Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

క్యాబినెట్ విస్తరణ 19న

-మాఘశుద్ధ పౌర్ణమి.. ఉదయం 11.30 గంటలకు -గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్ -ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు -శాఖల పునర్వ్యవస్థీకరణ కొలిక్కి! -అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి తన నిర్ణయం తెలియజేశారు. 19వ తేదీన మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో ఆ రోజు ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో ప్రమాణం చేయించాలని నిర్ణయించారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారు. 88 సీట్లలో అఖండ మెజారిటీతో పాలనాపగ్గాలను మరోసారి అప్పజెప్పారు. డిసెంబర్ 13న రెండోసారి ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్‌రావు ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణం స్వీకరించారు. తదుపరి మహమూద్ అలీకి హోంశాఖను అప్పగించారు. గత ప్రభుత్వంలో ఒకే శాఖలోని వివిధ విభాగాలు వేర్వేరు మంత్రుల వద్ద ఉన్నాయి. దీంతో సారూప్యం కలిగిన శాఖలన్నీ ఒకేశాఖ పరిధిలోకి తేవాలని సీఎం భావించారు. ఈ మేరకు కసరత్తు పూర్తికావడం, మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.

శాఖల పునర్వ్యవస్థీకరణ కొలిక్కి!
ప్రస్తుతం ఉన్న శాఖలను అలాగే కేటాయిస్తే కొన్ని సమస్యలు వస్తున్న నేపథ్యంలో శాఖలను పునర్వ్యవస్థీకరించాలని భావించిన సీఎం కేసీఆర్.. ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి అప్పగించారు. ఆయన పలుమార్లు వివిధశాఖల అధికారులతో సమావేశమై.. పునర్వ్యవస్థీకరణ విషయంలో అధ్యయనంచేశారు. ఇప్పటివరకు ఉన్న శాఖలు ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించినవే. అప్పట్లో పెద్దసంఖ్యలో ఉన్న మంత్రులకు కేటాయించడానికి వీలుగా శాఖలను విభజించారు. దీంతో ఒకే స్వభావం ఉన్న శాఖలు పలువురు మంత్రుల వద్ద ఉండటంతో ఆయా శాఖల మధ్య సమన్వయం ఇబ్బందిగా మారింది.

ఉదాహరణకు వ్యవసాయం దాని అనుబంధ శాఖలన్నీ వేర్వేరు మంత్రుల వద్ద ఉండేవి. సహకార శాఖ ఒకరి వద్ద, మార్కెటింగ్ మరొకరివద్ద, పశుసంవర్ధక శాఖ ఇంకొకరి వద్ద ఉండేవి. అలాగే పరిశ్రమలశాఖ ఒక మంత్రి వద్ద ఉండగా, మైనింగ్‌శాఖ మరొకరి దగ్గర, చేనేత జౌళిశాఖ మరొకరి దగ్గర ఉండేవి. విద్యాశాఖలో పాఠశాల విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్య వేర్వేరు మంత్రుల వద్ద ఉండేవి. వైద్య, ఆరోగ్య శాఖ, సంక్షేమశాఖలు, పంచాయతీరాజ్ ఒక దగ్గర, గ్రామీణాభివృద్ధి శాఖ మరొకరి వద్ద ఉండేవి. ఇలా అనేకశాఖలను విడగొట్టి ఒక్కొక్కరికి పంచడంతో సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో శాఖల ప్రక్షాళనపై శాస్త్రీయంగా అధ్యయనం చేసిన సీఎస్.. తుది నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించారు. దీనితో శాఖల కేటాయింపు సునాయాసమైంది. సమన్వయంకూడా చాలా తేలిగ్గా సాధ్యమవుతుందనే భావన వ్యక్తమవుతున్నది.

అసెంబ్లీ సమావేశాలపై నోటిఫికేషన్ జారీ
రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఈ నెల 22న ప్రారంభించేందుకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు గెజిట్ నోటిఫికేషన్ విడుదలచేశారు. వచ్చే శుక్రవారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. సభ ప్రారంభంకాగానే ఉభయసభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు సమావేశాలు కొనసాగుతాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.