Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం: సీఎం కేసీఆర్

– 35వేల కోట్లతో సంక్షేమం అమలుచేస్తున్న ఘనత మాదే – ఏప్రిల్ నుంచి ఒంటరి మహిళలకు రూ.వెయ్యి పింఛన్ – త్వరలోనే ఇంటింటికీ ఇంటర్నెట్, నల్లా కనెక్షన్ – ఏడాదిన్నరలోనే సీతారామ ప్రాజెక్టును పూర్తిచేస్తం – తిరుమలాయపాలెం బహిరంగసభలో సీఎం కేసీఆర్

తన ప్రతి రక్తపు బొట్టును రంగరించైనా సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు పిచ్చి, వెకిలి వేషాలు వేయొద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించిన సీఎం.. ఈ అభివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనపడుతలేదా? కండ్లు లేవా? అని మండిపడ్డారు. ప్రాజెక్టులు అడ్డుకునే దుర్మార్గాన్ని కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. మీరు ఎన్ని పిచ్చి, వెకిలి వేషాలు వేసినా.. నా రక్తం బొట్టు బొట్టు రంగరించైనా కచ్చితంగా ప్రాజెక్టులు కట్టి తీరుతం.. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం అని స్పష్టంచేశారు. పాలేరుకు ఆగమేఘాల మీద కృష్ణ నీళ్లు తెప్పిస్తమని అనాడే చెప్పామన్న సీఎం.. మంత్రి తుమ్మల సారథ్యంలో 10 నెలల్లోనే నీటిని తీసుకొచ్చి మీ పాదాలు కడిగామని అన్నారు. రాబోయే ఒకటిన్నర సంవత్సరాల్లో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.

మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో 60 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా వద్ద ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం తిరుమలా యపాలెం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏమొస్తదన్న వాళ్లు తెలంగాణ హోంగార్డులకు శుభవార్త కాంగ్రెస్ హయాంలో హోంగార్డులతో చాలా దుర్మార్గంగా వెట్టిచాకిరి చేయించుకున్నారు. అర్హులైన హోంగార్డులందరినీ పోలీసు డిపార్టుమెంట్ ఉద్యోగాల్లోకి తీసుకుంటాం. మిగతావారికి వేతనాలు పెంచబోతున్నాం. వచ్చాక ఏమొచ్చిందో పాలేరు ప్రజలడిగితే చెప్తారని అన్నారు. భక్తరామదాసు జయంతి రోజునే ఆయన పేరిట ప్రాజెక్టు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్మాణం పూర్తయిన తొలి ప్రాజెక్టుగా భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నిలిచిందని చెప్పారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నం కష్టపడి రాష్ర్టాన్ని సాధించుకున్నం. తెలంగాణకు సంబంధించి మాట్లాడితే హేళన చేసేవాళ్లు. ఎక్కడ సాధ్యమైతదని మాట్లాడేవాళ్లు. ఎన్నో అవమానాలు, విమర్శలు, వ్యక్తిగత నిందలు భరించి.. ఒక సమయంలో నా ప్రాణాలు కూడా ఫణంగా పెట్టి తెలంగాణ సాధించుకున్నాం అని కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు ఎన్ని ఆటంకాలు, ఎన్ని రకాల నాటకాలు జరుగుతా ఉన్నయో చూస్తున్నరు. ఎక్కడ ప్రాజెక్టులు కడితే అక్కడ కోర్టు స్టేలు తేవడం. ఇందుకోసం కాంగ్రెస్ వాళ్లు ఒక ముఠాను తయారు చేసినారు. వారికి నీళ్లు రావద్దు.. మేం చేయలేదు. మీరు చేస్తే మా బతుకేం కావాలి అంటూ అడుగడుగునా ఆటంకం సృష్టిస్తున్నరు. నిర్వాసితులను ముందుపెట్టి విచిత్రమైన పరిస్థితులు సృష్టిస్తున్నరు. సిగ్గు, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నరు. నిన్న కాంగ్రెస్ నాయకుడు చిదంబరం వచ్చినాడు. ఆయన పార్టీవాళ్లు రాసిచ్చిన స్క్రిప్టు చదివి పోతడు. తెలంగాణ వచ్చింది కానీ ప్రజలకేం రాలేదు అని అంటడు. నేనొక్క మాట సూటిగా అడుగుతా ఉన్న. ఈ రోజు రూ.35వేల కోట్ల ఖర్చుతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సంక్షేమ పథకాలు చేపడుతున్నది తెలంగాణ అనేది వాస్తవం కాదా? రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు.. వేల మందికి పింఛన్ ఇవ్వటం లేదా? మీ పరిపాలన ఉన్న రాష్ట్రంలో ఎక్కడన్నా ఇది అమలు చేస్తున్నరా? స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెట్టాలని జీవితంలో మీరు ఆలోచించిండ్రా? ఇది ఇవాళ అమలవుతున్నది.

గత పాలనలో నాలుగు కిలోల బియ్యమే ఇచ్చినారు. ఈరోజు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కడుపు నింపాలని సభ్యులెందరుంటే, అన్ని ఆరు కిలోలు ఇస్తున్నం. రాష్ట్రంలో సుమారు 5.5లక్షల బీడీ కార్మికులున్నారు. వారిలో పీఎఫ్ కార్డులున్న వారందరికీ పింఛన్ ఇవ్వాలని ఈ మధ్యనే నిర్ణయించినం. మీ డ్బ్భైఏండ్ల కాలంలో.. బీడీ కార్మికులను ఆదుకోవాలని ఆలోచన చేసిండ్రా? పేద ఒంటరి మహిళల గురించి ఈ మధ్యనే నేను అసెంబ్లీలో ప్రకటించిన. వారికి ఇబ్బందులున్నాయని, సుమారు 3లక్షల మంది ఉన్నారని చెప్తే.. రాబోయే ఏప్రిల్ నుంచి వారికి కూడా వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తామన్నాం.

దేశంలోనే ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఆడపిల్ల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ.51వేలు చొప్పున ఇస్తున్న మాట వాస్తవం కాదా? మీరు ఎక్కడైనా అమలు చేసిండ్రా చిదంబరం గారు? రూ.17,500 కోట్ల రైతుల రుణాలు మాఫీ చేసింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా? ఇటీవల 4వేల కోట్ల రూపాయల పేదల ఇంటి రుణాలు మాఫీ చేసిన మాట వాస్తవం కాదా? రాబోయే సంవత్సర కాలంలో తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయంతోపాటు ప్రభుత్వ ఖర్చుతో నల్లా బిగించి పరిశుభ్రమైన మంచినీటిని అందివ్వబోతున్నాం. మిషన్ కాకతీయ కింద ఆరువేల చెరువులు బాగుచేసి, మిగిలిన 30వేల చెరువులను కూడా బాగుచేయాలని జరుగుతున్న కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి కనపడుతలేదా? పేదలకు డబ్బాలాంటి ఇండ్లు కట్టించి, ఇదే వైకుంఠమనుకో, ఇదే కైలాసమనుకో అనిచెప్పి ఒక రూం కట్టించారు. ఈ రోజు రూ.5.4లక్షల వ్యయంతో డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కడుతున్నం. ఈ ఖమ్మం జిల్లాలోనే సుమారు ఆరువేల ఇండ్లు నిర్మాణంలో ఉన్నమాట వాస్తవం కాదా? తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో చెట్లు నాటినం. ప్రపంచం మొత్తంలోనే మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నం 230 కోట్ల మొక్కలను నాటే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాఉన్నది. ఇది వాస్తవమా కాదా? మీ జన్మలో ఇలాంటి ఆలోచన చేయలేరు. అనేక ప్రాంతాలు మాకు జిల్లాలు చేయండి మహాప్రభో, బాధలు భరించలేక పోతున్నాం అంటే మీరెన్నడూ పట్టించుకోలె. ఇవాళ రాష్ట్రంలో 21 కొత్త జిల్లాలను ఏర్పాటుచేసి, 31 జిల్లాలతో.. 125 కొత్త మండలాలను ఏర్పాటుచేసి, 68 రెవిన్యూ డివిజన్లను ఏర్పాటుచేసి పరిపాలన సంస్కరణలు తిస్కోచము.

విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఇస్తున్నం ఇవ్వాళ కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పినం. గత చరిత్రలో ఎన్నడూ ముస్లింల గురించి కానీ, ఇతర మైనారిటీల గురించి కానీ మీరు ఏనాడూ పట్టించుకోలేదు. ముస్లిం, మైనారిటీ విద్యార్థుల కోసం 200 రెసిడెన్షియల్ స్కూళ్లు, 31 పాఠశాలలు ఇప్పటికే ప్రారంభించాం. ఈ ఏడాది మరో 200 స్కూళ్లు పెట్టబోతా ఉన్నం. ఇవన్నీ కనపడుత లేవా? దేశంలో ముస్లింల కోసం ఎక్కడన్నా రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నయా? ఒక్క తెలంగాణలోనే ఉన్నయి. దానిని గౌరవించటం, మెచ్చుకునే సంస్కారం మీకు లేదు. ఏం జరుగుతలేదని మాట్లడతవు. ఏ నోటితో మాట్లాడతవు చిదంబరం? విద్యార్థులు విదేశాలకు పోయి చదువుకోవాలె. ఎప్పుడన్నా కాంగ్రెస్ రాజ్యంలో మీరు ఆలోచన చేసిండ్రా? ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లోని పేద విద్యార్థులుంటే, వారు విదేశాలకు పోతామంటే రూ.20 లక్షలు స్కాలర్‌షిప్‌లు ఇచ్చే ఒకేఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ కాదా? బీసీ విద్యార్థుల కోసం 501 రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తా ఉన్నాం. ఇది మీకు కనపడుటలేదా? దళిత ఆడపిల్లలు చదువుకోవాలి. దళిత బిడ్డలు వచ్చి మాకు రూం కిరాయికి కావాలంటే పట్టణాల్లో కొద్దిమంది దుర్మార్గులు ఇవ్వటం లేదు. ఆ బాధలు గమనించి గతేడాది 25 రెసిడెన్షియల్ కాలేజీలు మంజూరు చేసినం. ఈ ఏడాది ప్రతి రెవిన్యూ డివిజన్‌కు ఒకటి ఉండేలా 60 కాలేజీలు మంజూరు చేయబోతున్నం.

దళిత ఆడపిల్లలు చదువుకోవాలని ఏనాడైనా మీరు ఆలోచన చేసిన్రా? మీకు ఆ సంస్కారం ఉందా? మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు తెచ్చి అందరికీ అవకాశాలు కలిగించిన మాట వాస్తవంకాదా? న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్ల నిధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా? మీ జమానాలో కనీస ఆలోచన చేసినారా? బ్రాహ్మణుల్లో పేదవాళ్లు ఉన్నరు. వారి సంక్షేమానికి రూ.100 కోట్లు మంజూరు చేసిన మాట మీకు వినిపిస్త లేదా? మీ పాలనలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏనాడైనా ఆలోచన జరిగిందా? మొట్టమొదటిసారిగా దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా జర్నలిస్టు సంక్షేమానికి రూ.10 కోట్ల నిధులు మేం విడుదల చేసిన మాట నిజమా కాదా? ఇవన్నీ జరుగుతయని అనుకున్నమా? కలగన్నమా? జరిగిన మాట వాస్తవం కాదా? మీరు కండ్లులేని కబోదులా? అనేకమంది గోస మీరు పోసుకున్నరు. అర్ధాకలితో, నకనకలాడే వారితో మీరు పనిచేయించినారు. ఈరోజు మీరు పెట్టినటువంటి కాంట్రాక్టు ఎంప్లాయీస్ సుమారు 20వేల మందిని మేము రెగ్యులరైజ్ చేసింది మీకు కనపడుటలేదా? సుమారు 24వేల మంది అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తా ఉన్నరు. ఏ సీఎం చేయని సాహసం చేసి వారిని రెగ్యులరైజ్ చేస్తున్నది మీ కండ్లకు కనపడతలేదా చిదంబరంగారు? ఎన్నో సందర్భాలలో వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను మినహాయించండని రైతులు అడిగినారు. మీరు చేసినారా? ఇవ్వాళ వ్యవసాయ ట్రాక్టర్లకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ట్యాక్స్ మినహాయించింది. లక్ష పైచిలుకు ఆటో కార్మికులకు దేశంలో ఎక్కడాలేని విధంగా ఆటో కార్మికుల ట్యాక్స్ మాఫీ చేసింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం.

హోంగార్డులకు కానిస్టేబుల్ ఉద్యోగాలు కాంగ్రెస్ హయాంలో చాలా దుర్మార్గంగా వెట్టి చాకిరి చేయించుకున్న వారిలో హోంగార్డులు కూడ ఉన్నారు. వారిలో అర్హులైన వారందరినీ పోలీసు డిపార్టుమెంట్ ఉద్యోగాల్లోకి తీసుకుంటాం. మిగతా వారికి వేతనాలు పెంచబోతున్నాం. అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని పాలిస్తుంటే మీ భవిష్యత్ పోతదనే భయంతోటి అవాకులు, చవాకులు పేలుతున్నారు. ఇప్పటికైనా మానుకోండి. మంచి కోసం సహకరించండి. ప్రాజెక్టులు కట్టమని అడగండి. తెలంగాణ పచ్చబడితే మీ పొలాలు కూడ బాగుపడుతాయి. ప్రాజెక్టులు అడ్డుకునే దుర్మార్గాన్ని మానుకోండి. మీరు ఎన్ని పిచ్చి, వెకిలి వేషాలు వేసినా.. నా రక్తం బొట్టు బొట్టు రంగరించైనా కచ్చితంగా ప్రాజెక్టులు కట్టి తీరుతం.. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం.

ఖరీఫ్ నాటికి కిన్నెరసాని, పాలెం వాగు పూర్తి :హరీశ్ సీఎం కేసీఆర్ భక్తరామదాసు ప్రాజెక్టుద్వారా ఇచ్చిన స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ ఖరీఫ్‌నాటికి కిన్నెరసాని, పాళెం వాగు ప్రాజెక్టులను పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని స్పష్టంచేశారు. కాలువల్లో పరవళ్లు తొక్కుతున్న కృష్ణాజలాలను చూసి రైతులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు.

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన రామయ్యకు సీఎం సత్కారం కోటి మొక్కలను నాటి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వనజీవి రామయ్య దంపతులను సీఎం కేసీఆర్ బహిరంగ సభ వేదికపై ఘనంగా సత్కరించారు. నిర్దేశిత గడువుకంటే ముందే భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిన మెగా ఇంజినీరింగ్ ఏజెన్సీ అధినేత కృష్ణారెడ్డిని కూడా ముఖ్యమంత్రి సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు టీ హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జీ జగదీశ్‌రెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బూర నర్సయ్యగౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, జలగం వెంకటరావు, బాణోత్ మదన్‌లాల్, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, రాజయ్య, రసమయి బాలకిషన్, రెడ్యానాయక్, కొండా సురేఖ, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి, పూల రవీందర్, కొండా మురళి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, కార్పొరేషన్ చైర్మన్లు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఈదా శంకర్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేల సంఖ్యలో రైతులు, మహిళలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.

సీఎంకు ఘన స్వాగతం ముఖ్యమంత్రి సూర్యాపేట నుంచి రోడ్డు మార్గంలో జిల్లాలోకి ప్రవేశించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం బహిరంగ సభా స్థలివద్దకు సాయంత్రం 4 గంటలకు చేరుకున్నారు. సీఎం రాకకోసం అప్పటివరకు ఎదురుచూస్తున్న ప్రజలు ఆయన రాగానే నిలబడి చప్పట్లతో, జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ సభావేదికపైకి చేరుకుని తనదైన శైలిలో ప్రజలకు అభివాదం చేశారు. ముందుగా భక్తరామదాసు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. సీఎం ప్రసంగం ప్రారంభం కాగానే సభా ప్రాంగణం నినాదాలతో మారుమ్రోగింది.

సింగరేణికి జవసత్వాలు కల్పిస్తున్నం సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలను మీరే హరించి వేశారు. ఇప్పుడు 25వేల నుంచి 30వేల మందికి సింగరేణి కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు దొరుకుతున్న మాట వాస్తవమా కాదా! కాంగ్రెస్, టీడీపీ హయాంలో 2,686 కిలోమీటర్ల జాతీయ రహదార్లుంటే.. తుమ్మల ఆర్‌అండ్‌బీ మంత్రిగా పట్టుదలతో తక్కువ సమయంలోనే కొత్తగా సాధించుకొచ్చింది 2776 కిలోమీటర్లు. ఇది అభివృద్ధి కాదా! మీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. దీంతోనే మీరు అవాకులు, చవాకులు పేలుతున్నారు. ప్రపంచం మొత్తం మెచ్చుకుంటున్న పారిశ్రామిక విధానం టీఎస్-ఐపాస్. రూపాయి లంచం లేకుండా, ఒక్క ఆఫీసు చుట్టూ తిరుగకుండా రాష్ట్రంలో 3వేల పరిశ్రమలకు 15 రోజుల లోపు అనుమతులు ఇచ్చింది మీకు కనిపించడం లేదా? ఇందులో 16వందల పైచిలుకు పరిశ్రమలు ఉత్పత్తిలోకి వచ్చిన మాట వాస్తవం కాదా? తెలంగాణ ఏర్పడ్డ నాటికి 4లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటి గోదాములున్నాయి. ఈ రోజు స్వల్ప కాలంలో 21 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మించినం. ప్రతి మండల కేంద్రంలో రైతుల అవసరం దృష్ట్యా గోదాములు నిర్మించినం. ఇవి కనపడడం లేదా ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డికి?

24 గంటలూ కరెంటు వస్తున్నదనేవారు చేతులెత్తండి.. 24 గంటలు విద్యుత్ వస్తుందా? అని ప్రజలను అడిగిన సీఎం.. వస్తుందని చెప్పేవారంతా చేతులెత్తాలని కోరారు. దీంతో సభా ప్రాంగణంలో ఉన్న అందరూ చేతులెత్తారు. వేదికపై ఉన్న వారు చేతులు ఎత్తకపోవడంతో మీకు కరెంట్ రావడం లేదా? అని సీఎం అనడంతో వేదికపై ఉన్న నేతలందరూ చేతులెత్తగానే సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ప్రతి నెల రూ.1000 పింఛన్ వస్తున్నదా? అని అడగ్గానే.. వస్తున్నదంటూ సభకు హాజరైన ప్రతి ఒక్కరు చేతులెత్తి ముఖ్యమంత్రికి స్ఫూర్తిని కలిగించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలె తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి. అన్ని వృత్తుల వారు, కులాల వారిని ఆదుకోవాలి. వారికోసం రాబోయే బడ్జెట్‌లో అద్భుతమైన కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం. 25 లక్షల పైచిలుకు యాదవులు, గొల్ల, కురుమలు మన తెలంగాణలో ఉన్నారు. గత చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ప్రతి యాదవ కుటుంబానికి ఒక గొర్రెల యూనిట్ ఇస్తాం. గతంలో 20, 30% సబ్సిడీ ఇచ్చేవారు. తెలంగాణలోని యాదవ సోదరులందరికీ శుభవార్త చెప్తున్నా.. కచ్చితంగా 75% సబ్సిడీ ఇచ్చి నాలుగు లక్షల గొర్రెల యూనిట్లను రాబోయే రెండేండ్లలో అందిస్తాం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి దోహదం చేస్తుంది. మత్స్య కార్మికులు, చేనేత కార్మికులు, గంగపుత్ర, బెస్త కులం అందరికీ ఎంత డబ్బైనా ఖర్చు పెడుతాం. మత్స్య ఉత్పత్తిని పరిశ్రమగా మలచబోతున్నాం. త్వరలోనే చేనేత కార్మికుల బాధలు కూడ తొలిగిపోతాయి.

విద్యుత్ రంగంలో మెరుగుదలకు ప్రజలే సాక్షి గతంలో కరెంటు ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెలియదు. ఆ మహానుభావులు పట్టించుకోలేదు. మేము ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే బాగు చేస్తామని అసెంబ్లీలో చెప్పిన. 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టినం అని నేను చెప్పితే.. అట్ల జరిగితే చాలా అద్భుతమే అని.. జానారెడ్డి అన్నారు. కేవలం ఐదున్నర నెలల్లో తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఏ రకమైన విద్యుత్ సరఫరాకు మెరుగులు దిద్దామో ప్రజలే సాక్ష్యం. టీఆర్‌ఎస్ హయాంలో కరెంటు సరఫరా మీకు కనిపించడం లేదా చిదంబరంగారు? ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు, జనరేటర్లు ఇది మీ కాంగ్రెస్ జమానా. ఇవాళ హైదరాబాద్‌లో ఇన్వర్టర్లు, కన్వర్టర్ల దుకాణాలు దివాళా తీసినయి. ప్రజలారా.. మీ ఆశీస్సులతో కరెంటును బాగ చేసుకున్నాము. ఆద్భుతంగా చేపట్టిన పారిశ్రామిక విధానాన్ని ప్రపంచం అంతా మెచ్చుకుంటున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.