
-టీఆర్‌ఎస్ అభ్యర్థుల హల్‌చల్ -నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు -పాదయాత్రల ద్వారా ప్రజల వద్దకు -సీఎం కేసీఆర్ సభల షెడ్యూల్‌తో మరింత జోష్ -పల్లెల్లో ఇంటింటికీ టీఆర్‌ఎస్ కార్యకర్తలు -రాష్ట్రపథకాలు దేశానికి ఆదర్శం -కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ -కేసీఆర్ తెలంగాణ ఆత్మబంధువు -నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత
వారు కదులుతుంటే.. గులాబీ సైన్యం కదులుతున్నట్టుంది! సభ పెడితే.. సబ్బండవర్ణాలూ హాజరవుతున్నాయి! పల్లెల్లోనైనా.. పట్నాల్లోనైనా ప్రభంజనంలా సాగుతున్నది కారు ప్రచార హోరు! అభ్యర్థులు మొదలు గ్రామంలో సాధారణ కార్యకర్త వరకు దీక్షతో సాగిస్తున్న విస్తృత ప్రచారంతో దారులు గులాబీవనాలవుతున్నాయి. ఊరూవాడా జై తెలంగాణ నినాదంతో మారుమోగుతున్నాయి. ఇక పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ నెల 29వ తేదీ నుంచి ఎన్నికల సభల్లో పాల్గొననుండటం పార్టీ వర్గాల్లో మరింత జోష్‌ను నింపుతుందని భావిస్తున్నారు. సీఎం సభల విజయవంతానికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం సభలకు భారీగా ప్రజలను సమీకరించి, విజయవంతం చేసే కృషిలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి.
ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు సీఎం సభాస్థలాలను పరిశీలించారు. మరోవైపు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారికి మద్దతుగా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ తరువాత మండలాలు, గ్రామాలవారీ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నియోజకవర్గస్థాయి సమావేశాల్లో పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తూ.. వారి విజయానికి కృషిచేయాలంటూ శ్రేణులకు పార్టీ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. అన్ని గ్రామాలకు అభ్యర్థులు స్వయంగా ప్రచారానికి రావటం కుదరదుకాబట్టి.. పార్టీ నాయకులే సైనికుల్లా పనిచేయాలని పిలుపునిస్తున్నారు.
కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో రెండు భారీ బహిరంగసభలతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులు బోయినపల్లి వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపించాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలతో జరిగే మార్పులను విశదీకరిస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ ఆదివారం అంబర్‌పేట నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇదిలాఉంటే.. నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి, పెద్దపల్లి, మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, వనపర్తి నియోజకవర్గాల్లో నియోజకవర్గస్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు.
పట్టణ ప్రాంతాలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోని కాలనీల్లో ఆదివారం ప్రచారాన్ని నిర్వహించారు. కాలనీ అసోసియేషన్లతో సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఒక సెట్ నామినేషన్లు దాఖలుచేశారు. సోమవారం ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు, సికింద్రాబాద్ అభ్యర్థి తలసాని సాయికిరణ్, జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్, చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌రెడ్డి భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు వేయనున్నారు. నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలంలోనూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకోవాలని పార్టీ నాయకత్వం సూచించింది. నాయకులే అభ్యర్థులుగా భావించి గ్రామగ్రామానా ప్రచారం చేయాలని పేర్కొంది.
ఈ మేరకు ఇప్పటికే పల్లెల్లో, పట్టణ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఆదివారం ఆయా సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొని, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన వరంగల్‌రూరల్ జిల్లా దామెర మండలం ఓగ్లాపూర్ సమీపంలోని డిస్నీల్యాండ్ స్కూల్ ఆవరణలో, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్‌లో జరిగిన సమావేశాల్లో మంత్రి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. భద్రాచలంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశంచేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అధ్యక్షతన జరిగిన మంథని నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు.
పెద్దపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్‌నేతకానిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బాల్కసుమన్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గ సమావేశంలో మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావును రెండు లక్షల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మరోవైపు పాలేరు, వైరా నియోజకవర్గ సమావేశాలకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశంచేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రం సమీపంలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశాలకు పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డితోపాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎస్ నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల సమావేశాల్లో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం నాగర్‌ర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కోనేటిపూర్ వీహెచ్‌ఆర్ ఫంక్షన్‌హాల్లో నిర్వహించిన సమావేశానికి నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పీ రాములు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ్‌రెడ్డి, ఢిల్లీలో టీఆర్‌ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మందా జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి తదితరులు హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలకేంద్రంలో జరిగిన సభలో ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని వైజాపూర్ గిరిజన పల్లెలో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి జీ నగేశ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కేసీఆర్ తెలంగాణ ఆత్మబంధువు తెలంగాణకు ఆత్మబంధువు కేసీఆర్ అని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. కారు గుర్తుకు ఓటేస్తే తప్పకుండా అభివృద్ధి జోరుగా ఉంటుందని, మిగతా పార్టీలకు ఓటేస్తే బేకారుగా ఉంటుందని చెప్పారు. ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి నిజామాబాద్ జిల్లా సిరికొండలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అవన్నీ దేశవ్యాప్తంగా ఎందుకు జరుగటంలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌లాంటి నాయకుడు జాతీయస్థాయి రాజకీయాల్లో కీలకపాత్ర పోషించగలిగితే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతా అమలుచేసే అవకాశం ఉంటుందన్నారు.
రాష్ట్రపథకాలు దేశానికి ఆదర్శం దేశ ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని కరీంనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బీ వినోద్‌కుమార్ విమర్శించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డు షోల్లో ఆయన మాట్లాడుతూ 35 ఏండ్ల కిందటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించే అర్హత కోల్పోయిందని చెప్పారు. ప్రధానిగా మోదీ ఇప్పటివరకు దేశానికి చెప్పుకోతగ్గ పథకం ఏదైనా రూపొందించగలిగారా? అని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలే భవిష్యత్తులో భారతదేశాన్ని ఏలబోతున్నాయని అన్నారు. దేశంలోనే రైతుకు పంటపెట్టుబడిని ఇచ్చి ధైర్యాన్ని కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.