Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

భస్మాసుర కూటమి

-వారికి అధికారమిస్తే రాష్ట్రం అంధకారమే
-తెలంగాణకు అడ్డుపడ్డ పార్టీలన్నీ ఒక్కటయ్యాయి.. జర జాగ్రత్త
-కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాల్లో పింఛన్లు ఎందుకిస్తలేరని నిలదీయండి
-మంచిపనిచేసేవారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే
-రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రచారంలో మంత్రి కేటీఆర్
-ఎవరు ఎంత అభివృద్ధి చేశారో ప్రజాకోర్టులో తేల్చుకుందామని కాంగ్రెస్, టీడీపీకి సవాలు
-మోసగాళ్లను తిప్పికొట్టండి
-మాదిగల ఆశీర్వాదసభలో డిప్యూటీ సీఎం కడియం
-టీఆర్‌ఎస్‌ను ఎవరూ ఆపలేరు.. ఉత్తమ్‌కు గడ్డం శాశ్వతం
-రంగారెడ్డి జిల్లాలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
-రైతును రాజు చేసే కాళేశ్వరంపై చంద్రబాబు కుయుక్తులు
-మహాకూటమి నేతలను గ్రామాల్లోకి రానీయొద్దు
-ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి హరీశ్ పిలుపు
-ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యం: మంత్రి ఈటల రాజేందర్
-కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు: మంత్రి తలసాని ఆగ్రహం

టీఆర్‌ఎస్ స్టార్‌క్యాంపెయినర్లు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మహాకూటమిపై నిప్పులు చెరిగారు. అదొక భస్మాసుర కూటమి అని దానిని నమ్మొద్దని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కే తారకరామారావు, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ గురువారం వివిధ కుల, వృత్తి సంఘాలు నిర్వహించిన ఆశీర్వాద సభలు, ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. నాలుగున్నరేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన మాదిగల ఆశీర్వాదసభలో పాల్గొన్న కడియం శ్రీహరి కాంగ్రెస్, టీడీపీలు అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నాయని, ఆ పార్టీల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పలుగ్రామాల్లో ప్రచారం నిర్వహించిన కేటీఆర్ మరోసారి సీఎం కేసీఆర్‌కు పట్టం కడితే పేదల బతుకులు బాగుపడుతాయన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన విశ్వబ్రాహ్మణ, మహిళల ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న హరీశ్‌రావు.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పలు సభల్లో పాల్గొన్న ఈటల రాజేందర్ మహాకూటమి పేరుతో వస్తున్నవారి మాటలు నమ్మొద్దని సూచించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నాయిని నర్సింహారెడ్డి కాంగ్రెస్‌కు దమ్ముంటే టీఆర్‌ఎస్‌తో నేరుగా బరిలోకి దిగాలని సవాలు విసిరారు. తెలంగాణ నుంచి వెళ్లిపోయిన పార్టీతో పొత్తుపెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం కొత్తబిచ్చగాళ్లలా గ్రామాలకు వస్తున్నారని తలసాని ఎద్దేవా చేశారు.

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణను అడ్డుకున్న పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. ఒకప్పుడు చంద్రబాబునాయుడినే భస్మంచేసిన హస్తంతో కలిసి వస్తున్న మహాకూటమితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కూటమికి అధికారం ఇస్తే తెలంగాణ అంధకారమైపోతుంది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు వ్యాఖ్యానించారు. రెట్టింపు పింఛన్లు ఇస్తామంటున్న కాంగ్రెస్ నాయకులను తాము పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎందుకు ఇవ్వడంలేదో నిలదీయాలని పిలుపునిచ్చారు. గురువారం మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి, అంకిరెడ్డిపల్లె, వేణుగోపాల్‌పూర్, గండిలచ్చపేట, కట్కూరు, మండెపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోకి వచ్చిన కేటీఆర్‌కు మహిళలు బతుకమ్మలతో, ఒగ్గుడోలు కళాకారులు డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు. ప్రచారరథంపై నుంచి మంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రతిగ్రామంలో రూ.కోట్లతో చేపట్టిన అభివృద్ధిపనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు.

ప్రజాకోర్టులో తేల్చుకుందాం
అరవై ఏండ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ఏమిచేశాయో.. నాలుగేండ్లలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏంచేసిందో కండ్లముందే కనిపిస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మీరుచేసిన, మేముచేసిన అభివృద్ధి ఏమిటో ప్రజాకోర్టులో తేల్చుకుందాం అని కాంగ్రెస్, టీడీపీలకు సవాల్‌విసిరారు. ముసలినక్క కాంగ్రెస్, గుంటనక్క చంద్రబాబులకు ప్రజలే బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. పేదల కన్నీళ్లు తుడవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరిమహిళలు, బీడీకార్మికులు, బోదకాలు బాధితులకు పింఛన్లు ఇవ్వడంతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి సంక్షేమ పథకాలు అమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు.

అరవై ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరంటు కోతలతో రైతులు వ్యవసాయమంటేనే భయపడ్డారని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు దొరకక విసిగిపోయిన రైతులు.. కరంటు అడిగితే కాల్చి చంపిన గత ప్రభుత్వాల దుశ్చర్యలను ఆయన గుర్తుచేశారు. దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. బీళ్లుగా మారిన భూములకు కృష్ణా, గోదావరి జలాలు అందించి రైతురాజ్యం తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంటే.. కోర్టుల్లో కేసులుపెట్టి అడ్డుకుంటున్నారని కాంగ్రెస్, టీడీపీలపై మంత్రి మండిపడ్డారు.

మహాకూటమికి అధికారమిస్తే నెలకో సీఎం!
నలభైమంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్న మహాకూటమికి అధికారం కట్టబెడితే నెలకో సీఎం మారుతాడని మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు. కూటమిలో చంద్రబాబునాయుడు, ఢిల్లీ పెద్దలే పెత్తనం చెలాయిస్తారని చెప్పారు. గ్రామాలకు, పట్టణాలకు ఏం కావాలో అది చేశామని, ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంచిపనిచేసేవాళ్లను కాపాడుకుంటే మంచి జరుగుతుందని, డిసెంబర్ ఏడో తేదీన సీఎం కేసీఆర్‌కు పట్టం కట్టాలని విజ్ఞప్తిచేశారు. కేసీఆర్ వస్తేనే పేదోళ్ల బతుకులు బాగుపడుతాయన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, చీటి నర్సింగరావు, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, వైస్‌చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ చైర్మన్ శంకరయ్య, మహిళా కో ఆర్డినేటర్ రేణు, ఎంపీపీ జూపల్లి శ్రీలత, పూసపల్లి సరస్వతి, మండల, గ్రామ శాఖల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.