సంపదను సృష్టించదా? ఆ విధంగా గ్రామీణ తెలంగాణ పరిపుష్టం కాదా? కానీ తెలివిలేని గొర్రెలు మాట్లాడుతున్నయి. వారికి సరైన సమయంలో, సరైన సమాధానం ఇచ్చే బాధ్యత మీ గొల్ల, కురుమలపై ఉందని నేను మనవి చేస్తున్నా. అని సీఎం కేసీఆర్ తెలిపారు. బహిరంగసభలో శాసనమండలి చైర్మన్ కే స్వామిగౌడ్, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, అటవీ, బీసీసంక్షేమశాఖల మంత్రి జోగురామన్న, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కే యాదయ్య, శ్రీనివాస్‌గౌడ్, అంజయ్యయాదవ్, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ రాజయ్యయాదవ్, కురుమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం, యాదవసంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాబురావుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఉన్నంత కాలం తెలంగాణలోనే ఉంటా: సీఎం నేను ఈ మధ్య ఢిల్లీకి పోయినప్పుడు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నాతో మాట్లాడిండు. క్యాహై, కేసీఆర్ సాబ్, కిసానోంకో..ఆర్ హజార్ దేరహే.. యే క్యాహై.. అని అడిగారు. అవునండీ, సమైక్యరాష్ట్రంలో మా తెలంగాణ రైతులు బాగా దెబ్బతిన్నరు. అందుకే ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి ఇస్తున్నా..అని చెప్పా. అప్పుడు.. ఎన్ని కిస్తుల్లో మళ్లీ తిరిగి ఇస్తరు.. అని రాజ్‌నాథ్ అడిగారు. కిస్తీలు ఏం లేవు, వాపస్ ఇచ్చేది ఏం లేదు. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందని చెప్పిన, ఆయన కుర్చీలోంచి కిందపడ్డంత పనిచేసిండు(కేసీఆర్ నవ్వుతూ చెప్పారు). నువ్వో పెద్ద బాంబు వేసినవ్. కేంద్ర రాజకీయాల్లోకి ఏమైనా వస్తున్నవా.. అని రాజ్‌నాథ్ అడిగారు. నాకు అలాంటి ఆసక్తి లేదు. నేను తెలంగాణ కావాలని తెచ్చుకున్న. ఆ తెలంగాణలో అన్ని జాతులు, అన్ని కులాలు చిరునవ్వుతో బతికితే ఈ జన్మకు అదే చాలు, కేంద్ర రాజకీయాలు మీరే చేసుకోండి.. ఉన్నంత కాలం తెలంగాణలో ఉంటాను. అని ఆయనకు చెప్పిన. తెలంగాణలోని అన్ని జాతుల ప్రజలు, అన్ని కులాలు, వర్గాల ప్రజలు అభివృద్ది చెందినప్పుడే బంగారు తెలంగాణ కల సాధ్యమైతది. ఈ రోజు తెలంగాణలో కొత్తగా వచ్చిన 48 లక్షల గొర్రెలు అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఆ సంపద సృష్టికర్తలైన గొల్ల, కురుమ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న.

జాతిరత్నం తలసాని..మంత్రుల ఆలోచనలు అద్భుతం: సీఎం గొల్ల, కురుమ జాతి రత్నం, డైనమిక్ మినిస్టర్.. శ్రీనివాస్‌యాదవ్.. అద్భుతమైన తెలివితేటలున్న వ్యక్తి. 100 మొబైల్ ఆంబులెన్స్‌లు అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసువచ్చిండు. ఇది నా ఐడియా కాదు. ఇది నా తమ్ముడు శ్రీనివాస్‌యాదవ్‌దే ఐడియా. వంద అంబులెన్సులు తెచ్చిన ఘనత నా తమ్ముడు శ్రీనివాస్‌యాదవ్‌కే దక్కుతుందని చెప్తున్నా. నిజంగా కూడా ఒక్కోసారి గర్వం కలుగుతది. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులు ఎంతో గొప్పగా ఆలోచనలు చేస్తున్నారు. ఒకరోజు ఒక సమావేశంలో ఉన్నప్పుడు నా పక్కన ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు. ఆ సమయంలో హాస్టళ్లలో ఉన్న విద్యార్థుల భోజనం గురించి చర్చ వచ్చింది. అప్పుడు ఈటల రాజేందర్‌గారు నాతో చెప్పిండ్రు.. అన్నా నేను కూడా హాస్టల్‌లోనే చదువుకున్నా.. వారి ఇబ్బందులు తెలుసు, హాస్టల్ విద్యార్థులకు దొడ్డు బియ్యం అన్నం కాకుండా సన్నబియ్యం అన్నం పెడదామని సలహా ఇచ్చిండు. అదే ఇప్పుడు హాస్టల్స్‌లో పిల్లలకు సన్నబియ్యం పెట్టే పథకానికి కారణమైంది. ప్రజలు బాధలు తెలిసిన నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. అందుకే ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నయి. చాలా రాష్ర్టాల్లో మనుషులకే ఆంబులెన్స్‌లు దిక్కులేవు. కానీ మన రాష్ట్రంలో మన పశుసంవర్ధకశాఖ మంత్రి ఆలోచనతో పశువులకు మొబైల్ అంబులెన్స్‌లు వచ్చాయి.

అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చేయూత: సీఎం -మత్స్యకారుల సంక్షేమం కోసం రూ. వెయ్యి కోట్లతో చేపలపెంపకం కార్యక్రమం ప్రారంభించినం. -నాయీ బ్రాహ్మణ సోదరుల కోసం గ్రామాల్లో ఆధునిక నవీన క్షౌర శాలల ఏర్పాటుకు ఒక్కోదానికి రూ.లక్ష చొప్పున 25వేల నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు అందించబోతున్నం. -విశ్వబ్రాహ్మణ సోదరులకు రూ.250 కోట్లు కేటాయించినం. వారికి అవసరమైన పనిముట్లను బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో త్వరలోనే పంపిణీ చేయబోతున్నం. -రజక సోదరులకు అధునాతనమైన ధోబీఘాట్లు నిర్మించి, డ్రయ్యర్స్ కొనిచ్చేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నయి. -భారత దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులను ఆదుకునేందుకు 50శాతం సబ్సిడీపై నూలు, రంగులు, రసాయనాలు అందిస్తున్నం. వారి రుణాలు మాఫీ చేశాం. 50 వేల మరమగ్గాలకు వందశాతం సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. -సంచార జాతుల కోసం దేశంలోనే మొదటిసారిగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ. వెయ్యికోట్లు నిధులు కేటాయించి మోస్ట్ బ్యాక్‌వర్డ్ కులాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నం.

తెలంగాణ నంబర్‌వన్ మూడున్నరేండ్ల పసికూన అయినా తెలంగాణ రాష్ట్రం దేశంలో అనేక రంగాల్లో నంబర్‌వన్‌గా నిలుస్తోందని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆ జాబితాను ఇలా చెప్పుకొచ్చారు. -ఇంత పెద్ద సంఖ్యలో సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు. తెలంగాణ తప్ప. -సులభ వాణిజ్య విధానం (ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉంది. -సొంతంగా ఆదాయం పెంచుకోవడంలో ఇండియాలో నంబర్‌వన్ రాష్ట్రం తెలంగాణ. -3148 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే నంబర్‌వన్‌గా ఉన్నాం. -లబ్ధిదారుడిపై ఒక్క రూపాయి భారం లేకుండా ఉచితంగా డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టించే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. -బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం అత్యధికంగా రెసిడెన్సియల్ పాఠశాలలు నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. -విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళుతున్న బీసీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. -వచ్చే ఏడాది నుంచి ఏటా రైతులకు పెట్టుబడి కోసం ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడి ఇవ్వబోతున్న రాష్ట్రం భారతదేశంలో తెలంగాణే. -పేదింటి ఆడబిడ్డ పెండ్లి జరిగితే ఖర్చులకు రూ.75 ఇస్తూ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. -దేశంలో బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి భృతి ఇచ్చి ఆదుకుంటున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. -ఆడబిడ్డల ప్రసవ సమయంలో ప్రైవేటు దవాఖానల వాళ్లు డబ్బు కోసం వాళ్ల ఆరోగ్యం చెడగొడుతున్నరని, అది అడ్డుకునేందుకు కేసీఆర్ కిట్ పేరుమీద రూ.15వేల ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. -జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని దవాఖానలకు వైద్యానికి వచ్చే పేదలు చనిపోతే వారి శవాలను ఇంటికి ఉచితంగా చేర్చేందుకు 50 వాహనాలతో సేవ చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.