Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

భగీరథ సిద్ధం

-సాకారమవుతున్న స్వప్నం.. గ్రామాలలో తుదిదశకు చేరిన పనులు -90శాతం పనులు పూర్తి.. నిమిషానికి ఐదు లీటర్ల నీటి సరఫరా -కొత్త సంవత్సర కానుకగా 24వేల గ్రామాలకు తాగునీరు.. -వచ్చే జూన్ నాటికి అంతర్గత పైప్‌లైన్ల నిర్మాణం పూర్తి

దాహార్తితో అలమటించే ప్రజల గొంతు తడపడమే లక్ష్యం. ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తాం. అలా ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగబోం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన ప్రతిజ్ఞ ఇది. శాసనసభ సాక్షిగా, అనేక సభల్లో తాను చేసిన ప్రతిజ్ఞ ఎన్నికలకు ఏడాదిన్నర కాలం ఉండగనే నెరవేరబోతున్నది. దాదాపు రూ.50వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీరందించే మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా జనవరి ఒకటి నుంచి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో 24వేల ఆవాసాలకు మంచినీరు చేరబోతున్నది. గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ల నిర్మాణం వచ్చే జూన్‌కల్లా పూర్తి కానున్నది.

90శాతం పనులు పూర్తి మిషన్ భగీరథకు సంబంధించి 90శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతా పనులు డిసెంబర్ చివరినాటికి పూర్తిచేసేందుకు వేగంగా చర్యలు చేపట్టారు. ఇన్‌టేక్ వెల్స్, నీటిశుద్ధి కేంద్రాల వంటి భారీ కట్టడాల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. గ్రామాలలో ప్రధాన పైపులైను పనులు తుదిదశకు చేరాయి. ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. నదులు, రిజర్వాయర్ల నుంచి నీటిని తోడటం అన్నది భగీరథలోని మొదటిదశ. ఇందుకోసం ప్రతిపాదిత 19 ఇంటెక్‌వెల్స్ నిర్మాణం పూర్తయింది. ఈ ఇన్‌టేక్ వెల్స్ భారీ సాగునీటి ప్రాజెక్టులను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల వీటి నుంచి నదుల్లోకి పొడవైన వంతెనలు సైతం నిర్మించారు. మహబూబ్‌నగర్ సెగ్మెంట్‌లోని ఎల్లూరు ఇన్‌టేక్‌వెల్ ఆసియాఖండంలోనే అతి పెద్దది. పుల్కల్ మండలం సింగూ రు డ్యాం వద్ద నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్, నీటిశుద్ధి కేంద్రం భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందే అవకాశం ఉన్నది. ఇన్‌టేక్‌వెల్స్ తర్వాత అతికీలకమైనవి నీటిశుద్ధి కేంద్రాలు. ఇవీ చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇప్పటికే ఉన్న 60 నీటిశుద్ధి కేంద్రాలను వినియోగించుకుంటూనే మరో 50 కొత్తవి నిర్మిస్తున్నారు. వీటిలో 22పూర్తయ్యాయి. ఇన్‌టేక్ వెల్స్ నుంచి నీటిశుద్ధి కేంద్రాల వరకు, శుద్ధిచేసిన నీటిని గ్రామం వరకు సరఫరా చేసేందుకు పెద్ద పైపులైన్ల నిర్మాణం 90 శాతం పూర్తయింది. ప్రైవేట్ పొలాల మీదుగా పైపులైన్లు వేసేందుకు ప్రభుత్వం రైట్ టు యూజ్ ఇన్ ల్యాండ్ చట్టాన్ని వినియోగించింది. పొలాలకు ఇబ్బంది లేకుండా రోడ్ల పక్కగా పైపులైన్లు వేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో పైపులు వేయడానికి ముందుకు వచ్చి ఆదర్శంగా నిలిచారు. ఇందుకోసం ఏడెకరాలలో అల్లం పంటను తొలిగించారు. సీఎం స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులు ముందుకు వచ్చి పంట పొలాలలో పైపులైన్లు వేయడానికి అవకాశమిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో తొలిదశలో భాగంగా 24వేల ఆవాసాలకు నీరు చేర్చే పనులు డిసెంబర్ చివరకు పూర్తవుతాయి. రెండోదశలో అంతర్గత పైప్‌లైన్ నిర్మాణ పనులను 2018 తొలి ఆరునెలల్లో పూర్తి చేసేందుకు అధికారులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు.

నిమిషానికి ఐదు లీటర్లు తెలంగాణ గ్రామీణ తాగునీటి శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో 2048 నాటికి ప్రజలకు , పరిశ్రమలకు కలిపి 78.06 టీఎంసీల ఉపరితల జలాలు అవసరమవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల వారికి రోజుకు తలసరి 100 లీటర్లు, పురపాలికలు, నగర పంచాయతీల్లోని వారికి 135 లీటర్లు, నగరపాలక సంస్థల్లోని ప్రజలకు రోజుకు 150 లీటర్ల చొప్పున తాగునీటిని ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి ప్రస్తుతం 42.27 టీఎంసీల నీరు అవసరం. ఈ నీటిని 2.72 కోట్ల జనాభా అవసరాల కోసం సేకరించనున్నారు. రానున్న 30 ఏండ్లలో అంటే 2048 నాటికి రాష్ట్రంలో 78.06 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయని ఆర్‌డబ్ల్యూఎస్ అంచనా వేసింది. గ్రామాల్లో ప్రతి ఇంటికి నిమిషానికి 5 లీటర్ల చొప్పున తాగునీరు అందజేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే తలసరి 100 లీటర్ల చొప్పున అందేందుకు 20 నిమిషాలు పడుతుంది. కృష్ణా, గోదావరి, వాటి ఉపనదులు, రిజర్వాయర్లలో లభించే నీటిని.. నది వద్ద ఇన్‌టేక్‌వెల్ నిర్మించి సేకరిస్తారు. వాటిని శుద్ధిచేసి అక్కడి నుంచి ఎత్తైన ప్రాంతాల్లో నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి గ్రామంలోని ఓవర్‌హెడ్ ట్యాంకుల్లోకి వేగంగా నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి ఇంటింటికీ నల్లాల ద్వారా సరఫరా అవుతాయి. నీటిని ఎక్కువ గా తీసుకోవాలని ఎవరైనా మోటరు ఏర్పాటు చేస్తే ఆ ఇంటికి మొత్తం నీటి సరఫరా స్తంభించిపోయేలా ఫ్లో కంట్రోల్ వాల్వులు ఏర్పాటుచేశారు. భగీరథ కోసం రాష్ర్ర్టాన్ని మొత్తం 26 సెగ్మెంట్లుగా విభజించి నిర్మాణాలు చేపట్టారు. సరఫరా సమయంలో లీకేజీలు, ఒత్తిడిలో పైపులు పగిలిపోవడం లాంటి అంతర్గత, సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

పరిశ్రమలకు నీరు.. మిషన్ భగీరథ ప్రాజెక్టుతో పరిశ్రమలకు శుద్ధిచేసిన మంచినీటిని అందిస్తారు. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన 80 టీఎంసీల నీటిలో 8 టీఎంసీలు పరిశ్రమలకు ఇవ్వొచ్చు. నీరు అవసరమైన పరిశ్రమల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వారికి ప్రత్యేక పైపులైన్లు వేసి నీటిని సరఫరాచేస్తారు. హైదరాబాద్ తాగునీటికోసం పది టీఎంసీల రిజర్వాయర్ నిర్మిస్తున్నందున అక్కడి నుంచి పరిశ్రమలకు నీరిచ్చేందుకు వీలవుతుంది. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ ప్రాజెక్టు ద్వారానే బల్క్ వాటర్ సరఫరా చేయాలి.

ప్రాజెక్టు ప్రగతి ప్రస్తుతం 4,229 గ్రామీణ ఆవాసాలు, 7 పట్టణ ప్రాంతాలకు బల్క్ వాటర్ అందిస్తున్నారు. గజ్వేల్ సబ్‌సెగ్మెంట్ పనులను ప్రధా ని నరేంద్ర మోదీ ఆగస్టు 7 2016న ప్రారంభించారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లందించిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ రికార్డు సృష్టించింది. సూర్యాపేట సబ్‌సెగ్మెంట్‌లో 1621 ఆవాసాలకు అ క్టోబర్ 12న తాగునీటి సరఫరా మొదలైంది. ఆరు మండలాల పరిధిలోని 243 హ్యాబిటేషన్లు, 5 ఎస్సీ ఆవాసాలు, 10 ఎస్టీ ఆవాసా లు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలోని సుమారు 78 వేల కుటుంబాలకు నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఈ పథకాన్ని ప్రధాని మోదీ సహా అనేక రాష్ర్టాల సీఎంలు ప్రశంసించారు.

సమాంతరంగా కేబుల్ డక్ట్ మిషన్ భగీరథలో భాగంగా అంతర్గత పైపులైన్లతో పాటు అంతర్జాలాన్ని అందించే కేబుల్‌నూ వేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో తెలంగాణలో అన్ని గ్రామాలు డిజిటల్ సొబగులను సంతరించుకోనున్నాయి. తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎండీగా ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. ప్రాజెక్టులో 98 శాతం నీటి సరఫరా గ్రావిటీ ద్వారా చేసేలా డిజైన్ రూపొందించారు. వ్యాప్కోస్ డీపీఆర్‌ను సిద్దం చేసింది. తెలంగాణ జెన్‌కో కన్సల్టెంట్‌గా ఎలక్ట్రో మెకానికల్ పనులు డిజైన్ చేశారు.

417 విద్యుత్ సబ్‌స్టేషన్లతో కరెంటు సరఫరా మిషన్ భగీరథ ప్రాజెక్టులో నీటిసరఫరా కోసం వినియోగించే మోటర్లు, పంపులకు విద్యుత్ సరఫరా కోసం రూ.325 కోట్ల అంచనా వ్యయంతో 417 విద్యుత్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 280 సబ్‌స్టేషన్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 137 సబ్‌స్టేషన్ల పనులు తుదిదశకు చేరాయి. రూ.279 కోట్లు విద్యుత్ సబ్‌స్టేషన్లకు బిల్లుల చెల్లింపులు జరిగాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు 220కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 33 కేవీ సబ్‌స్టేషన్లు 39, 11కేవీ సబ్‌స్టేషన్లు 97, ఎల్‌టీ సబ్‌స్టేషన్లు 142 నిర్మాణాలు పూర్తయ్యాయి.

భగీరథ ప్రాజెక్టు స్వరూపం మిషన్ భగీరథ ప్రాజెక్టు కింద 19 ఇన్‌టేక్ బావులు, 50 నీటిశుద్ధి కేంద్రాలు, 554 గ్రౌండ్‌లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 579 ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 48,995 ప్రధాన సరఫరా పైపులైన్లు నిర్మిస్తున్నారు. కాగా, 218 రైల్వే క్రాసింగ్‌లు, 416 జాతీయ రహదారి క్రాసింగ్‌లు, 4,326 ఆర్‌అండ్‌బీ క్రాసింగ్‌లు, 6239 పంచాయతీరాజ్ రోడ్డు క్రాసింగ్‌లు, 1558 కాల్వల క్రాసింగ్‌లు, 107 నదుల క్రాసింగ్‌లకు వివిధ శాఖల ద్వారా అనుమతులు లభించాయి. భగీరథ ప్రాజెక్టు కోసం 972 ఎకరాల మేర ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు భూములను సేకరించారు.

భగీరథకు నీటి కేటాయింపులు కృష్ణా బేసిన్‌లో 15, గోదావరి బేసిన్‌లో 21 రిజర్వాయర్ల నుంచి భగీరథ కోసం పలు ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులు చేశారు. ఇందుకు అనుగుణంగా నీటి నిల్వలను అందుబాటులో ఉంచేందుకు కనీస నీటి సేకరణ స్థాయిని కూడా ఖరారు చేశారు. 2018లో కృష్ణా బేసిన్‌లోని 15 రిజర్వాయర్ల నుంచి 23.44 టీఎంసీలు, గోదావరి బేసిన్‌లో 21 రిజర్వాయర్ల నుంచి 32.58 టీఎంసీలు కేటాయించారు. 2048 నాటికి రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్ నుంచి 86.11 టీఎంసీల నీటి కేటాయింపులు ఖరారు చేశారు.

డిసెంబర్ చివరి నాటికి నీళ్లిస్తాం డిసెంబర్ చివరినాటికి భగీరథ నీటిని ఇంటింటికీ ఇవ్వగలుగుతాం. ఎత్తయిన ప్రాంతాలను గుర్తించి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించడంతో గ్రావిటీ ద్వారానే నీళ్లు గ్రామంలోకి చేరుతాయి. ఇంటిపైన చిన్న ట్యాంకును ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ అవసరం లేకుండా రెండంతస్తుల వరకు గ్రావిటీతో నీళ్లు చేరుతాయి. నిమిషానికి 5 లీటర్ల చొప్పున నీళ్లందేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మోటర్లుపెట్టి ఎక్కువ వాడకుండా కుళాయిల వద్ద వాల్వ్‌లు పెడుతున్నాం. ఎక్కువ నీటిని వాడాలని ప్రయత్నిస్తే ఆ నల్లాకు నీటి సరఫరా నిలిచిపోతుంది. -బీ సురేందర్ రెడ్డి (ఇంజినీర్ ఇన్ చీఫ్ -గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ)

నీళ్ల కష్టాలు తీరాయి గతంలో నీళ్ల కోసం మస్తుగా ఇబ్బంది పడ్డం. దుబ్బాకకు యేడాది కిదంట సీఎం కేసీఆర్ సార్ వచ్చి ఇంటింటికి నీళ్లు ఇస్తామని సెప్పిండు. ఆయన చెప్పినట్లే.. నిజంగానే మా ఇంటికి నల్లా పైపులైన్ వేసిండ్రు. 8 నెలలనుంచి మా ఇంటికి నీళ్లు వస్తున్నయి. రోజుకు 30 బిందెల దాక నీళ్లు వస్తున్నయి. ఇంట్లో ఉన్న మా ఆరు మందికి నీళ్లు సరిపడుతున్నాయి. – జంగేటి యాదమ్మ (దుబ్బాక)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.