Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బీజేపీ.. బేచో జనతాకీ ప్రాపర్టీ

-ప్రజల ఆస్తులు అమ్మటమే ఆ పార్టీ విధానం
-చమురు ధరలపై ప్రధానిది ద్వంద్వ నీతి
-గ్యాస్‌ ధరలపై ప్రజలను వంచించిన బీజేపీ
-యువత మతతత్వ శక్తుల ఉచ్చులో పడొద్దు
-రాహుల్‌గాంధీ.. ముందు అమేథీలో గెలువు
-వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కే ప్రజాశీర్వాదం
-‘ఆస్క్‌ కేటీఆర్‌’ సెషన్‌లో మంత్రి కేటీఆర్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువ సగ్గువకు అమ్మేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. బీజేపీ అంటే ‘బేచో జనతాకీ ప్రాపర్టీ’ (ప్రజల ఆస్తులను అమ్మేసే పార్టీ) అని మరో కొత్త నిర్వచనం ఇచ్చారు. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల పెంపుతో బీజేపీ అసలు నైజం బయటపడుతున్నదని ధ్వజమెత్తారు. కేంద్రానికి తెలంగాణపై వీసమెత్తు ప్రేమ కూడా లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ముందు ఇంట్లో (ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ) గెలిచి చూపించాలని సవాల్‌ విసిరారు. కేటీఆర్‌ ఆదివారం ‘ఆస్క్‌ కేటీఆర్‌’ పేరుతో నెటిజన్లతో సంభాషించారు. గంటన్నరపాటు అనేక అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీనే తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని స్పష్టం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.100 దాటాయని, ఎల్పీజీ ధర 2014లో రూ.410 ఉంటే ఇప్పుడు రూ.వెయ్యికి చేరిందని పలువురు నెటిజన్లు వాపోయారు.

దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ.. ‘మోదీజీ అన్‌స్టాపబుల్‌ (ఆపడం ఎవరి తరమూ కాదు). పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల్లో ఆయన మన దేశాన్ని ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెడుతారు. మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే. అచ్చేదిన్‌కు స్వాగతం’ అని ఎద్దేవా చేశారు. తమది పేదల ప్రభుత్వం అని చెప్పుకొంటూ ప్రజలను వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంటగ్యాస్‌ ధర పెరిగితే రోడ్లపై నానా హంగామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు కేంద్రమే పన్నులు తగ్గించాలని డిమాండ్‌ చేసిన మోదీ, ప్రధాని అయ్యాక రాష్ర్టాలే పన్నులు తగ్గించాలని సూచించడం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విమర్శించారు. కర్ణాటకలో రూ.2,500 కోట్లు ఇచ్చి సీఎం సీటు కొనుక్కోమన్నారని బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నాయని అన్నారు. హర్యానాలో ప్రభుత్వం రూ.300 కోట్ల అవకతవకలకు పాల్పడిందని సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే చెప్పడం వంటివి.. సత్య హరిశ్చంద్రుడికి సోదరుడిని అన్నట్టుగా ప్రగల్భాలు పలికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కనబడవని ఎద్దేవా చేశారు.

రాష్ట్రాలు గళమెత్తాల్సిందే
ఎల్‌ఐసీని కేంద్రం అడ్డికి పావుశేరు లెక్కన అమ్మడంపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. బీజేపీ అంటే బీ- బేచో, జే- జనతా కీ, పీ-ప్రాపర్టీ అని విమర్శించారు. సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)ని తెరవాలని కేంద్రానికి రాసిన లేఖకు స్పందన వచ్చిందా? అని ఓ నెటిజన్‌ అడగ్గా, ‘కేంద్ర ప్రభుత్వం బేచో ఇండియా పథకం కింద ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడంపైనే దృష్టిపెట్టింది’ అని ఎద్దేవా చేశారు. రాష్ర్టాల అధికారాలను కేంద్రం గుంజుకొంటున్నదని, దీనికి వ్యతిరేకంగా రాష్ర్టాలన్నీ సమిష్టిగా ప్రజాస్వామ్య పద్ధతిలో హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేసినా, తన పారిశ్రామిక అనుకూల విధానాలతో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తున్నదని, ఇప్పటికైనా కేంద్రం ఐటీఐఆర్‌ను ఇచ్చే అవకాశం ఉన్నదా? అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. ఈ ‘ఎన్‌పీఏ’ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వదని తేలడంతో ఆశలు వదిలేసుకున్నామని, సొంత ఉపాధి కల్పనపై దృష్టిపెట్టామని కేటీఆర్‌ చెప్పారు. ఐఐటీ, ఐఐఎంలు వంటి ఉన్నత విద్యాసంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారుతుందా? అన్న ప్రశ్నకు ‘ఎనిమిదేండ్లుగా ఎన్నిసార్లు అడిగినా ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ఎన్‌ఐడీ వంటి కేంద్ర సంస్థలను మోదీ ప్రభుత్వం ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదు. భవిష్యత్తులో వస్తాయనే ఆశ పెట్టుకోవడం కూడా వృథా’ అని స్పష్టం చేశారు.

మతోన్మాదుల ఉచ్చులో పడకండి..
ఉర్దూలో గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించడంపై ఒక నెటిజన్‌ ప్రశ్నించగా.. ‘తెలుగు మాదిరిగానే ఉర్దూ కూడా ఒక అధికారిక భాష. కేంద్ర ప్రభుత్వం, యూపీఎస్సీ సహా అనేక రాష్ర్టాలు ఉర్దూలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో నిర్వహిస్తే తప్పేంటి? అనవసరంగా మతోన్మాదుల ఉచ్చులో పడకండి’ అని సూచించారు. ప్రభుత్వ దవాఖానలు ప్రైవేటుతో సమానంగా ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి? అన్న ప్రశ్నకు ‘రాష్ట్రంలో వైద్యారోగ్య రంగాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌కు మరో మూడు టిమ్స్‌, వరంగల్‌లో హెల్త్‌ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. దీంతో సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి’ అని వివరించారు.

హైదరాబాద్‌ను ఇండియన్‌ సినిమా హబ్‌గా మా ర్చాలంటే ప్రపంచ స్థాయి ఫిల్మ్‌ స్కూల్‌/ యూనివర్సిటీ ఉండాలని సోనీ లివ్‌ తెలుగు హెడ్‌ శ్రీధర్‌రెడ్డి కొమ్మల సూచించగా.. సీఎం కేసీఆర్‌ ఈ విషయంపై ఎప్పుడో దృష్టి సారించారని, కరోనా వల్ల కాస్త ఆలస్యమైందని కేటీఆర్‌ సమాధానమిచ్చారు.
బీఆర్‌ఎస్‌ పథకంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నదని, దానిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
కొవిడ్‌ వల్ల పోలీస్‌ ఉద్యోగార్థులు రెండేండ్లు నష్టపోయారని, వయో పరిమితిని 3-5 ఏండ్లకు పెంచాలని ఓ నెటిజన్‌ కోరగా.. పరిశీలించాల్సిందిగా హోం మంత్రి మహమూద్‌ అలీని కోరారు.
ఇటీవల హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని త్వరలో పరామర్శించేందుకు ప్రయత్నిస్తానన్నా రు. హంతకులకు శిక్ష పడుతుందని స్పష్టంచేశారు.
ఆదిలాబాద్‌లో ఐటీ కంపెనీ బీడీఎన్‌టీ ల్యాబ్స్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారని ఓ నెటిజన్‌ అడుగ్గా.. జూన్‌లో వస్తున్నట్టు వెల్లడించారు. టైర్‌-2, టైర్‌-3 సిటీలు ఐటీ ఎగుమతుల వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు.
మిషన్‌ భగీరథను ‘కోట్ల మంది జీవితాలను మార్చిన పథకం’ అని అభివర్ణించారు.
తనకు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు వచ్చిందని, తా త్కాలిక ట్రాక్టర్‌ డ్రైవర్‌ అయిన తన తండ్రికి చదివించే స్థోమత లేదని సిరిసిల్లకు చెందిన బూర అర్వింద్‌ సాయం కోరగా.. ‘సూపర్‌ బ్రదర్‌.. తప్పకుండా సాయం చేస్తాం’ అని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధిపై స్పందించాలని కోరగా.. ఏడేండ్లలో 120 శాతం సాగు వి స్తీర్ణం పెరిగిందని, ఉచితంగా 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా, రైతుబంధు, రైతుబీమా, మిషన్‌ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఒకప్పుడు కరువు కాటకాల తో అలమటించిన పాలమూరు జిల్లా నేడు పచ్చని పొలాలతో, రెండు పంటలతో శోభిల్లుతున్నదని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు.

మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారం

రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌, బీజేపీతోపాటు అనేక ప్రతిపక్షాల నుంచి పోటీ ఉంటుంద ని, అయినా తెలంగాణ ప్రజలు తిరిగి టీఆర్‌ఎస్‌నే ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. బీజేపీ, ప్రధాని మోదీ విధానాలను కాంగ్రెస్‌కన్నా గట్టిగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ నిలదీస్తున్నదని, మో దీని ఢీకొట్టడానికి టీఆర్‌ఎస్‌ను తెలంగాణ దాటి విస్తరింపజేయాలని ఓ నెటిజన్‌ సూచించగా.. ‘భవిష్యత్తులో ఏం జరుగబోతున్నదో ఎవరికి తెలు సు?’ అని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీకి మీరి చ్చే సలహా ఏమిటని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. ‘ముం దు ఇంట (యూపీలోని అమేథి) గెలిచేందుకు ప్రయత్నించు. ఆ తర్వాత రచ్చ గెలుద్దువు’ అని సూచించారు. కాంగ్రెస్‌ వాళ్లు సీఎం కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తుండటం తో పార్టీ అధికారిక ట్వి ట్టర్‌ ఖాతాను బ్లాక్‌ చేసినట్టు చెప్పారు. మీ సేవలు, మీ నాయకత్వం జాతీయస్థాయిలో అవసరమని ఒకరు అడుగ్గా.. తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో చాలా సంతోషంగా ఉన్నానని సమాధానమిచ్చారు. పాఠశాలలో తన కుమారుడు హిమాన్షు క్రియేటివ్‌ యాక్షన్‌ ప్లాన్‌కు ప్రాతినిధ్యం వహించడంపట్ల ‘తండ్రిగా గర్వపడుతున్నా’ అని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలనుకొనే యువత అత్యంత సహనంతో, కఠోర శ్రమ చేయాలన్నారు. కేసీఆర్‌ తర్వాత దేశంలో తనకు అత్యంత ఇష్టమైన నేత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.