Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సీబీఐ కాకపోతే డీబీఐ

టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేపట్టారు. పలుప్రాంతాల్లో ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులను పరిచయం చేశారు. సభలకు పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

KCR in Mahabubnagar Meeting 26-04-14

-ఏ విచారణకైనా సిద్ధమన్న గులాబీనేత -నా జీవితం తెరిచిన పుస్తకం.. భయపడితే ఏనాడో బొందబెట్టేవారు.. -దళిత భూములు ఆక్రమించిన సన్నాసి పొన్నాల.. ఆయన బడాచోర్.. ఆయనపై కేసేది? -సన్నాసిని ముందు పెట్టుకొని రాహుల్ ప్రచారం చేయడం సిగ్గుచేటు -మోడీ గీడీ జాన్తానై.. కేంద్రంలో మూడో ఫ్రంటే.. తెలంగాణ చరిత్ర తెలియని నరేంద్రమోడీ -డ్వాక్రా మహిళలకు పది లక్షల వడ్డీలేని రుణం.. -పాలమూరు జిల్లా ఎన్నికల ప్రచారసభల్ల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్

తన ఆస్తులపై సీబీఐ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నా ఆస్తులపై సీబీఐ విచారణే కాకుండా డీబీఐ విచారణ కూడా చేసుకోండి. ఇలా భయపడితే కాంగ్రెస్ నేతలు నన్ను ఏనాడో బొంద పెట్టేవారు అని వ్యాఖ్యానించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, శాంతినగర్, గద్వాల, కొత్తకోట, జడ్చర్ల తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆయా సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తూ పొన్నాల, నరేంద్రమోడీ, చంద్రబాబు తీరును దుయ్యబట్టారు.

ఎన్నికల ప్రచారాల్లో టీఆర్‌ఎస్ సభలకు ప్రజలు భారీగా తరలిరావడం చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ కుట్రతో తనపై తప్పుడు కేసులు బనాయిస్తోందని, తాను ఈ సీబీఐ విచారణను స్వాగతిస్తున్నానన్నారు. పొన్నాల లక్ష్మయ్య దళితుల భూములను ఆక్రమించుకున్నా అతనిపై విచారణ లేదని, ఆయన చేసిన అక్రమాలకు వెలికి తీసి, జైలుకు పంపిస్తానని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నేతలు తనపై ఎన్ని కుట్రలు చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను అడ్డుకునే దమ్ముధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే తెలంగాణ నాశనం అయినట్లే అని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆ పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దళితుల భూములు ఆక్రమించుకున్న టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గజదొంగ అని నిప్పులు చెరిగారు. ఆయనకు సిగ్గు శరం ఉంటే టీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని అన్నారు. పొన్నాలలాంటి సన్నాసిని ముందు పెట్టుకొని తెలంగాణలో రాహుల్ గాంధీ ఓట్లు అడుగుతుండటం సిగ్గుచేటన్నారు.

మోడీగీడీ జాన్తానై

బీజేపీ నేతలు మోడీ జపం చేస్తున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేతిలో మోడీ కీలుబొమ్మగా మారాడని ఆరోపించారు. తెలంగాణ చరిత్ర తెలియని మోడీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో మోడీగీడీ జాన్తానై. కేంద్రంలో తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

మన రాష్ర్టాన్ని మనమే ఏలుదాం

తెలంగాణ రాష్ర్టాన్ని మనమే సాధించుకున్నాం. ఈ రాష్ర్టాన్ని మనం ఏలితే అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అందిస్తాను. పద్నాలుగేళ్ల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో మన తలరాతలు మనమే మార్చుకుందాం అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏళ్లు గోసపడ్డాం.14 ఏళ్లు ఉద్యమించాం. ఆమరణ దీక్షలు, ఆత్మబలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం మన కళ్లెదుట సాకారమైంది. 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో తెలంగాణ ధ్వంసమైంది. తెలంగాణ ఏర్పడిన సమయంలో మన పాలన మనం చేసుకోవాలి. ఈ సందర్భంలో ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే బాధపడేది మనమే అని కేసీఆర్ చెప్పారు.

డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం

టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు తీసుకున్న రూ. లక్షలోపు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని, ట్రాక్టర్లు, ఆటోలకు రోడ్డు రవాణా పన్నులు ఎత్తివేస్తామని, చెంచుగూడెం, తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని వరాలజల్లు కురిపించారు. వృద్ధులు, వితంతువులకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు భిక్ష వేసినట్లు రూ.వంద, రెండు వందలు పింఛన్లు ఇస్తే టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే వెయ్యి, 15 వందలు పింఛను ఇస్తామని ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇప్పిస్తామన్నారు.

నిరుద్యోగులకు విద్యార్హత లేకున్నా, డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇచ్చే విధంగా నిబంధనలు రూపొందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మహిళలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంతో రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తుందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలను అవమానపరిచే విధంగా ఒక గది ఉన్న ఇళ్లు నిర్మించి ఇచ్చాయని, ఒకే గదిలో మంత్రులు సంసారం చేస్తారా? అని ప్రశ్నించారు. బలహీన వర్గాలు నాగరిక ప్రపంచంలో బతకాలని, భారతేదేశంలోనే గౌరవంగా ఉండే విధంగా రూ.3లక్షల వ్యయంతో అన్ని వసతులతో కూడిన ఇల్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

పలుసార్లు ఈ ప్రాంతం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఓ నేత కేంద్ర స్థాయిలో చక్రం తిప్పారని, అంతగొప్ప కీర్తిని మూటగట్టుకున్నా ఆయన కల్వకుర్తిని ఎందుకు అభివృద్ధి చేయలేదంటూ జైపాల్‌రెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాలను చేపడతామని హామీ ఇచ్చారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించి ఇక్కడి పొలాలను సస్యశ్యామలం చేస్తామన్నారు.

ఆంధ్ర పార్టీలతో ఆగమైంది

ఆంధ్రా పార్టీల వల్ల ఇప్పటికే తెలంగాణ ఆగమాగమైందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా సీమాంధ్ర నేత రఘువీరారెడ్డి నీళ్లు తరలించుకుపోయేందుకు పొన్నాల లక్ష్మయ్య సహకరించారని, డీకే అరుణ హారతులిచ్చిందని కేసీఆర్ మండిపడ్డారు. ఇలాంటి నేతలను మళ్లీ ఎన్నుకుంటే తెలంగాణ వచ్చినా ఫలితం లేదన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు తన గురించి తెలుసుకోవాలని అన్నారు. తాను నిప్పులాంటి మనిషిని, తెరిచిన పుస్తకంలాంటి వ్యక్తినని చెప్పారు. పాలమూరు ఎంపీగా తెలంగాణ సాధించడం అదృష్టంగా భావిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. పాలమూరు జిల్లా కరువుతో అల్లాడుతున్నదని, జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకొని కూర్చుని పూర్తి చేయిస్తానన్నారు.

ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌పై బాంబులేసి స్లూయిస్ రంధ్రాల ద్వారా రాయలసీమ నాయకులు సాగునీటిని దోచుకొని పోతున్నారన్న కేసీఆర్.. ఇకపై ఆర్డీఎస్‌పై సీమాంధ్ర దోపిడీలు సాగవన్నారు. గతంలో రాయలసీమ గూండాలకు ఆర్డీస్ వద్ద తెలంగాణలో పులి బిడ్డలు ఉన్నారని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరికలు చేశానని గుర్తు చేశారు. రెండు నదులున్న నడిగడ్డ ఎడారిగా మారుతున్నదని, స్వార్థ రాజకీయ నాయకుల నిర్లక్ష్యం ఫలితంగా పొలాలు బీడులుగా మారిపోయాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటితోపాటు పేదలకు సత్వరమే వైద్యం అందించేందుకు ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. తాను ఏనాడూ అబద్ధమాడనని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వచ్చాక ఆరు నెలల పాటు విద్యుత్ సమస్య ఉంటుందన్నారు.

2280 మెగావాట్ల థర్మల్, ఐదువేల మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులో ఉందని, అయితే వర్షాలపైనే ఆధార పడ్డ జలవిద్యుత్‌తో కష్టాలు తప్పవన్నారు. రెండున్నరేళ్ల పాటు తెలంగాణలో కరెంట్ కష్టాలు ఉంటాయన్నారు. 15 వేల మెగావాట్ల విద్యుత్ పనులకు శ్రీకారం చుడతామని, వచ్చే మూడేళ్లలో రైతులకూ 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు.

మన రాష్ట్రంలో మన జెండే ఉండాలి

తెలంగాణ వెనుకబాటుతనానికి ఇన్నాళ్లూ పాలించిన ఆంధ్రా పార్టీలే కారణమని కేసీఆర్ ఆరోపించారు. చంద్రబాబును ఆంధ్రాబాబుగా అభివర్ణించారు. తెలంగాణ మన రాష్ట్రమని, మన రాష్ట్రంలో మన పార్టీ, మన జెండానే ఉండాలన్నారు. ఇవన్నీ జరగాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరముందన్నారు. ఇంకా ఆంధ్రోళ్ల పెత్తనం అవసరమా ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి, టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హెలికాప్టర్‌లో తిరిగినా సమయం తక్కువగా ఉండటంతో పలు నియోజకవర్గాల్లో జరగాల్సిన సభలు రద్దు చేశారు. కేసీఆర్ వెంట హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న మంద జగన్నాథం ఉన్నారు. కార్యక్రమాల్లో ఆయా నియోజకవర్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థులు జైపాల్‌యాదవ్ (కల్వకుర్తి), గువ్వల బాలరాజు (అచ్చంపేట), మర్రి జనార్దన్‌రెడ్డి (నాగర్‌కర్నూల్) జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), మంద శ్రీనాథ్ (అలంపూర్), కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల), ఆల వెంకటేశ్వర్‌రెడ్డి (దేవరకద్ర లక్ష్మారెడ్డి (జడ్చర్ల) తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.