Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

భుజం భుజం కలిపి బంగారు తెలంగాణ సాధిద్దాం

-ఉద్యమంలో వరంగల్ స్ఫూర్తిని మరిచిపోలేం.. -ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్‌ఎస్‌కు బంపర్ మెజారిటీ -రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ -శిఖండిలా వ్యవహరిస్తున్న టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం: మంత్రి ఈటల -టీఆర్‌ఎస్‌లో చేరిన డాక్టర్ పరమేశ్వర్, విద్యావేత్త పరంజ్యోతి

KTR inviting BJP leaders in tho TRS party

తెలంగాణ ఉద్యమం పార్టీలను నమ్ముకోలేదు. తెలంగాణ ప్రజల్నే నమ్ముకున్నది. తద్వారానే సీఎం కేసీఆర్ స్వరాష్ర్టాన్ని సాధించారు. ఏ రాజకీయ పార్టీని నమ్ముకోకుండా.. భుజం భుజం కలిపి తెలంగాణ రాష్ర్టాన్ని ఎట్లా సాధించుకున్నామో..? అట్లనే ఇప్పుడు బంగారు తెలంగాణను సాధించుకుందాం. ఈ ప్రయాణంలో సమయం కావాలి. 60 ఏండ్ల దరిద్రం 15 నెలల్లోనేపోదు. కొత్త సంసారం.. కొంత సమయం ఇయ్యాలి. ఐదేండ్లలో మా వ్యవహారం బాగా లేకపోతే బండకేసి కొట్టే అధికారం మీకుంది అని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటుస్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ పరమేశ్వర్‌తోపాటు విద్యావేత్త పరంజ్యోతి భారీఎత్తున అనుచరగణం, కార్యకర్తలతో టీఆర్‌ఎస్‌లో చేరారు.

తెలంగాణభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్ సమక్షంలో వీరు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే ఐదేండ్లలో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా చేసుకోవాలన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇంటికి తులం బంగారం ఇయ్యడం కాదని, దేశంలోనే మన రాష్ట్ర ప్రజలు మంచి జీవన ప్రమాణాలతో జీవించేలా చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. ఉద్యమంలో పనిచేసిన ఎవరినీ మరచిపోబోమని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వరంగల్ జిల్లా ప్రజల స్ఫూర్తిని కొనియాడారు. గతంలో పనిచేసిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి వరంగల్ జిల్లా ప్రజలు చెప్పులు చూపించారని, ఇంకో ఆయనకు చుక్కలు చూపించారని అన్నారు. చంద్రబాబు రైతులను పరామర్శించేందుకు వచ్చినపుడు.. తెలంగాణ వస్తే మా సమస్యలు పోతయని రైతు పణికెర మల్లయ్య దిమ్మతిరిగే సమాధానం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకో ఆయన బచావో అంటూ తిరుగుతున్నారు. నిన్న వరంగల్ పత్తి రైతు దగ్గరికి పోయి.. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తలేదని చెప్పబోతే రైతులు దీటుగా సమాధానం చెప్పారని పేర్కొన్నారు. పత్తిని కొనుగోలు చేసేది సీసీఐ కదా.. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుది.

మీరే మద్దతు ధర ఎక్కువ ఇప్పించొచ్చు కదా..? అని అడిగితే ఆయన వెనక్కి వచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోయింది కదా.. వరంగల్ సప్పబడిందని అనుకున్నా. కానీ, నిన్న రైతుల మాటలు, ఇప్పుడు ఈ వేదిక చూసిన తర్వాత ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్ కూడా దక్కదని స్పష్టమైంది అని పేర్కొన్నారు. వరంగల్‌కు ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి బంపర్ మెజారిటీతో గెలుస్తారని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

వచ్చే ఏడాది 9 గంటల నాణ్యమైన కరెంటు రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ అంధకారమైతదని చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయ జీవితం చిమ్మ చీకట్లకు పోయిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏపీ ఆఖరి కిరణం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ఓ కట్టె పట్టుకొని.. కరెంటు ఉత్పత్తి కేంద్రాలన్నీ ఆంధ్రాలో ఉన్నాయి. కరెంటు వాడకం ఎక్కువగా తెలంగాణలో ఉన్నందున రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ అంధకారమైతదన్నారు. కానీ ఇప్పుడేమైంది? ఆయన రాజకీయ జీవితం చిమ్మచీకటి అయిందేగానీ తెలంగాణ దేదీప్యమానంగా వెలుగుతున్నది అని అన్నారు. ఇప్పటికీ రాత్రిపూటనే రైతులకు కరెంటు ఇస్తున్నప్పటికీ.. పగటి పూట ఇచ్చేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఏడాది మార్చి తర్వాత పట్టపగలు 9 గంటల నాణ్యమైన కరెంటును ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 96 గ్రామీణ నియోజకవర్గాలున్నాయి. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇయ్యాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

అవి నిరాధార.. అడ్డగోలు ఆరోపణలు వాటర్‌గ్రిడ్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిరాధార, అడ్డగోలు ఆరోపణలని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశంలోని 29 రాష్ర్టాల్లో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ వాటర్‌గ్రిడ్ పథకంపై ప్రశంసలు కురిపించారని, ఇక్కడ ఉన్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాత్రం ఈ విషయం అర్థమైతలేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ పూర్తయితే పుట్టగతులుండవని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్ల కోసమే ఇన్ని పైపులైన్లు వేస్తున్నారని, రూ.36వేల కోట్లు అవసరమా..? ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు అర్థమే లేదని విమర్శించారు.

ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి గత పాలకుల వివక్ష కారణంగానే తెలంగాణ వెనుకబడిందని, సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు సాధించిన రాష్ర్టాన్ని విఫల ప్రయోగంగా చిత్రీకరించేందుకు కుట్రలు పన్నుతున్నాయని, వీటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలోనే తెలంగాణను నంబర్‌వన్ రాష్ట్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, తెలంగాణ వారికి కూడా పాలించే శక్తి, నైపుణ్యం ఉందని ముఖ్యమంత్రి రుజువు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం శిఖండి పాత్ర పోషించాయని.. ఇప్పుడు కూడా అదే పాత్రను పోషిస్తున్నాయని అన్నారు. కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ల పాత్ర మరువలేనిదని అన్నారు. ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనలో సీఎం కేసీఆర్‌కు బాసటగా నిలిచేందుకు చాలామంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.

భారీగా తరలివచ్చిన శ్రేణులు గతంలో టీఆర్‌ఎస్ పార్టీలో ఉండి… పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరించిన డాక్టర్ పరమేశ్వర్ 2009 ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. అనంతరం 2014లో బీజేపీ అభ్యర్థిగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆయనతోపాటు విద్యావేత్త డాక్టర్ పరంజ్యోతి, భారీఎత్తున తరలివచ్చిన అనుచరులతో కలిసి ఆదివారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరితోపాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. టీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.