-ప్రభుత్వాల కూల్చివేత కుట్రలో ఆ పార్టీ అగ్ర నాయకత్వం
-కాల్‌డాటాను తవ్వుతున్నకొద్దీ బయటపడుతున్న ఆధారాలు
-బీజేపీపై కేసులు వేసేందుకు పలు రాష్ట్రాల్లో విపక్షాల కసరత్తు
-కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ సహా 6 రాష్ట్రాలు సిద్ధం
-బీజేపీ, ఆరెస్సెస్‌తో రామచంద్రభారతికి సన్నిహిత సంబంధాలు
-2015 నుంచి ఆర్సీబీ కాల్‌డాటా విశ్లేషణ
-గుట్టు రట్టు చేస్తున్న రామచంద్రభారతి కాల్స్
-పలు రాష్ట్రాల్లో 40-50 సర్వర్లలో డాటా నిక్షిప్తం
-వాటి నుంచి డాటాను తొలగించడం అసాధ్యం
-డాటా విశ్లేషణలో పలు మీడియా ఏజెన్సీలు
-ఫాంహౌస్ చర్చల్లో ఇరవైసార్లు అమిత్‌షా పేరు
-పీఎం నేరుగా ఇన్‌వాల్వ్ అయ్యారంటూ మెసేజ్
-సంతోష్, తుషార్, సాకేత్‌తో ఫోన్లు, మెసేజ్‌లు
-జగ్గుస్వామితో కూడా చాటింగ్ చేసిన రికార్డులు
-అష్టకష్టాలు పడ్డా తప్పించుకోవటం అసాధ్యం
-రంకు ఎల్లకాలం సాగదు. బొంకు దాస్తే దాగదు. అబద్ధాల దుప్పట్లు ఎన్ని కప్పినా… నిప్పులాంటి నిజం నిద్రపోదు. ఇప్పుడదే జరుగుతున్నది!..
ఏమన్నారేమన్నారు!
బీజేపీ నేతలు ఎన్నెన్ని మాటలు చెప్పారు!
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరపడానికి వచ్చిన ముగ్గురు బ్రోకర్లు ఎవరో వారికి తెల్వనే తెల్వదని కదా!
వాళ్లకు, బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేనే లేదని కదా!
ఆ ముగ్గురూ కేసీఆర్ ఆడే నాటకంలో భాగమని కదా!
ఇంతేనా? హరెరెరె…! ఎన్ని మాటలు? ఎన్ని వేషాలు? ఎన్ని డ్రామాలు? ఎన్ని కతలు! పొద్దున లేస్తే మీడియా కాన్ఫరెన్సులు. 24 గంటలు టీవీల్లో చర్చలు. సోషల్ మీడియాలో వీడియో సందేశాలు. ట్విట్టర్‌లో పిట్ట కూతలు. వాట్సాప్‌లో పిచ్చి రాతలు. గాయిగాయి, గత్తర గత్తర, లొల్లి లొల్లి! మేమే పాపమూ ఎరుగమంటూ ఒకరు. మాకే నేరమూ తెల్వదంటూ ఇంకొకరు!
సరే.. అ- ధర్మ స్వరూపమైన కలికాలపు ‘కొత్త దేవుడు’ రంగురంగుల కొంగొత్త బట్టల్లో ఎలాగూ కొలువుదీరి ఉండనే ఉన్నాడు… ఢిల్లీలో! పాత దేవుడేం చేస్తాడులే అనే ధీమాతోనే కదా… యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ముందు తడిబట్టల ప్రమాణం! నిజమా.. ఆ ముగ్గురు బ్రోకర్లు ఎవరో బీజేపీ నేతలకు నిజంగా తెల్వనే తెల్వదా?
బ్రోకర్లుగా వచ్చిన దొంగ స్వాములతో బీజేపీకి ఎలాంటి బంధమూ లేనే లేదా? రామచంద్ర భారతిని మొన్ననే, ఆ ఫామ్‌హౌస్‌లోనే మొదటిసారి చూసారా?
అబద్ధం.. పచ్చి అబద్ధం. పుచ్చు అబద్ధం!
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి వచ్చిన ఆ ముగ్గురు బ్రోకర్లు రామచంద్రభారతి, సింహయాజి, నందు బీజేపీకి సుపరిచితులు. అందునా రామచంద్రభారతి కాలాంతకుడు. సింహయాజి పాత్రా తక్కువేం కాదు. వారు బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్‌షా రహస్య ఆయుధాలు. వారు ఆడమన్నట్టల్లా ఆడే పావులు. చెప్పిన పని చేసుకొచ్చే రోబోలు! వాళ్లు స్వాముల వేషాల్లో ఉన్న పాములు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కాటువేసే కాలనాగులు.
ఇప్పుడప్పుడు కాదు; వారు ఏండ్ల తరబడిగా బీజేపీ- సంఘ్ పరివారంలో కీలక వ్యక్తులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకొని పార్టీ ఆర్గనైజేషనల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌దాకా… ఆరెస్సెస్ అగ్రనేత దత్తాత్రేయ హొసబలె మొదలుకొని, భారత ధర్మ జన సేన నేత తుషార్ దాకా… కేంద్ర ప్రభుత్వంలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్న రవి వశిష్ట్ మొదలుకొని, అమిత్‌షా ప్రైవేటు సెక్రటరీ సాకేత్ దాకా… ఎవరైనా వీళ్లు పిలిస్తే పలకాల్సిందే! మెసేజ్ పెడితే రిైప్లె ఇవ్వాల్సిందే! అడిగిన పని చేసి పెట్టాల్సిందే! ఆహ్వానిస్తే రావాల్సిందే! కలుస్తామంటే కలవాల్సిందే! అదీ వాళ్ల హవా!
‘అక్కడి ప్రభుత్వాన్ని అలా కూల్చాం’ అని కథలా చెప్తారు వాళ్లు. అక్కడ అలాగే జరిగి ఉంటుంది. ‘ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా ఫలానా వ్యక్తి వస్తాడు’ అని చెప్తారు వాళ్లు. ఆ వ్యక్తే ఢిల్లీ పోలీసు కమిషనర్ అవుతాడు. ఎవరికెలాంటి భద్రత కల్పించాలో, ఎవరిపై ఐటీ, ఈడీ దాడులు జరపాలో కేంద్రం నిర్ణయిస్తుంది అనుకుంటాం మనం అమాయకంగా. కానీ బీజేపీలో చేరితే ఏ క్యాటగిరీ భద్రత వస్తుందో, ఏయే సంస్థలు దాడులు జరపవో రామచంద్రభారతే నిర్ణయించి చెప్తాడు.
ఒక్కమాటలో చెప్పాలంటే రామచంద్రభారతి అండ్ కో… అమిత్‌షా ఆడించే రాజ్యాంగేతర శక్తులు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సహకారంతో, తెలంగాణ పోలీసులు రట్టుచేసిన గుట్టు ఇప్పుడు దేశవ్యాప్తమైంది.
దేశంలోని 30 – 40 చోట్ల పరిశోధన జరుపుతున్న వివిధ రకాల మీడియా ఏజెన్సీల నుంచి అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తే.. దొంగ స్వాములు ఖచ్చితంగా బీజేపీ బ్రోకర్లు. ప్రభుత్వాల కూల్చివేత కుట్ర నుంచి బీజేపీ అగ్ర నాయకత్వం తప్పించుకునే చాన్స్ ఎంత మాత్రం లేదు.
ఇలా చెప్పారు..
‘కర్ణాటకలో ఏం చేసినమో మీకు తెలుసా! 16 మందితో గవర్నమెంట్‌ని కూల్చి పారేసినం. అది నేనే ఆపరేట్ చేసిన’ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఘనంగా చెప్తాడు దొంగస్వామి రామచంద్రభారతి. ‘ఏం చేసినమంటే.. 16 మంది విపక్ష ఎమ్మెల్యేలకు లుంగీలు, రుమాళ్లు కట్టినం. చేతిలో గడ్డపారలు పెట్టినం. కూలీల్లా వేషమేసి, ట్రాక్టర్ ఎక్కించి, ఎలహంకలోని ఫాంహౌజ్‌కు తీసుకుపోయినం. అక్కడ వారిని వోల్వో బస్సు ఎక్కించి చెన్నైకి తరలించినం. చెన్నైలో దిగిన తర్వాత ఇండిగో ఫ్లైట్‌లో ముంబైకి తీసుకు వెళ్లినం. ముంబై చేరుకున్నాక ఎవరికివ్వాల్సినవి వాళ్లకి డెలివరీ చేసేసినం’ మరింత రసవత్తరంగా పూసగుచ్చినట్టు వివరించి రక్తి కట్టించాడు మరో దొంగ స్వామి సింహయాజి.
ఇదీ జరిగింది
కర్ణాటకలో 2018 మే 15న ఎన్నికల ఫలితాల తర్వాత మే 23న కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుతో అది 2019 జూలై 23న పడిపోయింది. ఎన్నికల్లో మెజారిటీ రాకున్నా బీజేపీ అధికారంలోకి మాత్రం రాగలిగింది. ఫిరాయించింది 17 మంది ఎమ్మెల్యేలే.
ఇలా చెప్పారు..
‘మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టింది కూడా మేమే తెలుసా. ఈ సింహయాజీయే నాకు లోనావాలాలో కాటేజ్ ఇప్పించిండు. దాంట్లో ఉండే నేను మొత్తం ఆపరేషన్‌ను నడిపించిన’ రామచంద్రభారతి తనకు తానే చెప్పుకొన్న మరొక ఘనత ఇది.
ఇదీ జరిగింది
మహారాష్ట్రలో2019 అక్టోబర్ 24 ఎన్నికల ఫలితాల తర్వాత నవంబర్ 28న శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్‌ల మహా కూటమి ప్రభుత్వం ఏర్పడింది.శివసేనలో ఏకనాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు చిచ్చుతో 2022 జూన్ 30 నాడు అది కూలిపోయింది. సేన తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ అధికార భాగస్వామిగా మారింది. .
‘నెక్ట్స్ టార్గెట్ ఢిల్లీయే. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టబోతున్నాం. ఇప్పటికే 43 మంది ఆప్ ఎమ్మెల్యేలు టచ్‌లోకి వచ్చారు’ అంటూ అక్టోబర్ 26న ఫామ్‌హౌస్‌లో రామచంద్ర భారతి గొప్పగా చెప్పాడు. అంతకు కొన్ని రోజుల ముందే ఆగస్టు 26న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విలేకరుల సమావేశం పెట్టి మరీ, తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతున్నదని, 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ఆపరేషన్ కమల్ నిర్వహిస్తున్నదని బహిరంగంగా ప్రకటించారు.
కర్ణాటకలో, మహారాష్ట్రలో విపక్ష ప్రభుత్వాలు కూలిన మాట స్పష్టం. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన మాటా అంతే నిజం. ఇదంతా స్పష్టంగా, స్ఫటిక సదృశంగా మన కండ్ల ముందున్న వాస్తవం. నిన్నా మొన్నా జరిగిన నిజం. రామచంద్రభారతికి, సింహయాజికి బీజేపీతో ఏ సంబంధమూ లేకపోతే, అక్కడ విపక్ష ప్రభుత్వాల కూల్చివేతలోని లోగుట్టు, కుట్ర, ఇచ్చిన డబ్బులు వారికి ఎట్టా తెలిసినట్టు? ఏ రాష్ట్రంలో ఏం చేసినారో, ఎమ్మెల్యేలను ఎట్ల లొంగదీసుకున్నరో, ఎట్లా తరలించారో, ఎవరికి ఎంత పేమెంట్, ఎక్కడ ఇచ్చినారో ఈ దొంగ స్వాములు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఏ ప్రభుత్వాన్ని ఎట్ల కూల్చినారో ఎలా పూసగుచ్చినట్టు వివరించగలుగుతున్నారు? ‘అవును, నిజం.
అచ్చం వాళ్లు చెప్పినట్టే జరిగింది మా దగ్గర’ అని బాధిత విపక్షాల నాయకులు ఇప్పుడు బహిరంగంగానే చెప్తున్నారు. ఇది చాలదా వాళ్లు బీజేపీ బ్రోకర్లేనని చెప్పడానికి! సరే అదీ చాలదనుకుందాం! తన ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తున్నట్టు, ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముందే చెప్పారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూల్చడానికి తామే ఆపరేట్ చేస్తున్నామని రామచంద్రభారతి వివరాలతో సహా వెల్లడించారు. ఆప్ ముందే సేకరించి, అప్పటికింకా వెల్లడించని వివరాలతో, ఆర్సీబీ వెల్లడించిన వివరాలు పూర్తిగా సరిపోలాయని ఢిల్లీలోని ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది చాలదా వాళ్లు బీజేపీ బ్రోకర్లేనని చెప్పడానికి! సరే అదీ చాలదనుకుందాం!
సాధారణంగా రాజకీయ నాయకులకు ఎలాంటి భద్రత ఇవ్వాలో ఎవరు నిర్ణయిస్తారు? ఐటీ, ఈడీ దాడులు ఎవరిపై చేయాలో నిర్ణయించేది ఎవరు? కేంద్రం. మరి కేంద్ర హోం శాఖ తీసుకొనే నిర్ణయాల గురించి రామచంద్రభారతి ఎలా, ఏ హోదాలో హామీ ఇస్తాడు? ‘బీజేపీలో చేరితే మీపై ఐటీ ఈడీ దాడులేం ఉండవు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చినట్టు మీకూ వై ప్లస్ క్యాటగిరీ రక్షణ కల్పిస్తాం’ అని ఆయన ఏ హోదాలో హామీ ఇస్తాడు? ఇది చాలదా వాళ్లు బీజేపీ బ్రోకర్లేనని చెప్పడానికి! సరే అదీ చాలదనుకుందాం!
‘ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా ఎవరు రాబోతున్నారు?’ ఇదీ ఢిల్లీ పారిశ్రామిక వేత్త, ఆదిత్రీ ఆగ్రో టెక్ గ్రూపునకు చెందిన ఆనంద్ అనూ అనే వ్యక్తి రామచంద్రభారతికి పంపిన మెసేజ్. దీనికి 2022 జూలై 31న రామచంద్ర భారతి ఇలా జవాబిస్తాడు. ‘తమిళనాడు క్యాడర్‌కు చెందిన సంజయ్ ఆరోరా అనే ఐపీఎస్ అధికారి ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా వస్తాడు’ అని!
ఢిల్లీ రాష్ట్రమే అయినప్పటికీ, అది దేశరాజధాని కావడంతో, అక్కడ శాంతి భద్రతల వ్యవహారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రధానితో సంప్రదింపుల తర్వాత, హోంమం త్రి స్వయంగా ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎవరో నిర్ణయిస్తారు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ, రామచంద్రభారతి చెప్పిన రెండు రోజుల తర్వాత, అంటే… నాడు, ఆయన చెప్పిన వ్యక్తే, అంటే సంజయ్ ఆరోరానే ఢిల్లీ సీపీగా వచ్చారు. ఢిల్లీ సీపీపై రామచంద్రభారతికి, ఆనంద్‌కు సంభాషణ జరిగింది నిజం. రామచంద్ర భారతి చెప్పింది చెప్పినట్టు జరిగిందీ నిజం. ఇది రికార్డుల్లో ఉన్న సత్యం. రామచంద్రభారతికి బీజేపీతో, కేంద్రంతో, హోంమంత్రి అమిత్‌షాతో ఏ సంబంధమూ లేకపోతే, అంత పెద్ద నిర్ణయం ఆయనకు ముందే ఎలా తెలిసింది? అని కమల్ ఫైల్స్‌పై పరిశోధన జరుపుతున్న మీడియా ఏజెన్సీలు ఆశ్చర్యపోతున్నాయి.
తవ్వినకొద్దీ విస్తరిస్తున్న నెట్‌వర్క్
ఎమ్మెల్యేలకు ఎర కేసులో దొరికిన కాల్‌డాటాను తవ్వుతుంటే రామచంద్రభారతి అండ్ కో నెట్‌వర్క్ ఎంత బలంగా, ఎంత విస్తృతంగా ఉన్నదో బయట పడుతున్నదని దాన్ని విశ్లేషిస్తున్న నిపుణులు, పాత్రికేయులు, మీడియా ఏజెన్సీలవారు పేర్కొంటున్నారు. బీజేపీ, ఆరెస్సెస్ అగ్రనేతలు పలువురితో ఆర్సీబీకి ఏండ్ల తరబడి సన్నిహిత సంబంధాలున్నట్టు స్పష్టమవుతున్నదని అంటున్నారు. బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, ఆరెస్సెస్‌లో నంబర్ -2, కాబోయే సర్‌సంఘ్ చాలక్‌గా ప్రచారంలో ఉన్న దత్తాత్రేయ హొసబలే సహా, కేంద్ర మంత్రులు గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, ప్రకాశ్ జావడేకర్, వీ మురళీధరన్, పురుషోత్తం రూపాల, శ్రీపాదయశోనాయక్, కేంద్ర మాజీ మంత్రి సీఆర్ చౌదరి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌దాస్, యోగా గురువు బాబా రాందేవ్ ఉన్నట్టు అవి ఫొటోలతో సహా బయటపెడుతున్నాయి.
ఆర్సీబీ.. స్వామీజీ కనుక కలుసుకున్నాడు అనుకోవడానికి లేదు. బీజేపీ- ఆరెస్సెస్ నేతలకు రామచంద్రభారతికి మధ్య లైవ్ కాంటాక్ట్ నడిచింది. నిరంతర సంబంధాలు. ఈయన ఇటు నుంచి మెసేజ్ కొడితే, అటునుంచి వెంటనే రిైప్లె రావాల్సిందే. వారు ఎంతటి అగ్రనేత అయినా, ఎలాంటి పదవిలో ఉన్నా రామచంద్ర భారతి నుంచి మెసేజ్ వచ్చిందంటే వెంటనే ప్రతిస్పందన కనిపించేదంటే ఆయన ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ‘మీరు చెప్పినట్టుగా నేను అమృతాశ్రమ్‌ను సంప్రదిస్తున్నాను. చాలా ముఖ్యమైన కొన్ని విషయాలను వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది’ అని 2022 ఏప్రిల్ 10 నాడు రామచంద్ర భారతి, ఆరెస్సెస్ అగ్రనేత దత్తాత్రేయ హొసబలేకి ఒక మెసేజ్ పంపారు. ఆ వెంటనే ఆయనకు రిైప్లె వచ్చింది. ‘మేం హరిద్వార్‌లో ఉన్నాం. బైరాగీ క్యాంపు వద్ద, కంకాళ్‌లోని షేక్‌పూర్ కాలనీలో ఉన్న జగద్గురు శంకరాచార్య ఆశ్రమానికి రండి. రేపు 6.30కి మనం కలుద్దాం’ ఇదీ దత్తాత్రేయ హొసబలే ఇచ్చిన జవాబు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. రామచంద్ర భారతికి ఆరెస్సెస్ అగ్రనేతలకు ఎంత సన్నిహిత సంబంధాలున్నాయో! ఇదీ రామచంద్ర భారతి పలుకుబడి. ఇది ఇక్కడితో ఆగలేదని మీడియా ఏజెన్సీల పరిశోధనలో బయటపడుతున్నది.
ఢిల్లీ అధికార కారిడార్లలో ఆయనకు ఎంత పలుకుబడి అంటే బీజేపీ నేతలే పదవుల కోసం ఆయనను పదవుల కోసం ప్రాధేయపడేంత. సంఘ్ పరివార్‌లో ఎంతో పేరున్న సాధ్వీ ప్రాచీ, తనకు రాజ్యసభ సీటు ఇప్పించాల్సిందిగా రామచంద్రభారతిని వేడుకున్నదంటే ఆయన ప్రాభవం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పైరవీలు ఇంకెన్నో. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ప్రైవేటు సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సాకేత్‌కుమార్ పేరు కూడా కాల్‌డాటాలో ప్రస్తావనకు వచ్చింది. ‘మీరు చెప్పిన విషయం కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి చెప్పాను. హోంశాఖ మంత్రి పేరుతో రాసిన ఒక లేఖ కావాలి. ఆ లేఖను మెయిల్ చేయవద్దు. నాకు మాత్రమే ఇవ్వండి’ అని సాకేత్ అందులో రామచంద్రభారతికి సూచిస్తారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేంద్ర బీజేపీ పెద్దల జోక్యం నేరుగా ఉందనడానికి అనేక ఆధారాలు బయటపడుతున్నట్టు మీడియా ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ‘ప్రధానమంత్రి స్వయంగా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు’ అని రామచంద్రభారతి పంపిన మెసేజ్ ఇప్పటికే దొరికింది. తాజగా అమిత్‌షా ప్రైవేట్ సెక్రటరీ సాకేత్ ప్రమేయం గురించిన మెసేజ్ కూడా బయటకు వచ్చింది. 2002 అక్టోబర్ 18న రామచంద్రభారతి.. నందుకు పంపిన ఒక మెసేజ్‌లో ఇలా చెప్తారు. తెలంగాణ వ్యవహారానికి సంబంధించి ‘ఇప్పుడు స్వామీజీతో మాట్లాడడానికి ముందు సాకేత్‌తో నేను దీనిపై తీవ్రంగా చర్చించాను. దీని గురించే నేను మాట్లాడాను. ఏం జరిగిందో నేను రేపు చెప్తాను’ అని ఆర్సీబీ అందులో నందకుమార్‌కు సందేశం పంపాడు.
దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? కర్ణాటకలో సర్కారు కూల్చింది సరిపోలేదేమో! రేపటి ఎన్నికల్లో ఎలాగూ గెలవలేమన్న నమ్మకమో! ఇప్పుడు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌ను లైన్‌లో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. శివకుమార్‌తో ఆర్సీబీ జరిపిన సంభాషణలు కూడా కాల్‌డాటాలో బయటపడుతున్నాయి. అటు తమిళనాడులోని కొందరు నేతలతో కూడా ఆర్సీబీ చేసిన సంభాషణలు కాల్‌డాటాలో దొరికాయి.
ఫామ్‌హౌజ్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో జరిపిన సంభాషణల్లో రామచంద్రభారతి కనీసం 20 సార్లు అమిత్‌షా పేరును ప్రస్తావించాడు. ఇక కాల్‌డాటాను చూస్తే అమిత్‌షా, బీఎల్ సంతోష్, కేంద్రంలోని అండర్ సెక్రటరీ రవి వశిష్ట్, అమిత్‌షా ప్రైవేటు సెక్రటరీ సాకేత్, ఆరెస్సెస్ అగ్రనేతలు దత్తాత్రేయ హొసబలే.. ఇలా అనేకమందితో రామచంద్రభారతి జరిపిన సంభాషణలు బయటపడుతున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నిహితుడు అడ్వకేట్ శ్రీనివాసే బ్రోకర్లకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినట్టు విస్పష్టంగా బయటపడింది. బ్రోకర్ నందుతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఉన్న సంబంధాలు హైదరాబాద్‌లో కోడై కూస్తున్నయి. ఇటు బీజేపీ, అటు ఆరెస్సెస్ అగ్రనేతలతో రామచంద్రభారతి, సింహయాజి దిగిన ఫొటోలు ఇంటర్నెట్ నిండా పుంఖానుపుంఖాలుగా ఉన్నాయి. అయినా బీజేపీ నేతలు ఏమంటున్నారు? రామచంద్రభారతి ఎవరో తమకు తెల్వదనీ, ఆయనతో తమకు ఏ సంబంధమూ లేదని! అలాగని మనల్ని నమ్మమంటున్నారు.
సరే కొంచం సేపు నమ్ముదాం. మరి రామచంద్ర భారతి ఎవరో తెల్వకపోతే, ఆయనను రక్షించడానికి బీజేపీ రోజుకొక కేసు ఎందుకు వేస్తున్నట్టు? విచారణను అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? నీతిగల్ల రాజకీయ పార్టీయే అయితే, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మేం ఎలాంటి విచారణకైనా సిద్ధం అనాలి. కానీ బీజేపీ నేతలు విచారణను ఆపాలంటూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఈ 25 రోజుల్లో వారు 20 కేసులదాకా వేసి, దిగువ కోర్టు మొదలుకుని సుప్రీంకోర్టు దాకా రోజుకొక మొట్టికాయ తింటున్నారు. తిట్టించుకుంటున్నారు. దీన్ని బట్టే తెలుస్తున్నది వారి అసలు రంగేమిటో. గాయిగాయి చేసి ప్రజలను ఆగమాగం చేసి తప్పుదోవ పట్టించడమే వారి అసలు వ్యూహం. ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ వచ్చి ‘ముఖాబులా బహుత్ రంగీన్ హోజాయెగా’ అని బెదిరించడం కూడా ఇందులో భాగమే. తప్పుచేసి తప్పించుకునే దారి లేక టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను బెదిరించి లొంగదీసుకోవడానికి ఆయన ప్రయత్నించారు. చీకటి, దొంగ ఒకటే అన్నట్టు జరిగిన ఘోరాన్ని దాచడానికి తన ప్రధానమంత్రి స్థాయిని వాడుతున్నారు. అయితే కేసీఆర్ తనదైన శైలిలో ఈ వ్యవహారాన్ని పోలీసులకు, న్యాయస్థానాలకు అప్పగించి, చట్టం తనపని తాను చేసుకుపోయే వీలు కల్పించారు. దీంతో నిజం నిలకడ మీద తెలుస్తుందన్నట్టు ఒక్కో విషయం తేటతెల్లమవుతూ వస్తున్నది.
ఎవరూ తప్పించుకోలేరు
గోచిల పాపం కాశీకి పోయినా పోదన్నట్టు ఇప్పుడెవరూ తప్పించుకోలేరు. బ్రోకర్ స్వా ములైనా, బీజేపీ అగ్ర నేతలైనా! కాల్‌డాటాలో బయటపడుతున్న సత్యాలు ఆ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు దేశమంతా ఈ కాల్‌డాటాను విశ్లేషించే పనిలోనే ఉన్నది. పాపాల పుట్టలాగా తవ్వినకొద్దీ అందులో సంచలనాలు బయటపడుతున్నాయి. అమిత్‌షా, బీఎల్ సంతోష్, తుషార్, జగ్గూస్వామి, రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్, బండి సంజయ్ సన్నిహితుడు, కిషన్‌రెడ్డి సన్నిహితుడు ఇలా… కేంద్ర మంత్రులు, ఆరెస్సెస్ అగ్రనేతలు, కేంద్రంలోని ఐఏఎస్ అధికారులు… ఇలా ఎందరి పేర్లో! కేవలం ముగ్గురు బ్రోకర్ల వ్యవహారం కాదు. వారి వెనక బీజేపీ పెద్ద తలకాయలన్నీ ఉన్నాయి. నంబర్ వన్, టు, త్రీ… ఇలా ఇంకెందరో! ఇది ఇప్పుడు తెలంగాణ వ్యవహారం ఎంతమాత్రం కాదు. ఇది దేశం మొత్తానికీ విస్తరించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో తమ ప్రభుత్వాలను కూల్చిన బ్రోకర్ల ముఠాపై, బీజేపీ పెద్దలపై కేసులు వేయడానికి అక్కడి విపక్ష పార్టీలు సిద్ధమవున్నాయి. తమ ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నించారంటూ ఢిల్లీ, బీహార్, తమిళనాడు, కేరళలోని పార్టీలు కేసులు వేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఒక తేనెతుట్టె కదలనుంది.
ఇప్పుడు కేసీఆర్ ఒక దారి చూపించారు. దర్యాప్తు సంస్థలు కేంద్రానికే కాదు. రాష్ట్రాలకూ ఉంటాయని. ఈ దేశం చేసుకున్న చట్టం సీఆర్‌పీసీ ఒకటుందని. దేశానికి న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ కూడా ఉందని. దీన్ని ఆలంబనగా చేసుకుని ఇప్పుడు ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రం కదలనున్నది. దాని పర్యవసానం ఏమిటి? నిందితులకు ఒక జైలు నుంచి మరొక జైలుకు షిఫ్ట్ కావడం తప్ప మరో మార్గం లేదు. బీజేపీ అగ్రనేతలకు ఒకదాని తర్వాత మరొక నోటీసు… అంతకుమించిన పరాభవం తప్ప దు. చేసుకున్న వారికి చేసుకున్నంత!
ముక్తాయింపు 1
ఆర్సీబీకి 2 పాస్‌పోర్టులు?
బీజేపీ చెప్తున్నట్టు రామచంద్రభారతి నిజంగా స్వామీజీనే అయితే ఆయన ఒకసారి కాషాయం ఎందుకు కడతాడు? ఒకసారి డ్రెస్సు ఎందుకు వేస్తాడు? రామచంద్రభారతికి ఒకటికి రెండు ఆధార్ కార్డులున్నాయి. ఒకటికి రెండు పాన్‌కార్డులున్నాయి. ఒకటికి రెండు డ్రైవింగ్ లైసెన్సులున్నాయి. ఇవన్నీ మీడియా ఏజెన్సీల పరిశోధనలో బయటపడ్డాయి. వీటన్నింటి కంటే ఘోరమైన విషయం ఏమిటంటే ఆయనకు రెండు పాస్‌పోర్టులున్నాయట. ఇది అతి పెద్ద నేరం. ఇదీ ఈ స్వామీజీల వ్యవహారం
ముక్తాయింపు 2
ముగ్గురు బ్రోకర్లలో ఒకరైన సింహయాజిది ఆంధ్రపదేశ్‌లోని రాయలసీమకు చెందిన రాయచోటి. వైసీపీతో స్నేహం నటిస్తూనే జగన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు జరిగినట్టు ఇప్పటికే బయటపడింది. బ్రోకర్లే ఈ విషయాన్ని బయటపెట్టారు. దీంతో సింహయాజి జీవితంలో తాను మళ్లీ ఏపీకి పోగలనా? అని ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. పోతే తన పరిస్థితి ఏమవుతుందోనని ఆయన భయపడుతున్నట్టు సమాచారం.