Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బీజేపీ రైతు ద్రోహి.. బండి రాష్ట్ర ద్రోహి

-బండి సంజయ్‌ది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర
-తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే
-‘పాలమూరు’కు జాతీయ హోదా విజ్ఞప్తిపై స్పందనేది?
-కృష్ణాజలాల వాటా తేల్చకుండా శిఖండి బోర్డు పెట్టలేదా?
-రాముడు నడిచిన భద్రాద్రికి బీజేపీ ఏం చేసిందో చెప్పు?
-వరి పంటతో రాజకీయ చలి మంటలు కాగేది బీజేపీ కాదా?
-పొత్తిళ్లలో ఉన్న తెలంగాణ పసిగుడ్డుపై కత్తిగట్టింది నిజం కాదా?
-బండి సంజయ్‌కు రాసిన బహిరంగ లేఖలో మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

క్షమాపణ చెప్పి నడువు
వడ్లు కొనాలని అడిగితే నూకలు తినండని తెలంగాణ ప్రజలను అవమానించిన దురహంకారం బీజేపీదని కేటీఆర్‌ ఆగ్రహించారు. ‘రైతు ద్రోహి, రాష్ట్ర ద్రోహి పాత్ర పోషిస్తున్న మీకు పాదయాత్ర చేసే నైతిక హకు లేనేలేద’ని తేల్చిచెప్పారు. దశ, దిశ లేని బీజేపీ దరిద్ర విధానాలతో దేశంలో ఎన్నడూలేని విధంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని గుర్తు చేశారు. ఎక్కాలు రాని నాయకత్వం ప్రజలపై చేస్తున్న సంగ్రామాన్ని గుర్తుకుతెచ్చేలా బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన కేంద్ర ప్రభుత్వ చేతగానితనంపై ప్రజలకు బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. రైతు ద్రోహి, రాష్ట్ర ద్రోహి అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్‌ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు రైతు దగా యాత్ర, రైతు దోఖా యాత్ర అని పేరు పెట్టుకొని ఉంటే బాగుండేదని చురక అంటించారు. ‘బండి సంజయ్‌ చేస్తున్నది పాదయాత్ర కాదు.. అది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర, ఝూటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర. రైతు ద్రోహి, రాష్ట్ర ద్రోహి పాత్ర పోషిస్తున్న మీకు పాదయాత్ర చేసే నైతిక హక్కు లేనే లేదు’ అని కుండబద్దలు కొట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాలమూరు జిల్లా నుంచి పాదయాత్రను ప్రారంభించినంత దగాకోరుతనం ఇంకొకటి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చబడుతున్న పాలమూరుపై పగబట్టిన పార్టీకి అధ్యక్షుడైన ఆయనకు అకడ అడుగుపెట్టే నైతిక అర్హత లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం బండికి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. పాలమూరు గడ్డకు బీజేపీ చేసిన ద్రోహం, ప్రాజెక్టుల మంజూరులో చూపిన నిర్లక్ష్యం, నిధుల విడుదలలో కేంద్రం చేసిన వంచనకు ఇక్కడి ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దశాబ్దాల పోరాటంతో సాధించుకొన్న తెలంగాణ అస్థిత్వాన్ని పదే పదే ప్రశ్నిస్తూ, ఎగతాళి చేస్తున్నందుకు ముందు తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పి పాదయాత్రను ప్రారంభిస్తే కాస్త అయినా గౌరవం దకుతుందని బండి సంజయ్‌కు హితవు పలికారు.

పాలమూరుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు పెట్టి కపట యాత్రలా?
పాలమూరు గడ్డ పచ్చని పంటలతో కళకళలాడుతున్నదన్న నిజాన్ని కలలో కూడా ఓర్వలేకపోతున్న నాయకత్వం బీజేపీది అని మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. పాలమూరుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు పెట్టి బోడి పెత్తనం చేస్తూ, పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్లిప్పుడు కపట యాత్రలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పేరుతో ఒక శిఖండి సంస్థను ఏర్పాటు చేసి పాలమూరుకు న్యాయంగా దకాల్సిన నదీ జలాల వాటాను సందిగ్ధంలోకి నెట్టిన కుట్రపూరిత పార్టీ బీజేపీ అని ధ్వజమెత్తారు.

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏది?
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడీకి జై కొడుతూ, పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్న బీజేపీ బానిస నాయకులు సిగ్గూఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా? అని కేటీఆర్‌ నిలదీశారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ స్పందన ఏమిటని ప్రశ్నించారు. పకనే ఉన్న కర్ణాటక అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చి పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాకే పాలమూరు గడ్డ మీద బండి సంజయ్‌ అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు రైతు చేసిన పాపం ఏమిటని బీజేపీపై నిప్పులు చెరిగారు. పాలమూరు ప్రజల చిరకాల కోరిక.. గద్వాల, మాచర్ల రైల్వే లైన్‌ను ఎలా పూర్తి చేస్తారో బండి సంజయ్‌ స్పష్టం చేయాలని ప్రశ్నించారు.

వరిపంటతో రాజకీయ చలిమంటలా?
వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది బీజేపీ కాదా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. రైతులతో రాబందుల్లా వికృత రాజకీయం చేసి వడ్లు కొనాలని అడిగితే చేతగాదని చేతులెత్తేసి ఇప్పుడు మిడతల దండులా యాత్రకు బయల్దేరుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు వేస్తే కేంద్ర ప్రభుత్వంతో కొనిపిస్తామని తెలంగాణ రైతాంగాన్ని తప్పుదోవ పట్టించి, పంట చేతికొచ్చినంక బండి తప్పించుకు తిరుగుతున్నారని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ రైతాంగం ప్రస్తుతం ఎదురొంటున్న గడ్డు పరిస్థితిపై తన వైఖరిని స్పష్టం చేశాకే పాదయాత్ర ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ దౌర్జన్యాన్ని ప్రజలు మర్చిపోలేదు
తెలంగాణకు అడుగడుగునా బీజేపీ అన్యాయమే చేసిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. పొత్తిళ్లలో ఉన్న తెలంగాణ పసిగుడ్డుపై కత్తిగట్టి అధికారం ఉందన్న అహంకారంతో 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపిన బీజేపీ దౌర్జన్యాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. తెలంగాణకు న్యాయంగా దకాల్సిన విభజన హామీలు నెరవేర్చేందుకు బండి సంజయ్‌, బీజేపీ నాయకత్వానికి తెలివిలేదని మండిపడ్డారు. నీతి ఆయోగ్‌ చెప్పినా నిధులిచ్చే నీతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రాజెక్టులకు జాతీయ హూదా ఇవ్వరు, నదీ జలాల్లో వాటాలు తేల్చకుండా జలదోపిడీకి సహకరిస్తారు’ అని మండిపడ్డారు.

బండి సంజయ్‌ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు
ఉచిత కరెంట్‌ ఇస్తుంటే మోటర్లకు మీటర్లు పెట్టాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తారని, పండించిన పంటలు కొనకుండా రైతును గోస పెడతారని బీజేపీపై కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ అంటేనే గిట్టని బీజేపీ నాయకులు కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభం? అని ప్రశ్నించారు. పాదయాత్రే కాదు మోకాళ్లపై దేకుంటూ యాత్ర చేసినా బండి సంజయ్‌ను, బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. బీజేపీ డీఎన్‌ఏలో ఉన్న వివక్ష, విభజన రాజకీయాలను తెలంగాణ ప్రజలు గుర్తించి తిరసరిస్తారని లేఖలో పేర్కొన్నారు.

దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేసే చిల్లర పార్టీ.. బీజేపీ
ఆదిశక్తి పీఠమైన జోగుళాంబను దర్శించుకొని పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్‌.. రాష్ట్రంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలకు అదనంగా ఎన్ని నిధులు తీసుకొచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని నిలదీశారు. తెల్లారి లేస్తే రాముడి పేరుతో రాజకీయాలు చేసే నీచమైన భారతీయ జనతా పార్టీ.. ఆ కోదండ రాముడు నడయాడిన భద్రాద్రి క్షేత్రానికి ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. బండి సంజయ్‌, బీజేపీ.. దేవాలయాలను, దేవుళ్లను రాజకీయాలకు వాడుకొంటారని ఎద్దేవా చేశారు. తాము మాత్రం అచంచలమైన భక్తి, అంకుఠిత దీక్షతో ఆసేతు హిమాచలంలోనే అద్భుతమైన దైవక్షేత్రంగా యాదాద్రిని పునర్నిర్మించామని స్పష్టం చేశారు. యాదాద్రి దైవకార్యంలో బీజేపీకి భాగస్వామ్యం ఉన్నదా? అని అడిగారు. దేవుళ్లు, దైవాన్ని రాజకీయాలకు వాడుకోవడాన్ని అలవాటుగా మార్చుకొన్న బీజేపీ.. తెలంగాణ రైతాంగాన్ని కూడా తన చిల్లర రాజకీయాలకు బలి చేస్తున్నదని మండిపడ్డారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.