Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బీజేపీ నడ్డా.. అబద్ధాల అడ్డా

-కమలం పార్టీ అధ్యక్షుడివన్నీ నయవంచక మాటలు
-తెలంగాణ ఉద్యోగుల జీతాల ఆలస్యానికి కేంద్రమే కారణం
-రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో 30వేల కోట్లు కోత
-నిధులు ఆపినవారే.. జీతాల ఆలస్యంపై నిందలేస్తారా?
-సొంతగడ్డపై నడ్డా బొక్కబోర్లా.. ఇక్కడికొచ్చి డైలాగులా?
-మునుగోడులో ఫ్లోరోసిస్‌ దవాఖాన ఏమైంది?
-నెరవేర్చిన హామీలపై శ్వేతపత్రం ప్రకటించే దమ్ముందా?
-బీజేపీ తీరుపై విరుచుకుపడిన మంత్రి హరీశ్‌రావు
-రాష్ట్రానికి అవార్డు రాని నెల, అవార్డు రాని శాఖ ఉన్నదా?
-సంజయ్‌ గారు చెప్తారు.. ఈడీ గారు వస్తారు
-8 ఏండ్లలో ప్రజల జీవనంలో కేంద్రం తెచ్చిన గుణాత్మక మార్పు ఏమిటి?
-ఇస్తామన్న కోట్ల కొద్దీ కొలువులేవి? వేస్తామన్న లక్షలకొద్దీ డబ్బు ఏది?
-రైతు ఆదాయాన్ని కాదు.. సాగు ఖర్చును రెట్టింపు చేశారు
-బీసీల గణన జరపాలని, ప్రత్యేకశాఖ పెట్టాలని కోరితే చేయరేం?

బీజేపీ నయవంచక స్వరూపాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాయే బయటపెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో సొంతరాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో బొక్కబొర్లా పడిన నడ్డా.. తెలంగాణకు వచ్చి సినిమా డైలాగులు చెప్తే ఎవరూ నమ్మరని అన్నారు. 8 ఏండ్ల పాలనలో దేశానికి, రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. పథకాలు మావి, పబ్లిసిటీ మీదా? అని ప్రశ్నించారు. కేంద్రం కోతల వల్లే ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా చెల్లించాల్సి వస్తున్నదని స్పష్టంచేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌ నిప్పులు చెరిగారు.

స్వచ్ఛందంగా తప్పుకుంటే తప్ప బీఆర్‌ఎస్‌కు తిరుగులేదు
రాష్ట్రంలో ఏం జరుగుతున్నదనే కనీస అవగాహన లేకుండా నడ్డా మాట్లాడారని, రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. కరీంనగర్‌ సభలో నడ్డా సినిమా డైలాగుల్లా మాట్లాడారే తప్ప, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడలేదని అన్నారు. ‘బీఆర్‌ఎస్‌కు ఇక వీఆర్‌ఎస్సే అంటరు. వీఆర్‌ఎస్‌ అంటే స్వచ్ఛంద పదవీ విరమణ. మాకు మేము స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంటే తప్ప బీఆర్‌ఎస్‌కు తిరుగులేదన్నట్టే. బీఆర్‌ఎస్‌కు ఓటమి లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్వయంగా ఒప్పుకున్నట్టయ్యింది’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాసకోసం తండ్లాడితే పాట్లు తప్పవని నడ్డా గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. సొంతగడ్డ హిమాచల్‌ప్రదేశ్‌లో బొక్కబోర్లా పడ్డ నడ్డా తెలంగాణలో సుద్దులు చెప్పడమేమిటని మండిపడ్డారు. ‘జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి.. సినిమా డైలాగులా మీరు చెప్పేది. దేశ ప్రజలకు, తెలంగాణకు ఏం చేశారో చెప్పలేదు. ఆయన మాటల్లో సొల్లు మాటలు తప్ప ప్రజలకు మేలు చేసేది ఒక్కటీ లేదు. మునుగోడులో ఓడిపోయినా వారికి ఇంకా జ్ఞానోదయం కాలేదు’ అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ‘బీజేపీకి ఎంతసేపూ రాజకీయాలే ముఖ్యం. ఎన్నికల్లో ఎట్లా గెలవాలె? గెలిచినవాళ్లను ఎట్లా పడగొట్టాలె? ఎవరి మీద కేసులు పెట్టాలె? ఎవరికి గోతి తీయాలె? ప్రభుత్వాలను ఎట్ల పడగొట్టాలె? ఇవే బీజేపీకి తెలిసిన విద్యలు. ఈ కుట్రల మీదే ఆ పార్టీ నడుస్తున్నది..’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి నిమిషం ప్రజలకు ఎలా సేవ చేయాలని తమ నాయకుడు కేసీఆర్‌ తపిస్తారని, తండ్లాడుతారని చెప్పారు.

కోట్ల కొద్దీ కొలువులు, లక్షలకొద్దీ డబ్బులు ఏమయ్యాయి?
ఎన్నికల హామీలపై నడ్డాకు మాట్లాడే నైతిక హక్కులేదని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కోట్ల కొద్దీ కొలువులు ఇస్తమంటిరి..లక్షల కొద్దీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో వేస్తామంటిరి. వీటి సంగతేందో చెప్పకపోతిరి నడ్డా’ అని ప్రశ్నించారు. దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ ఆ పార్టీ అమలు చేయలేదని విమర్శించారు. మ్యానిఫెస్టోలో చెప్పనవీ మేం చేశాం ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవే కాదు చెప్పని వాటినీ అమలు చేశామని మంత్రి హరీశ్‌రావు వివరించారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజలకు అవసరమనుకున్నవాటిని అమలు చేసిన నాయకుడు సీఎం కేసీఆర్‌ అని చెప్పారు. రైతుబంధు కింద రూ. 60 వేల కోట్లు, రైతుబీమాకు రూ. 5 వేల కోట్లు, కేసీఆర్‌ కిట్‌కు రూ. 5 వేల కోట్లు, వేల కోట్లతో మిషన్‌ భగీరథ, దళితబంధు, కల్యాణలక్ష్మి.. ఇలా ప్రజలకు కావాల్సిన వాటిని అమలు చేసుకుంటూ పోతున్నామని ఆయన వివరించారు. తాము బీజేపీ మాదిరిగా మాట ఇచ్చి తప్పే వాళ్లం కాదని అన్నారు.

ఫ్లోరోసిస్‌ హాస్పిటల్‌ ఏమైంది నడ్డా?
ఫ్లోరోసిస్‌ బాధితుల కోసం మునుగోడులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా నడ్డా దవాఖాన కడుతామని వేసిన శిలాఫలకం మర్రిగూడలో నేటికీ వెక్కిరిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నడ్డా కొబ్బరికాయ కొట్టిన దానికే దిక్కులేదని, అలాంటి వ్యక్తి చెప్పే మాటలు తెలంగాణ ప్రజలను నమ్మాలా? అని ఆయన ప్రశ్నించారు. ఫ్లోరోసిస్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఎప్పుడు పెడతారని నిలదీశారు. ప్రజల జీవనంలో గుణాత్మకమైన మార్పు తెచ్చేలా చేసిన ఒక్క మంచి పని ఉన్నా బీజేపీ చెప్పాలన్నారు. బూతులు మాట్లాడటం, బురద జల్లడం, దాడులు చేయడం, కేసులు పెట్టడం ద్వారా తెలంగాణ ప్రజల మనసులను గెలవలేరని మంత్రి హరీశ్‌రావు బీజేపీ నేతలకు హితవు పలికారు. రెండు నెలలల్లోనే గుజరాత్‌కు ఎన్ని వేల కోట్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సెప్టెంబర్‌ 17న జరిపింది అధికారికం కాదా?
అధికారంలోకి వస్తే సెప్టెంబర్‌ 17న అధికారికంగా ఉత్సవాలు చేస్తామని నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా జరిపిందని చెప్పారు. ‘నడ్డా.. మీకు ఈ మాత్రం తెలియదా? ఎవరూ అప్డేట్‌ చేస్తలేరా?’ అని ప్రశ్నించారు. ధరణిపై బీజేపీది సొల్లువాదనగా హరీశ్‌రావు కొట్టిపారేశారు. ఇంతకుముందు లంచాలు, అవినీతితో కునారిల్లిన రెవెన్యూ విధానం పోయి.. పారదర్శకంగా పనులు జరుగుతున్నందునే బీజేకి నచ్చడం లేదా? అని ప్రశ్నించారు. ధరణిమీద బురదజల్లే పనిని మానుకోవాలన్నారు.

హమ్‌ ఉస్‌సే ఇమాన్‌దార్‌ హై..
తెలంగాణ ప్రజలను, తెలంగాణ యాసను పార్లమెంటులో కేంద్రమంత్రి నిర్మల హేళన చేశారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ వాళ్లకు హిందీ సరిగా మాట్లాడటం రాదనడంపై ఆయన మండిపడ్డారు. ‘హమారా హిందీ కమ్‌జోర్‌ హోగా.. లేకిన్‌ హమ్‌ కామ్‌దార్‌ హై.. హమ్‌ ఉస్‌సే జ్యాదా ఇమాన్‌దార్‌హై. ఓ బాత్‌ ఆప్‌ సమజ్‌నా చాహియే. హమ్‌ బీజేపీ జైసా కమ్‌జోర్‌ నహీ హై. బీజేపీ జైసా దేశ్‌కో హమ్‌ కమ్‌జోర్‌ నహీ బనాయేంగే’ అని ఆయన దీటుగా జవాబిచ్చారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ ప్రతిష్ఠ ఎలా దిగజారిపోతుందో తెలుసుకోవాలని సూచించారు. పేదరికంలో, రూపాయి విలువ పతనంలో, ధరల పెరుగుదలో ఇలా అన్నిరంగాల్లో భారతదేశ ప్రతిష్ఠ దిగజారిపోతున్నదని నిప్పులు చెరిగారు.

ఢిల్లీలో అవార్డులు.. గల్లీలో అవహేళనలా?
ఒకవైపు ఢిల్లీలో అవార్డులు ఇస్తూ.. మరోవైపు గల్లీల్లో బద్నాం చేయడం బీజేపీ నాయకులకు అలవాటేనని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు అవార్డు రాని నెల, ప్రశంసలు దక్కని డిపార్ట్‌మెంట్‌ లేదన్నారు. పనిచేయకుండానే అవార్డులు ఇస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు అవార్డులు ఇవ్వాల్సి వస్తుందని బహుశా వాటిని కేంద్రం రద్దు చేసినా ఆశ్చర్యం లేదన్నారు. బీజేపీ నేతలు తమ సభల్లో రాష్ట్రానికి ఏం చేస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి బుల్లెట్‌ ట్రెయిన్‌, వందేభారత్‌ రైల్లేవని నిలదీశారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇవ్వరో చెప్పాలన్నారు. ఐటీఐఆర్‌ను ఎందుకు రద్దుచేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు మంత్రిత్వశాఖ ఏదని, బీసీ కులగణన ఎందుకు చేపట్టరని ప్రశ్నించారు. తిట్టడం కాకుండా, బీజేపీ నేతలు తమకంటే మెరుగ్గా ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని సవాల్‌ చేశారు.

పథకాలు తెలంగాణవి.. ప్రచారం కేంద్రానిది
దేశంలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆకాశమంత ఎత్తులో ఉన్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ పథకాలు బాగాలేకపోతే..తామేమీ చేయకపోతే తెలంగాణ పథకాలు ఎందుకు కాపీ కొడుతున్నారని ప్రశ్నించారు. ‘రైతుబంధును కాపీ కొట్టి పీఎం కిసాన్‌ సమ్మాన్‌నిధి పెట్టుకోలేదా? మిషన్‌ భగీరథను కాపీ కొట్టి హర్‌ఘర్‌ జల్‌ పథకం తేలేదా? మిషన్‌ కాకతీయను కాపీ కొట్టి అమృత్‌సరోవర్‌ కార్యక్రమాన్ని తెచ్చింది మీరు కాదా? మనుషుల కోసం 108 వస్తదో అట్లాగే మూగజీవాల కోసం 1962 పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడితే, దాన్ని కాపీ కొట్టి దేశం మొత్తం అమలు చేసింది మీరు కాదా? మేము జిల్లాకో మెడికల్‌ కాలేజీని అమలు చేస్తే దాన్ని కాపీకొట్టి దేశంమొత్తం చేస్తామని మీరు ప్రకటించుకోలేదా? ఎవరు ఎవరిని చూసి కాపీ కొడుతున్నారు?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

సంజయ్‌ చెప్తారు.. ఈడీ వస్తారు
కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణలో చెల్లవని మంత్రి హరీశ్‌రావు తేల్చిచెప్పారు. ప్రభుత్వాలను పడగొట్టేందుకు, వ్యక్తులను బెదిరించేందుకు దర్యాప్తు విభాగాలను బీజేపీ వాడుకోవడం మానాలని హితవు పలికారు. ‘సంజయ్‌గారు చెప్తారు.. తరువాత ఈడీగారు వస్తారు’ అని ఆయన ఎద్దేవా చేశారు. నాలుగు రోజులక్రితమే ఈడీ వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పడం, శుక్రవారం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసు ఇవ్వడంపై ఆయన ఛలోక్తి విసిరారు.

8 ఏండ్ల పాలనలో కోటి కోట్ల అప్పు
దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీజేపీకి రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన్నాడు దేశానికి రూ.56వేల కోట్ల అప్పు ఉంటే.. ప్రస్తుతం అది రూ.1,35,87,893 కోట్లకు చేరిందని వివరించారు. బీజేపీ 8 ఏండ్ల పాలనలో దాదాపు కోటి కోట్ల అప్పు చేసిందన్నారు. అంటే సంవత్సరానికి రూ. 12 లక్షల కోట్లు అప్పు చేసిందని తెలిపారు. దేశ ప్రజలనెత్తిన నెలకు లక్ష కోట్ల అప్పు రద్దుతున్నది బీజేపీ అని ఆధారాలతో సహా వెల్లడించారు. అదే సమయంలో తెలంగాణ అప్పులు అదుపులోనే ఉన్నాయని పార్లమెంటు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో కేంద్రం ప్రకటించిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఈ నెల 13న కేంద్రం ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన పత్రాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రదర్శించారు. తెలంగాణ అప్పులు ఎక్కువగా చేస్తున్నదంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆ పత్రమే సమాధానమని చెప్పారు. తెలంగాణ అప్పుల శాతంలో 23.5 శాతం ఉందని, దేశంలో రుణ రాష్ట్రాల్లో కింది నుంచి 6వ స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణ కంటే జీఎస్టీ అప్పుల్లో 22 రాష్ట్రాలు ముందున్నాయన్నారు.

సొంతపన్నుల రాబడిలో తెలంగాణ టాప్‌
సొంతపన్నుల రాబడి (ఎస్‌ఓఆర్‌)లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. 8 ఏండ్లుగా ఎస్‌ఓఆర్‌లో 11.5 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే తెలంగాణ నంబర్‌ 1గా నిలిచిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ 8.6 శాతం, మధ్యప్రదేశ్‌ 7 శాతం, కర్నాటక 5.7 శాతం, గుజరాత్‌ 2.6 శాతం మాత్రమే వృద్ధిరేటును సాధించిందని, మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ అనేక రెట్లు ముందున్నదని వివరించారు. దీన్ని పెంచలేకపోవటానికి బీజేపీ దగ్గర సమాధానం ఉందా? అని ఆయన ప్రశ్నించారు.

ఫస్టుకు జీతాలు ఇవ్వకపోవటానికి కారణం కేంద్రమే
ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వకపోవటానికి కారణం కేంద్రం కాదా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇచ్చే ఎఫ్‌ఆర్‌బీఎంలో రూ. 15 వేల కోట్ల కోత పెట్టింది కేంద్రమేనన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఏకపక్షంగా రూ.15 వేల కోట్లను కేంద్రం కోత పెట్టిందని, అదే సమయంలో ఉద్యోగుల మీద ప్రేమ ఉన్నట్టు బీజేపీ మాట్లాడుతున్నదని మండిపడ్డారు. ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ తమదని అన్నారు. దేశంలో అత్యధిక జీతాలు పొందే ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులని తెలిపారు. దేశంలో వివిధ రాష్ట్రాల ఉద్యోగులకు ఎంతెంత ఇస్తున్నాయి? కేంద్రం ఎంత చెల్లిస్తున్నది? తెలంగాణ ఎంత చెల్లిస్తుందో పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. కేంద్రం పెట్టిన కోతల వల్ల..నిబంధనల వల్ల తమ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా వస్తున్నాయన్నారు. బాయికాడ కరెంటు మీటర్లు పెట్టలేదని నిరుడు రూ.6 వేల కోట్లు, ఈసారి మరో రూ. 6వేల కోట్లు కేంద్రం కోతపెట్టిందని హరీశ్‌రావు స్పష్టంచేశారు. మీటర్లు పెట్టాలని చెప్పలేదంటున్న కేంద్రం.. మరి, ఆ రూ.12 వేల కోట్లను ఎందుకు ఆపిందని ప్రశ్నించారు. నిలిపివేసిన మొత్తం రూ. 27 వేల కోట్లు వస్తే తాము కూడా ఒకటోతారీఖు జీతాలిస్తామన్నారు. నీతి ఆయోగ్‌, ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మరో 30 వేల కోట్లనూ కేంద్రం అడ్డుకున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేకుండా కుట్ర చేసి జీతాలు ఇవ్వటం లేదని పేర్కొనటాన్ని ఆయన తప్పుబట్టారు.

నడ్డా.. వీటిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?
కోట్ల కొద్దీ కొలువులు ఇస్తమంటిరి. లక్షల కొద్దీ డబ్బులు ఖాతాల్లో వేస్తామంటిరి. వాటి సంగతి ఏంది? కరీంనగర్‌ గడ్డ మీద ఈ లెక్కలన్నీ చెప్తే బాగుండేది కదా?
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు? ఆ లెక్కన ఇప్పటికి 17 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చారా?
బీజేపీ గెలిస్తే ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు. ఎంతమంది అకౌంట్లల్లో వేశారు?
విదేశాల్లోని నల్లధనం వాపస్‌ తెస్తామన్నారు. ఎంత తీసుకొచ్చారు? ఎంత బ్లాక్‌మనీ ఇక్కడినుంచి విదేశాలకు వెళ్లింది? చెప్పగలరా?
రూపాయి విలువ పెంచుతామన్నారు. పెంచిన్రా.. దించిన్రా? 2014లో రూపాయి విలువ రూ.53, ఇవ్వాళ అది రూ.83. మీ హయాంలో రూపాయి విలువ దారుణంగా పతనమైంది నిజం కాదా?
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. కానీ డీజిల్‌, ఎరువుల ధరలు పెంచి, జీఎస్టీ వేసి రైతుల ఖర్చును రెట్టింపు చేసింది నిజం కాదా?
దేశంలో అందరికీ ఇండ్లు ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా ఇండ్లు?
ఈ దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చిన ఒక్క హామీనైనా మీరు నెరవేర్చారా?

కిషన్‌రెడ్డీ.. ఈ కోత పెట్టిన నిధులు ఎప్పుడిస్తారు?

ఎఫ్‌ఆర్‌బీఏంలో ఏకపక్షంగా రూ. 15వేల కోట్లు
బోరుబావుల కాడ మీటర్లు పెట్టలేదని రూ.12వేల కోట్లు
మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నీతి ఆయోగ్‌ ప్రకటించిన రూ. 24 వేల కోట్లు
5వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధులు రూ. 5,374 కోట్లు
కిషన్‌రెడ్డీ.. జీఎస్టీ సెస్సులో ఎవరెంత ఇచ్చారో చెప్పు?
కేంద్రం జీఎస్టీ సెస్సును తెలంగాణకు రూ.8,379 కోట్లు ఇచ్చామంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొనటాన్ని మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలో అతితక్కువ సెస్సు రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని, కేంద్రం ఇచ్చిన సెస్సు కన్నా తెలంగాణ కేంద్రానికి ఇచ్చిందే ఎక్కువని గుర్తుంచుకోవాలని అన్నారు. ఏ రాష్ట్రానికైనా పన్నుల్లో 14 శాతం వృద్ధిరేటు రాకపోతే ఆ రాష్ర్టాలకు సెస్‌లో జమ అయిన డబ్బుల నుంచి కేంద్రం చెల్లింపులు జరుపుతుందని వివరించారు. తెలంగాణ కేంద్రానికి చెల్లించిన సెస్‌ రూ.30,878కోట్లు కాగా, ఇందులో తెలంగాణ తీసుకున్నది కేవలం రూ. 8,379 కోట్లు మాత్రమేనని తేల్చిచెప్పారు. సొంత ఆదాయ వనరులను బాగా పెంచుకుంటున్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.

తెలంగాణ పురోగతికి ఆనవాళ్లు
రాష్ట్రం ఏర్పడిననాడు తెలంగాణ జీఎస్‌డీపీ రూ.4.51 లక్షల కోట్లు అని, అదే 8 ఏండ్లలో రూ.11.5 లక్షల కోట్లకు చేరిందని మంత్రి హరీశ్‌రావు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పనితీరుకు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఆయన తలసరి ఆదాయంతో పోల్చి చూపారు. కేంద్ర తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం రెండింతల కన్నా ఎక్కువ పెరిగిందని వివరించారు. ఈ లెక్కలన్నీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాలేనని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎందుకు పెరగటం లేదని ఆయన నిలదీశారు. దక్షిణాదిన తెలంగాణ నంబర్‌ 1గా నిలిచిందన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.