-ప్రధాని మోదీ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు
-ఇంటింటికి నీళ్లు, ఇంటర్నెట్ ఇచ్చేది తెలంగాణ ఒక్కటే
-మిగతా రాష్ట్రాలకు కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి: మంత్రి కేటీఆర్
-మిషన్ భగీరథ వెబ్సైట్, మొబైల్ యాప్ ఆవిష్కరణ
మిషన్ భగీరథ దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారని చెప్పారు. ఎర్రమంజిల్‌లోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో శుక్రవారం మిషన్ భగీరథ వెబ్సైట్, మొబైల్‌యాప్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ప్రపంచ బ్యాంకు నిధులు రూ.కోటితో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కాన్ఫరెన్సుహాల్ను ప్రారంభించారు. ఉద్యోగులే మొబైల్యాప్, వెబ్‌సైట్‌ను రూపొందించడం అభినందనీయమన్నారు.
రియల్‌టైం మానిటరింగ్‌తో పాటు యూజర్ ఇంటర్ఫేస్ బాగున్నాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి, కృష్ణాబేసిన్ను అనుసంధానిస్తూ మిషన్ భగీరథలో తాగునీటి గ్రిడ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారు. ఇంటర్ కనెక్టవిటీ గ్రిడ్ ఏర్పాటుతో మిషన్ భగీరథ ప్రపంచస్థాయి ప్రాజెక్టుగా మారుతుందన్నారు. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల ప్రతినిధులు మిషన్‌భగీరథ గురించి తెలుసుకోవడానికి, పనులను చూడడానికి వచ్చారన్నారు.ప్రాజెక్టు పూర్తయ్యాక మిగతా 24 రాష్ట్రాలు అధ్యయనం కోసం వస్తాయని చెప్పారు. మిగతా రాష్ట్రాలకు కన్సల్టెన్సీ సేవలను అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇంటింటికి మంచినీటితో పాటు ఇంటర్నెట్ అందించే అవకాశం తెలంగాణకు తప్ప మరే దేశానికి రాష్ట్రానికి దక్కలేదన్నారు. భగీరథ పైప్లైన్లతో పాటు ఆప్టిక్ ఫైబర్డక్ట్ను వేస్తున్నామని, త్వరలో రాష్ట్రంలోని ఇంటింటికీ ఇంటర్నెట్ అందిస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌నాటికి ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటిని అందిస్తామని పునరుద్ఘాటించారు. చివరి గడపకు నల్లా నీళ్లు అందేవరకు విశ్రమించవద్దని ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లను కోరారు. నీళ్ల విషయంలోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
తాగునీటి రంగంలో తెలంగాణను స్వయంసమృద్ధిగా మార్చడానికే మిషన్‌భగీరథకు ముఖ్యమంత్రి రూపకల్పన చేశారని చెప్పారు. సీఎం ఆలోచనను క్షేత్ర స్థాయిలో అద్భుతంగా అమలుచేసిన ఘనత ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి దక్కుతుందని కొనియడారు. మిషన్‌భగీరథ ఆలోచన సీఎం కేసీఆర్‌దని, మంత్రి కేటీఆర్ నాయకత్వంలోనే ప్రాజెక్టు అచరణ గొప్పగా ప్రారంభమైందని మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఇంజినీర్లు, ఉద్యోగులతో మంత్రి కేటీఆర్ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. శుక్రవారం పుట్టినరోజు జరుపుకొన్న ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.