-పారిశ్రామిక కారిడార్లు, ఫార్మాసిటీ, -నిమ్జ్ తదితరాలకు 4 వేల కోట్లు ఇవ్వండి -కేంద్రమంత్రి గోయల్‌కు కేటీఆర్ లేఖ -రెండు పారిశ్రామిక కారిడార్లకు -ఆమోదంపై మంత్రి ధన్యవాదాలు

తెలంగాణలో వివిధ ప్రాజెక్టులకు వచ్చే సార్వత్రిక బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. పారిశ్రామిక కారిడార్లు, ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, నేషనల్ డిజైన్ సెంటర్ల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు కనీసం రూ.4,000 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఆ లేఖను బుధవారం విడుదలచేశారు. తెలంగాణలో హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్లను ప్రాథమికంగా ఆమోదించినందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు క్లస్టర్ల పరిధిలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి రూ.5 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారని పేర్కొన్నారు. ఈ రెండింటినీ వేగవంతంగా చేపట్టడానికి వచ్చే బడ్జెట్లో కనీసం 50 శాతం నిధులను కేటాయించాలని కోరారు. హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మాపార్క్ అవుతుందని, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ స్ఫూర్తిలో నిధులు కేటాయిస్తే ఫార్మారంగంలో భారత్ మరింత ముందుంటుందని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో జీరో లిక్విడ్ డిశ్చార్జి (జెడ్‌ఎల్‌డీ) విధానంలో కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)తో ఫార్మాసిటీని ఏర్పాటు చేయనున్నట్టు లేఖలో వివరించారు. ఎలాంటి కాలుష్య ప్రభావం లేకుండా దీనిని నిర్మిస్తామని తెలిపారు.
ఫార్మాసిటీలో గ్లోబల్ ఫార్మా యూనివర్సిటీ, కామన్ డ్రగ్ డెవలప్మెట్ అండ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్, కూలింగ్ సిస్టమ్, లాజిస్టిక్ పార్కులు, ఎస్ఎంఈ హబ్‌లను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. దీనికున్న ప్రాధాన్యం నేపథ్యంలో కేంద్ర వాణిజ్యశాఖ, డీపీఐఐటీ నిమ్జ్ హోదాను ఇచ్చాయని గుర్తుచేశారు. ఇక్కడ కంపెనీలను ఏర్పాటుచేయడానికి జాతీయ, అంతర్జాతీయస్థాయి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని వివరించారు. ఫార్మాసిటీ ద్వారా రూ.64 వేల కోట్ల పెట్టబడులు వస్తాయని.. 5.60 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశామని తెలిపారు. నిమ్జ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫార్మాసిటీ అంతర్గత, బహిరంగ మౌలిక సదుపాయాలకు రూ.4,922 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామని, వచ్చే బడ్జెట్లో ఇందులో కనీసం రూ.870 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు.
జహీరాబాద్ నిమ్జ్‌కు రూ.500 కోట్లు జహీరాబాద్ నిమ్జ్‌కు కేంద్రం 2016 జనవరిలో ఆమోదం తెలిపిందని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. దీని ఏర్పాటు కోసం మొదటిదశ భూమిని టీఎస్ఐఐసీ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నదని వివరించారు. నిమ్జ్‌లో మౌలిక సదుపాయాలకు రూ.9,500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామని, ముందుగా కనీసం రూ.500 కోట్లు అయినా కేటాయించాలని కోరారు. నేషనల్ డిజైన్ సెంటర్ (ఎన్డీసీ) ఏర్పాటుకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని డీపీఐఐటీ సిఫారసు చేసిందని గుర్తుచేసిన మంత్రి కేటీఆర్.. దీనికోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో స్థలాన్ని గుర్తించామని తెలిపారు. ఈ భూమిని ఉచితంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని.. ఎన్డీసీ ఏర్పాటుకు ప్రాథమికంగా రూ.200 కోట్లు కేటాయించాలని లేఖలో కోరారు.