Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కారు ఆగొద్దు.. డ్రైవరు మారొద్దు

-జాతీయపార్టీలను తిరస్కరించండి
-జీవచ్ఛవంలాంటి కాంగ్రెస్‌కు ఆక్సిజన్ అందిస్తున్న చంద్రబాబు
-తెలంగాణకు అమిత్‌షా ఆస్తులమ్మి లక్షల కోట్లు ఇచ్చారా?
-హైదరాబాద్‌లో స్థిరపడ్డవారి బాధ్యత నాదే
-మరోసారి టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి
-మన హైదరాబాద్ – మనందరి హైదరాబాద్ కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపు
-చంద్రబాబు పొత్తు ప్రతిపాదనను తిరస్కరించానని వెల్లడి
-తెలంగాణలోనే సబ్ కా సాత్ – సబ్ కా వికాస్.. హైదరాబాద్ సురక్షిత, ప్రశాంత నగరం
-మార్వాడీల చేరిక సభలో మంత్రి కే తారకరామారావు

నాలుగున్నరేండ్లలో కారు వేగం బాగుందని, సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా డ్రైవర్ ఏకాగ్రతతో కారు నడుపుతున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ సమయంలో ప్రజలు కారులో డీజిల్ పోసి వేగం ఆగకుండా చూడాలని కోరారు. కారు ఆగొద్దు.. డ్రైవర్ మారొద్దు అని పిలుపునిచ్చారు. సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో అగర్వాల్, జైన్, మహేశ్వరీలకు చెందిన వివిధ మార్వాడీ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మరోవైపు హైదరాబాద్‌లోని కూకట్‌పలి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల ప్రజలతో నిజాంపేటలో నిర్వహించిన మన హైదరాబాద్-మనందరి హైదరాబాద్ కార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్ అభ్యర్థులు అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందతో కలిసి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాలకు కాంగ్రెస్, బీజేపీలు తీరని నష్టాన్ని చేస్తున్నాయని విమర్శించారు. డ్బ్బై ఏండ్లలో దేశానికి కాంగ్రెస్ పార్టీ మొండి చెయ్యి చూపిందని, ప్రతి ఒక్కరి నెత్తిపై భస్మాసుర హస్తం పెట్టి దేశాన్ని ఆగమాగం చేసిందని మండిపడ్డారు. ఇక దేశంలో అందరి చెవుల్లో పువ్వు పెట్టింది బీజేపీనని విమర్శించారు. రాష్ర్టానికి లక్షల కోట్లు ఇచ్చామన్న అమిత్‌షా వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. మేం ఇచ్చేవాళ్ల.. మీరు పుచ్చుకునేవారని మాట్లాడడం తగదు. అమిత్‌షా ఏమైనా తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులను అమ్మి తెలంగాణకు నిధులిచ్చారా? అసలు రాష్ర్టాల నుంచి పన్నులు కట్టకుంటే కేంద్రం నిధులు ఎలా ఇస్తుంది? రాష్ర్టాలు లేకుంటే కేంద్రం అనేది ఒక మిథ్య.

అహంకారపూరిత ధోరణి ఉన్న కాంగ్రెస్, బీజేపీలను తెలుగు ప్రజలు తిప్పికొట్టాలి. స్థానిక ప్రాంతీయ పార్టీలను ఎన్నుకోవాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది ఒకటే వైఖరి. వారికి బాసులు ఢిల్లీలో ఉంటారు. ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల సీఎంలపై, ప్రజల ఆకాంక్షలపై ఆ పార్టీలు చిన్నచూపు చూస్తాయి. ఢిల్లీలో కొందరు అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారు. ఈ పరిస్థితులు పోవాలంటే ప్రాంతీయ పార్టీలు బలపడాలి. వాటితోనే అభివృద్ధి సాధ్యం అని కేటీఆర్ స్పష్టంచేశారు. ఏపీలోగానీ ఇతర రాష్ర్టాల ఎన్నికల్లోగానీ జాతీయ పార్టీలకు అడ్రస్‌లేకుండా చేయాలని అన్నారు.

బీజేపీ 21 రాష్ట్రాల్లో ఉన్నదని చెప్పుకొనే అమిత్‌షా.. సీఎం కేసీఆర్‌లా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలని, 24 గంటల నిరంతర విద్యుత్, మిషన్ కాకతీయ పథకాలు అమలుచేసి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. అమరావతిలో కొత్త రాజధాని ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ తోటి పక్క రాష్ట్రం అభివృద్ధిని కాంక్షించి రాష్ట్రం తరఫున అమరావతికి రూ.100 కోట్లు ఇద్దామని తొలుత భావించారని కానీ, ప్రధాని మోదీ తట్టెడు మట్టి, చెంబడు నీళ్లతో సరిపుచ్చడంతో కేవలం శుభాకాంక్షలు తెలిపి మౌనంగా వచ్చారని కేటీఆర్ వివరించారు. అక్కడ హర్షాధ్వానాల నడుమ కేసీఆర్‌ను స్వాగతించిన తీరు మరచిపోలేదని ఆయన గుర్తుచేశారు.

హైదరాబాద్‌లో స్థిరపడినవారి బాధ్యత నాదే
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పరిపాలన సాగిస్తున్నాం. హైదరాబాద్‌లో స్థిరపడిన కోస్తా, రాయలసీమ ప్రజలతోపాటు ఇతర ప్రాంతాలవారి బాధ్యతను నేను స్వయంగా తీసుకుంటా. అన్నగా, మీలో ఒక్కడిగా, కేసీఆర్ కుమారుడిగా అండగా ఉంటా. ప్రజలను ప్రజలుగానే చూశాం తప్ప ప్రాంతాలుగా చూడలేదు. సీఎం కేసీఆర్.. చంద్రబాబుపై ఉద్వేగంగా చేసిన విమర్శలను రాజకీయ కోణంలో చూడాలే తప్ప.. ప్రజల కోణంలో అన్నట్టు భావించవద్దు. చంద్రబాబు మా రాజకీయ ప్రత్యర్థి. రాజకీయాల్లో ఒకరినొకరు తలపడినప్పుడు విమర్శలు సహజం. రాజకీయ ప్రత్యర్థుల మీద మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు కొందరిని నొప్పించవచ్చు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతర ప్రాంతాల ప్రజలు టీఆర్‌ఎస్‌తో కలిసి ముందుకుసాగుతుంటే.. ఏపీ నుంచి తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నం చేస్తున్న చంద్రబాబును విమర్శించారే తప్ప ప్రజలను ఉద్దేశించి కాదు. దీనిపై ఉన్న అపోహలను దూరం చేసుకోవాలి అని మంత్రి కేటీఆర్ సూచించారు. స్థానికంగా జీవచ్ఛవంలా పడి ఉన్న కాంగ్రెస్‌కు చంద్రబాబు తన డబ్బుతో ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయమని కాంగ్రెస్, టీడీపీలకు తెలుసునని, కేవలం మెజార్టీ స్థానాలను తగ్గించే ప్రయత్నంలో వారు ఉన్నారని వివరించారు.

రాష్ట్ర ఏర్పాటుతోనే తెలంగాణ యాసకు గౌరవం
1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం ఒక చరిత్ర. అప్పటిదాకా ఢిల్లీ, ముంబయి, కలకత్తా తదితర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్లినా మన వాళ్లను మద్రాసీలు అని పిలిచేవారు. దేశంలో తెలుగువారికి అస్తిత్వం, ఆత్మగౌరవం ఉన్నదని చెప్పేలా టీడీపీని స్థాపించి ఆయన తెలుగువారికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. 2001లో కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంలో తెలుగు మాట్లాడేవారిలో తెలంగాణ డిమాండ్ బలంగా ఉండి 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయింది. పాలనలో కేసీఆర్ దక్షత, తీరుతెన్నులతో దేశంలో తెలంగాణ యాసకు గౌరవం దక్కింది. చరిత్ర కొన్ని మలుపులు తిరిగినప్పుడు అనివార్యంగా వచ్చిన మార్పులే ఈ రెండు సందర్భాలు అని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రజల్లో బలమైన విశ్వాసాన్ని నింపాం
టీఆర్‌ఎస్ నాలుగున్నరేండ్ల పాలనలో ప్రజల్లో బలమైన విశ్వాసం నింపిందని కేటీఆర్ అన్నారు. 2014లో ఎన్నికల కంటే ముందు టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో అపోహలు ఉండేవి. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చాయి. హైదరాబాద్‌లో ఉంటున్న ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న కేసీఆర్ మాటలను ఆచరణలో చూపించాం. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందించినం. కాబట్టే 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అసాధారణమైన గెలుపు సాధ్యమైంది అని కేటీఆర్ వివరించారు. కార్యక్రమంలో ఎంపీలు విశ్వేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి, నాయకులు బండి రమేశ్ పాల్గొన్నారు.

చంద్రబాబు పొత్తంటే కుదరదని చెప్పా
టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుంటామని చంద్రబాబు చేసిన ప్రతిపాదనను తిరస్కరించామని కేటీఆర్ వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో సినీనటుడు హరికృష్ణ చనిపోతే మానవీయకోణంలో సీఎం కేసీఆర్, నేను వారి కుటుంబసభ్యులను ఓదార్చాం. దాదాపు రెండుగంటలపాటు ఉన్న సమయంలో చంద్రబాబు.. టీడీపీ-టీఆర్‌ఎస్ కలిసి నడుద్దామన్న ప్రతిపాదన పెడితే సున్నితంగా తిరస్కరించాను. ఇక్కడ కొంతమంది నాయకులకు నేను అండగా ఉండాలని చంద్రబాబు అన్నారు. నగరంలో స్థిరపడిన ప్రజలందరూ టీఆర్‌ఎస్‌తోనే ఉంటామన్న మూడ్‌లోకి వచ్చారని, ఈ వాతావరణాన్ని చెడగొట్టవద్దని చెప్పాను. తెలంగాణలో చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి సీఎం కాలేరని ఇక్కడి ప్రజలు గుర్తించారని, టీఆర్‌ఎస్‌తో ఇప్పటివరకు బాగున్నామని, భవిష్యత్తులోనూ బాగుంటామని అనుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పా.

రాష్ట్రంలో మేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పనిచేయలేదు. మీరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయకండని చెప్పా. నీళ్లపై అడుగడుగునా పేచీ పెడుతూ, ఆదర్శవంతమైన పాలనలో చిచ్చులు పెడుతూ ప్రభుత్వాన్ని కూలదోసే ఆలోచనలో ఉన్న మీతో కలిసి నడువటం ఎలా సాధ్యమని ప్రశ్నించాను. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లోకల్ అని చెప్పుకొన్న లోకేశ్‌ను అక్కడికి తీసుకువెళ్లి క్యాబినెట్‌లో చేర్చుకుని మా భవిష్యత్తు అంతా ఆంధ్రప్రదేశ్‌తోనే ముడిపడి ఉందన్నట్టు పరోక్షంగా ఇక్కడి పార్టీ నేతలకు సందేశం ఇచ్చిన సందర్భాన్ని గుర్తుచేశాను. తెలంగాణలో ఇంకా టీడీపీ ఉండాలనే ఆయన ఆలోచన మంచిదికాదని వివరించాను. నీళ్ల తగాదాలు, ఇతర విషయాల్లో వైరుధ్యాల నడుమ పొత్తు కుదరదని స్పష్టంచేశాను అని కేటీఆర్ వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.