
దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నెటిజనులు ‘బై బై మోడీ’ హాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ట్విటర్‌లో దేశవ్యాప్తంగా ఈ హాష్‌ట్యాగ్ గురువారం నంబర్ వన్‌గా నిలిచింది. దేశాన్ని పాలించడం లో మోడీ ప్రభుత్వం అన్ని విధాల విఫలమైందని, దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యేందుకు కారణం మోడీ ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణమంటూ నెటిజన్లు ట్వీట్లతో చెలరేగిపోయారు.
ఇది ట్రెండింగ్‌గా మారడంతో టీఆర్ఎస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మేల్యేలు సైతం తమ ట్వీట్ల ద్వారా మోడీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. దాదాపు యాభై వేలకు పైగా ట్వీట్లు చేశారు. గ్యాస్, డీజిల్ పెట్రోల్ ధరలు మొదలుకొని ద్రవ్యోల్బణం దాకా, విద్వేషాలు విధానాల మీద నెటిజన్లు విమర్శలు చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం డబుల్ చేస్తామని చెప్పి ఖర్చులను రెట్టింపు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్.. ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా బీజేపీ సర్కారు భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు చేసుకున్న ప్రచారాన్ని గుర్తు చేస్తూ ‘దేశానికి పాలించే నాయకుడు కావాలి కానీ పబ్లిసిటీ కోసం పాటుపడే నాయకుడు వద్దం’టూ ట్వీట్ చేశారు. అదానీ – బీజేపీ బంధాన్ని, కార్పొరేట్ల కోసం.. వారి బాగు కోసం బీజేపీ అనుసరిస్తున్న విధానాలను, ఇటీవల శ్రీలంకలో అదానీ కంపెనీలకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు మధ్యవర్తిత్వం వహించిన అంశాన్ని, దేశంలో బొగ్గు కృత్రిమ కొరత సృష్టించి ఆస్ట్రేలియాలో ఉన్న ఆదాయాన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. తమ తమ నాయకుల ట్వీట్లతో పార్టీ కార్యకర్తల్లో సైతం కొత్త జోష్ వచ్చినట్లయింది.