-దేశానికే ఈ పథకం ఆదర్శం -సిద్ధిపేట సభలో రాష్ట్రమంత్రి హరీశ్‌రావు -కొత్త రాష్ట్రంలో ఎన్నో పథకాలు: ఇందూరు సభలో పోచారం -ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను ఆశ్చర్యపరుస్తున్న సంక్షేమ పథకాలు -ఆదిలాబాద్‌లో బీసీ, అటవీశాఖ మంత్రి జోగురామన్న -పథకం ప్రారంభం అదృష్టం:కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ

కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో కొలువు దీరిన తొలి సర్కార్, సామాన్యుల అభ్యున్నతి పట్ల వినూత్న పథకాలు అమలుచేస్తూ ముందుకెళుతున్నది. పేదలకు చేదోడుగా నిలిచేందుకు ఆసరా పింఛన్ల పథకం అమలుచేసి సామాన్యుల అభినందనలు అందుకున్న ప్రభుత్వం.. అదే ఒరవడిలో భాగంగా ఆదివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బీడీ కార్మికులకు జీవనభృతి పథకాన్ని ప్రారంభించింది. జీవన భృతి పథకం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా సిద్ధిపేటలో మొదటిసారి పథకాన్ని ప్రారంభించిన ఆయన అర్హులైన బీడీకార్మికులకు రూ.1000 జీవనభృతి అందజేశారు. బీడీకార్మికుల కష్టసుఖాలు తెలిసినందునే వారికి సీఎం కేసీఆర్ జీవన భృతి అందించి అండగా నిలుస్తున్నారన్నారు. జిల్లాలో 25 వేల బీడీ కార్మికులను జీవనభృతికి అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు.

మరో 25 వేల మందికి పథకం వర్తింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. అర్హులైన ప్రతి బీడీకార్మికురాలికి అమలుచేస్తామని హరీశ్‌రావు తెలిపారు. జాబితాలో తమపేర్లు రాకపోతే అర్హులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగనవసరం లేదన్నారు. వారి ఇండ్లకే అధికారులు వచ్చి వివరాలు తెలుసుకుని అక్కడికక్కడే విచారించి 15 రోజుల్లో పింఛన్ అందజేస్తారన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. ఎంపికైన ప్రతి బీడీ కార్మికురాలి పేరును ఆన్‌లైన్‌లో అనుసంధానంచేసి ప్రతి నెలా ఆమె ఖాతాలో భృతిని జమచేస్తామని చెప్పారు. అవినీతి రహితంగా, దళారులకు తావులేకుండా పారదర్శక పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని హరీశ్‌రావు కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ 60 ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్ర పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రజలకు రావాల్సినవన్నీ దోచుకున్నారన్నారు. రాష్ట్రం ఏర్పాటు కాగానే పలు సంక్షేమ పథకాల అమలవుతున్నాయని చెప్పారు.
ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవన భృతి అమలుచేయాలని జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. ఆమె సీఎం కేసీఆర్ దృష్టికి తేవడంతో అప్పటికప్పుడు అదే వేదికపై అంచనావేసి పథకాన్ని ప్రకటించారని గుర్తుచేశారు.

నేనూ ఒకనాడు బీడీ కార్మికురాలినే: నిజామాబాద్ మేయర్
నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం మాట్లాడుతూ 13 ఏండ్ల క్రితం తానూ పేద కుటుంబ గృహిణిగా బీడీలు తయారుచేసిన అనుభవం ఉన్నదని గుర్తుచేశారు. ఉదయం ఏడు గంటల నుంచి దినమంతా పనిచేస్తే నెలకు రూ.1000 ఆదాయం వచ్చేదన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో అర్హుల పేర్లు ప్రకటించి, వారికి చెక్‌లు అందజేశారు. ఆదిలాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, అటవీశాఖ మంత్రి జోగు రామన్న అర్హులకు జీవనభృతి చెక్‌లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికుల కష్టాలను చూసి ప్రభుత్వం అర్హులకు జీవనభృతి పంపిణీ చేయాలని నిర్ణయించిందన్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు చూసి కమ్యూనిస్టు, బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు. జిల్లాలో 56 వేల మంది బీడీ కార్మికులకు గాను 46 వేల మందిని అర్హులుగా గుర్తించారు.