Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కార్‌.. జోర్‌దార్‌

-పోలింగ్‌ జరిగిన ఆరు సీట్లూ టీఆర్‌ఎస్‌కే..
-మొత్తం 18 ఎమ్మెల్సీలు గులాబీ ఖాతాలోకే
-తొలి ప్రాధాన్య ఓటుతోనే ఫలితాలు..
-మండలిలో 40 సీట్లలో 36కు పెరిగిన బలం
-మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సంపూర్ణం
-భానుప్రసాదరావు, ఎల్‌ రమణ, వంటేరి యాదవరెడ్డి,
-తాతా మధు, మంకెన కోటిరెడ్డి, దండె విఠల్‌ జయకేతనం
-కనీస పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్‌, బీజేపీ
-గవర్నర్‌ కోటాలో మాజీ స్పీకర్‌ సిరికొండ ఎంపిక
-విజేతలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభినందనలు
-మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతల శుభాకాంక్షలు

టీఆర్‌ఎస్‌ కార్‌… షంషేర్‌!
సార్‌.. కేసీఆర్‌.. జోర్‌దార్‌!
తెలంగాణ నలుమూలలా… గులాల్‌ కమాల్‌!
ఎన్నిక ఏదైతేనేం…
మళ్లీ అదే విజయధ్వానం!!

శాసన మండలిలోని 18 సీట్లకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అప్రతిహత విజయం సాధించింది. అన్నింటికీ అన్ని స్థానాలనూ కైవసం చేసుకుని తనకు ఎదురులేదని మరోమారు నిరూపించుకుంది. ఎమ్మెల్యే కోటా కింద ఖాళీ అయిన మొత్తం 6 సీట్లనూ గులాబీ పార్టీ ముందే ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక స్థానిక సంస్థల కోటాలో 12 సీట్లు ఖాళీ కాగా, అందులో ఆరింటిని ముందే ఏకగ్రీవంగా చేజిక్కించుకుంది. పోలింగ్‌ జరిగిన మిగతా 6 స్థానాలను కూడా సంపూర్ణ ఆధిక్యతతో, మొదటి ప్రాధాన్య ఓట్లతో కైవసం చేసుకుంది. గవర్నర్‌ కోటా కింద భర్తీ చేసిన స్థానాన్ని కూడా కలిపితే, ఖాళీ అయిన మొత్తం 19 సీట్లూ, అంటే మండలి బలంలో దాదాపు సగం తాజాగా టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే జమయ్యాయి. అధికారంలోకి వచ్చిన ఏడేండ్ల తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ బలం ఇదీ!

-మొత్తం 40 సీట్ల మండలిలో టీఆర్‌ఎస్‌కు
-ఇప్పటికే 17 మంది సభ్యులుండగా, 19 మందితో
-కలిపి ఆ బలం 36కు పెరిగింది.
-అంటే 90 శాతం సీట్లు టీఆర్‌ఎస్‌వే.


స్థానిక కోటాలో ఖాళీ అయిన 12 సీట్లు తెలంగాణవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. అంటే మండలి ఫలితాలు మొత్తం తెలంగాణ మనోభావాలకు ప్రతిబింబాలు. ఈ ఎన్నికల్లో అనేక చోట్ల విపక్షాలు కనీసం అభ్యర్థుల్ని పోటీ పెట్టలేక పోయాయి. బరిలోకి దిగిన చోట కనీస పోటీ ఇవ్వలేకపోయాయి. అప్పుడో ఇప్పుడో ఒకటో అరో ఎన్నిక గెలవగానే నిప్పు మీది ఉప్పులా ఉరుకులాడుతూ, ఇక టీఆర్‌ఎస్‌ పని అయిపోయిందంటూ అహంకారంతో మిడిసిపడే విపక్ష నేతలు ఇప్పుడు ఏమంటారు? పొద్దున లేస్తే అబద్ధాలు, అవాకులు పేలే బీజేపీకి అసలు మండలిలో ప్రాతినిధ్యమే లేదు. తిట్లకు, విమర్శకు తేడా తెల్వని కాంగ్రెస్‌కు ఉన్నది ఒకే ఒక్కడు! అదీ వాటి బలం. అదీ వాటికున్న ప్రజాదరణ.. హతవిధీ!

తెలంగాణతో నడిచేది, తెలంగాణను నడిపేది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని తెలంగాణ నాయకులకు, ప్రజలకు స్పష్టంగా తెలుసు. అందుకు నిదర్శనమే నేటి విజయం. తాజా తీర్పుతోనైనా విపక్ష నేతలు కళ్లు తెరవాలి. సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు.. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. గెలుపు, ఓటమి సహజం. అంతమాత్రాన విర్రవీగడం అనవసరం. అందుకే ఎన్నిక ఏదైనా, మెజారిటీ ఎంత పెద్దదైనా, విజయం ఎంతటిదైనా… టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ మొదలుకుని ముఖ్యమంత్రి దాకా ఒకటే మాట.. ఒకటే బాట.

ప్రజా సేవే ప్రథమ కర్తవ్యం.
తెలంగాణ ప్రగతికే పునరంకితం.

పంచాయతీ అయినా.. పార్లమెంటు అయినా ఎన్నికలేవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని మరోసారి నిరూపితమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. ఈ నెల 10న జరిగిన 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో అన్నింటినీ టీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా గెలుచుకొన్నది. ఎన్నికలు జరిగిన ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్లగొండ, మెదక్‌ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది.

రెండు గంటల్లోపే ఎటువంటి ఉత్కఠ లేకుండా.. ఆరింటికి ఆరు స్థానాలను తొలి ప్రాధాన్య ఓటుతోనే టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకొన్నది. రెండో ప్రాధాన్య ఓటు అవసరం లేకుండానే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భానుప్రసాదరావు, ఎలగందుల రమణ, మెదక్‌ నుంచి డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి, ఖమ్మం జిల్లాలో తాతా మధు, నల్లగొండలో మంకెన కోటిరెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి దండె విఠల్‌ జయకేతనం ఎగురవేశారు. గెలిచిన అభ్యర్థులకు రిటర్నింగ్‌ అధికారులు ధృవీకరణ పత్రాలను అందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు చేసుకొన్నాయి. గెలిచిన అభ్యర్థులను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందించారు. మరోవైపు మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయ్యారు.

తిరుగులేని టీఆర్‌ఎస్‌
12 స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడగా ఇందులో 6 స్థానాలు ఏకగ్రీవం కావడం తెలిసిందే. ఈ విజయంతో మండలిలో టీఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తిగా ఎదిగింది. 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు, 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలతోపాటు, గవర్నర్‌ కోటాలో ఒకరి నామినేషన్‌తో మొత్తం 19 స్థానాలు టీఆర్‌ఎస్‌కు ఖాతాలోచేరాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఊసు లేకుండా పోయింది. ఇక రెండు స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌ మరోసారి ఘోర పరాభవాన్ని చవిచూసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉన్న ఈ ఎన్నికలు.. టీఆర్‌ఎస్‌ సత్తాను చాటాయి.

టీఆర్‌ఎస్‌ విజయం సంపూర్ణం
శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులుంటే దాదాపు సగం స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటన్నింటినీ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడంతో మండలిలో గులాబీదళం బలం 36కు పెరిగింది. ఎంఐఎంకు 2, కాంగ్రెస్‌కు 1, స్వతంత్రులు 1 స్థానంలో ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో 6 స్థానాలు, స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్‌, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఈ ఆరుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత, వరంగల్‌ స్థానం నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 6 స్థానాలకు ఈ నెల 10న పోలింగ్‌ నిర్వహించారు.

గవర్నర్‌కోటా ఎమ్మెల్సీగా సిరికొండ
ఎన్నికల ప్రక్రియ ద్వారా భర్తీ అయ్యే 18 స్థానాలతోపాటు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నది. ఈ స్థానానికి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర మొదటి శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి పేరును గవర్నర్‌కు సిఫారసు చేసింది. ప్రభుత్వ సిఫారసుకు అనుగుణంగా గవర్నర్‌ ఆయన అభ్యర్థిత్వానికి ఆమోదం తెలియజేస్తూ మంగళవారం గెజిట్‌ విడుదలచేశారు. ఎన్నికల కమిషన్‌ సైతం సిరికొండ మధుసూదనాచారిని ఎమ్మెల్సీగా ధృవీకరిస్తూ గెజిట్‌ విడుదల చేసింది.

టీఆర్‌ఎస్‌ శ్రేణుల సమిష్టి కృషి ఫలితం
నాపై ఎంతో నమ్మకంతో టికెట్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ఈ విజయం అంకితం. ఈ ఎన్నికల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎంతో సహకారం అందించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణుల సమిష్టి కృషితో ఘన విజయం సాధ్యమైంది. నా సొంత జిల్లా ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు అవకాశం లభించింది.

-దండె విఠల్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ


కేసీఆర్‌కు రుణపడి ఉంటా
సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధించా. సీఎం కేసీఆర్‌ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి జీవితాంతం రుణపడి ఉంటా. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా గెలుపులో కీలకపాత్ర వహించిన మంత్రి హరీశ్‌రావు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు అప్పగించిన గురుతర బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేరుస్తా.

-డాక్టర్‌ యాదవరెడ్డి, మెదక్‌ ఎమ్మెల్సీ


ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల గొంతుకను శాసనమండలిలో వినిపించి, సమస్యల పరిష్కారానికి కృషిచేయడమే నా లక్ష్యం. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన అవకాశం, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రోత్సాహం, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణుల కృషి వల్లనే నేను ఈ విజయం సాధించాను. నా గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

-తాతా మధు, ఖమ్మం ఎమ్మెల్సీ


ప్రతిపక్షాల కుట్రలు సాగలేదు
నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, గెలిపించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. నా విజయాన్ని తమ భుజాలపై వేసుకుని నడిపించిన మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఓటర్లకు, ఇతర ముఖ్య నేతలందరికీ కృతజ్ఞతలు. ఓట్లను చీల్చాలని ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా సాగలేదు. నా గెలుపు జిల్లాలో టీఆర్‌ఎస్‌ శక్తిని మరోసారి చాటి చెప్పింది.

-ఎంసీ కోటిరెడ్డి, నల్లగొండ ఎమ్మెల్సీ


విషప్రచారాలు పనిచేయవు
ఈ గెలుపు సీఎం కేసీఆర్‌ది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలది. నా గెలుపునకు కారణమైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు. నాపై అనేక విష ప్రచారాలు చేశారు. అయినా ఓటర్లు నన్ను మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిపించారు.
-భాను ప్రసాద్‌రావు, కరీంనగర్‌ ఎమ్మెల్సీ

కేసీఆర్‌ శక్తిని నిరూపించిన ఎన్నికలు
ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ శక్తిని, బలాన్ని మరోసారి నిరూపించాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు. కేసీఆర్‌ ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని, స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తా.
– ఎల్‌ రమణ, కరీంనగర్‌ ఎమ్మెల్సీ

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.