Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

భవిష్యత్ మనదే

తెలంగాణ గడ్డమీద టీఆర్‌ఎస్ తప్ప మరో రాజకీయ పార్టీకి భవిష్యత్తు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తేల్చి చెప్పారు. నేడు, రేపే కాదు.. భవిష్యత్తు కూడా మనదేనని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏదో ఊసుపోక మాట్లాడుతున్నారే తప్ప. రాష్ట్ర ప్రజలు అసలు వారిని నమ్మే పరిస్థితే లేదని కేసీఆర్ అన్నారు. 2019 ఎన్నికల్లో 154 అసెంబ్లీ స్థానాలకు 135నుంచి140 స్థానాలు గెలుస్తామని ప్రకటించారు.

KCR-addressing-in-party-Pleenary-Meeting -మెదక్, కంటోన్మెంటే గీటురాళ్లు.. ఈ గడ్డ మీద వేరే పార్టీకి మనుగడ లేదు -వచ్చే ఎన్నికల్లో 154 సీట్లకు 135-140 మనవే -సంక్షేమం.. వ్యవసాయం.. పారిశ్రామికం.. ఈ మూడు ప్రభుత్వ ప్రాథమ్యాలు -బడ్జెట్ తర్వాత ఉధృతంగా దళితులకు భూ పంపిణీ -అమర వీరుల ఎంపిక రెండో ఫేజ్ త్వరలో.. జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్తూపాలు -మూడేండ్లలో రైతులకు 24 గంటల కరెంటు .. సాంస్కృతిక సారథితో విస్తృత ప్రచారం -పార్టీ నేతలు, కార్యకర్తల కోసం పదవులు సిద్ధం.. 20 నుంచి నిరుపేదలకు పట్టాలు పంపిణీ -తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి అనే మూడు ప్రాథమ్యాలను పెట్టుకుందని ఆయన చెప్పారు. వచ్చే బడ్జెట్ అనంతరం దళితులకు భూపంపిణీ ఉధృతం చేస్తామని చెప్పారు. అమర వీరుల కుటుంబాలకు సహాయానికి సంబంధించి సెకండ్ ఫేజ్ ఎంపిక ప్రారంభించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని కేసీఆర్ వెల్లడించారు.

పార్టీలోని ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీలో రాష్ట్ర మంత్రులు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, జిల్లా, మండలపార్టీ అధ్యక్షులు సహా భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహించిన ఈ సమావేశంలో కేసీఆర్ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. సుమారు గంటకు పైగా సాగిన ఆయన ప్రసంగంలోని ప్రధానాంశాలివి.. రాష్ట్రంలో మరో పార్టీకి భవిష్యత్తు లేదు.

ప్రతిపక్ష పార్టీలో ఏదో తమాషా కోసం బై డిఫాల్ట్ గెలుస్తమని మాట్లాడుతున్నరుగానీ, ఇక్కడ విశ్లేషణ చేస్తే మనకు తప్ప వేరే పార్టీకి భవిష్యత్తు లేదు. ఎందుకంటే మన గుండెల్లో అంకితభావం ఉన్నది. కచ్చితంగా బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకు సాగుతున్నం. బూజుపట్టిన విధానాలతో ఇంకా రొటీన్‌గా ఆలోచించే కొన్ని పార్టీలు, కొత్తగా ఆలోచించలేని పార్టీలు గత్తర బిత్తరై పిచ్చి పిచ్చిగ మాట్లాడుతున్నయి. ఇప్పటికే మనం రెండుసార్లు ప్రజల్లోకి పోయినం. మెదక్ ఉప ఎన్నిక, కంటోన్మెంట్ ఎన్నికలకు పోయినం. ప్రజలు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. చాలదా! రేపు కూడా అదేవిధంగా ఉంటది. రేపు 154 సీట్లు అసెంబ్లీలో వస్తె.. కచ్చితంగా 135-140 స్థానాలు గెలుస్తం.

మనం ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చిన తర్వాత… 24 గంటలు కరెంటు ఇచ్చిన తర్వాత… వెయ్యి రూపాయల పింఛను ఇచ్చిన తర్వాత… డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించిన తర్వాత ఇంకో పార్టీ గెలుస్తదా? సాధ్యమైతదా? వాళ్ల బాధ, అరుపులు, పెడబొబ్బలు అందుకే. ఏదో మునిగిపోయినట్లు రకరకాల శాపనార్థాలు, దీవెనలు చేస్తుంటరు. దేనికీ జడవకుండా మీ మంత్రులు, నాయకులతో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోండి. ప్రభుత్వంలో జరిగే విషయాలు తెలుసుకొని, ప్రజలకు వాస్తవాలను చెప్పండి. మనం ఎన్నో మహోన్నత కార్యక్రమాలు తీసుకున్నం.

ఏ నిర్ణయమైనా కడుపునిండ తీసుకున్నం. గత ప్రభుత్వాలు నిరుపేదలకు రూ.75, రూ.200 పెన్షన్లు ఇచ్చిండ్రు. కడియం శ్రీహరి అధ్యక్షతన మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసుకున్నం. పేదలకు పింఛన్లు ఇచ్చేందుకు ఒక పరపతి, లక్ష్యం ఉండాల్నా? కేవలం ఓట్ల కోసం గోల్‌మాల్ చేసే పద్ధతా? దేనికోసం… ఆలోచించమని చెప్పిన. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏకే గోయల్ నన్ను అసలు ఎందుకోసం పింఛన్లు సార్ అని అడిగిండ్రు. బిచ్చం ఎత్తుకున్నట్లు కాకుండా రెండు పూటల మంచిగ అన్నం తినడానికి పింఛన్లు ఇయ్యాలని చెప్పిన.

అప్పుడు పప్పు, ఉప్పు, బియ్యం రేట్లు వేసి లెక్కలు తీసి… రూ.685-700 ఇస్తే సరిపోతుందని చెప్పిండ్రు. రౌండప్‌గా రూ.వెయ్యి పింఛను ఇయ్యాలని బాధ్యతగా నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం పింఛన్ల కోసం సంవత్సరానికి రూ.870 కోట్లు ఖర్చు పెడితె, ఈరోజు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.3500 కోట్లు ఇస్తున్నది. ఈ మధ్య గ్రామాల్లోకి వెళ్లినపుడు ముసలోల్లను అమ్మా పింఛను వచ్చిందా? అని అడిగితే… వచ్చింది బిడ్డా .. తీసుకున్నపుడు అబద్దమాడొద్దు రూ.3వేలు వచ్చినయి.. సంతోషంగా ఉంది, నువ్వే మా పెద్ద కొడుకువు అని చెప్పినరు. బియ్యం మీద… పెట్టేవాళ్లకు కడుపునిండ అన్నం పెట్టండి. ఇచ్చేదేందో ఆరు కిలోల చొప్పున ఇయ్యమని చెప్పిన. ఈమధ్య పటాన్‌చెరు నుంచి మిత్రుడొచ్చి తనకు 48 కిలోలు వచ్చినయని చెప్పిండ్రు. 35-45-50 కిలోలు రావడంతో అందరూ సంతోషంగ ఉన్నరు.

బడ్జెట్ తర్వాత దళితుల భూపంపిణీ..: దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకం తీసుకున్నం. ఇది ఈ బడ్జెట్ తర్వాత మళ్లీ స్పీడ్ అందుకుంటది. ఎందుకంటే భూములిచ్చే వాళ్ల లిస్టు మన కలెక్టర్ల దగ్గరకు వస్తుంది. ఇప్పుడే కొత్తగా అధికారులు వచ్చినందున ఉన్నంతలో నిజాయితీపరులను కొత్త కలెక్టర్లుగా జిల్లాలకు పోస్టు చేసినం. ఇప్పుడు దళితులకు మూడెకరాలు కొనిచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తం. ఉద్యోగస్తులందరికీ తెలంగాణ ఇంక్రిమెంటు ఇస్తమన్నం.. ఇచ్చినం. మాట నిలబెట్టుకున్నం. కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల విభజన పూర్తి చేస్తే.. వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించే ప్రక్రియను కూడా పూర్తి చేస్తం.

అమరుల రెండో లిస్టు త్వరలో..: అమరవీరుల కుటుంబాలను రూ.10 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకుంటమని చెప్పినం. ఇప్పటికే ఒక దశ పూర్తయింది. మరో ఫేజ్ అమలు కోసం కలెక్టర్లకు లిస్టులు ఇవ్వాలని చెప్పినం. ఇక ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపాలను నిర్మిస్తం. రాష్ర్టావతరణ దినోత్సవం జూన్ రెండున ఏ జిల్లాలో ఆ జిల్లా మంత్రి, కలెక్టర్, ఎస్పీ కచ్చితంగా ఉదయంపూట అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతే జాతీయ జెండా ఆవిష్కరిస్తరు. రేపో, ఎల్లుండో జీవో కూడా ఇవ్వబోతున్నం. సింగిల్ విండో పారిశ్రామిక విధానం చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేసినం.

త్వరలో దానిని లాంచ్ చేయబోతున్నం. మంగళవారం ఉదయం ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి నన్ను వ్యక్తిగతంగా అభినంచినరు. పారిశ్రామిక పాలసీ బాగుంది… దేశంలో పారిశ్రామివేత్తలంతా లైను కడతరు. ఎప్పుడు మీరు అనౌన్స్ చేస్తారని అడిగారు. మైనార్టీల కోసం రూ.1083 కోట్ల బడ్జెట్ పెట్టాం. లంబాడీ తండాలన్నీ గ్రామపంచాయతీలుగా చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినం. త్వరలో అమలు కూడా కాబోతుంది. ముస్లిం మహిళల కోసం షాదీముబారక్, దళిత, గిరిజన మహిళలకు కళ్యాణలక్ష్మి పథకం. సిక్ మహిళలు మన రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంటారు. అయినా సిక్కు మహిళలను కూడా ఈ పథకం కిందకు తీసుకువచ్చినం.

సుమోటాగా హామీల అమలు… ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పకున్నా,ఎవరూ డిమాండు చేయకున్నా కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. మానవతా దృక్పథంతో సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం పంపిణీ కోసం ఏ పార్టీ ధర్నా చేయకున్నా ఇస్తున్నం. ఆ పిల్లలు చాలా సంతోషంగా ఉన్నరు. ఆ పిల్లలకు వారంలో ప్రతి రోజూ గుడ్డు ఇయ్యాలని మంత్రి ఈటెల రాజేందర్‌కు చెప్పిన. మెస్ ఛార్జీలను కూడా పెంచేందుకు వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ పెడదామని, అందుకు సంబంధించిన సర్వే చేయమని నిన్న రాత్రి చెప్పిన. బాల్కొండ నియోజకవర్గంలో బహిరంగ సభలో బీడీ కార్మికులకు భృతి (వాళ్లకిచ్చేది పింఛను కాదు) కింద నెలకు రూ.వెయ్యి ఇస్తమని చెప్పినం. రేషన్‌కార్డులు, పింఛన్లు సెటిల్ చేసినం. ఇంకా ఒకటీ, అరా ఉన్నా… చివరి మనిషి వరకు సహాయం చేద్దాం. మీ ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే జిల్లా మంత్రులకు చెప్పండి. బీడీ కార్మికులకు కూడా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అదనపు భృతి ఇచ్చేందుకు ఉత్తర్వులిచ్చాం.అని చెప్పారు.

ఇష్యూలు లేక… ఇష్టమొచ్చినట్లు విమర్శలు… ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నరు. అప్పుడప్పుడు వాళ్ల స్టేట్‌మెంట్లను చూసి నేనే నవ్వుకుంట. ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నరు. హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు వచ్చే పద్ధతి శాస్త్రీయబద్ధంగా ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి పారిశ్రామిక వాడలు రావాలి. తెలంగాణ ఏ దృష్టితో అభివృద్ధి కావాల్నో… అదేరీతిన అభివృద్ధి చేసేందుకు నేను ఫార్మా సిటీ కోసం ఏరియల్ సర్వే చేసిన. హెచ్‌ఎండీఏ పరిధిలో అడవులు అభివృద్ధి చేసి, పచ్చదనం పెంచేందుకు సర్వే చేసిన.

వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు కోసం ఏరియల్ సర్వే చేసిన. నేను అట్ట పోతుంటె కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రీ కిందకు భూమ్మీదకు దిగు అన్నరు. సరే నేను దిగిన. వరంగల్‌లో పాదయాత్ర చేస్తుంటె… కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నరని అన్నరు. గాల్లో ఉంటె ఆ మాట… భూమ్మీద ఉంటె ఈ మాట. ఏం మాట్లాడాలె? ఎంత దిక్కుమాలిన విమర్శ అంటె… మహబూబ్‌నగర్‌కు పోయి జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి పాదయాత్ర చేసిన. పేదలందరూ సహకరిస్తే ఇండ్లు కట్టిస్త. సర్వే చేయండి అది జరిగిన తర్వాత హైదరాబాద్‌కు నా దగ్గరికి రిపోర్టు వస్తది.

వచ్చిన తర్వాత వెంటనే మంజూరు చేసి, 8-10 రోజుల్లో మళ్లీ వచ్చి కాలనీకి పునాది రాయి వేస్తా అని చెప్పిన. నిన్న మహబూబ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ స్టేట్‌మెంట్ చూస్తె నవ్వాల్నా, ఏడ్వాల్నా తెల్వదు. కేసీఆర్ ఎనిమిది రోజులైంది, నేను లెక్కబెట్టుకున్న… రాకపోతివి అని అన్నరు. ఏం చెప్పాలి? ఇది కేసీఆర్ మీద చేసే విమర్శనా? ఈ విమర్శలతో కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కొంటరా? ప్రజలేం అనుకుంటరనే సోయి లేకుండా గుడ్డిగా మాట్లాడుతున్నరు… అని ఎద్దేవా చేశారు.

మూడేండ్లు దాటితే 24 గంటల కరెంటు… గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల కరెంటు బాధలు పడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇపుడు పునర్విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలో జెన్‌కో ఆరువేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనుంది. ఈ సంవత్సరం నవంబరు వరకు భూపాలపల్లిలో 600 మెగావాట్లు, జైపూర్ నుంచి 1200 మెగావాట్లు… అంటే దాదాపు రెండువేల మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది. కొద్దోగొప్పో యాసంగి పంటకు కష్టముంటది.

నేను, జిల్లాలో మంత్రులు కూడా రైతు సోదరులకు విజ్ఙప్తి చేసినం తక్కువ గంటలే కరెంటు వస్తున్నందున వరి చేన్లు పెట్టొద్దని చెప్పినం. అయినా ఓపెన్ మార్కెట్‌లో 1300 మెగా వాట్ల కరెంటు ఇస్తామని కొన్ని కంపెనీలను ముందుకొచ్చినయి. ఎంత ఖర్చయినా సరే కరెంటు కొని రైతులను ఆదుకుంటాం. వచ్చే వర్షాకాలం నాటికి ఆ ఇబ్బంది కూడా ఉండదు. రెండు సంవత్సరాలు గడిచేనాటికి రైతాంగానికి బ్రహ్మాండంగా ఇస్తం..మూడో సంవత్సరం గడిచే నాటికి 24 గంటల కరెంటు ఇస్తం అన్నారు.

సాంస్కృతిక సారథితో విస్తృత ప్రచారం.. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై తెలంగాణ సాంస్కృతిక సారథితో విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. మానుకొండూరు ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారధి ఛైర్మన్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో 550 మంది కార్మికులను రిక్రూట్ చేసుకుని శిక్షణ ఇచ్చి ఊరూరా వాడవాడా ప్రచారం చేస్తామన్నారు. అలాగే హరితహారం కార్యక్రమంలో అంతా భాగ స్వాములు కావాలన్నారు.

మూడేండ్లలో 120 కోట్ల మొక్కలు నాటాలి. ప్రతి గ్రామానికి 40వేలు, నియోజకవర్గానికి 40 లక్షల చొప్పున ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 40 కోట్ల మొక్కలు నాటబోతున్నం. హరితహారంతో పాటు మిషన్ కాకతీయపై కూడా సాంస్కృతిక సారథి విస్తృతంగా ప్రచారం చేస్తది. వారితో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, అందరూ సమన్వయంతో భాగస్వాములు కావాలి అన్నారు.

నాడు తెలంగాణ… నేడు బంగారు తెలంగాణ కోసం కల్పన… గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కలలుగని సాకారం చేసుకున్నామని, ఇప్పుడు బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏదన్నా కార్యక్రమం విజయవంతం కావాలంటే మొదలు కల్పన ఉండాలి. ఇమాజినేషన్ ఉండాలి. ఆతర్వాత యాక్షన్‌లోకి ట్రాన్స్‌లేట్ (కార్యాచరణ) కావాలి. దాని తర్వాత ఫీల్డ్‌మీద ఎగ్జిక్యూటివ్ (క్షేత్రస్థాయి అమలు) కావాలి. నేను ఉద్యమాన్ని ప్రారంభించినపుడు హుజూరాబాద్ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు వస్తే నా కల్పన చెప్పితే..సిన్మాలెక్కుంది సార్ అని అన్నరు. నేను కెప్టెన్‌సాబ్… సిన్మా కూడా ఇంతే. మనిషి కల కనాలి. అప్పుడే ఆరాటముంటది. కల్పన ఉంటేనే ఏదైనా జరుగుతది అన్న. ఆనాడు తెలంగాణ కోసం… ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం అట్లనే కల్పన చేసి బయలుదేరినం అన్నారు.

హైదరాబాద్‌ను అమెరికాలోని డల్లాస్‌ను తలదన్నే రీతిలో అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ సిటీ ఒకడేమో నేను కట్టినంటడు. ఒకడు హైటెక్ అని, ఇంకోడు ఇంకోటి అంటడు. నగరంలో దారుణమైన పరిస్థితులున్నయి. రేపు సాయంత్రం టీవోలో నా ప్రోగ్రాం ఉంటది. చూడండి. వాస్తవాలు మీకు తెలుస్తయి. పిచ్చోళ్ల సిటీ కూడా ఇట్ల ఉండదు. హైదరాబాద్ జనాభా కోటి ఉంటది. పదివేల మందికి ఒక మార్కెట్ ఉండాలె. ఈ లెక్క వెయ్యి మార్కెట్లు కావాలి.

కానీ 24 మాత్రమే ఉన్నయి. బస్‌షెల్టర్లు, శ్మశానవాటికలు, దోబీఘాట్లు, ఒక్కటంటే ఒక్కటి సక్కగ లేవు. నగరం ధర్మం మీద నడుస్తుంది. గత ప్రభుత్వాలు పేదల గుడిసెలను జేసీబీలు పెట్టి కూలగొట్టినయి. కానీ ఇప్పుడు అట్ల కాదు. 2.80 లక్షల మంది పేదలు దరఖాస్తు చేసుకున్నరు. కచ్చితంగా వారికి 150 గజాల వారికి ఎలాంటి ఛార్జీలు స్థలాలకు పట్టాలిస్తం. ఈనెల 20 నుంచి నగర మంత్రులు, నాయకులు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తరు అని చెప్పారు.

ప్రజల అవసరాలకే ప్రభుత్వ స్థలాలు… ప్రజల సామూహిక అవసరాలు తీర్చేందుకే ప్రభుత్వ స్థలాలున్నాయని, వాటిని గత ప్రభుత్వాలు చేతగాక సరైన రీతిలో వినియోగించుకోలేకపోయాయని సీఎం చెప్పారు. సెక్రటేరియట్ అమ్ముతవా..? అని అంటరు. మరి ఇన్ని మార్కెట్లు కావాలి. ఎక్కడ పెట్టాలి? కాంగ్రెస్, టీడీపీ నాయకుల నెత్తి మీద పెట్టాల్నా? పంజాగుట్ట కాలనీలో పది క్వార్టర్లు కూలగొడుతం ఎకరం జాగాల మార్కెట్ పెడుతం. మలక్‌పేటలో ఎకరం జాగాలో మార్కెట్ పెడతం.

ఎర్రమంజిల్‌కాలనీలో జాగాలున్నయి అక్కడ పెడ్తం. ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో ఎక్కడైతే జాగాలున్నయో వాటిని తీసుకుంటం.. బస్‌షెల్టర్లు పెడతం. ప్రజల ఆస్తిని, ప్రజల భూమిని ఎట్ల వాడాల్నో మీకు తెల్వలె. తెలివి పని చేయలె. మేం చేద్దామంటే… విమర్శలు. సెక్రటేరియల్ మారిస్తే… ప్రభుత్వ జాగాలు అందుబాటులోకి వస్తే అక్కడ బస్ స్టేషన్లు కడతం, మార్కెట్లు కడతం. కచ్చితంగా ప్రజల సామూహిక అవసరాలకు మాత్రమే వాడుతం.. అని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో ఓపిక ఉండాలె.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓపికగా ఉండాలని కేసీఆర్ శ్రేణులకు సూచించారు. అవకాశాలు అనుకోకుండా కూడా వస్తాయన్నారు. ఎల్లారెడ్డికి చెందిన అనిత అనుకోకుండా నిజామాబాద్ జడ్‌పీ చైర్మన్‌గా ఎన్నికైన ఉదంతాన్ని వివరించారు. అలాగే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నియోజకవర్గం నుంచి నిలబడాలనుకున్నా పార్టీ ఆదేశంతో తప్పుకున్నారని ఆయన ఏకంగా మెదక్ ఎంపీ అయ్యారని చెప్పారు. ఇపుడు ఒక నియోజకవర్గంలో ఇద్దరేసి నాయకులున్నా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు రాబోతున్నందున సమస్యలుండవని చెప్పారు. అలాగే రాష్టంలో కొన్ని వందల మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టులు, 40-50 కార్పొరేషన్ ఛైర్మన్లు, వాటికి సంబంధించి డైరెక్టర్ పోస్టులు, కొన్ని వందల దేవాలయ కమిటీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

ఇవేం రాతలు..? సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో మీడియా తీరును కూడా ఎండగట్టారు. రాతలు కూడా ఎట్ల రాస్తరో తెల్వదు. పేపరోళ్లకు వందలసార్లు చెప్పినా ఫలితం లేదు. ఒక పేపరాయన పుల్లప్ జీహెచ్‌ఎంసీ అని వచ్చింది. అసలు విషయమేమింటే… ఒక జడ్జి తీర్పు ఇచ్చిండు.. హైదరాబాద్ నగరంలో ఒక వార్డులో పదివేల ఓట్లు, ఒక దగ్గర లక్ష ఓట్లు ఉన్నయి. ఇది కరెక్టుకాదు. వచ్చే ఎన్నికల నాటికి సరి చేయండి. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కచ్చితంగా సమాంతరం (బ్యాలెన్స్) చేసి పెట్టాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది.

దాని ప్రకారం ప్రభుత్వం-జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్ చేస్తుంది. మరి ఈ విషయం మీద నాలెడ్జ్ ఉందో లేదో, కావాలనో ఒకాయన హైకోర్టుకు పోయిండు. దాని మీదు కోర్టు మీరు సాకులు చెప్పి తప్పించుకోకండి అని చెప్పిందిగానీ పుల్లప్ చేయలె, పిల్లప్ చేయలె. దానికి ఒకాయన పుల్లప్‌అని, చీవాట్లుఅని, మెట్టికాయలు అని రాస్తరు. ఇవన్నీ వారి విజ్ఞతకే వదిలేస్తున్న… అని చెప్పారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మూడు ప్రాథమ్యాలు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడు ప్రాథామ్యాలు పెట్టుకుని పని చేస్తుందని స్పష్టం చేసిన సీఎం… ఎవరు అడిగినా అదే చెప్పాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. అన్నింటికంటే ముందు పేదలు, వారికి సంబంధించిన సంక్షేమ పథకాలు నెంబర్ వన్ ప్రయారిటీగా ఉంటయి. రెండో ప్రయారిటీ… వ్యవసాయం. రైతన్నలు సల్లగుంటెనె మనం ఇంత పిడికెడు అన్నం తింటం. పారిశ్రామిక, పెట్టుబడుల రంగానికి మూడో ప్రియారిటీ. రాష్ట్రం కచ్చితంగా ఆర్థిక పురోగతి సాధించి, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే పరిశ్రమలు, పెట్టుబడుల రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముంది. ఈ మూడు భాగాలుగా పని విభజన చేసుకొని, వ్యూహాలు రచించుకొని ముందుకు పోతున్నం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.