Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

భారీ మెజార్టీలే లక్ష్యం

-16 స్థానాల్లో గెలుపు మనదే.. సర్వేలన్నీ టీఆర్‌ఎస్ విజయాన్ని సూచిస్తున్నాయి: సీఎం కేసీఆర్
-ప్రతి ఎంపీ రెండుమూడు లక్షల మెజార్టీ సాధించాలి
-అందుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి
-రెండుమూడ్రోజుల్లో ఎంపీ అభ్యర్థుల ప్రకటన
-టీఆర్‌ఎస్‌లోకి వస్తామంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలుv -ఒకరిద్దరిని పార్టీలో చేర్చుకోక తప్పేటట్టు లేదు
-టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్
-ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్
–17న టీఆర్‌ఎస్ ఎన్నికల శంఖారావం
-రెండున్నర లక్షలమందితో కరీంనగర్‌లో భారీ సభ
-అదే స్థాయిలో 19 న నిజామాబాద్ పట్టణంలో

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పదహారు స్థానాల్లో విజయం సాధించడం ఖాయమైపోయిందని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్ గెలుపును స్పష్టంగా చెప్తున్నాయన్న సీఎం.. ప్రతి నియోజకవర్గంలో రెండుమూడు లక్షల మెజార్టీ సాధనే లక్ష్యంగా కృషిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనికి ప్రధాన బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలే తీసుకోవాలని చెప్పారు. ఈ నెల 17న కరీంనగర్ సభలో ముఖ్యమంత్రి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. కనీసం రెండున్నర లక్షల మందితో కరీంనగర్ సభ జరిగేలా చూడాలని కేసీఆర్ చెప్పారు. అదేస్థాయిలో నిజామాబాద్ పట్టణంలో ఈ నెల 19న భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం తెలంగాణభవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికతోపాటు పార్లమెంటు ఎన్నికలపై పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు ఎవరనేది చూడకుండా ప్రతి ఒక్క అభ్యర్థి గెలిచేవిధంగా చూడాలని చెప్పారు. బాల్క సుమన్, సీహెచ్ మల్లారెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనందున వారి స్థానాల్లో కొత్తవారికి టికెట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. రెండుమూడ్రోజుల్లో పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించుకుందామని కేసీఆర్ చెప్పారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేతోపాటు మరొకరిని ఇంచార్జిగా నియమిస్తామని, వీరు ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 స్థానాలు టీఆర్‌ఎస్సే గెలుస్తుందని సర్వేలన్నీ చెప్తున్నాయని, పార్టీపరంగా చేయించిన సర్వేల్లోనూ ఇదే తేలిందని సీఎం చెప్పారు. అయితే అన్ని సీట్లలో మనమే గెలుస్తున్నామనే ధీమాలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. భారీ మెజార్టీలు సాధించేదిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు. మరో స్థానంలో మిత్రపక్షం ఎంఐఎం గెలుస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు
టీఆర్‌ఎస్‌లోకి వస్తామంటూ పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొన్నిరోజులుగా ఆసక్తి చూపుతున్నారని సీఎం కేసీఆర్ సమావేశంలో వెల్లడించారు. టీఆర్‌ఎస్‌కు ఇప్పటికే సరిపోయేంత ఎమ్మెల్యేలు ఉన్నందున కొత్తగా ఎమ్మెల్యేలు అవసరంలేదనే ఉద్దేశంతో ఇప్పటివరకు వారిని చేర్చుకోలేదన్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై వారి పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం పోయిందని, ఆ పార్టీ ఆ విధంగా తయారైందని చెప్పారు. టీఆర్‌ఎస్‌లోకి వస్తామంటూ అనేకమార్లు వారు వర్తమానం పంపించినా ఇప్పటివరకు నిర్ణయం చెప్పలేదన్నారు. అయితే ఒకరిద్దరిని చేర్చుకోక తప్పేటట్టులేదని సీఎం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. వారికి మెజార్టీ లేదని మొదటినుంచి చెప్తున్నా.. పోటీలో పెట్టారని అన్నారు. చివరికి ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించారని, పోటీ పెట్టకుండా ఉండి ఉంటే ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేవని వ్యాఖ్యానించారు.

ఒక్కో ఎమ్మెల్సీకి ఇద్దరు మంత్రులు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలనుంచి టీఆర్‌ఎస్, మిత్రపక్షం ఎంఐఎం అభ్యర్థులే సులువుగా విజయం సాధిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఓటు వేయడంలో ఎలాంటి పొరపాటు దొర్లకుండా వారికి కేటాయించిన అభ్యర్థులకు ఓటు వేయాలని సూచించారు. ఎమ్మెల్యే తప్పు ఓటు వేస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందని, అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. మంగళవారం ఉదయం మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించి అసెంబ్లీకి వెళ్లి ఓటింగ్‌లో పాల్గొనాలని చెప్పారు. టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశానికి ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజుల్ హసన్ ఇఫెండి హాజరయ్యారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇఫెండికి ఓటు వేయాల్సి ఉన్నందున వారితో సమన్వయానికిగాను ఆయనను ఈ సమావేశానికి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులతోపాటు ఇఫెండిని సీఎం సమావేశానికి పరిచయంచేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికిగాను జిల్లాలవారీగా ఎమ్మెల్యేలను కేటాయించారు. ఒక్కొక్కరికి 20 ఓట్లు వచ్చేలా అభ్యర్థుల సొంత జిల్లాతోపాటుగా సమీప జిల్లా ఎమ్మెల్యేలను కేటాయించారు. రెండు జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఒక ఎమ్మెల్సీకి ఇంచార్జిగా ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలను సమన్వయం చేస్తారు. ఈ సందర్భంగా మాక్ ఓటింగ్ నిర్వహించారు. ఆనారోగ్య కారణాలతో పద్మారావు, సాయన్న రాలేదు. రెడ్యానాయక్ తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని రావడంతో ఆలస్యమైంది. అప్పటికే సమావేశం పూర్తయినా ఆయనతోనూ మాక్ పోలింగ్ నిర్వహించారు. మహమూద్ అలీకి హైదరాబాద్, మహబూబ్‌నగర్, శేరి సుభాష్‌రెడ్డికి మెదక్, నిజామాబాద్, సత్యవతిరాథోడ్‌కు వరంగల్, నల్లగొండ, ఎగ్గె మల్లేశంకు రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేలను కేటాయించారు.

క్యాంటీన్ పనుల పరిశీలనv తెలంగాణభవన్ ముందు నిర్మిస్తున్న క్యాంటీన్ నిర్మాణ పనులను సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ పరిశీలించారు. పనులు వెంటనే పూర్తిచేసి, పార్టీ కార్యకర్తలు, నాయకులకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. సీఎం వెంట రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్, కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

కరీంనగర్ నుంచి ఎన్నికల శంఖారావం
కరీంనగర్ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 17న మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ పరిధిలో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధి సభను భారీఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. రెండున్నర లక్షలకు పైగా ప్రజలను ఈ సభకు సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో వస్తుందని సర్వేల్లో తేలినందునే అక్కడ మొదటి సభ నిర్వహిస్తున్నామని వివరించారు. ఆ తరువాత 19న నిజామాబాద్ లోక్‌సభ పరిధి సభను నిజామాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సభకు కూడా రెండు లక్షల మందికిపైగా హాజరయ్యేలా లక్ష్యం విధించారు. ఉమ్మడి జిల్లాల ప్రకారం ఒకే నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉన్న జిల్లాల్లో రెండు సభలు, భౌగోళికంగా పెద్దగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా రెండుమూడు సభలను పెట్టుకుందామని కేసీఆర్ అన్నారు. జహీరాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్, ఖమ్మంలాంటి నియోజకవర్గాల్లో రెండుమూడు సభలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.