Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బీజేపీది గంటకొక అబద్ధం.. పూటకొక వదంతి

-శిశుపాలుని తప్పులు కృష్ణుడు లెక్కించినట్టు
-బీజేపీ తప్పులను లెక్కపెడుతున్న దుబ్బాక
-సత్యమేవ జయతే సూక్తిని విస్మరించిన బీజేపీ
-అనునిత్యం అసత్యాలు.. వ్యక్తిగత దూషణలే
-బీజేపీ నేతలవి మరీ ఇంత పచ్చి అబద్ధాలా?
-మీ పార్టీ ఎంపీలు గెలిచినచోట చేసిందేమిటి?
-పోరుగడ్డ దుబ్బాక ఓటర్లు చైతన్యవంతులు
-బీజేపీ నాయకులకు బుద్ధిచెప్పటం ఖాయం
-మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు
-గోబెల్స్‌ ప్రచారాన్ని తూర్పారబట్టిన మంత్రి

బీజేపీతో తస్మాత్‌ జాగ్రత్త. బీజేపీ నాయకులు అబద్ధాల పునాదులపై అధికారంలోకి రావాలని చూస్తున్నారు. దుబ్బాకలో గెలువాలని ప్రయత్నిస్తున్నారు. పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. వారి పట్ల దుబ్బాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మోసపోతే గోస పడుతం. తస్మాత్‌ జాగ్రత్త. – మంత్రి హరీశ్‌రావు

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ నాయకులు పూటకో వదంతి సృష్టిస్తూ, గంటకో అబద్ధం ఆడుతూ వారి భారతీయ జనతా పార్టీని ‘భారతీయ ఝూటా పార్టీ’గా మార్చారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మొదలు నుంచి వార్డు నాయకుడి దాకా అందరూ అబద్ధాలాడుతూ తప్పుడు ప్రచారాలకు తెరలేపారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌లతో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వెయ్యి అబద్ధాలాడైనా ఓ పెండ్లి చేయాలనేది పెద్దలు చెప్పిన సామెత. కానీ దుబ్బాకలో బీజేపీ నాయకులు వెయ్యి అబద్ధాలాడైనా ఒక ఎన్నికను గెలువాలనే కొత్త సామెతను సృష్టించారు’ అని ఎద్దేవాచేశారు. భారతీయ సంప్రదాయానికి తామే ప్రతినిధులుగా చెప్పుకొనే బీజేపీ నాయకులు.. ‘సత్యమేవ జయతే’ అనే ఉపనిషత్తు సూక్తిని విస్మరించి, ‘అసత్యమే జయతే’ అని నమ్ముతున్నారని అన్నారు. నిత్యం అబద్ధాలాడటం.. వ్యక్తిగత దూషణలకు దిగడం వారినైజంగా మారిందని విమర్శించారు. ‘శ్రీకృష్ణుడు శిశుపాలుని తప్పులు లెక్కించినట్టు.. బీజేపీ నేతల అబద్ధాలను దుబ్బాక ప్రజలు లెక్క పెడుతున్నారు. బీజేపీ తప్పుడు ప్రచారాలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు’ అని చెప్పారు.

దుబ్బాక ప్రజలు ఆలోచించాలి..
విజ్ఞత కలిగిన దుబ్బాక ప్రజలు బాగా ఆలోచించాలని మంత్రి హరీశ్‌ కోరారు. దుబ్బాక అనేక వామపక్ష, తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ప్రాంతమని చెప్పారు. స్వరాష్ట్రం కోసం కొట్లాడిన సీఎం కేసీఆర్‌ను రెండుసార్లు దీవించిన గడ్డ ఇదని గుర్తుచేశారు. దుబ్బాకకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు చేశామని హరీశ్‌రావు చెప్పారు. ‘మీరు గెలిచిన కాడ ఏం చేశారని ఇక్కడ చేస్తారు? ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌లో గెలిచారు. ఈ రెండేండ్లలో ఏదైనా ఒక మంచి ప్రాజెక్టు తెచ్చారా?’ అని బీజేపీ ఎంపీలను హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. ‘ఏడాది లోపలనే మీ పనితీరు అర్థమైంది. మిమ్మల్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. అందుకే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌లలో టీఆర్‌ఎస్‌ గెలిచింది’ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ ఝూటా మాటల గురించి, అసత్య ప్రచారాల గురించి మీడియా ద్వారా మొత్తం రాష్ట్రంలోని మేధావులకు, విజ్ఞులైన ప్రజలకు తెలియజేస్తున్నానంటూ బీజేపీ గోబెల్స్‌ ప్రచారం వివరాలను హరీశ్‌రావు తెలిపారు. అవి హరీశ్‌ మాటల్లోనే..

1.బీడీ కార్మికుల పింఛన్‌లో కేంద్రం వాటా.. అబద్ధం
దేశంలో ఎక్కడా లేనివిధంగా బీడీ కార్మికులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.2016 పెన్షన్‌ ఇస్తున్నది. ఇందులో రూ.1,600 కేంద్రం ఇస్తున్నట్టు బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. కేంద్రం రూపాయి కూడా ఇవ్వడం లేదని నేను సవాల్‌ విసిరితే అంతా తోక ముడిచారు. బీడీ కార్మికులకు కాంగ్రెస్‌ పుర్రె గుర్తును ఇస్తే.. బీజేపీ 18% జీఎస్టీ విధించింది. దీంతో బీడీ అమ్మకాలు పడిపోయాయి. ఒకప్పుడు నెల రోజులు పని దొరికితే, ఇప్పడు 15 రోజులు కూడా దొరుకడం లేదు. ఉన్న పనిని పోగొట్టిన కాంగ్రెస్‌, బీజేపీలు బీడీ కార్మికుల శాటలో మన్ను పోశాయి. ఇవ్వాళ పీఎఫ్‌ నంబర్‌ ఉన్న ప్రతి బీడీ కార్మికుడికి సీఎం కేసీఆర్‌ రూ.2,016 పెన్షన్‌ ఇచ్చి, వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఇవ్వని దాన్ని ఇచ్చినట్టు చెప్పుకొంటున్న బీజేపీ ఝూటా పార్టీ కాదా?

2.కేసీఆర్‌ కిట్‌లో కేంద్రం వాటా.. అబద్ధం
కేసీఆర్‌ కిట్‌ కింద ఇచ్చే రూ.13 వేలలో రూ.6 వేలు కేంద్రం ఇస్తున్నదని ఒక నాయకుడు, రూ.8 వేలు ఇస్తున్నట్టు మరో నాయకుడు అబద్ధాలు చెప్తున్నారు. వాస్తవానికి కేసీఆర్‌ కిట్‌లో కేంద్ర ప్రభుత్వానిది నయా పైస లేదు. నూటికి నూరు శాతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఇస్తున్నది. కానీ.. బీజేపీ నాయకులు విడుదలచేసిన కరపత్రంలో పింఛన్‌లో రూ.1200 వేలు, కేసీఆర్‌ కిట్‌లో రూ.6 వేలు కేంద్రం ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.

3.గొర్రెల యూనిట్లలో కేంద్ర సాయం ఉన్నది.. అబద్ధం
గొల్లకుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల యూనిట్లను అందిస్తుంటే అందులో రూ.50 వేలు కేంద్రానివని, రూ.25 వేలు మాత్రమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తున్నదని గోబెల్స్‌ ప్రచారానికి బీజేపీ తెరలేపింది. ప్రజలను గొర్రెలుగా భావించేవారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతారేమో. ఈ పథకం ఖర్చును నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. బీజేపీ నాయకులకు గొర్రెల యూనిట్‌ కాస్టు కూడా తెలియదు. యూనిట్‌ కాస్టు రూ.లక్షా 25 వేలు. ఇందులో లబ్ధిదారుని వాటా 25%.. అంటే రూ.31,250. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటా 75% అంటే రూ.93,750. ఇది కూడా వారికి తెలియదు. ఇప్పటివరకు ప్రభుత్వం 77 లక్షల గొర్రెలను 3.70 లక్షల మంది గొల్లకుర్మలకు పంపిణీ చేసింది.

4.చేగుంట ఈఎస్‌ఐ గజ్వేల్‌కు తరలింపు.. అబద్ధం
కేంద్రం రూ.25 కోట్లతో ఈఎస్‌ఐ దవాఖానను చేగుంటకు మంజూరు చేస్తే దానిని గజ్వేల్‌కు తరలించుకు పోయారని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ చేగుంట సభలో చెప్పారు. పోదామా గజ్వేల్‌కు? అక్కడ ఈఎస్‌ఐ దవాఖాన చూపిస్తావా? గజ్వేల్‌లో ఈఎస్‌ఐ దవాఖాన లేదు. చేగుంటకు దవాఖాన మంజూరైతే కాగితం చూపాలి.

5.రేషన్‌ బియ్యం సబ్సిడీలో కేంద్రం అధిక వాటా.. అబద్ధం
రేషన్‌ బియ్యం సబ్సిడీలో కేంద్రం కిలోకు రూ.29 భరిస్తుంటే రూపాయి మాత్రమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భరిస్తున్నదంటూ ఆఖరుకు ప్రజలు తినే అన్నం మీద కూడా గోబెల్స్‌ ప్రచారాలు చేస్తున్నారు. కేంద్రం ఇచ్చేది సగం కార్డులకే. మిగతా సగం కార్డుల సబ్సిడీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. వారు చెప్తున్నది నిజమైతే.. సగం కార్డులు రద్దయిపోతాయి. వారిచ్చే ఆ సగంలో కూడా కిలోకు రూ.3 చొప్పున అందులో రూ.2 భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ రూపాయికి కిలో చొప్పున ప్రజలకు అందజేస్తున్నది. కేంద్రం 5 కిలోలకే సబ్సిడీ ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యాన్ని ఇస్తున్నది.

6.పాలిటెక్నిక్‌ కాలేజీ సిద్దిపేటకు తరలింపు.. అబద్ధం
పాలిటెక్నిక్‌ కళాశాలకు దుబ్బాకలో శంకుస్థాపన జరిగాక సిద్దిపేటకు తరలించారని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నది. అసలు పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరయిందీలేదు.. శంకుస్థాపన జరిగిందీలేదు.

7.మోటర్లకు మీటర్లు సీఎం ఆలోచన.. అబద్ధం
మోటర్లకు మీటర్లు పెట్టాలని కేసీఆర్‌ చూస్తున్నారని బండి సంజయ్‌ చెప్పారు. ఇంతకంటే పచ్చి అబద్ధం, దివాళకోరు రాజకీయాలు ఉంటాయా? ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అన్నట్టుంది వాళ్ల వ్యవహారం. ఏప్రిల్‌ 27న బిల్లు నమూనాను రాష్ర్టాలకు పంపుతూ.. ‘ఎవరికీ సబ్సిడీపై కరెంట్‌ ఇయ్యద్దు.. ఉచిత కరెంట్‌ ఇయ్యద్దు.. బాయిలకాడ మీటర్లు పెడితే మీకు లెక్కస్తది.. లెక్క తీయిండ్రి.. సబ్సిడీ లేకుండా రైతు చేతిలో బిల్లు పెట్టండి..’ అని కేంద్రం సూచించింది. మే 17న మళ్లా ఇంకో ఉత్తరం రాసిన్రు. మేము చెప్పినట్టు బాయిలకాడ మీటర్లు పెడితే తెలంగాణకు రూ.2,500 కోట్లు ఇస్తమన్నరు. మన సీఎం కేసీఆర్‌ జూన్‌ 2న ప్రధానికి లేఖ రాశారు. ‘మేము బాయిలకాడ మీటర్లు పెట్టం.. మా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇచ్చి తీరుతం. మీరు రూ.2,500 కోట్లు ఇచ్చినా మాకొద్దు. తెలంగాణ రైతులే మాకు ముఖ్యం’ అని స్పష్టంచేశారు.

8.ధాన్యం కొనుగోళ్లకు 5,500 కోట్లు.. అబద్ధం
వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనేందుకు కేంద్రం రూ.5,500 కోట్లు విడుదల చేసిందని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కేంద్రం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. పౌరసరఫరాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి బ్యాంకుల దగ్గర వడ్డీకి తీసుకొని రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది.

9.డబ్బు దొరికిన ఇంటితో రఘునందన్‌కు సంబంధం లేదు.. అబద్ధం
సిద్దిపేటలో పోలీసులు సోదాలు చేసి డబ్బు సీజ్‌ చేస్తే.. డబ్బు దొరికిన ఇల్లు తమవాళ్లది కాదని, తనకు సంబంధం లేదని చెప్తున్న రఘునందన్‌రావు.. సోదాలు జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే సిద్దిపేటకు చేరుకొని, కార్యకర్తలను పిలిపించి, ఆ ఇంటి ముందు ఎందుకు హడావిడి చేశారు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఆ రోజు ఎందుకు ధర్నా చేశావు? అదే రోజు సాయంత్రానికి వాళ్ల సోషల్‌ మీడియాలో బీజేపీ అభ్యర్థికి చెందిన ఎనిమిది ఇండ్లలో సోదాలు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేసి ఉప ఎన్నికలో ఝూటా స్టార్‌గా రఘునందన్‌రావు నిలిచారు. ఒకే ఘటనపై మూడు అబద్ధాలు ప్రచారం చేశారు.

10.పోలీసులే డబ్బు పెట్టారు.. అబద్ధం
సోదాలో దొరికిన డబ్బును ఆ ఇంట్లో పోలీసులే పెట్టారని అబద్ధం ప్రచారం చేసి బీజేపీ దొరికిపోయింది. డబ్బులు తమవేనని స్వయంగా రఘునందన్‌ అత్తమామలు చెప్పిన వీడియో అందుకు రుజువు. సోదాల వీడియోలు బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నాయకుల పరిస్థితి కుడితల పడ్డ ఎలుకలా తయారైంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.