-అయినా ఎగిరిన తెలంగాణ ఆత్మగౌరవ బావుటా
-నరేంద్రమోదీ, అమిత్‌షాకు కీలుబొమ్మ రాజగోపాల్
-సీఆర్‌పీఎఫ్, ఐటీతో మునుగోడుపై దండయాత్ర
-ఈటల, రాజగోపాల్‌తోనే ఎన్నికలు డబ్బుమయం
-బీజేపీ ధన ప్రవాహానికి హవాలా కింగ్‌పిన్‌లా వివేక్
-జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు స్వయంగా ప్రధానే వచ్చారు..
-ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారానికి మేం వెళ్లకూడదా?

మునుగోడు ప్రజలు బీజేపీ అధికార, ధన మదానికి చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కీలుబొమ్మ మాత్రమేనని విమర్శించారు. కోట్లకొద్దీ హవాలా డబ్బుతో ఉప ఎన్నికలో గెలిచేందుకు బీజేపీ విఫలయత్నం చేసిందని ఆరోపించారు. ఆదివారం మునుగోడు ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 2018 సార్వత్రిక ఎన్నికల తరువాత వచ్చిన హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా నల్లగొండ గడ్డపై మొట్ట మొదటిసారి 12కు 12 స్థానాలను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టి ఓటర్లు కొత్త చరిత్ర లిఖించారని కొనియాడారు. పార్టీ గెలుపుకోసం కృషిచేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మునుగోడు ఓటర్లు, వామపక్ష నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ఆత్మగౌరవ విజయం
రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయనేందుకు మునుగోడు ఉప ఎన్నికే నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. అమిత్‌షా, నరేంద్రమోదీ అహంకారం, డబ్బుమదంతో రాజకీయంగా కండ్లు నెత్తికెక్కి పొగరుతో బలవంతపు ఉప ఎన్నికను తెలంగాణ ప్రజలపై, మునుగోడు ప్రజలపై రుద్దారని ధ్వజమెత్తారు. మునుగోడు ప్రజానీకం వాళ్లిద్దరి అహంకారానికి చెంపపెట్టువంటి తీర్పు ఇచ్చిందని అన్నారు. ఈ గెలుపు ద్వారా మునుగోడు ప్రజలు తమ ఆత్మగౌరవమే కాకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటాను ఎగురవేశారని ప్రశంసించారు. మునుగోడు ప్రజలు గుద్దిన గుద్దుతో ఎన్నికలు రుద్దినవాళ్లకు చక్కరొచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను గౌరవించాలనే ఇంగితం లేకుండా తొమ్మిది రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చడమే కాకుండా తెలంగాణలో కూడా ఈ క్రూరమైన రాజకీయ క్రీడకు బీజేపీ తెరలేపిందని విమర్శించారు. ఈ కుట్ర వెనుక అమిత్‌షా, మోదీ ఉన్నారనే విషయం తెలిసే చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు తమ తీర్పుతో వారి అధికార మదా న్ని, అహంకారాన్ని తొక్కివేశారని అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఇంకా భారీ మెజార్టీ రావాల్సివున్నా, అక్కడ బీజేపీ అనేక అడ్డదారులు తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో కాస్త తగ్గిందని చెప్పారు. బీజేపీ ఢిల్లీ నాయకత్వం, గల్లీ నాయకత్వం ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బు సంచులతో, మద్యంతో అడ్డదారిలోనైనా ఓటర్లను ప్రలోభపెట్టి గెలవాలని చూసిందని విమర్శించారు. ఎన్నికలను ధనమయంచేసి జనం గొంతునొక్కే ప్రయత్నం బలంగా చేసిందని మండిపడ్డారు.
బీజేపీ కోట్లకొద్దీ ధన ప్రవాహం
ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే కోటి రూపాయలతో దొరికింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అనుచరుడై కరీంనగర్ కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు అని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ‘బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పీఏ శ్రీనివాస్ రూ.90 లక్షలతో దొరికింది నిజం కాదా? గుజరాత్ నుంచి వివేక్ హవాలా మార్గంలో రూ.2.5 కోట్లు తెప్పించి దొరికింది నిజం కాదా? నేను ఆషామాషీగా ఈ విషయాలు చెప్పటం లేదు. పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా. వివేక్ కింగ్‌పిన్‌లా వ్యవహరిస్తూ గతంలో ఈటల రాజేందర్‌కు, ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి ఆయన కంపెనీ నుంచి రూ.75 కోట్లు పంపిన మాట వాస్తవం కాదా? పార్టీ మారంగానే రాజగోపాల్ కంపెనీ ఖాతాల్లోకి రూ.75 కోట్లు ప్రవహించింది నిజం కాదా? రూ.75 కోట్లు బదిలీ చేయడమే కాకుండా వివేక్ అనుచరుడు మణికొండలో రూ.కోటితో పట్టుబడింది నిజం కాదా? జమునా హేచరీస్‌కు రూ.25 కోట్లు వివేక్ ట్రాన్స్‌ఫర్ చేసింది నిజం కాదా? వివేక్ ఒక హవాలా ఆపరేటర్ మాదిరిగా అక్కడ రూ. 25కోట్లు, ఇక్కడ రూ.75 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఎవరికోసం ఇంత సొమ్ము ఇస్తున్నారు? రాజ్‌గోపాల్‌రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ నుంచి రూ.5.25 కోట్లు మునుగోడులోని ఓటర్లకు, బీజేపీ నాయకుల బ్యాంక్ అకౌంట్లకు డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? ఈ అంశంపై మేం ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఆధారాలతో ఫిర్యాదు చేసినా బీజేపీ నేతలు ఢిల్లీలో ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి ఈసీ ప్రేక్షకపాత్ర వహించేలా చేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఒకటి రెండు కాదు.. వారు చేసిన అధికార దుర్వినియోగం, విచ్చలవిడితనం పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు. టీఆర్‌ఎస్ డబ్బు పంపిణీ చేస్తున్నదనే ఆరోపణతో 15 సీఆర్‌పీఎఫ్ కంపెనీల బలగాలు, 40 ఐటీ బృందాలను మునుగోడుపై దండయాత్రకు పంపారని ఆరోపించారు.
మెజార్టీపై మేమూ ఆరోపణలు చేయగలం
ఎన్నికల కమిషనే తొలగించిన రోడ్డు రోలర్ గుర్తుతోపాటు కారును పోలిన గుర్తులను మళ్లీ బలవంతంగా తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. టీఆర్‌ఎస్ గుర్తును పోలిన ఆ గుర్తులకు సుమారు 6 వేల ఓట్లు పడ్డాయని, లేకపోతే టీఆర్‌ఎస్‌కు 17 వేల ఓట్ల మెజార్టీ వచ్చేదని చెప్పారు. ఓడిపోయిన వెంటనే నెపాలు వేయడం, నిందలు మోపడం, చిల్లరమల్లర మాటలు మాట్లాడటం బీజేపీకి అలవాటేనని మండిపడ్డారు. ‘ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చని, ఫలితాలను తారుమారు చేస్తామని ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ బ్రోకర్లు స్పష్టంగా చెప్తున్నారు. ఈవీఎంలను మేనేజ్ చేశారని, గుర్తులను తారుమారు చేయటంవల్లనే టీఆర్‌ఎస్‌కు మెజార్టీ తగ్గిందని మేం కూడా ఆరోపణలు చేయగలం’ అని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఎవరి ఆధీనంలో ఉంటదనే కనీస జ్ఞానం కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి లేకపోవటం బాధాకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఈసీ పనిచేస్తున్నదని, దానిని కూడా తిడుతున్నారంటే.. మోదీని తిట్టినట్టేనని అన్నారు. కాంట్రాక్టులు, కాసులు ఇచ్చి తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కేందుకు బీజేపీ ప్రయత్నించినా.. టీఆర్‌ఎస్ జైత్రయాత్రను ఆపలేకపోయిందని ఎద్దేవా చేశారు.

మోదీ రావచ్చు.. మేం వెళ్తే తప్పా?
చిన్నపాటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం స్వయానా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ కేంద్ర నాయకత్వం అంతా వచ్చి ప్రచారం చేశారని, ఒక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తాము వెళ్తే తప్పేంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వాళ్లు చేస్తే సంసారం, వేరేవాళ్లు చేస్తే వ్యభిచారమా? ఇదెక్కడి నీతి? అని నిలదీశారు. ఎన్నికల్లో ఓటమి సహజమని, దాన్ని అంగీకరించే దమ్ము, హుందాతనం ఉండాలని వ్యాఖ్యానించారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్‌లో తాము ఓడిపోయినప్పుడు హుందాగా ఒప్పుకొన్నామని, ఆ స్థితప్రజ్ఞత టీఆర్‌ఎస్‌కు ఉన్నదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఇంగితం, సంస్కారం బీజేపీకి లేవని విమర్శించారు.
ఓటమి భయంతోనే దాడులు
ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ప్రచారం వాళ్లు చేసుకొంటూ వెళ్లాలని మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ మాత్రం మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డిని కొన్ని గ్రామాల్లో ప్రజలు ఛీత్కరించి తరిమికొట్టారని, దాన్ని తట్టుకోలేక పలివెల గ్రామంలో కెలికి కయ్యం పెట్టుకొని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై రాళ్ల దాడికి పాల్పడ్డారని విమర్శించారు. ‘పలివెలలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్‌తో పాటు 12 మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలను రక్తం వచ్చేలా కొట్టారు. మళ్లీ తెల్లారేసరికి బీజేపీ వాళ్లనే కొట్టినట్టు డ్రామాలు ఆడారు. ఈటల రాజేందర్ స్వయంగా మీడియా ముందు డ్రామాలు వేశారు. ఇక బండి సంజయ్ అనే తొండి మనిషైతే మునుగోడులో ఏదో జరిగిపోయిందని, ఆగమేఘాల మీద వెళ్లి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తానని చెప్పి అర్ధరాత్రి బయలుదేరారు. ఎందుకీ చిల్లర డ్రామాలు? ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఎక్కడైనా ఉంటుందా?’ అని నిలదీశారు.
ఈటల, రాజగోపాల్ వల్లే ఎన్నికలు ధనమయం
తెలంగాణ ఏర్పడిన తర్వాత నారాయణ్‌ఖేడ్, పాలేరు, దుబ్బాక, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ తదితర అనేకచోట్ల ఉప ఎన్నికలు వచ్చినా ఎక్కడా ఎన్నికలు డబ్బుమయం కాలేదని, హుజూరాబాద్, మునుగోడులో మాత్రమే ఎందుకయ్యాయని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ అనే ధనవంతులు, కాంట్రాక్టర్లు వచ్చిన తర్వాతే ఉప ఎన్నిక ధనమయం, కలుషితం అయ్యిందని ఆరోపించారు. ధనస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం మీద రుద్దుతున్నది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. ఈ ఇద్దరు ధనవంతులకు వందల కోట్లు ఢిల్లీ నుంచి పంపి, తిమ్మిని బమ్మిని చేసైనా గెలవాలని ఆదేశించారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఏమైనా అడ్డదారులు తొక్కి ఉంటే.. ఐటీ కంపెనీలు, సీఆర్‌పీఎఫ్ బలగాలు ఏం చేశాయని ప్రశ్నించారు. బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడులో టీఆర్‌ఎస్‌కు ఓటు శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు. గతంలో 74,687 ఓట్లు రాగా, ప్రస్తుతం సుమారు 97 వేల ఓట్లు వచ్చాయని చెప్పారు.
ఆల్ ఫేక్ పార్టీ బీజేపీ
బీజేపీ అంటేనే ఆల్ ఫేక్ పార్టీ అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీలో అందరూ ఫేకేనని విమర్శించారు. మునుగోడులో స్వతంత్రులను నకిలీ అభ్యర్థులుగా నిలబెట్టి ఓట్లు చీల్చేందుకు యత్నించారని ఆరోపించారు. ‘పైన ఉన్నోడు ఫేకుడు.. ఇక్కడ ఉన్నోడు జోకుడు తప్ప ఇంకేం లేదు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టారని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపారనని.. ఇలా చెప్పుకొంటే పోతే బీజేపీ అంతా ఫేక్.. ఫేక్.. ఫేక్’ అని కేటీఆర్ విమర్శించారు.
బీజేపీ ఫేక్‌లు
-ఇండింపెండెంట్‌లు ఫేక్
-రోడ్డురోలర్ వంటి గుర్తులు ఫేక్
-రూ.3 వేల పెన్షన్ ఫేక్
-1000 కోట్ల నిధులు ఫేక్
-రాజగోపాల్‌రెడ్డికి జ్వరం ఫేక్
-కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్‌ఎస్‌లో చేరారన్నది ఫేక్
-కర్నె ప్రభాకర్ బీజేపీలో చేరినట్టు చేసిన ప్రచారం ఫేక్
-టీవీలు, ఏజెన్సీల పేరుతో సర్వేలు ఫేక్
-ఐటీ దాడులు ఫేక్
-మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ఇంట్లో డబ్బులు దొరకడం ఫేక్
-రాజగోపాల్‌రెడ్డి ఓటేసినట్టు చెప్పడం ఫేక్
ఉద్యోగ సంఘాలనూ వదల్లేదు
మునుగోడులో గెలిచేందుకు బీజేపీ చేయకూడని పనులన్నీ చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రస్థానంలో ఉండి పోరాడిన టీఎన్జీవో నేతలను సైతం అమ్ముడుపోయారంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరికి ఉద్యోగ సంఘాలను కూడా వదలకుండా చిల్లర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. రెండు శిఖండి పార్టీలను ముందు పెట్టి.. టీఆర్‌ఎస్ ఓట్లను చీల్చే కుట్రలు చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఓటర్ల దగ్గరికి వెళ్లి కమలం పువ్వు గుర్తును చేతిపై మెహందీగా పెట్టారని, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉంటుందా? అని నిలదీశారు. దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడాలని, అంతే తప్ప అడ్డదారుల్లో గెలవాలని చూడొద్దని హితవు పలికారు. బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టిన మునుగోడు తీర్పు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని బతికించిన ఓటర్లకు, గులాబీ దండుకు, ఎర్రసైన్యానికి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.
మాట నిలబెట్టుకుంటా..మునుగోడును దత్తత తీసుకుంటా
ఎన్నికల ప్రచారం సందర్భంగా వాగ్దానం చేసినట్టుగా మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించడం ద్వారా టీఆర్‌ఎస్ పట్ల, సీఎం కేసీఆర్ నాయకత్వం పట్ల నమ్మకం ఉంచిన మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఇంతకుముందు వాగ్దానం చేసినట్టుగా మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా గట్టుప్పల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఓటర్లనుద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కూసుకుంట్లను గెలిపిస్తే మంత్రిగా తాను మునుగోడును దత్తత తీసుకుంటానని, నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నల్లగొండ వాసులకు ధన్యవాదాలు
పూర్వ నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందడం పట్ల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తంచేశారు. చరిత్రలో మొదటిసారిగా ఒకే పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకున్నందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు ధన్యవాదాలు తెలిపారు. గత మూడేండ్లలో జరిగిన మూడు ఉప ఎన్నికలలో విజయం చేకూర్చడం ద్వారా నల్లగొండ జిల్లా వాసులు టీఆర్‌ఎస్‌పై పూర్తి నమ్మకముంచారని ఆయన సంతోషం వ్యక్తంచేశారు. మూడేండ్లలో హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, తాజాగా మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం సాధించింది.