Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బీజేపీ చేసిందేమిటి?

-తెలంగాణకు కేంద్రం ఒక్కపైసయినా అదనంగా ఇచ్చిందా?
-రాష్ట్రం నుంచి వెళ్లిన నిధులు కూడా వెనక్కి రావటం లేదు
-స్మార్ట్‌, అమృత్‌ సిటీలు ఏమయ్యాయి?
-ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌, బీజేపీలు కుమ్మక్కయ్యాయి
-ఐదేండ్లకే చార్జిషీట్‌ వేస్తే ఆ రెండు పార్టీలపై ఎన్నివేయాలి?
-జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లు చూపిస్తాం..
-బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఇండ్లు కిషన్‌రెడ్డి చూపించగలరా?
-మీడియా ఇష్టాగోష్ఠిలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు

కేంద్రంలో ఆరేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ర్టానికి అదనంగా ఒక్కపైసా నిధులు ఇచ్చిందా? ఒక్క మంచి పని అయినా చేసిందా? అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. ఐదేండ్లు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై చార్జిషీట్‌ వేస్తామంటున్నారు.. దేశాన్ని, రాష్ర్టాన్ని దశాబ్దాలపాటు పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌లపై మేము ఎన్ని చార్జిషీట్లు వేయాలి? అని ఎద్దేవాచేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్‌ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ము న్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై అభిప్రాయాలను వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే.. ఎన్నికల్లో పోటీచేయడానికి ప్రతిపక్షాలకు అభ్యర్థులు ఎందుకు దొరుకడంలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌పై చార్జిషీట్‌ వేయడం కాదు.. ముందుగా అన్నిస్థానాల్లో అభ్యర్థులను నిలపండంటూ బీజేపీని ఉద్దేశించి అన్నారు.

కేంద్రప్రభుత్వం ఆరేండ్లలో రాష్ర్టానికి చేసిన ఒక్క మంచిపని కూడాలేదని, రాష్ట్రం నుంచి వెళ్లిన నిధులు కూడా తిరిగి రావడం లేదని విమర్శించారు. మున్సిపోల్స్‌లో తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. అన్నిపార్టీల జాతకాలు ఈ నెల 25న బయటపడుతాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీలు ఎక్కడున్నాయో చూపెట్టాలని.. రాష్ట్రంలో ప్రకటించిన రెండు స్మార్ట్‌సిటీలకు ఎన్ని నిధులు ఇచ్చారో ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు లక్ష్మణ్‌ చెప్పాలని నిలదీశారు. అమృత్‌ పథకంతో ఎన్ని పట్టణాలు అమృతాలొలుకుతున్నాయి? అని ఎద్దేవాచేశారు. మీ విధానం చెత్త మున్సిపాలిటీలు అయితే.. తమవి కొత్త మున్సిపాలిటీలని వివరించారు. ప్రతిపక్షాలది గుడ్డి వ్యతిరేకత అని, తెలంగాణ ఉద్యమకాలం నుంచీ వాటిది వితండవాదమేనని విమర్శించారు. పురపాలకశాఖ మంత్రిగా మున్సిపల్‌ ఎన్నికలు తనకు సవాల్‌ లాంటివని కేటీఆర్‌ పేర్కొన్నారు.

అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ
టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంఐఎంతో ఎప్పుడు కూడా పొత్తుపెట్టుకోలేదని కేటీఆర్‌ చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్‌, పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో అన్నిస్థానాల్లోనూ ఒంటరిగానే పోటీచేశామని గుర్తుచేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అన్నిస్థానాల్లో బరిలో నిలిచామన్నారు. భైంసాలో మూడువార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవం కావడానికి స్థానిక పరిస్థితులే కారణమని చెప్పారు. మతపరమైన, జాతీయఅంశాలు స్థానిక ఎన్నికల్లో పనిచేయవని..స్థానికంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ప్రభావితం చేస్తాయని తెలిపారు.

ఇక పరిపాలన.. పురపాలనే
మున్సిపోల్స్‌ ముగిశాక నాలుగేండ్లపాటు ఎలాంటి ఎన్నికలు ఉండవని.. ఇక పరిపాలనతోపాటు పురపాలనపై దృష్టి పెడుతామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. గతంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి 68 మాత్రమే ఉండేవని.. ఇప్పడు వాటిని 141 చేశామన్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాలు, కొత్త పంచాయతీలు, కొత్త మండలాలు, కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటుచేసుకున్నామని చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని.. జగిత్యాల, కరీంనగర్‌, నిజామాబాద్‌, నారాయణపేట, నిర్మల్‌ సహా అనేకచోట్ల జాతీయపార్టీలు పరోక్షంగా పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ రెబెల్‌ అభ్యర్థుల సమస్య 95 శాతం పరిష్కారమయిందని, ఒకటి రెండుచోట్ల ఉన్నవారు త్వరలోనే దారికి వస్తారని చెప్పారు. ప్రజల ఆదరణ ఉన్నది కాబట్టే టీఆర్‌ఎస్‌లో బీ ఫాంలకు పోటీ పెరిగిందని చెప్పిన కేటీఆర్‌.. ప్రజాదరణ లేకపోవడం వల్లే ప్రతిపక్షాల నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని తెలిపారు.

హైదరాబాద్‌లోనే డబుల్‌ బెడ్‌రూంలకు రూ. 9వేల కోట్లు దేశంలో ఏ మెట్రోనగరంలోనూ లేనివిధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2.70 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను రూ.18 వేల కోట్లతో చేపట్టామన్నారు. వాటిని చూపించడానికి సిద్ధంగా ఉన్నామని.. బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి ఇండ్లను నిర్మించారో చూపించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. పేదలకు ఇండ్లకోసం ఇంత పెద్దఎత్తున బడ్జెట్‌ ఏ రాష్ట్రం కూడా కేటాయించలేదని.. ఒక్క హైదరాబాద్‌లోనే రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోనూ ఇండ్లను చూపిస్తామని తెలిపారు.

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం
పీఆర్సీపై నివేదిక రాగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్‌ తెలిపారు. ఆర్థికమాంద్యం ప్రభావం రాష్ట్రంలోనూ ఉన్నదని.. ఆర్ధికంగా భారంపడే అంశాలపై ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని అన్నారు. మ్యానిఫెస్టోను అమలుచేయడానికి ఐదేండ్లు సమయం ఉంటుందని, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్షితోపాటు మ్యానిఫెస్టోలో పెట్టని అనేక అంశాలను కూడా అమలుచేశామని తెలిపారు. టిక్కెట్లు రానప్పుడు ఆరోపణలు చేయడం సహజమని.. మంత్రి మల్లారెడ్డిపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ మంత్రి చెప్పారు. కొత్త మున్సిపల్‌చట్టాన్ని అమలుచేయడం ఆశాఖ మం త్రిగా ఒక సవాల్‌ అని అన్నారు. తాగునీరు, కరంటు, పారిశుద్ధ్యం, అర్బన్‌పార్క్‌లు, అర్బన్‌లంగ్‌స్పేస్‌ ఇలా పట్టణాల్లో అనేకరకాల మార్పులు తీసుకువచ్చామని తెలిపారు.

గడువు ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
జీహెచ్‌ఎంసీకి నిర్ణీత గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని కేటీఆర్‌ తెలిపారు. సీఎంగా మరో పదేండ్లు ఉంటానని కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని.. దానిపై మళ్లీ ఊహాగానాలు అవసరం లేదని చెప్పారు. జీహెచ్‌ఎంసీని వికేంద్రీకరించాల్సిన అవసరముందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.

అమలవుతున్న పథకాలతో కాంగ్రెస్‌ డాక్యుమెంట్‌
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటికే అమలుచేస్తున్న పథకాలను కాపీకొట్టి కాంగ్రెస్‌ పార్టీ తన విజన్‌ డాక్యుమెంట్‌ లో పొందుపర్చిందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లో కూర్చుని క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధం లేని డాక్యుమెంట్‌ను రూపొందించారని.. అందులో విజన్‌ ఏమాత్రం లేదని ఎద్దేవాచేశారు. మరో నాలుగేండ్లపాటు అధికారంలోకిరాని పార్టీ హామీలు ఎలా అమలుచేస్తుందో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌కు అనేక అంశాలపై కనీస అవగాహన కూడా లేదని, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకే విజన్‌ డాక్యుమెంట్‌తో మోసం చేస్తున్నదని చెప్పారు. ఐదు రూపాయలకు కిలో బియ్యం పథకం ఇప్పటికే అమలవుతున్నదని, చెరువుల సుందరీకరణను మినీట్యాంక్‌బండ్‌ పేరుతో అమలుచేస్తున్నామని చెప్పారు. గతంలో హుస్సేస్‌సాగర్‌ మీద మాత్రమే ట్యాంక్‌బండ్‌ ఉండేది.. ఇప్పుడు 90 పట్టణాల్లో మినీ ట్యాంక్‌బండ్‌లు ఏర్పాటుచేశామని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు, ప్రతిపక్షనేతలకు ఓపిక ఉంటే నాగర్‌కర్నూల్‌, ఖమ్మం పట్టణంలోని లకారం చెరువు, వరంగల్‌లో భద్రకాళి చెరువు వద్దకు వెళ్లి చూడాలని కేటీఆర్‌ సూచించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటికే అమలుచేస్తున్న పథకాలను కాపీకొట్టి కాంగ్రెస్‌ తన విజన్‌ డాక్యుమెంట్‌లో పొందుపర్చింది. హైదరాబాద్‌లో కూర్చుని క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధం లేని డాక్యుమెంట్‌ను రూపొందించారు. అందులో విజన్‌ ఏమాత్రం లేదు. మరో నాలుగేండ్లపాటు అధికారంలోకిరాని పార్టీ హామీలు ఎలా అమలుచేస్తుందో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పాలి.
– మంత్రి కే తారకరామారావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.