-మనది తెలంగాణ ఆత్మగౌరవం
-మోటర్లకు మీటర్లు పెడితే 6 వేల కోట్లు ఇస్తమన్నరు
-వడ్లు కొన చేతగాదు.. ఎమ్మెల్యేలను కొంటరట
-ఓడిపోతమని తెలిసే బీజేపీ బరితెగించి దాడులు
-మునుగోడు ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు ఫైర్

బీజేపీది కాంట్రాక్టులు ఇస్తామనే ఢిల్లీ అహంకారం అయితే మనది తెలంగాణ ఆత్మగౌరవమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ వడ్లు కొనుడు చేతకాదు కానీ వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను మాత్రం కొనే కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్ దెబ్బకు బీజేపీ దిమ్మ తిరిగిందని, కమలం నేతలు ముఖం చాటేసుకొన్నారని దుయ్యబట్టారు. కేంద్రం వడ్లు కొనకున్నా కేసీఆర్ ప్రతి గింజ కొన్నారని గుర్తుచేశారు. ఢిల్లీలోని బీజేపీ నేతలు మాత్రం నూకలు బుకమని హేళన చేశారని మండిపడ్డారు. నూకలు బుకమని తెలంగాణ రైతులను అవమానించిన బీజేపీ తోకలు కత్తిరించాలని పిలుపునిచ్చారు. మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మంగళవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ, నాంపల్లి, చండూరులో మంత్రి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రసంగిస్తూ.. బీజేపీ నేతలు డబుల్ ఇంజిన్ సరార్ అంటున్నారని.. కానీ, వాళ్లది ట్రబుల్ ఇంజిన్ సరార్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ బట్టేబాజ్ మాటలు వింటే గోస పడతారని ప్రజలకు సూచించారు.
కేసీఆర్ దెబ్బకు బీజేపీ మైండ్‌బ్లాక్
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రపై సీఎం కేసీఆర్ కొట్టిన దెబ్బకు బీజేపీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ దెబ్బకు బీజేపీ నేతలు ముఖం చాటేశారని ఎద్దేవాచేశారు. ఢిల్లీ బీజేపీ దూతలు చంచల్‌గూడ జైల్లో ఉన్నారని, ఢిల్లీ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ఇక ఇటువైపు రావడానికి గజగజ లాడుతున్నారని ఎద్దేవాచేశారు. ఢిల్లీ అహంకారం గెలవాలా? తెలంగాణ ఆత్మగౌరవం గెలవాలా ఆలోచించండి? అని పిలుపునిచ్చారు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ సాధిస్తే.. ఢిల్లీలోని బీజేపీ ఇప్పుడు తెలంగాణను ఆగంచేసేందుకు సిద్ధమైందని చెప్పారు. తెలంగాణ రాకపోతే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, కల్యాణలక్ష్మి వచ్చేవా? కేసీఆర్ సీఎం కాకపోతే అవ్వలకు రూ.2వేల పింఛన్ వచ్చేదా? అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
ఆరు వేల కోట్లిస్తం..బోరుకాడ మీటర్లు పెట్టమంటున్రు
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే రూ.6వేల కోట్లు ఇస్తమని పేర్కొంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఢిల్లీ నుంచి లేఖ పంపిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాడు తొండి సంజయ్ చెప్పిన ముచ్చట ఉట్టిదేనని, టీఆర్‌ఎస్ ఆందోళనే నేడు నిజమయ్యిందని అన్నారు.‘బోరు బాయి కాడ మీటర్ పెట్టుండ్రి.. బిల్లు రైతు ఇంటికి పంపుండ్రి’ అని లేఖలో చెప్పిండ్రని గుర్తుచేశారు. మీటర్ పెట్టమంటరా.. వద్దా..? అని ప్రశ్నించారు. మీటర్లు వద్దంటే.. మూడో తేదీన కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
రూ.400 గ్యాస్‌బండను రూ.1200 చేసిండ్రు
కేంద్రంలోని బీజేపీ సర్కారు సామాన్యులపై ధరల భారం మోపుతున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ సర్కారు ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూ.2వేల పింఛన్, ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.1,00,116, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ ఇస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం ఎల్‌ఐసీ, బ్యాంకులు, రైల్వే, ఎయిర్‌పోర్ట్‌లను కార్పొరేట్‌కు ధారదత్తం చేసిందని ఆరోపించారు. గ్యాస్ ధరలు పెంచి వంటింట్లో మంట పెట్టిందని మండిపడ్డారు. రూ.400 ఉన్న గ్యాస్‌బండ ధరను రూ.1,200 చేసిందని దుయ్యబట్టారు. రూ.18 వేల కాంట్రాక్ట్ ఇచ్చి రాజగోపాల్‌రెడ్డిని కొన్నదని ఎద్దేవాచేశారు. ‘
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో.. బీజేపీ మాటల్లో నీతి, నిజం అంతే ఉంటది’ అని ఎద్దేవాచేశారు. ఢిల్లీ బీజేపీ చేనేతపై 5 శాతం జీఎస్టీ వేసిందనీ, ఆధారాలతో చూపెట్టడంతో బీజేపీ నేతలు నల్లముఖం వేశారని మంత్రి పేర్కొన్నారు. మునుగోడులో ఓడిపోతామని బీజేపీ వాళ్లు డిసైడ్ అయ్యారని, అందుకే ప్రజలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌గా చెప్పుకొంటున్న బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో బస్వరాజ్ అమర్ గోయల్ అనే కాంట్రాక్టర్ తాను చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలంటే 40 శాతం కమీషన్ ఇయ్యమంటున్నారని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని మోదీకే ఉత్తరాలు రాశాడు. బీజేపీని గెలిపిస్తే మనదగ్గర కూడా ఆగం జేస్తదని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.