Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

భావితరాల భవిష్యత్ కోసం పనిచేస్తున్నాం..

-ప్రాజెక్టులను అడ్డుకునేందుకు సచ్చినోళ్ల పేర్లతో దొంగ కేసులు
-ప్రజల గొంతు కోసేందుకు సిద్ధమైన ఆ పార్టీ నాయకులు
-ఆరునూరైనా పాలమూరు ఎత్తిపోతల ద్వారా నీళ్లు ఇచ్చి తీరుతం
-54 ఏండ్లు అధికారం ఇస్తే వాళ్ల కుటుంబాలే బాగుపడ్డయి
-ఎప్పుడు ఎన్నికలొచ్చినా మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారం
-ప్రగతి ఉత్సవ సభలో మంత్రి కే తారకరామారావు
-షాద్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-దివిటిపల్లిలో 1,024 డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ప్రారంభం
-హాజరైన మంత్రులు లక్ష్మా రెడ్డి, మహేందర్‌ రెడ్డి, ఎంపీ జితేందర్‌ రెడ్డి

టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ నాయకులకు రాష్ట్రంలో పుట్టగతులుండవనే భయం పట్టుకున్నదని, అందుకే సచ్చినోళ్ల పేర్లతో ప్రాజెక్టులపై దొంగ కేసులు వేశారని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. పాలమూరు ప్రజలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు రూ.40 వేల కోట్లతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే హర్షవర్ధన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి అనే కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టును అడ్డుకునేందుకు పులులు, సింహాల పేరుతో కేసులు వేశారని మండిపడ్డారు. సిగ్గులేనితనంలో పీహెచ్‌డీ ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్‌కే వస్తుందని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రజల గొంతు కోసేందుకు సిద్ధమైనవారి మాటలు ఎవరూ నమ్మవద్దని కోరారు. సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో రూ.67.75 కోట్లతో చేపట్టిన కొత్తూరు-షాద్‌నగర్ రహదారి విస్తరణ పనులు, రూ.85.65 కోట్లతో నిర్మించనున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లు, మున్సిపల్ కార్యాలయం, ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్ మండలం దివిటిపల్లిలో నూతనంగా నిర్మించిన 1,024 డబుల్‌బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు పీ మహేందర్‌రెడ్డి, సీ లకా్ష్మరెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు వై అంజయ్యయాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన షాద్‌నగర్ ప్రగతి ఉత్సవ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

54 ఏండ్లు అధికారంలో ఉండి ఎక్కడ అభివృద్ధి చేశారో చూపాలని కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లాలో వలసలు పెరింగేందుకు కాంగ్రెస్ కారణం కాదా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిందని, దశాబ్దాల తరబడి పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చిందో చెప్పాలన్నారు. పాలమూరు ప్రాజెక్టు కోసం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కృషిచేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు తోలుబొమ్మలను ముందు పెట్టి దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

నాడు నిజాంపాలనలో అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ద్వారా పాలమూరు బీడు భూములకు నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే అప్పటి ఆంధ్రా నాయకులు అడ్డుకున్నారన్నారు. నాటినుంచి ఏనాడైనా నీళ్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందా? అన్ని ప్రశ్నించారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తిచేసి సాగునీరు అందించేవరకు ఊరుకోరని స్పష్టంచేశారు. ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణంలో పాలమూరుకే ప్రథమ ప్రాధ్యానం ఉంటుందన్నారు.

భావితరాల భవిష్యత్ కోసం పనిచేస్తున్నాం..
ఎన్నికల కోసం కాకుండా భావితరాల భవిష్యత్ కోసం పనిచేస్తున్నామని, నాలుగేండ్లలోనే ఎవరూ ఉహించని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పేదల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకోసం ఎంతయినా ఖర్చుచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. మన రాష్ట్ర పాలన, సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ రూ.200 పింఛను 29 లక్షల మందికి మాత్రమే ఇస్తే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ పింఛను మొత్తాన్ని రూ.వెయ్యి, రూ.1500కు పెంచి రాష్ట్రంలో 43 లక్షల మందికి పంపిణీ చేస్తున్నదని పేర్కొన్నారు. కరంటు అడిగిన రైతులను కాల్చి చంపిన టీడీపీ, కాం గ్రెస్ పార్టీలకు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. మరోమారు తెలంగాణ గడ్డపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలను కోరారు. షాద్‌నగర్ మీదుగా రిజినల్ రింగ్ రోడ్డు పోతున్నందున ఈ ప్రాంతం నగరానికి దీటుగా అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని, మరో మూడేండ్లలో ఉహించని స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2 కోట్లు రెండు రోజుల్లో విడుదల చేస్తామని హామీఇచ్చారు. అంతకుముందు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్ పదిలం
సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో నిర్మించిన 1,024 డబుల్‌బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రైతులకు ఉచితంగా 24 గంటల కరంటు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విషయం గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుసునన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు 50 ఏండ్లకుపైగా అధికారం కట్టబెడితే ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులు చేపట్టనివారు ఇప్పుడు మోసపూరిత మానిఫెస్టోతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు వారి కుటుంబాలను బాగు చేసుకున్నారే తప్ప ప్రజల బాధలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దివిటిపల్లిలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం సాగనీయకుండా ప్రతిపక్షాలు చేసిన కేసుల కుట్రలను ఎదుర్కొని ఇండ్లు పూర్తి చేశారంటూ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ను మంత్రి అభినందించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో పలు రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. తెలంగాణ చౌరస్తాలో, దివిటిపల్లిలో వేర్వేరుగా ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ మంత్రి రాములు, మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ ఎమ్మెల్యేలు ఎడ్మా కిష్టారెడ్డి, జైపాల్ యాదవ్, స్టేట్ కో-ఆపరేటివ్ కంజ్యూమర్స్ ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాల్‌నాయక్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శులు అందె బాబయ్య, శ్రీనివాస్‌యాదవ్, వాల్యనాయక్, మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్, హౌసింగ్ పీడీ రమణారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్ తదితరులు పాల్గొన్నారు.

గాంధీభవన్‌లో కంటి వెలుగు శిబిరం ఏర్పాటుచేయిస్తాం
సీఎం కేసీఆర్ ఏటా రూ.వేల కోట్ల నిధులతో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నా కాంగ్రెస్ నాయకుల కండ్లకు కనిపించడం లేదని, వారికోసం హైదారాబాద్‌లోని గాంధీ భవన్‌లో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేయిస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా అభివృద్ధి ఫలాలు కనిపిస్తాయన్నారు. పాలమూరు జిల్లాను నాశనం చేసిందే ఆ పార్టీ అని, ఇప్పుడు జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని రాష్ర్టాలు అభివృద్ధి చెందాయని, తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తేవాలని ప్రజలను కోరారు. రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఓవైపు రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటూనే.. మరోవైపు ప్రాజెక్టులను పూర్తిచేయాలని పాదయాత్రలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయ ఉనికి కోసం వారు చేసే చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే 400కు పైగా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నది ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు పాలమూరు జిల్లా ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చారని మండిపడ్డారు. ఎత్తేం, కర్వేన, ఉదండపూర్ రిజర్వాయర్ పనులు జరుగకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మోసం చేయడం తప్ప కాంగ్రెస్ ఒరగబెట్టిందేమీ లేదన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.