Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బీజేపీది అహంకారం.. అసహనం

-వాళ్లవి దొంగమాటలు.. దొడ్డిదారులు
-మేం చెప్పినవి చేస్తాం.. చేసినవే చూపిస్తాం
-వాళ్లు ఏం చేయకున్నా.. చేశామంటారు
-గోబెల్స్‌కే పాఠాలు చెప్పగల సమర్థులు
-మా పనులే మా నినాదం
-మా గురించి ప్రజలకు తెలుసు
-వాళ్లవి దొంగమాటలు.. దొడ్డిదారులు
-మేం చెప్పినవి చేస్తాం.. చేసినవి చూపిస్తాం
-వాళ్లు ఏం చేయకున్నా.. చేశామంటారు
-గోబెల్స్‌కే పాఠాలు చెప్పగల సమర్థులు
-దుబ్బాకలో గెలుపు మాదే.. భారీ మెజార్టీ ఖాయం
-మా పనులే మా నినాదం.. మా గురించి ప్రజలకు తెలుసు
-నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి హరీశ్‌రావు

బీజేపీ రాష్ట్ర నేతలు అహంకారంతో, అసహనంతో వ్యవహరిస్తున్నారని ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ ఎన్ని అబద్ధాలు చెప్పినా.. ఎన్ని నాటకాలు వేసినా టీఆర్‌ఎస్‌కు ప్రజల్లోనుంచి కొంచెంకూడా ఆదరణ తగ్గకపోవడాన్ని కాషాయ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఈ ఎన్నికలో తాము ఇప్పటివరకు ఏం చేశామో చెప్పి ప్రజలను ఓట్లడిగామని, కమలంపార్టీ నేతల్లా కోతలు కోయలేదన్నారు. బీజేపీ నేతలు ఎన్నివిధాలుగా బరితెగించినా తాము సంయమనంతో వ్యవహరించామని చెప్పారు. ఈ ఎన్నికలో తాము గతం కంటే ఎక్కువ ఓట్లతో బ్రహ్మాండమైన మెజార్టీ సాధిస్తామని హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ ప్రచార సారథి, ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు నమస్తే తెలంగాణకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవీ వివరాలు..

-దుబ్బాక నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి

ఎంత మెజారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు?
భారీ మెజార్టీ ఖాయం. మేం నేలవిడిచి సాముచేయడం లేదు. క్షేత్రస్థాయిలో ఉండి మాట్లాడుతున్నాం. గత మెజార్టీ కన్నా ఎక్కువే వస్తుందన్నది మా విశ్వాసం. ప్రజల్లో మా పాలనపై నమ్మకం ఉన్నది. కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరిచేందుకు వందల కారణాలున్నాయి. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను రూ.2,016కు పెంచాం. రైతుబంధును రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచాం. కాళేశ్వరం నీళ్లు జీవితకాలంలో చూస్తామా అని కాంగ్రెస్‌, బీజేపీ గోబెల్స్‌ ప్రచారం చేశాయి. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు దుబ్బాక రైతన్నల కాళ్లను ముద్దాడుతున్నాయి. ఈ నియోజకవర్గం వ్యవసాయాధారితం. 78 వేల రైతు కుటుంబాలున్నాయి. మాది రైతు ప్రభుత్వం. మా నాయకుడు కేసీఆర్‌ స్వయంగా రైతు. మా ప్రభుత్వం చేసిన పనులే మా నినాదం. మేము ఏమిచేశామో ఇక్కడి ప్రజలు చూశారు. అందుకే వందకు వందశాతం మా మెజార్టీ గతంకన్నా పెరగటం ఖాయం.

ఇంకా రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్‌, బీజేపీ ఆరోపిస్తున్నాయి?
రైతు రుణమాఫీలో.. రూ.25 వేల లోపు తీసుకున్నవారికి రుణమాఫీ ఇప్పటికే అమలుచేశాం. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే రైతు చేతికే నేరుగా అందిస్తాం. కానీ, కరోనా విపత్తుతో రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయి జాప్యమైంది. కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు కూడా అందలేదు. కేంద్రం రాష్ర్టాన్ని నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం.

ప్రచారంలో చివరిరోజు వరకు భారీగా ఇతర పార్టీలవారు టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని ఎలా విశ్లేషిస్తారు?
దుబ్బాక టీఆర్‌ఎస్‌ అడ్డా. ఇక్కడ మా పార్టీకి మొదటి నుంచి ప్రజల అండ ఉన్నది. ఎన్నిక ఏదైనా విజయం టీఆర్‌ఎస్‌నే వరించింది. మా పార్టీ ప్రచారానికి అద్భుత స్పందన లభించింది. ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌ సభలకు, సమావేశాలకు తరలివచ్చారు. బీజేపీ నేతలు సోషల్‌మీడియాతో రెచ్చగొట్టేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నంచేశారు. ఝూటా మాటలు చెప్పారు. వాటిని ప్రజలే కాదు.. ఆ పార్టీ కార్యకర్తలు కూడా నమ్మడంలేదు. ఆ పార్టీ యువత సొంత నేతల తప్పుడు ప్రచారంపై తలెత్తుకోలేకపోతున్నారు. తెలంగాణ ఇస్తున్న పెన్షన్లను కేంద్రం ఇస్తున్నదని, డబుల్‌ బెడ్‌రూంలకు బీజేపీ ప్రభుత్వం నిధులు ఇస్తున్నదని, గొర్రెల పథకానికి ఒక్కొక్కరికీ రూ.50 వేలు ఇస్తున్నదని, రూ.2,000 కోట్ల విద్యుత్‌ బకాయిలు కేంద్రం ఇచ్చిందని అడ్డగోలు మాటలు చెప్పారు. వీటిని వినీవినీ బీజేపీ స్థానిక నేతలు, కార్యకర్తలు విసిగిపోయారు. అందుకే వారు ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. దౌల్తాబాద్‌, మిరుదొడ్డిలోని 14 గ్రామాలు టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. అక్కడ బీజేపీ గ్రామశాఖలు కూడా రద్దయ్యాయి. వారంతా గులాబీజెండా పట్టుకొని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతను గెలిపించేందుకు కంకణం కట్టుకున్నారు. మనస్సాక్షిని చంపుకోలేమని చెప్తున్నారు. తొగుట, చేగుంట, రాయపోలు తదితర మండలాల్లో వారం రోజులుగా వందల మంది బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. తోట కమలాకర్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు గులాబీ కండువా కప్పుకొన్నారు.

దుబ్బాకలో బీజేపీ నేతలను, అభ్యర్థి రఘునందన్‌రావును వేధించారని ఆరోపిస్తున్నారు.. నిజమేనా?
ఇదో దుర్మార్గ ప్రచారం. ఉద్దేశపూర్వకంగా వేధించడమన్నది మా పాలసీనే కాదు. అది బీజేపీ పాలసీ. ఉత్తర భారతదేశంలో ఏం జరుగుతున్నదో, అనేక రాష్ర్టాలను ఆ పార్టీ ఎలా కైవసం చేసుకున్నదో చూస్తూనే ఉన్నాం. సిద్దిపేటలో రఘునందన్‌రావు బంధువుల ఇండ్లతోపాటు టీఆర్‌ఎస్‌ నాయకుల ఇండ్లలోనా అధికారులు సోదాలు నిర్వహించారు. కానీ, రఘునందన్‌ ఎందుకు తన బంధువు ఇంటి వద్దకే వెళ్లి ఆందోళనచేశారు? తొలుత ఆ ఇంటితో సంబంధమే లేదన్నారు. నిజంగా అక్కడికి ఆయన డబ్బులు తరలించకపోతే కంగారెందుకు? వాళ్ల అత్త, మామలు పోలీసులకు స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చారు. బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయనేలేదు. కరీంనగర్‌లోని ఆయన ఇంటికి పంపిస్తే.. దానిని అరెస్టు అంటూ ఓ హైడ్రామా క్రియేట్‌చేశారు. పూటకో డ్రామా రక్తికట్టించారు. పోలింగ్‌ చివరి అంకం వరకు బీజేపీ నాయకులవి ఇంకా ఇలాంటి అనేక డ్రామాలు మనం చూడాల్సి ఉంటుంది. మేం అధికార దుర్వినియోగం చేసేవాళ్లమే అయితే మా నాయకుల ఇండ్లలో సోదాలు జరిగినప్పుడు వాళ్లలా ప్రవర్తించేవాళ్లం కదా! రోడ్డుపైన నా వాహనం కూడా ఆపి తనిఖీచేశారు. నేను పోలీసులకు పూర్తిగా సహకరించాను.

బీజేపీ సోషల్‌మీడియాను అడ్డంపెట్టుకొని అసత్యప్రచారాలకు దిగుతున్నదని మీరు అనేక సభల్లో ఆరోపించారు. నిజమేనా?
అవును. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అన్నట్టు తయారైంది. ప్రతిరోజూ బీజేపీ సోషల్‌మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నది. ఝూటా నంబర్‌వన్‌.. టూ అంటూ నేను 18 ప్రశ్నలు సంధించాను. దీనికి ఇప్పటివరకు బండి సంజయ్‌ స్పందించడంలేదు. నేను చెప్పింది అవాస్తవమే అయితే ఖండించాలి కదా! చెప్పలేరు అంటే వాళ్లు చెప్పేది తప్పే. అందుకే బీజేపీకి ఓటుతోనే సమాధానం చెప్పాలి. గుజరాత్‌లో పెన్షన్‌ రూ.400 ఇస్తున్నారు. ఇక్కడేమో ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తామని, రూ.5 వేలు పింఛన్ల రూపంలో ఇస్తామని బండి సంజయ్‌ చెప్తున్నారు. బీజేపీ పాలిత 17 రాష్ర్టాల్లో ఎక్కడైనా రూ.2,016 పెన్షన్‌ ఇస్తున్నారా? నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ మాట్లాడుతూ.. దుబ్బాకలో ఈఎస్‌ఐ దవాఖానను కేంద్రం ఇస్తే, దానిని తరలించారని ఆరోపించారు. ఆయనే రెండేండ్ల క్రితం పసుపు బోర్డు తెప్పిస్తా అని బాండ్‌ పేపర్‌ రాశారు. ఇప్పటివరకు అది ఏమయ్యిందో తెలియదు. బీజేపీ నేతల తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నది. కన్నతల్లికి కడుపు నిండా తిండిపెట్టని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు ఉన్నది వీళ్ల తీరు.

సుజాతపై బీజేపీ నేతల వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవచ్చు?
బీజేపీ నేతల మానసిక దౌర్భాగ్యానికి ఇదో నిదర్శనం. మహిళా నాయకురాలిని పట్టుకొని కించపరిచేలా మాట్లాడారు. యావత్‌ మహిళాలోకాన్ని కించపరిచారు. ఆమె బాధను మిమిక్రీచేశారు. ఇదేనా వాళ్ల సంస్కృతి? వాళ్ల అక్కకో, చెల్లికో, తల్లికో ఇలాంటి దుఃఖం వస్తే ఇట్లనే వ్యవహరిస్తారా? సుజాత ఆదర్శ మహిళ. ఆమెది స్టేజీ మ్యారేజీ. పెద్దలు కాళోజీ, కేసీఆర్‌ ఆధ్వర్యంలో పెండ్లి జరిగింది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. రామలింగారెడ్డి తన పిల్లలకు కూడా స్టేజీ మ్యారేజీచేశారు. సుజాత కార్యకర్తలకు అండగా ఉన్నారు. నా ఎన్నికలప్పుడు కూడా ఆమె ప్రచారంచేశారు. మహిళ ఆదిశక్తి. కుటుంబాన్ని ఎలా అయితే సంబాళించుకుంటారో.. నియోజకవర్గాన్ని కూడా అలాగే చేయగలరు. ఆమెకు ఆ శక్తి ఉన్నది.

బీజేపీ ఎందుకు ఏదో ఒక అంశంపై రచ్చ చేస్తున్నది?
ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు.. ప్రజల్లో బలం, విశ్వాసం లేక.. ప్రజల దృష్టిమరల్చేందుకు ఏదో ఒక యాగీ చేయడం, మీడియాలో కనిపించడం, దానితో ఏమైనా ఓట్లు పడుతాయేమో అన్న భ్రమలో బీజేపీ నేతలున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉపయోగించి మాపై అనేక దాడులుచేయిస్తున్నారు. మా నాయకుల ఇండ్లపై రోజూ పోలీసు దాడులు జరుగుతున్నాయి. ఒకేరోజు పది మంది ఇండ్లపై కూడా దాడులు జరిగాయి. మేం ఎన్నడూ నియ్యత్‌ తప్పలేదు. మా నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేయకుండా చేశారు. ఈ రచ్చలో కూడా బీజేపీ అభాసుపాలయ్యింది. సిద్దిపేటలో రఘునందన్‌ మామ ఇంటిలో సోదాలే నిదర్శనం. మొదటిరోజు రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేసిన నేతలు.. తెల్లారి పోలీసులు చూపించిన ఆధారాలతో కక్కలేక.. మింగలేక కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయారు. స్వయంగా ఇంటి యజమాని, బీజేపీ అభ్యర్థి అత్తనే రఘునందన్‌రావు కోసం దుబ్బాకకు పంపిస్తున్నామని చెప్పారు. ఇలాంటి ఘటనలపై కేంద్ర హోంమంత్రి కిషన్‌రెడ్డి స్పందించిన తీరు దారుణం. చట్టాన్ని ఉల్లంఘించినవారికి మద్దతు ఇస్తారా? మేజిస్ట్రేట్‌ అధికారి ముందే వాళ్లు డబ్బులు పంపుతున్నట్టు ఒప్పుకొన్నారు. దొంగలకు వత్తాసు పలుకుతారా? దేశానికి ఆయన సమాధానం చెప్పాలి. బీజేపీ వాళ్లు డబ్బులు పంచినా.. చీరెలు పంచినా.. ప్రలోభపెట్టినా పోలీసులు పట్టించుకోవద్దా? కిషన్‌రెడ్డి ఏం మెసేజ్‌ ఇవ్వాలనుకున్నారు? ఇక రఘునందన్‌రావు అక్కడ గాయపడ్డట్టు స్టంట్‌చేశారు. నిజంగా ఆయన చేతికి గాయమైతే ఉదయం తెల్ల పట్టి, మధ్యాహ్నం ఆస్మాన్‌ పట్టి, సాయంత్రం సభల్లో చేతులు ఎలా ఊపారో దుబ్బాక ప్రజలకు చెప్పాలి.

బీజేపీలో ఎందుకంత అసహనం?
బీజేపీ చెప్పిన అబద్ధాల బండారాన్ని మేము బయటపెట్టాం. ప్రజలకు కాదు.. కనీసం కార్యకర్తల ముందు కూడా ఆ పార్టీ నేతలు తలెత్తుకోలేని పరిస్థితి ఉన్నది. అందుకే ఆ పార్టీ నేతల్లో అసహనం కనిపిస్తున్నది. రోజుకో నాటకానికి తెరతీశారు. పోలీసులు కొట్టారని, ప్రచారానికి రానివ్వడంలేదని, ఇండ్లలో సోదాలు చేశారని, నిరాహార దీక్షలని రకరకాల స్టంట్లుచేశారు. ఇక ఈ రెండురోజులు వాళ్ల అంగీలు వాళ్లే చింపుకొని, వాళ్లను వాళ్లే కొట్టుకొని టీఆర్‌ఎస్‌ వల్లే ఇదంతా అని చెప్పినా ఆశ్చర్యంలేదు. ఓడిపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్‌లో ఏమైనాచేస్తారు. సొమ్మసిల్లినట్టుగా కూడా నటిస్తారేమో. స్థానికంగా బీజేపీకి మద్దతులేదు. ఆదరణలేదు. అందుకే పరాయి నాయకులను, కిరాయి కార్యకర్తలను నమ్ముకుంటున్నారు. ఓటమి ఖాయమవడంతో ఏమిచేయాలో తోచక అసహనానికి గురవుతున్నారు. తొలిదశలో అబద్ధాలతో తిరిగారు. నిజం నిలకడ మీద తెలిపోయింది. దీంతో ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే నిలిచారు.

ఝూటా బీజేపీ అని ఎందుకు అంటున్నారు?
బీజేపీ ఒక్కటి కాదు.. రెండు కాదు.. వందల అబద్ధాలను చెప్పింది. అందుకే దానిని భారతీయ ఝూటా పార్టీ అంటున్నాం. అందుకే మేము వాళ్లను నిలదీశాం. అబద్ధాలపై ప్రశ్నించాం. సమాధానం చెప్పలేక వ్యక్తిగత దాడులకు దిగడం మొదలుపెట్టారు.

విద్యుత్‌, వ్యవసాయ బిల్లులతో ఎలా నష్టం?
కార్పొరేట్‌ కంపెనీలను బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. అందుకే విద్యుత్‌, వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చింది. స్వయంగా కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామాచేశారు. బీజేపీ కిసాన్‌ మోర్చా కూడా మద్దతు ఇవ్వడంలేదు. ఆ బిల్లులు ఎంత నష్టమంటే.. కనీసం దుబ్బాకలో బీజేపీ నేతలెవ్వరూ వాటి గురించి ప్రచారం కూడా చేసుకోలేదు. మాది ప్రజాప్రభుత్వం. మేము కార్పొరేట్ల కోసం పనిచేయడంలేదు. బీజేపీ, కాంగ్రెస్‌ కార్పొరేట్లకు సాగిలపడుతాయి. ఈ రెండు బిల్లులు దేశానికి, రైతాంగానికి ఏమాత్రం మంచిది కాదు. మా నాయకుడు కేసీఆర్‌ ఇప్పటికే దీనిపై స్పష్టత ఇచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతంచేయాలని, రైతులు బాగుపడాలన్నది మా నాయకుడు కేసీఆర్‌ తపన. వ్యవసాయం పండుగ కావాలన్నదే మా పార్టీ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ విధానాలే దుబ్బాకలో బీజేపీకి గుదిబండ.

దుబ్బాకపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఎందుకు?
దుబ్బాకతో సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉన్నది. దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని, ఇక్కడి దేవుడి బాయిలో ఈత కొట్టిన ఆయనకు ఈ గడ్డపై ప్రత్యేక అభిమానం ఉండదా? ఆయన సీఎం కాకముందే.. ఇక్కడ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణానికి నిధులు సమకూర్చారు. కనీసం దుబ్బాక గల్లీలు, సరిహద్దులు తెలియని సంజయ్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఈ నేలపై ఏం మమకారం ఉంటుంది? సీఎం కేసీఆర్‌ చిన్ననాటి మిత్రులు అనేకమంది ఉన్నారు. ఆయనకు ఇక్కడి ప్రతి గ్రామంలో ఆత్మీయులు ఉన్నారు. కాంగ్రెస్‌వాళ్లు దుబ్బాకను తామే అభివృద్ధిచేశామని చెప్తున్నారు. మరి అంత చేసినవాళ్లు ఇక్కడ కనీసం దవాఖానను కూడా ఎందుకు కట్టించలేదు? కేసీఆర్‌ ప్రత్యేక దృష్టితో, రామలింగారెడ్డి కృషితో ఇక్కడ వంద పడకల దవాఖాన నిర్మించడం వాస్తవం కాదా? మార్కెట్‌ కమిటీల అభివృద్ధికి రూ.40 కోట్లతో పనులుచేశాం. రోడ్ల అభివృద్ధికి రూ.280 కోట్లు ఇచ్చాం. నియోజకవర్గ పరిధిలో 730 చెరువుల మరమ్మతులకు రూ.130 కోట్లు ఇచ్చాం. 19 సబ్‌స్టేషన్లు రూ.150 కోట్లతో కట్టాం. రూ.222 కోట్లతో 3,900 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించాం. గజ్వేల్‌- దౌల్తాబాద్‌, చేగుంట- భూంపల్లి రోడ్లు వేశారు. దీంతో హైదరాబాద్‌కు దూరం తగ్గింది. ప్రధాన రోడ్లనువేశాం. దుబ్బాక- సిద్దిపేట రోడ్డును కూడావేశాం.

బీజేపీ జాతీయవాదం అంటున్నది. రఘునందన్‌రావు నినాదం అదే కదా? దీనిపై మీరేమంటారు?
బీజేపీకి స్థానిక సమస్యలపై అవగాహన లేదు. వారు ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నారు. టీఆర్‌ఎస్‌ ఎంఐఎంతో కలిసి పనిచేస్తున్నదని రఘునందన్‌రావు చెప్తున్నారు. మరి సంగారెడ్డిలో ఇదే ఎంఐఎం నాయకులకు బెయిల్‌ ఇప్పించి తులాభారాలు వేయించుకున్నది రఘునందన్‌రావు కాదా? అసదుద్దీన్‌తో ఆలింగనాలు చేసుకున్నది.. అక్బర్‌తో కలిసి ఫొటోలు దిగింది రఘునందన్‌రావు కాదా? జాతీయవాదం విషయంలో టీఆర్‌ఎస్‌ ఎప్పుడూ రాజీపడలేదు. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఏ అంశానికైనా మద్దతు ఇచ్చాం. నోట్ల రద్దు, జీఎస్టీ వంటివాటిని ప్రజల కోణంలో తెస్తున్నామంటే మద్దతు ఇచ్చాం. అనేక కేంద్ర చట్టాలకు సహకరించాం. ఇదేస్థాయిలో ప్రజావ్యతిరేక చట్టాలను వ్యతిరేకించాం. ఇక అసదుద్దీన్‌తో కేసీఆర్‌ తిరుగుతున్నారని, కేసీఆర్‌ హిందూ వ్యతిరేకి అని దుర్మార్గ ప్రచారం కూడా చేశారు. కానీ, దేశంలో కేసీఆర్‌ను మించిన హిందూవాది ఉన్నారా? కేసీఆర్‌ ఏమి చేసినా చిత్తశుద్ధితో చేస్తారు. బీజేపీలా ఓట్ల కోసం కాదు. మా పార్టీ, మా నాయకుడు అన్ని మతాలకు, కులాలకు సమప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి.

కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదని, బీజేపీతో టీఆర్‌ఎస్‌ మిలాఖత్‌ అయ్యిందని అంటున్నారు. దీనిపై ఏమంటారు?
మేము ప్రజలతో మిలాఖత్‌ అయ్యాం. కాంగ్రెస్‌ ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతుంది? రాష్ట్రస్థాయిలో అనేక సందర్భాల్లో బీజేపీతో కలిసి పనిచేసిన చరిత్ర, చీకటి ఒప్పందాలు చేసుకున్న చరిత్ర కాంగ్రెస్‌ నాయకులది, ఉత్తమ్‌ తన సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌ను కూడా గెలిపించుకోలేకపోయారు. ఇక దుబ్బాక గురించి మాట్లాడుతున్నారు. డిపాజిట్‌ కాపాడుకొనేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు ప్రయాసపడుతున్నాయి.

దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదని మీరు చెప్తున్నారు.. ఏ విధంగా బాధ్యత తీసుకుంటారు?
సుజాత నాకు తోబుట్టువులాంటిది. నా నియోజకవర్గానికి పక్కనే ఉంటుంది. తొలినుంచి నాకు ఈ నియోజకవర్గంపై అవగాహన ఉన్నది. జిల్లా మంత్రిగా కూడా ఉన్నాను. అందుకే రాబోయే మూడేండ్లలో ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ బాధ్యతను ఆమెతోపాటు నేను తీసుకుంటున్నా. డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ కావాలంటే సోలిపేట సుజాతనే గెలువాలి. మోదీ చెప్తున్నట్టే ఇక్కడ మేం కూడా చెప్తున్నాం. బీహార్‌లో, కేంద్రంలో బీజేపీ ఉంటే డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ అని చెప్తున్నరు. ఇక్కడ కూడా అంతే. ఇంకో మూడేండ్లు రాష్ట్రంలో అధికారంలో టీఆర్‌ఎస్‌ ఉంటుంది. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ గెలిస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. బీజేపీ గెలిస్తే ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీకి ఇంకో ఎమ్మెల్యే తోడవుతాడు. కాంగ్రెస్‌ గెలిస్తే 8 మంది ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరుతుంది. అంతే. ఇక్కడ అభివృద్ధి జరుగదు. అందుకే డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ డెవలప్‌మెంట్‌ అంటున్నం. అది ఒక్క టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం. జిల్లా మంత్రిగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్త. రామలింగారెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్త. ఇండ్ల సమస్య తీరుస్త. దవాఖాన పనులు పూర్తిచేయిస్త. రోడ్ల పనులు పూర్తిచేయిస్త. దుబ్బాక ప్రజల్లో సగం మందికి నా ఇల్లు తెలుసు. రాత్రయినా.. పగలైనా ప్రజలు నా వద్దకు రావచ్చు. ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధం. మూడో తేదీన మూడో నంబర్‌ గుర్తుపై సుజాతక్కకు ఓటేయండి.

రాష్ట్రం చేపట్టిన ప్రతి పథకానికి కేంద్రం నిధులు ఇస్తున్నదని బీజేపీ నేతలు చెప్తున్నారు. మీరేమంటారు?
ఇది మరో అబద్ధం. నేను ఇప్పటికే బీజేపీకి 18 ప్రశ్నలు వేశాను. వాటికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నుంచి జవాబు రాలేదు. సంజయ్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎంపీకి తక్కువ. రూ.282 కోట్లు ఇచ్చామని ఆయన చెప్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీకి ఇచ్చి ఉంటుందేమో కేంద్ర ప్రభుత్వం. మేం దుబ్బాకకు రూ.6 వేల కోట్లకుపైగా నిధులిచ్చాం. వివిధ పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులు కాకిరెట్టంత.. టీఆర్‌ఎస్‌ ఇచ్చేది సముద్రమంత. కేంద్రం నిధులు ఇవ్వలేదు అంటలేము.. కానీ, మేము ఇచ్చినదానితో పోల్చవద్దని చెప్తున్నాం. పెన్షన్లకు మీరు ఇచ్చేది రూ.200 అయితే.. మేము ఇచ్చేది రూ.1,816. ఎనకటికి ఎవరో సముద్రంలో ఉప్పువేసి ‘నా వల్లే సముద్రంలో ఉప్పు తయరయ్యింది’ అన్నట్టున్నది బీజేపీ పరిస్థితి. మద్యం, డబ్బు, సోషల్‌మీడియాలో దుష్ర్పచారాన్ని బీజేపీ నమ్ముకొన్నది. మేము సంక్షేమ పథకాలను నమ్ముకొని పనిచేస్తున్నాం.

దుబ్బాక ప్రజలకు మీరు ఇచ్చే పిలుపు ఏమిటి?
ఈ నియోజకవర్గం రైతు కేంద్రంగా ఉంటుంది. దేశంలో చరణ్‌సింగ్‌, దేవీలాల్‌ తర్వాత రైతు గురించి ఆలోచించిన ఏకైక నేత కేసీఆర్‌. నియోజకవర్గంలోని 78 వేల మంది రైతులు కేసీఆర్‌ నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లిస్తున్నాం. 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం. రెండుసార్లు రైతుమాఫీ చేసిన చరిత్ర మాది. బాయికాడ మీటర్లు.. కాలిపోయే మోటర్లు కావాలా? 24 గంటల ఉచిత కరెంటు కావాలా? రైతన్నలు ఆలోచించాలి. ఆడపిల్లల తల్లుల్లో ఆత్మైస్థెర్యం నింపింది ఎవరు? బీడీ కార్మికులకు ప్రత్యేకంగా దేశంలో ఎక్కడ లేనివిధంగా పెన్షన్‌ ఇస్తున్నది ఎవరు? ప్రజలు ఆలోచించాలి. దుబ్బాకకు తొలిసారి మహిళా ఎమ్మెల్యేగా సుజాతక్కకు అవకాశం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలి. 18% జీఎస్టీ వేసి బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బతీసింది బీజేపీ అయితే, బీడీ కట్టలపై పుర్రెగుర్తు పెట్టింది కాంగ్రెస్‌. బీడీ కార్మికుల కడుపునింపుతున్నది, నెలనెలా పెన్షన్‌ ఇస్తున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.

మీ మోసాలు 18
తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అన్యాయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు నిలదీశారు. రాష్ర్టానికి కేంద్రం చేసిన 18 మోసాలను బట్టబయలు చేస్తూ, వాటిపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక రెడ్డి సంక్షేమభవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి.. ‘ఈ 18 మోసాలు తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాల్లో కొన్ని మాత్రమే. వీటన్నింటికీ అంశాలవారీగా జవాబివ్వాలని సవినయంగా కోరుతున్నా. మీరు తెలంగాణ బిడ్డ. బీజేపీ నాయకులు అయినప్పటికీ, పుట్టిన గడ్డకు మేలు చేయాల్సిన బాధ్యత ఓ ప్రజాప్రతినిధిగా మీపై ఉంటుంది. తెలంగాణ రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు కేంద్రం చేసే అన్యాయాలను సవరించే ప్రయత్నం చేయండి’ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంపై సవతితల్లి ప్రేమను చూపిన బీజేపీకి ఓటెందుకెయ్యాలని ప్రశ్నిస్తూనే, ప్రశ్నలకు జవాబిచ్చి నైతికతను నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు.

ఆ 18 ప్రశ్నలివీ..
1.తెలంగాణకు చెందిన 7 మండలాలను కేంద్రం ఏపీలో కలిపింది. ఆ మండలాలను వేరేరాష్ట్రంలో కలపడం మీరుచేసిన అన్యాయం కాదా
2.తెలంగాణకు చెందిన 460 మెగావాట్ల లోయర్‌ సీలేరు హైడల్‌ పవర్‌ ప్లాంట్‌ను కేంద్రం ఏపీకి అప్పగించింది. ప్లాంట్‌ను రాష్ర్టానికి కాకుండా చేయడం మీరు చేసిన ద్రోహం కాదా
3. బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ పెడ్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీ ఏమైంది? ఆ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు విస్మరించింది
4. హైదరాబాద్‌కు కేటాయించిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును ఎందుకు రద్దు చేశారు? అలా రాష్ర్టాన్ని ఆర్థికంగా దెబ్బ తీయలేదా
5. కాజీపేటకు మంజూరైన వ్యాగన్‌ ఫ్యాక్టరీని ఎందుకు రద్దు చేశారు? ఇది మీరు తెలంగాణకు చేసిన అన్యాయం కాదా
6. తెలంగాణ ఏర్పడి ఆరేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ నీటి కేటాయింపులు ఎందుకు చేయలేదు
7. కాళేశ్వరం సహా తెలంగాణ చేపట్టిన ఒక్క ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారా. ఇది వివక్ష కాదా? విద్వేషం కాదా
8. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ గొప్పవని, కేంద్రం సహాయంగా వీటికి రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసింది. కానీ కేంద్రం ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించే విధానం కాదా
9. ఏపీకి చెందిన 1153 మంది విద్యుత్‌ ఉద్యోగులు ఇంకా తెలంగాణలోనే పనిచేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవటం లేదు? ఇది కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం కాదా
10. తెలంగాణకు 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేసినా, అన్నింటికీ ఎందుకు నిధులు ఇవ్వలేదు
11.తెలంగాణలో 39.50 లక్షల మంది అర్హులైన పెన్షనర్లు ఉన్నారు. అందులో 6 లక్షల మందికి మాత్రమే, అదీ రూ.200 మాత్రమే పింఛన్‌ ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏమిటి
12. 100 ఎయిర్‌పోర్టుల ప్రణాళికలో వరంగల్‌ను ఎందుకు చేర్చలేదు? ఇది తెలంగాణపై చిన్న చూపు కాదా
13. టెక్స్‌టైల్స్‌ రంగాభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తున్నది. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్‌ పార్కును వరంగల్‌లో నిర్మిస్తుంటే నిధులు ఎందుకు ఇవ్వరు
14.ఆదిలాబాద్‌లో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు?
15.ఎస్సీ వర్గీకరణ చేయాలని, ఎస్టీల రిజర్వేషన్‌ శాతాన్ని పెంచాలని రాష్ట్రం ఎన్నిసార్లు కోరినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు
16.తెలంగాణలోని అన్నిజిల్లాలకు నవోదయ స్కూళ్లు మంజూరు చేయాలని కోరినా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నదెందుకు
17.నర్మద, గంగానది ప్రక్షాళనకు నిధులు ఇచ్చిన కేంద్రం.. మూసీనది ప్రక్షాళనను ఎందుకు పట్టించుకోవడం లేదు
18.తెలంగాణకు వివిధ మార్గాల్లో కేంద్రం నుంచి రూ.12 వేల కోట్ల వరకు రావాలి. ఈ నిధులను విడుదల చేయకపోవడం వివక్ష కాదా

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.