Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

భూ రికార్డుల విప్లవం

-మార్చి 11న ఒకే రోజు పాస్‌పుస్తకాల పంపిణీ.. -కోర్ బ్యాంకింగ్ తరహాలో భూ క్రయవిక్రయాలు -మార్చి 12 నుంచి అమలులోకి కొత్త విధానం.. -సాదాబైనామాల దరఖాస్తుల స్వీకరణ ఉండదు -బ్యాంకు రుణాల కోసం పాస్‌పుస్తకాల తనఖాకు చెల్లుచీటీ -పంట పెట్టుబడి పథకాన్ని ప్రధాని ప్రశంసించారు.. -2020కల్లా కోటి ఎకరాలకు సాగునీరిస్తాం -ఫిబ్రవరి చివరి నుంచి జిల్లాకు ఒకే రెవెన్యూ కోర్టు.. -అసైన్డ్ భూములపై మానవీయకోణంలో పరిశీలన -ఎస్సీ, ఎస్టీ కుటుంబాల స్థితిగతుల కంప్యూటరీకరణ -గ్రామాల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు.. -గ్రామం స్థాయిని బట్టి నిధుల కేటాయింపు -స్థానిక తక్షణ అవసరాలకు జిల్లా పరిమాణాన్ని బట్టి.. -కోటి, కోటిన్నర చొప్పున జిల్లా కలెక్టర్లకు నిధులు -మార్చి 12 నుంచిఅసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు -రాష్ట్రంలో మరో 4 వేల గ్రామ పంచాయతీలు! -లిటిగేషన్లకు తావులేకుండా ఏర్పాటుచేస్తాం -బిల్లులో పంచాయతీ ఎన్నికల విధివిధానాలు -బిల్లు ఆమోదానికి ఫిబ్రవరి మొదటివారంలో -అసెంబ్లీ ప్రత్యేక భేటీ ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు! -కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు

భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించిన రాష్ట్ర ప్రభుత్వం, సవరించిన రికార్డుల మేరకు రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందించేందుకు రంగం సిద్ధంచేసింది. మార్చి 11వ తేదీన ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బ్యాంకులు రైతులకు రుణాలిచ్చేందుకు ఇకపై పట్టాదార్ పాస్‌పుస్తకాలు తనఖా పెట్టుకోరాదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పలు కార్యక్రమాలు, ఇటీవల పూర్తయిన భూ రికార్డుల ప్రక్షాళన, పంచాయతీరాజ్ కొత్త చట్టం, పంచాయతీలకు ఎన్నికలు తదితరాలపై మంగళవారం ప్రగతిభవన్‌లో ఏర్పాటుచేసిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పట్టుబట్టి పనిచేస్తే పరిశుభ్రమైన, అభివృద్ధికరమైన గ్రామీణ తెలంగాణను సాధించుకోగలమని సీఎం ఉద్బోధించారు. అసాధారణమైన పనులుచేసే శక్తియుక్తులు, దేన్నైనా సాధించే పట్టుదల రాష్ర్టానికి ఉందన్న సీఎం.. ఒకే రోజులో సమగ్ర కుటుంబ సర్వే, తక్కువకాలంలో కరంటు కష్టాలను అధిగమించడం, తాగునీటి సమస్యకు పరిష్కారం కనుగొనడంవంటి కార్యక్రమాలను ఉదహరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా చేపడుతున్న పంటల పెట్టుబడి పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న సీఎం.. సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్షమా? పరోక్షమా? అనే విషయంలో సమాలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని ఆమోదించుకునేందుకు ఫిబ్రవరి మొదటివారంలో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తున్నట్టుతెలిపారు. అసైన్డ్ భూముల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ప్రతి గ్రామానికి నోడల్ అధికారి పాస్‌పుస్తకాల పంపిణీ పద్ధతి ప్రకారం జరుగడానికి ప్రతి గ్రామానికి నోడల్ అధికారిని నియమించాలి. పాస్‌పుస్తకాల పంపిణీకి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదలచేస్తుంది. ప్రతి గ్రామానికి ఆ గ్రామ రైతుల పాస్ పుస్తకాలు ఒక రోజు ముందు లేదా అదేరోజు ఉదయానికి చేర్చాలి. ఇందుకు ప్రతి గ్రామానికి ప్రత్యేక వాహనం ఏర్పాటుచేయాలి. పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులతోపాటు అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను భాగస్వాములను చేయాలి అని సీఎం చెప్పారు.

ఫిబ్రవరి చివరి నుంచి జిల్లా మొత్తానికి ఒకే రెవెన్యూ కోర్టు భూరికార్డుల ప్రక్షాళనలో 93% భూమి, 92% ఖాతాలు వివాదరహితమైనవని తేలింది. ఇక మిగిలింది చాలా తక్కువ. ఫిబ్రవరి చివరికల్లా ఆర్డీవో, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు నిర్వహించే రెవెన్యూ కోర్టుల స్థానంలో జిల్లా మొత్తానికి ఒకే ఒక రెవెన్యూ కోర్టు ఉండాలి. రెవెన్యూ రికార్డుల నిర్వహణలో మార్చి 12నుంచి విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఇంతవరకు ఈ దిశగా జరిగినదంతా స్థిరపడాలి. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఉండాల్సిన అవసరం లేదు. మొత్తం రాష్ట్రంలో రోజువారీగా జరిగే రిజిస్ట్రేషన్లు రెండున్నర వేల నుంచి నాలుగు వేల వరకు ఉంటాయి. ఇందులో 60% పట్టణ ప్రాంతాల్లో, 40% గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. ఇక ముందు ఇప్పుడున్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా 443 మండల కార్యాలయాలు కూడా రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చూస్తుంటాయి. మొత్తం 584 మండలాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలుంటాయి. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్‌కు నెలల కొద్దీ సమయం పట్టాల్సిన అవసరం ఇక ముందు ఉండదు. మార్చి 12 నుంచి కోర్ బ్యాంకింగ్ నెట్‌వర్క్ తరహా విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. కొనుగోలుదారు, అమ్మకందారు పాస్ పుస్తకాల్లో తక్షణమే ఎంట్రీలు, మార్పులు, చేర్పులు నమోదవుతాయి. దీనికోసం ఎక్కువ సామర్థ్యంకల కంప్యూటర్లు, సర్వర్లు ఏర్పాటుచేస్తున్నాం. ఇద్దరికీ పాస్ పుస్తకాలు కొరియర్‌ద్వారా వారి ఇండ్లకే పంపుతాం. ధరణి వెబ్‌సైట్‌లో వెంటనే అప్‌డేట్ అవుతుంది. ధరణి వెబ్‌సైట్‌ను ప్రపంచంలో ఏ మూలనుంచైనా చూడవచ్చు. భూరికార్డుల ప్రక్షాళన పూర్తయిన నాటి నుంచి మార్చి 12 వరకు చోటు చేసుకుంటున్న క్రయవిక్రయాల వివరాలను కలెక్టర్లు అప్‌డేట్ చేసి ధరణిలో అప్‌లోడ్‌చేయాలి. మార్చి 12 నుంచి కోర్ బ్యాంకింగ్ విధానం మొదలవుతుంది. పహాణీ కాలమ్స్ కూడా తగ్గించాం. పహాణీలో మరాఠీ పదాలను తీసేసి సరళమైన తెలుగు పదాలను ఉపయోగిస్తాం. కలెక్టర్ వ్యవస్థ ఇంకా బలోపేతం కావడానికి చర్యలు తీసుకుంటున్నాం అని సీఎం తెలిపారు.

ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగించాలి భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా పూర్తిచేసినందుకు రెవెన్యూశాఖ మంత్రి, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రక్షాళన కార్యక్రమ ప్రత్యేక అధికారి, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లందరినీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమావేశం ప్రారంభంలో ప్రత్యేకంగా అభినందించారు. వారికి తన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ మనం ఎన్నో పనులుచేస్తుంటాం కానీ, ఇంత గొప్పగా చేయలేం. చాలా పనులు వాయిదావేస్తాం కానీ ఇది సాహసంతో చేశాం. దేశమంతా మనల్ని అభినందిస్తున్నది. మనది కొత్త రాష్ట్రమయినా దేశానికి ఆదర్శమయ్యాం. చాలామందికి మన మీద ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ఈ స్ఫూర్తి ఇలానే కొనసాగాలి. మున్ముందు కూడా పూర్తిగా అవినీతిరహితంగా జరుగాలి అని సీఎం చెప్పారు.

దేన్నైనా సాధించే పట్టుదల రాష్ట్రానికి ఉంది అసాధారణమైన పనులుచేసే శక్తియుక్తులు, దేన్నైనా సాధించే పట్టుదల రాష్ట్రానికి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టి అమలుపరుస్తున్న అనేక కార్యక్రమాల గురించి, సాధించిన విజయాల గురించి ఈ సందర్భంగా గుర్తుచేశారు. సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో చేయగలిగాం. విద్యుత్ సమస్యను పూర్తిగా అధిగమించి ఇప్పుడు వ్యవసాయానికి కూడా 24 గంటలు కరంటు ఇస్తున్నాం. తాగునీటి సమస్యకు అతి తక్కువకాలంలో పరిష్కారం కనుగొన్నాం. భూరికార్డుల ప్రక్షాళన కేవలం వందరోజుల్లో విజయవంతంగా పూర్తిచేయగలిగాం. దీనికి ప్రజలు వందశాతం తృప్తిగా ఉన్నారు. ప్రభుత్వమే తమ ముంగిటకు వచ్చి, లంచాలు లేకుండా, భూమికి రక్షణ కల్పించిందని వారంటున్నారు. గొర్రెల పంపిణీ విషయంలో చాలామంది ఎన్నో అనుమానాలు వ్యక్తంచేసినా, 35 లక్షల గొర్రెలను పంచాం అని సీఎం వివరించారు. గొర్రెల పంపిణీ పథకం పకడ్బందీగా అమలవుతున్నందుకు కలెక్టర్లు, సంబంధిత అధికారులను సీఎం అభినందించారు. ఇప్పటికే 38,28,987 గొర్రెలను పంపిణీ చేస్తే.. వీటికి అదనంగా 14,56,376 గొర్రెపిల్లలు పుట్టాయి. మొత్తంగా ప్రస్తుతం రాష్ట్రంలో 52,79,363 గొర్రెలు అదనంగా చేరాయి. ఇది పెద్ద కార్యక్రమం. ఇదొక సంచార బ్యాంకులాంటిది. రాబోయే రోజుల్లో ఇతర రాష్ర్టాలకు మాంసం ఎగుమతిచేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటుంది. గొర్రెలకు అవసరమైన దాణాగడ్డిని కూడా పెంచాలి. జిల్లాల్లో ఉన్నపండ్ల తోటల వివరాలు సేకరించి అక్కడ గడ్డిపెంచే ఆస్కారం ఎంతవరకు ఉందో పరిశీలించాలి అని సీఎం చెప్పారు.

71.75లక్షల మంది రైతుల సమస్యలను పట్టించుకుంటాం రైతుల కష్టాలు తొలిగించడానికి చాలా చర్యలు చేపట్టాం. కల్తీవిత్తనాలు లేకుండాచేశాం. కల్తీ ఎరువులు, నకిలీ పురుగు మందుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. రైతుకు పంట పెట్టుబడి కింద ఏడాదికి ఎకరానికి రూ.8000 ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ప్రధాని మోదీ మన పథకాన్ని ప్రశంసించారు. రైతులకు మద్దతు ధర విషయంలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేశాం. ప్రస్తుతం వాటిని గ్రామ, మండలస్థాయిలో ఏర్పాటుచేశాం. రైతులు ఒక సంఘటిత వ్యవస్థగా ప్రస్తుతం లేనందున వారు పండించిన పంట మార్కెట్‌లోకి తేవడానికి, అమ్మడానికి ఈ సమితులు ఎంతగానో ఉపయోగపడుతాయి. సమన్వయ సమితుల ద్వారా పంటల కాలనీల విధానం తీసుకురాగలం. 2600కు పైగా మండల వ్యవసాయాధికారు (ఏఈవో)లను నియమించాం. మండల ఏఈవోలకు ఆగ్రానమిస్టులుగా శిక్షణ ఇస్తున్నాం. ఎక్కువ ఉత్పత్తి సాధించే పంటలు పండిస్తాం. మార్కెట్‌కు పంట వచ్చే ముందర లైసెన్సు కొనుగోలుదారు, లేదా కమిషన్ ఏజెంట్‌తో సమన్వయ సమితి సభ్యులు మాట్లాడి ధర నిర్ణయిస్తారు. కనీస మద్దతు ధర రాబట్టుకునే ప్రయత్నంచేస్తారు. రైతులందరూ ఒకేరోజు మార్కెట్‌కు రాకుండా వంతుల చొప్పున రోజుకు కొందరు వచ్చే ఏర్పాటుచేసి, వారు పంటను సులువుగా అమ్ముకొని డబ్బులు తీసుకునే ఏర్పాటుచేస్తారు. 71,75,096 మంది రైతు ఖాతాదారుల సమస్యలను ప్రభుత్వం సమర్థవంతంగా పట్టించుకుంటుంది అని సీఎం చెప్పారు.

లిటిగేషన్లకు తావులేకుండా కొత్త గ్రామపంచాయతీలు పంచాయతీ ఎన్నికలు తప్పకుండా నిర్వహించాలి. గ్రామ పంచాయతీల ఏర్పాటుకు జిల్లా పంచాయతీ శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా భౌగోళిక హద్దులు ఏర్పాటుచేయాలి. రాజ్యాంగం అదే చెప్తున్నది. కోర్టు లిటిగేషన్‌కు తావులేకుండా గ్రామ పంచాయతీలు ఏర్పాటుకావాలి. దీన్ని శాసనప్రక్రియద్వారా చేయబోతున్నాం. ఇప్పుడు 8,684 గ్రామ పంచాయతీలున్నాయి. మరో 4 వేలు కొత్తగా ఏర్పాటు కావచ్చు అని సీఎం తెలిపారు. మనం చాలా విషయాల్లో విజయం సాధించాం, కానీ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోలేకపోయాం. దీని మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇది అవసరమా? పనిచేసే పంచాయితీరాజ్ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలి. దీనికోసం ఎన్నోరకాల చర్చలు జరిపాం. ఇంకా జరుపుతున్నాం. సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షమా? పరోక్షమా? అనేదీ చర్చిస్తున్నాం. సర్పంచ్‌ను పనిచేసే సర్పంచ్‌గా ఎలా చేయగలగాలి? అని ఆలోచిస్తున్నాం. ఒకప్పుడు జిల్లా కలెక్టరుకు పంచాయతీల మీద ఎన్నో అధికారాలుండేవి. ఇప్పుడు నియంత్రణ లేకుండా పోయింది. ఈ నిస్సహాయ స్థితి నుంచి బయటపడాలి. పంచాయతీరాజ్ వ్యవస్థ గొప్పగా రూపొందించిన మహత్తరఉద్యమం. అదిప్పుడు అంతరించి పోయింది. ఏ గ్రామానికి పోయినా పెంటకుప్పలుగా ఉంటున్నది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీకి ఏమేం పనులు అప్పచెప్పాలో ఆలోచించాలి. ఈ సందర్భంగా మున్సిపల్ చట్టాన్ని సవరించే ఆలోచన కూడా చేస్తున్నాం అని సీఎం తెలిపారు.

మార్చి 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రస్థాయి ఆర్థిక కమిషన్ ఏర్పాటుచేశాం. బడ్జెట్‌లో గ్రామాలకు రెండువేల కోట్లు కేటాయిస్తాం. ఫిబ్రవరిలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు పరిశీలిస్తున్నాం. ఎన్నికల విధివిధానాలను బిల్లులో పొందుపరుస్తాం. మార్చి 12నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తాం. చిన్న గ్రామ పంచాయతీకి (500వరకు జనాభా) రూ.5 లక్షలు, తర్వాతస్థాయి పంచాయతీకి రూ.10 లక్షలు.. అలా స్థాయినిబట్టి 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు సమకూరుస్తాం. ప్రభుత్వం వందశాతం పన్నులు వసూలు చేయిస్తుంది.జాతీయస్థాయి ఆర్థిక సంఘం నిధులు ఉపయోగించుకుంటాం. ఉపాధిహామీ నిధులతో గ్రామాల్లో ఆస్తులను సమకూర్చుకుంటాం. ప్రతిగ్రామానికీ ఇలా ఇంతపెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకుంటాం. ఎమ్మెల్యే, ఎంపీ, నిధులు కూడా వినియోగిస్తాం. మనం పట్టుబడితే పరిశుభ్రమైన, అభివృద్ధికర గ్రామీణ తెలంగాణను సాధించుకోగలం అని సీఎం అన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కే కేశవరావు, సీఎస్ ఎస్పీసింగ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీనియర్ ఐఏఎస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్ల సమావేశంలో నిర్ణయాలు.. సీఎం సూచనలు -షెడ్యూల్డ్, ప్లెయిన్ ఏరియాల్లో సాదాబైనామాలు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నంతవరకు పూర్తిచేయాలి. -ఆర్వోఎఫ్‌ఆర్ ప్రతిపాదనలు జిల్లాలవారీగా పంపిస్తే, పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. -జిల్లాలవారీగా భూప్రక్షాళనకు సంబంధించి ఇంకేమన్నా సమస్యలుంటే ప్రభుత్వానికి పంపాలి. -మార్చి 12తర్వాత సాదాబైనామా దరఖాస్తుల స్వీకరణ ఉండదు. భూ బదలాయింపులన్నీ రిజిస్ట్రేషన్ ద్వారాకానీ, వారసత్వహక్కుగాకానీ మ్యుటేషన్ జరుగాలి. -కొత్తగా సబ్‌రిజిస్ట్రార్ల బాధ్యతలప్పగిస్తున్న 443 మంది తహసీల్దార్లకు, ప్రస్తుత 141 మంది సబ్‌రిజిస్ట్రార్లకు రిజిస్ట్రేషన్ కొత్త విధానంలో, ఐటీ అప్లికేషన్లలో శిక్షణ. -మార్చి12 తర్వాత బ్యాంకు రుణాల కోసం పట్టాదార్ పాస్‌పుస్తకాలు తాకట్టుపెట్టుకోకూడదు. ధరణి వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకోవాలి. -భూ సంబంధ సమస్యలు చాలా ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు ఆ చిక్కులన్నీ తొలిగిపోవాలి. ఈ సమస్యల్లో ప్రధానమైంది అసైన్డ్‌భూములు. ఈ ప్రక్రియ గతంలో చాలా అశాస్త్రీయంగా జరిగింది. చాలామంది నుంచి ధనవంతులు కూడా కొనుగోలుచేశారు. చాలా అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో ఏంచేయాలో రెవెన్యూశాఖ గైడ్‌లైన్స్ రూపొందించాలి. వీటికి అనుగుణంగా కలెక్టర్లు, జేసీలు తమ జిల్లాల్లో పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలి. అసైన్డ్ భూముల విషయంలో మానవీయకోణంలో ఆలోచించాలి. -కొత్తగా ఏర్పాటు చేసే గ్రామపంచాయతీల భౌగోళిక సరిహద్దులు (పరిధి) నిర్ణయించి జనవరి 25కల్లా ప్రభుత్వానికి కలెక్టర్లు వివరాలు పంపాలి. కొత్త పంచాయతీల ఏర్పాటుకు కనీస జనాభా 500 ఉండాలి. విడిపోతున్న గ్రామపంచాయతీకి కొత్త పంచాయతీకి మధ్య కనీసం 1.5-2 కి.మీ. దూరం ఉండాలి. -గ్రామాలు బాగుపడటానికి పంచాయతీ వ్యవస్థ ఎలా ఉండాలో కలెక్టర్లు తమ సూచనలు, సలహాలను పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శికి పంపాలి. సర్పంచ్‌ల నుంచి పని రాబట్టుకోవటానికి ఏంచేయాలో జిల్లా పంచాయతీ అధికారులు సూచనలివ్వాలి. అలాగే పంచాయతీలను సరిగ్గా పనిచేయించి సత్ఫలితాలను సాధించడానికి ఏంచేయాలో సూచనలు, సలహాలు ఇవ్వాలి. -ఈ సూచనలు, సలహాల ఆధారంగా కొత్త పంచాయతీరాజ్ ముసాయిదా బిల్లును ఫిబ్రవరి మొదటివారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. -రాబోయే ఎన్నికల్లో ఎన్నికైన సర్పంచ్‌లకు వారు పదవీ బాధ్యతలు చేపట్టేలోపు శిక్షణ ఇవ్వాలి. -గ్రామపంచాయతీస్థాయిలో సక్రమంగా పని జరుగకపోతే గ్రామం అభివృద్ధి సరిగ్గా ఉండదు. -చాలా జిల్లాలకు 2-4 లక్షల జనాభానే ఉంది. ప్రతి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాల స్థితిగతులు కంప్యూటరీకరించాలి. వాటి ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్ల్లాన్ నిధులు ఉపయోగపడేలా చూడాలి. -పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు రూపొందిస్తుంది. ఇవి ముఖ్యంగా ఆరోగ్య,వైద్యరంగంలో ఉంటాయి. -2020 కల్లా తప్పకుండా కోటి ఎకరాలకు సాగునీరు. డిసెంబర్ చివరికే చాలావరకు కాళేశ్వరం నీళ్లు వస్తాయి. -స్థానిక తక్షణ అవసరాల కోసం పెద్ద జిల్లాల కలెక్టర్లకు రూ.1.5 కోట్లు, చిన్న జిల్లాల కలెక్టర్లకు రూ.1 కోటి కేటాయింపు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.