
-డాటా చౌర్యంలో అడ్డంగా బుక్కైన చంద్రబాబు, లోకేశ్ -నైతిక బాధ్యత ఉంటే విచారణకు ముందుకు రావాలి -హైదరాబాద్‌లో ఏపీ పోలీసులకు ఏం పని?: కేటీఆర్ -అడ్డంగా దొరకడం, బుకాయించడం చంద్రబాబు, లోకేశ్‌కు అలవాటే -డాటా చౌర్యం ఫిర్యాదుపై విచారణకే తెలంగాణ పోలీసులు వెళ్లారు -మీ ప్రజల డాటా మాకెందుకు? -దింపుడుకళ్లం ఆశ మాదిరిగా కేసీఆర్‌పై బాబు ఆరోపణలు -మీడియా సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ ప్రజల డాటాను దొంగతనం చేయకుంటే విచారణ ఎదుర్కొనాలని, కడిగిన ముత్యంలా బయటికి రావాలని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సూచించారు. ఏపీ ప్రజల సమాచారాన్ని వారి అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థకు ఇవ్వటానికి చంద్రబాబుకు, ఆయన ప్రభుత్వానికి సిగ్గుండాలన్నారు. ఏపీ ప్రజల అనుమతి తీసుకునే వారి డాటాను ఐటీగ్రిడ్ సంస్థకు, సేవా యాప్‌కు ఇవ్వమని చెప్పారా? అని ఏపీ మంత్రి లోకేశ్‌ను ప్రశ్నించారు. అలా చెప్పి ఉంటే శిక్షార్హులేనన్నారు. ఈ కేసును ఏపీకి బదలాయించాలన్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ.. దొంగతనం చేసిన వారి దగ్గరికి కేసును బదలాయిస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేరమే జరుగకపోతే ఇంత భయం ఎందుకు? అని నిలదీశారు. చంద్రబాబుకు నైతికబాధ్యత, సిగ్గు ఉంటే విచారణకు ముందుకు రావాలని సవాలు విసిరారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వమే ఆ సమాచారాన్ని అధికార పార్టీకి చేరవేయటం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవటమేనని చెప్పారు.
ఐటీ చట్టంలోని 66, 72 సెక్షన్లను ఉల్లంఘించడమేనని అన్నారు. దొంగకు నోరు ఎక్కువన్న కేటీఆర్.. ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అనే రీతిలో తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు దుమ్మెత్తి పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేండ్లలో ఏమీ చేయకపోవడంతో దింపుడుకళ్లం ఆశ మాదిరిగా కేసీఆర్, టీఆర్ఎస్ మీద ఆరోపణలుచేసి అక్కడి భావోద్వేగాలను రెచ్చిగొట్టి లబ్ధిపొందాలని చంద్రబాబు చూస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. అడ్డంగా దొరకడం, దొరికిన తర్వాత మిద్దెలు ఎక్కి అరవడం, బుకాయించడం చంద్రబాబు, ఆయన పుత్రరత్నానికి అలవాటేనని విమర్శించారు. గతంలో ఓటు కు నోటుకేసులో మన వాళ్లు బ్రీఫ్డ్ మీ అం టూ అడ్డంగా దొరికిపోయారని, అప్పుడుకూడా ఇలాగే మాట్లాడారని గుర్తుచేశారు. ఒక ఐటీ కంపెనీలో పనిచేసే లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి.. ఏపీలో పౌరులకు సంబంధించి ప్రభు త్వ వెబ్సైట్లో, డాటా సెంటర్లో ఉండే అధికారిక సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థ దొంగతనం చేసి, టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌లోకి డౌన్లోడ్ చేసిందనే ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు సోదాలకు వెళ్లారు అని కేటీఆర్ వివరించారు.
ఇక్కడ ఏపీ పోలీసులకేం పని? నేరం జరిగింది హైదరాబాద్‌లో అయితే.. ఇక్క డ ఏపీ పోలీసులకు ఏం పని అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆంధ్ర పోలీసులు వచ్చి లోకేశ్వర్‌రెడ్డి ఇంటి మీద దాడిచేసి, నోటికొచ్చినట్లు దుర్భాషలాడారని తెలిపారు. ఫిర్యాదుపై విచారణకు వెళ్లిన తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు అడ్డుకోవడం పద్ధతేనా? ఐటీ గ్రిడ్ అనే సంస్థ తప్పుచేయకపోతే భయం ఎందుకు? విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. డాటా ఇవ్వడంపై ప్రశ్నించిన ఒక విజిల్ బ్లోయర్పై దాడిచేయడం, ఇక్కడ చట్టాన్ని సరిగా అమలయ్యేలా చూస్తున్న తెలంగాణ పోలీసుల మీద బట్ట కాల్చి మీద వేయడం చంద్రబాబుకు చేతనయ్యే పని అని విమర్శించారు. తెలంగాణ పోలీసులు పక్షపాతం లేకుండా ఒక ఫిర్యాదు వస్తే.. అక్కడ దొంగతనం జరిగిందా లేదా? అనేది నిర్ధారించుకోవడానికి వెళ్లారని తెలిపారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. ఉమ్మడి రాజధాని అయినా హైదరాబాద్ తెలంగాణ పోలీసు పరిధిలోకి వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. పోలీసులు విచారించి తప్పులేకుంటే క్లీన్చిట్ ఇస్తారని, దానికి ఏపీ పాలకులు భయపడాల్సిన పనిలేదని చెప్పారు. కంప్యూటర్ తానే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు.. ఆ కంప్యూటర్లో డాటాను దొంగతనం చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. ఏపీ ప్రజల సమాచారాన్ని వారి అనుమతిలేకుండా టీడీపీకి సంబంధించిన సంస్థలకు ఇస్తున్న సీఎం ఇంకా కొనసాగటమా? ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలు అక్క డి ప్రభుత్వాన్ని నమ్మి ఆధార్ ఇచ్చింది వాటిని ఐటీ గ్రిడ్ సంస్థకు అప్పగించడానికా? అనేది ఏపీ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పార్టీలకు అప్పనంగా అమ్ముకోవడమేంటన్నారు. ఏపీ ప్రజల డాటా ను తెలంగాణ ప్రభుత్వం దొంగతనం చేసిందనటాన్ని ఆయన కొట్టిపారేశారు. ఆ డాటాను తామేం చేసుకుంటామని ప్రశ్నించారు.
బాబుది దింపుడుకళ్లం ఆశ.. చంద్రబాబుకు ప్రజల్లో పరపతి, పలుకుబడి, ప్రతిష్ఠ తగ్గిపోయి.. చివరికి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. దింపుడుకళ్లం ఆశ మాదిరిగా కేసీఆర్ మీదనో, టీఆర్ఎస్ మీదనో, మన ప్రభుత్వం మీదనో దుమ్మెత్తి పోస్తే ఆంధ్ర ప్రజల సానుభూతికోసం చిల్లర చేష్టలు చేస్తున్నారన్నారు. బాబు తాను కోల్పోయిన ప్రతిష్ఠను చిల్లరమల్లర ప్రయత్నాలతో తిరిగి పొందలేరన్నారు. ఐదేండ్లలో చేసింది ఏమైనా ఉంటే చెప్పుకోవాలి. కానీ, బాబు చేసింది ఏమీలేదు. బిల్డప్ తప్ప. అమరావతి అన్నారు.. గ్రాఫిక్స్ చూపించారు అని విమర్శించారు. మీ డొల్లతనం అర్థమైన ప్రజలు మీకు బుద్ధిచెప్తారని తేలిపోవడంతో చిల్లర ప్రయత్నం చేస్తున్నారన్నారు.
డమ్మీ అకౌంట్లతో తప్పుడు ప్రచారం.. ఎదురు డబ్బులిచ్చి సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పని జరుగుతున్నదని కేటీఆర్ విమర్శించారు. టీడీపీవాళ్లు నిన్నటినుంచి కష్టపడుతున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్లో డమ్మీ ప్రొఫైల్స్ సృష్టించారు. పెయిడ్ అకౌంట్లు, రోబోట్స్ పెట్టి తెలంగాణ ప్రభుత్వం దొంగతనం చేసిందని గొంతు చించుకొని అరుస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. సోషల్ మీడియా లేనప్పుడు, ప్రజలకు ఇవేవి తెలియనప్పుడు చంద్రబాబు నాటకాలు నడిచేవని, కానీ.. ఇప్పుడ నడువబోవని స్పష్టంచేశారు. మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏ జీవన్‌రెడ్డి, కేపీ వివేకానంద, మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్, బేతి సుభాష్‌రెడ్డి, ముఠా గోపాల్ కూడా పాల్గొన్నారు.
వీరందరినీ ఎంతకు కొన్నారు? తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఎంతకు కొన్నారు? ఆయనతో పాటు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, యాదవరెడ్డిలను ఎంతకు కొన్నారు? దీనికంటే ఆరు నెలల ముందు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనను ఎంతకు కొన్నారు?
దొంగకు నోరు ఎక్కువ అంటారు.. ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అనే రీతిలో తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు దుమ్మెత్తి పోస్తున్నారు. దింపుడుకళ్లం ఆశ మాదిరిగా కేసీఆర్, టీఆర్ఎస్ మీద ఆరోపణలుచేసి అక్కడి భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారు. -కేటీఆర్