-మిషన్‌కాకతీయ, వాటర్‌గ్రిడ్, ప్రాజెక్టులతో జల్ -హరితహారంతో జంగల్‌ను పెంచి కాపాడుతున్నాం -భూ పంపిణీతో రైతులకు జమీన్ ఇస్తున్నాం -పేద గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తాం -గిరిజనుల సమగ్ర అభివృద్ధే సర్కారు లక్ష్యం -త్వరలో మావ సాటే.. మావ రాజ్ సాకారం -కొమురం భీం 75వ వర్ధంతి సభలో కేటీఆర్ వెల్లడి -విద్యతోనే గిరిజనుల అభివృద్ధి: మంత్రి చందూలాల్

నిరుపేదలకు జల్, జంగల్, జమీన్ కావాలని పోరాడిన ఆదివాసీ యోధు డు కొమురం భీం స్ఫూర్తితో ఆయన ఆశయాలను అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఆదివాసీల ఆరాధ్యదైవం, గోండు వీరుడు భీం 75వ వర్ధంతిని అధికారికంగా ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడెఘాట్‌లో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్, మంత్రులు చందూలాల్, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి భీం సమాధి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఆదిలాబాద్ అడవిబిడ్డల స్ఫూర్తిని చాటిన ఘనుడు కొమురం భీం అని కొనియాడారు. ఆదివాసులను ఏకంచేసి పోరాటస్ఫూర్తిని రగిలించారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు.
తెలంగాణ వస్తే ఏమొస్తదన్న వారికి అస్తిత్వాన్ని సాధించుకుంటున్నదని భీం వర్ధంతితో నిరూపించామన్నారు. గతంలో గిరిజన పోరాట యోధుడంటే కేవలం ఏపీకి చెందిన అల్లూరి సీతారామరాజనే భ్రమ ఉండేదన్నారు. ఆ పేరుతోనే సినిమాలు తీశారని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో భీంసహా ఇక్కడి పోరాట యోధులందరినీ గుర్తు చేసుకుంటున్నామన్నారు. మొన్న కాకా విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టుకున్నామని, పీవీ, కాళోజి, కొండా లక్ష్మణ్ బాపూజీల జయంతి, వర్ధంతిలను అధికారికంగా జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. జల్, జంగల్, జమీన్‌ను కోసం భీం పోరాడిన స్ఫూర్తితోనే ప్రభుత్వం ఆయన ఆశయాలను అమలు చేస్తున్నదని చెప్పారు. జల్(నీరు) ఎంతో అవసరమని, అందుకోసమే మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు.
జంగల్(అడవి)ను కాపాడుకునేందుకు 25శాతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచేందుకు హరితహారం చేపట్టామన్నారు. జమీన్(భూమి)ను ప్రతి పేదవాడికి అందించేందుకు ఇప్పటికే దళితులకు మూడెకరాల చొప్పున పంపిణీ చేశామని, త్వరలో నిరుపేద గిరిజనులకు కూడా మూడెకరాల భూమి అందించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జోడెఘాట్‌కు 50 డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. గిరిజనులు కోరుకుంటున్న స్వయంప్రతిపత్తి కల త్వరలో నెరవేరుతుందన్నారు. మావ సాటే.. మావ రాజ్(మా గూడెంలో మా రాజ్యం) త్వరలో సాకారం కానున్నదన్నారు. 500 జనాభా ఉన్న ఆదివాసీ గూడేలను పంచాయతీలుగా మార్చనున్నామని చెప్పారు. ఏజెన్సీ మండల కేంద్రాల్లో 30 పడకల దవాఖానలు ఏర్పాటుకు హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల వేతనాలను పెంచుతూ త్వరలోనే ఉత్తర్వులు విడుదల చేస్తామని, సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
అధికారికంగా భీం వర్ధంతి చారిత్రకం: మంత్రులు చందూలాల్, జోగు, అల్లోల భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం చారిత్రక ఘట్టమని పర్యాటక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్ పేర్కొన్నారు. ప్రతి గిరిజనుడు చదువుకోవాలని, అప్పు డే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పర్యావరణ, అటవీశాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ హక్కుల కోసం బ్రిటిషర్లతో పోరాడి ప్రాణాలను తృణఫ్రాయంగా అర్పించిన మహోన్నత వ్యక్తి భీం అని కొనియాడారు. గిరిజన ప్రాంతా ల్లో విద్య, వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదన్నారు. దేవాదాయ, న్యాయ, గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ భీం స్మారక మ్యూజియాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నదన్నారు. ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ 2011లో ఉమ్మడి రాష్ట్రంలో భీం వర్ధంతికి వస్తుంటే కరీంనగర్‌లో అరెస్టు చేశారని, భీం చరిత్రను తొక్కిపెట్టారన్నారు.
ట్యాంక్‌బండ్‌పై కనీసం విగ్రహాన్ని పెట్టలేదని, టీఆర్‌ఎస్ పోరాటంతో రెండేండ్ల కింద ఏర్పాటు చేశారన్నారు. భీం స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించారని చెప్పారు. గ్రూప్స్‌కు సిద్ధమయ్యే గిరిజన విద్యార్థులకు ప్రభు త్వం ఉచిత శిక్షణ అందించాలని ఎంపీ గెడాం నగేశ్ కోరారు. వాటర్‌గ్రిడ్‌తో గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్య దూరమవుతుందని సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో చీఫ్ విప్ నల్లాల ఓదెలు, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి, బాపురావు, రేఖానాయక్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు సతీశ్, భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, ఆత్రం సక్కు, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఎక్కా, కలెక్టర్ జగన్‌మోహన్, కేసీఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు గోగుల రవీందర్‌రెడ్డి, వాల శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.